breaking news
Reliance Infra Company
-
అనిల్ అంబానీకి భారీ ఉపశమనం
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై దివాలా చర్యలను నిలిపివేస్తూ తాజాగా అపిల్లేట్ ట్రిబ్యునల్ ఎన్సీఎల్ఏటీ ఆదేశాలు జారీ చేసింది. తమ అప్పీల్ మేరకు ఎన్సీఎల్టీ ఆదేశాలను ఎన్సీఎల్ఏటీ రద్దు చేసినట్లు రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియకు ఆదేశిస్తూ ఇంతక్రితం ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ సీపీ(ఐబీ)/624(ఎంబీ)2022 కేసులో 2025 మే 30న జారీ చేసిన ఆదేశాలను ఎన్సీఎల్ఏటీ రద్దు చేసినట్లు పేర్కొంది. తమకు సౌర విద్యుత్ సరఫరా చేసిన ధుర్సర్ సోలార్ పవర్‌కి చెల్లింపులు జరపలేదంటూ రిలయన్స్ ఇన్ఫ్రాపై ఆరోపణలు ఉన్నాయి. ధుర్సర్‌కి సెక్యూరిటీ ట్రస్టీగా వ్యవహరించిన ఐడీబీఐ ట్రస్టీషిప్ సర్వీసెస్ సంస్థ 2022 ఏప్రిల్‌లో రిలయన్స్ ఇన్ఫ్రాపై కార్పొరేట్ దివాలా పరిష్కార చర్యలు తీసుకోవాలంటూ ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. రిలయన్స్ ఇన్ఫ్రా 2018 ఆగస్టు 28 నుంచి అసలు రూ. 88.68 కోట్లతో పాటు వడ్డీ కూడా బాకీ పడిందని వివరించింది.దీనితో రిలయన్స్ ఇన్ఫ్రాపై ఎన్సీఎల్టీ దివాలా చర్యలకు ఆదేశించింది. అయితే, ధుర్సర్ సోలార్ పవర్‌కు పూర్తిస్థాయిలో రూ. 92.68 కోట్లు చెల్లించేసినందున దివాలా చట్ట చర్యలను వ్యతిరేకిస్తున్నట్లు రిలయన్స్ ఇన్ఫ్రా పేర్కొంది. ఇంధన కొనుగోలు ఒప్పందంలో భాగంగా టారిఫ్‌లకింద సొమ్ము చెల్లించినట్లు తెలియజేసింది. -
రూ. 2,599 కోట్లు వడ్డీతో సహా 15 రోజుల్లో కట్టాలి..
నష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్న అనిల్ అంబానీ నేతృత్వంలోని కంపెనీకి అనుకోని ఎదురు దెబ్బ తగిలింది. రూ.2,599 కోట్ల భారీ మొత్తాన్ని రీఫండ్ చేయాలని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) నుంచి తుది నోటీసు అందింది. ఎన్డీటీవీ ప్రాఫిట్ నివేదిక ప్రకారం.. రూ. 2,599 కోట్లను ఎస్బీఐ ప్రైమ్ లెండింగ్ రేటుపై అదనంగా 2 శాతం చొప్పున వడ్డీతో పాటు 15 రోజులలోపు తిరిగి చెల్లించాలని కోరుతూ రిలయన్స్ ఇన్ఫ్రాకు చెందిన ఢిల్లీ ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ (DAMEPL)కి డీఎంఆర్సీ నోటీసు జారీ చేసింది. చెల్లించడంలో విఫలమైతే కోర్టు ధిక్కార కేసును ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.ఇదీ నేపథ్యం..న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి సెక్టార్ 21 ద్వారక వరకు నడిచే ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ లైన్ రూపకల్పన, నిర్వహణ కోసం ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్, అనిల్ అంబానీకి చెందిన డీఏఎంఈపీఎల్ మధ్య ఒప్పందం జరిగింది. అయితే తాము గుర్తించిన కొన్ని నిర్మాణ లోపాలను డీఎంఆర్సీ పరిష్కరించలేదని ఆరోపిస్తూ 2012లో డీఏఎంఈపీఎల్ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది.