breaking news
rebel forces
-
ముందున్న సవాలు
21వ శతాబ్దంలో అత్యంత దీర్ఘకాలం సాగిన యుద్ధం... లక్షలాది ప్రజల ప్రాణాలు తీసి, మరెందరినో వలస బాట పట్టించి, శరణార్థులుగా మార్చిన యుద్ధం... ఎట్టకేలకు ఒక ముగింపునకు వచ్చింది. సంక్షుభిత సిరియా చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. అధ్యక్షుడు బషర్ – అల్ – అసద్ పాలనకు ఆదివారం ఆకస్మికంగా తెరపడడంతో సిరియాలో అంతర్యుద్ధం కొత్త మలుపు తిరిగింది. అలెప్పో, హమా, హామ్స్ల తర్వాత డమాస్కస్ సైతం తిరుగుబాటు శక్తుల వశం కావడంతో సిరియా రాజకీయ, సైనిక దృశ్యం సమూలంగా మారిపోనుంది. ఈ పరిణామాల ప్రభావం ఆ ప్రాంతమంతటా కనిపించనుంది. దాదాపు 53 ఏళ్ళ పైచిలుకు నిరంకుశ కుటుంబ పాలన పోయినందుకు సిరియన్లు సంబరాలు చేసుకుంటున్నా, తరువాతి పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. తిరుగుబాటు తర్వాత డమాస్కస్‌లో సాగుతున్న విధ్వంసం, లూటీ దృశ్యాలు 2021లో అఫ్ఘానిస్తాన్‌లో జరిగిన సంఘటనల్ని తలపిస్తున్నాయి. అక్కడ తాలిబన్ల లానే ఇక్కడ ఇస్లామిస్ట్ బృందాలు సైతం గద్దెనెక్కాక వెనకటి గుణం మానక నిజ స్వభావం చూపిస్తాయని భయాందోళనలు రేగుతున్నాయి. వెరసి, అసలే రగులుతున్న పశ్చిమాసియా కుంపటికి కొత్త సెగ వచ్చి తోడైంది. చరిత్ర గమనిస్తే, ప్రజాగ్రహ ఉద్యమం 2011 మార్చిలోనే సిరియాను తాకింది. ఎప్పటికప్పుడు కూలిపోవడం ఖాయమని భావించినా, అసద్ ఏలుబడి వాటన్నిటినీ తట్టుకొని, దాటుకొని వచ్చింది. జనాగ్రహాన్ని ఎదుర్కొనేందుకు ఆయన తీవ్ర హింసకు పాల్పడ్డారు. స్వదేశీయులపైనే ఒక దశలో రసాయన ఆయుధాలు వాడినట్లు ఆరోపణలూ వచ్చాయి. సిరియాకు ఆయన పీడ ఎప్పుడు వదులుతుందా అని ఎదురుచూస్తున్న పరిస్థితి తెచ్చాయి. దాదాపు దశాబ్ద కాలం దూరం పెట్టాక, అరబ్ ప్రపంచం గత ఏడాది మళ్ళీ చేరదీయడం అసద్‌కు కలిసొస్తుందని భావించారు. అయితే, అరబ్ రాజ్యాలు తమ స్వలాభం కోసమే ఆ పని చేశాయి. అసద్ పోతే వచ్చే తెలియని దేవత కన్నా తెలిసిన దయ్యం మేలని భావించాయి. వారం రోజుల క్రితం దాకా ఈ పాలనకు చరమగీతం తథ్యమని ఎవరూ ఊహించ లేదు. రష్యా, ఇరాన్, హెజ్బుల్లాల అండతో అసమ్మతిని అణచివేస్తూ, అసద్ అధికారాన్ని నిలబెట్టుకుంటూ వచ్చారు. అయితే, కొద్ది రోజుల క్రితం ఒక్కసారిగా మళ్ళీ తిరుగుబాటు బృందాలు విజృంభించడంతో నాటకీయంగా కథ అడ్డం తిరిగింది. ఒక పక్క ఉక్రెయిన్‌తో పోరాటం నేపథ్యంలో రష్యా వైమానిక సాయం ఉపసంహరించుకోగా, మరోపక్క ఇజ్రాయెల్‌తో యుద్ధం వల్ల హెజ్బొల్లా వనరులు క్షీణించాయి. ఇదే అదనుగా ఇస్లామిస్ట్ గ్రూప్ హయత్ – తహ్రీర్ అల్ – షామ్ (హెచ్‌టీఎస్) సారథ్యంలోని తిరుగుబాటుదారులు చకచకా ముందుకు చొచ్చుకువచ్చారు. అసద్‌కు పట్టున్న ప్రాంతాలన్నీ కైవసం చేసుకుంటూ, ఆఖరికి అధికార పీఠానికి ప్రతీక అయిన డమాస్కస్‌ను చేజిక్కించుకోవడంతో ఏళ్ళ తరబడి సాగుతున్న నియంతృత్వానికి తెరపడింది. పదవీచ్యుతుడైన అధ్యక్షుడు విమానంలో పలాయనం చిత్తగించాల్సి వచ్చింది. అసద్ పదవీచ్యుతి ప్రభావం ప్రాంతీయంగా గణనీయమైనది. ఆ ప్రాంతంలో ఇంతకాలంగా స్నేహంగా మెలిగిన కీలక దేశం సిరియాలో అనుకూల పాలన పోవడం ఇరాన్‌కు వ్యూహాత్మకంగా ఇబ్బందికరమే. మరోపక్క హెజ్బుల్లా భవిష్యత్తూ అనిశ్చితిలో పడింది. తిరుగుబాటుదారులకు తెర వెనుక అండగా నిలిచిన టర్కీ ఇప్పుడిక అక్కడ చక్రం తిప్పే సూచనలున్నాయి. అయితే, టర్కీ ప్రయోజనాలకూ, ప్రాంతీయ శక్తులకూ మధ్య వైరుద్ధ్యం తలెత్తితే ఉద్రిక్తతలు పెరుగుతాయి. మానవ హక్కులను సైతం కాలరాస్తున్న నియంతృత్వంపై పోరాటం ఎవరు, ఎక్కడ చేసినా అది సమర్థనీయమే. ప్రపంచం సంతోషించాల్సిన అంశమే. నియంతృత్వం పోయి ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడుతుందని ఆశిస్తాం. కానీ, అసద్ పాలన స్థానంలో రానున్న పాలన ఏమిటన్నది ప్రశ్న. ఒకటికి పది సంస్థలు ఈ సాయుధ తిరుగుబాటును నడిపాయని విస్మరించలేం. అసద్‌ను గద్దె దింపడం సరే కానీ, అనేక వైరుద్ధ్యాలున్న ఇవన్నీ ఒకతాటిపైకి రావడం, రేపు సజావుగా పాలన సాగించడం సాధ్య మేనా అన్నది బేతాళప్రశ్న. తీవ్రవాద అల్‌ఖైదాకు ఒకప్పటి శాఖ అయిన హెచ్‌టీఎస్ లాంటి తీవ్ర వాద సంస్థలు తమను తాము జాతీయవాద శక్తులుగా చెప్పుకుంటున్నా, అవి తమ వెనకటి స్వభా వాన్ని వదులుకుంటాయా అన్నదీ అనుమానమే. అదే గనక జరగకపోతే... దశాబ్దాలుగా అల్లాడు తున్న సిరియా, అక్కడి సామాన్యుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టవుతుంది. ఒకప్పటి సంపన్న సిరియా దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురై, అంతర్యుద్ధంలో మగ్గుతూ శిథిలాల కుప్పగా మారింది. అసద్ హయాంలో దాదాపు 1.2 కోట్లమంది దేశం విడిచి పోవాల్సి వచ్చింది. ఉద్రిక్తతా నివారణ జోన్లలో అతి పెద్దదైన ఒక్క ఇడ్లిబ్ ప్రావిన్స్‌లోనే సుమారు 20 లక్షల మంది శరణార్థులుగా బతుకీడుస్తున్నారు. తాజా పరిణామాలతో ఆ దేశాన్ని రాజకీయంగా, సామాజికంగా