దీనికి సంబంధించి కంపెనీ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ 2017లో ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ రూ. 2,950 కోట్లు వడ్డీతో సహా డీఏఎంఈపీఎల్కి చెల్లించాలని ని ఆదేశించింది. దీంతో డీఎంఆర్సీ రూ. 2,599 కోట్లను యాక్సిస్ బ్యాంక్ వద్ద ఎస్క్రో ఖాతాలో జమ చేసింది. ఇప్పుడు సుప్రీం కోర్టు తీర్పు తమకు అనుకూలంగా రావడంతో తాము డిపాజిట్ చేసిన రూ. 2,599 కోట్ల మొత్తాన్ని తిరిగి చెల్లించాలని అనిల్ అంబానీ సంస్థకు 15 రోజుల సమయం ఇచ్చింది. -
జియో చేతికి రిలయన్స్ ఇన్ఫ్రా..ఎన్సీఎల్టీ ఆమోదం!
అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్ అనుబంధ సంస్థ రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ సొంతం చేసుకునేలా జియోకు జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (NCLT) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ కు చెందిన టవర్లు, ఫైబర్ ఆస్తులు జియో సొంతం కానున్నాయి. రిలయన్స్ ఇన్ఫ్రా దివాలా తీయడంతో ఆ కంపెనీ స్వాధీనానికి ముకేశ్ అంబానీ 2019 నవంబర్‌లో రూ.3,720 కోట్లతో బిడ్ దాఖలు చేశారు. అయితే ఈ బిడ్డింగ్‌ను వ్యతిరేకిస్తూ రుణదాతలు కోర్టును ఆశ్రయించారు. ఆ కేసు కొనసాగుతుండగా... గత నెల జియో ఎన్సీఎల్టీ ఆశ్రయించి ప్రక్రియను వేగవంతం చేయాలని కోరింది. ఆలస్యమయ్యేకొద్దీ ఇరువర్గాలకూ నష్టం చేకూరుతుందని, ఆస్తుల విలువ కూడా తగ్గుతుందని పేర్కొంది. ఈ క్రమంలో ఎన్సీఎల్టీ తాజాగా ఆమోదం తెలిపింది. -
10 శాతం తగ్గిన పిపవావ్
గత కొన్ని రోజులుగా జోరుగా పెరుగుతున్న పిపవావ్ డిఫెన్స్ షేర్ 10 శాతం క్షీణించి రూ.68.85 వద్ద ముగిసింది. ఒక్కో షేర్‌ను రూ.63 చొప్పున నిఖిల్ గాంధీ నేతృత్వంలోని ప్రమోటర్ల గ్రూప్ నుంచి 18 శాతం వాటాను రూ.819 కోట్లకు కొనుగోలు చేయనున్నామని రిలయన్స్ ఇన్ఫ్రా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ట్రేడింగ్ ప్రారంభంలోనే ఈ షేర్ 10 శాతం లోయర్ సర్క్యూట్‌ను తాకింది. ఈ క్షీణత కారణంగా కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక్కో రోజులోనే రూ.563 కోట్లు హరించుకుపోయి రూ.5,069 కోట్లకు తగ్గింది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇన్ఫ్రా కంపెనీ పిపవావ్ డిఫెన్స్‌లో రూ.2,082 కోట్లతో నియంత్రిత వాటాను కొనుగోలు చేయనున్న సంగతి తెలిసిందే. కాగా రిలయన్స్ ఇన్ఫ్రా కంపెనీ షేర్ 3 శాతం వృద్ధితో రూ.490 వద్ద ముగిసింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.391 కోట్లు పెరిగి రూ.12,880 కోట్లకు చేరింది.