ఒక గాడిన పెట్టాల్సిన తరుణమిది. స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్న సిరియన్లు సైతం ఈ భగీరథ ప్రయత్నంలో భాగస్వాములవ్వాలి. అలాగే, ఆంక్షల విధింపుతో అసద్ పతనానికి దోహద పడ్డ పాశ్చాత్య దేశాలు సైతం సిరియా వాసుల కష్టాల తొలగింపుపై దృష్టి పెట్టాలి. తద్వారా వేలాది సిరియన్ శరణార్థులు స్వచ్ఛందంగా స్వదేశానికి వచ్చి, దేశ పునర్నిర్మాణంలో భాగమయ్యే వీలు చిక్కుతుంది. అసద్ పదవీచ్యుతితో సిరియా పునర్నిర్మాణానికి అవకాశం అంది వచ్చినా, అందుకు సవాలక్ష సవాళ్ళున్నాయి. మితవాద, అతివాద బృందాల సమ్మేళనమైన ప్రతిపక్షం సైనిక విజయం నుంచి సమర్థమైన పరిపాలన వైపు అడుగులేయడం ముఖ్యం. అందులో జయాపజయాలను బట్టే సిరియా భవితవ్యం నిర్ణయం కానుంది. అందుకే, రానున్న కొద్ది వారాల పరిణామాలు కీలకం. -
తీవ్ర గాయాలతో భారత్‌లోకి మయన్మార్ సైనికులు.. ఏమైందంటే?
మయన్మార్ (బర్మా) చెందిన 151 మంది సైనికులు భారత్‌లోకి చొచ్చుకొని వచ్చారు. మిజోరం రాష్ట్రంలో గల సరిహద్దు జిల్లా లాంగ్ట్లైలోకి మమన్మార్ సైనికులు తరలివచ్చినట్లు అస్సాం రైఫిల్స్ అధికారి వెల్లడించారు. ప్రజాస్వామ్య అనుకూల సాయుధ తిరుగుబాటు సంస్థ అయిన అరాకన్ ఆర్మీ(ఏఏ) ఆ దేశ సైన్యం ‘తత్మాదవ్’ క్యాంప్‌ను ధ్వంసం చేసింది. దీంతో మయన్మార్ సైన్యంలోని 151 మంది సైనికులు అంతర్జాతీయ సరిహద్దు దాటి భారత్‌లోని మిజోరంలోకి ప్రవేశించారు. కాగా.. కొన్ని రోజులుగా భారత్ సరిహద్దుకు సమీపంలోని మయన్మార్ ప్రాంతంలో ఆ దేశ సైన్యానికి, ప్రజాస్వామ్య అనుకూల సాయుధ సంస్థ అరాకన్ ఆర్మీకి మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం తీవ్రమైన గాయాలతో కొంతమంది సైనికులు భారత్‌లోకి వచ్చినట్లు ధ్రువీకరించారు. అయితే అస్సాం రైఫిల్స్ అధికారులు గాయపడిన మయన్మార్ సైనికులకు ప్రథమ చికిత్స అందించారని పేర్కొన్నారు. ప్రస్తుతం మయన్మార్ సైనికులు అస్సాం రైఫిల్స్ కస్టడీలో మయన్మార్ సరిహద్దు వద్ద ఉన్నారని పేర్కొన్నారు. వారిని మయన్మార్ పంపించడానికి భారత దేశ విదేశాంగ శాఖ, మయన్మార్ మిలిటరీ ప్రభుత్వానికి మధ్య చర్చలు జరుగుతున్నాయని అస్సాం రైఫిల్స్ అధికారులు తెలిపారు. మరోవైపు మయన్మార్‌లో సైనిక పాలనను కూలదోసి.. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని నెలకొల్పడానికి అక్కడి ప్రజాస్వామ్య అనుకూల సాయుధ తిరుగుబాటు సంస్థలు ఉమ్మడిగా పోరాటాలు చేస్తున్న విషయం తెలిసిందే. త్రీబ్రదర్‌హుడ్ అలయన్స్ (టీబీఏ), మయన్మార్ జాతీయ ప్రజాస్వామ్య కూటమి సైన్యం (ఎంఎన్డీఏఏ), టాంగ్ జాతీయ విమోచన సైన్యం(టీఎన్‌ఎల్‌ఏ), అరాకన్ ఆర్మీ(ఏఏ) కీలక పాత్ర పోషిస్తున్నాయి. చదవండి: హౌతీ రెబెల్స్‌ను మళ్లీ దెబ్బ కొట్టిన అమెరికా -
రాకెట్ దాడిలో యువ క్రీడాకారుడి మృతి
డమాస్కస్: సిరియాలో మారణహోమం కొనసాగుతూనే ఉంది. తాజాగా రెబెల్ గ్రూపు జరిపిన రాకెట్ దాడిలో ఓ యువ పుట్‌బాల్ క్రీడాకారుడు మృతిచెందాడు. మరో ఏడుగురు క్రీడాకారులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన సిరియా రాజధాని డమాస్కస్ శివారులోని ఓ స్పోర్ట్స్ క్లబ్లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్న సమయంలో జరిగింది. ఈ సంఘటనలో మృతిచెందినది సమీర్ మహ్మద్ మౌస్సూద్ అనే 12 ఏళ్ల బాలుడిగా గుర్తించినట్లు సిరియన్ ఆర్మీస్ పుట్‌బాల్ టీం అధ్యక్షుడు మోహసీన్ అబ్బాస్ తెలిపారు. మౌస్సూద్,సిరియన్ ఆర్మీ పుట్‌బాల్ టీం యూత్ లీగ్‌లో ఆడుతున్నాడని, అల్-ఫేయాహా స్పోర్ట్స్ క్లబ్లో వారు శిక్షణ తీసుకుంటున్నాడని వివరించారు. గాయపడిన క్రీడాకారులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. గతంలో రెబెల్ గ్రూపు ఈ స్పోర్ట్స్ క్లబ్‌పై పలుమార్లు దాడి చేసిందని తెలిపారు. గత మంగళవారం రాజధానిలో రెబెల్ గ్రూపు జరిపిన బాంబుదాడిలో 44 మంది పౌరులు మృతిచెందిన సంగతి తెల్సిందే. -
కేరళ సాఫ్ట్వేర్ ఇంజినీర్ కిడ్నాప్
న్యూఢిల్లీ: కేరళకు చెందిన ఓ ఐటీ ఉద్యోగి లిబియాలో అపహరణకు గురయ్యాడు. కాజీకోడ్ జల్లాకు చెందిన రేగి జోసెఫ్ (43) ను లిబియా రాజధాని ట్రిపోలి లో అక్కడ తిరుగుబాటు దళాలు గతనెల 31న కిడ్నాప్ చేశారు. రాజధానికి సమీపంలో సోక్ అల్ జముయా కార్యాలయంలో విధులు నిర్వర్తిసుండగా దాడిచేసిన ప్రభుత్వ వ్యతిరేక దళాలు జోసెఫ్ తో పాటు మరో ముగ్గుర్ని అపహరించారు. జోసెఫ్ ఆల్ దివాన్ కంపెనీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు. భార్య షినుజ, ముగ్గురు కుమార్తెలుతో గత రెండు సంవత్సరాలుగా ఆయన లిబియా నివసిస్తుండగా, భార్య స్థానిక టిఎంసి హాస్పిటల్ లో నర్సుగా పని చేస్తున్నారు. కాగా తన కుమారుడు కిడ్నాప్ వ్యవహారంపై తన కోడలు భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించినట్టు జోసెఫ్ తండ్రి పుల్లు వెలిల్ తెలిపారు. మరోవైపు కాజీకోడ్ ఎంపీ ఎంకె రాఘవన్ స్పందిస్తూ జోసెఫ్ కుటుంబానికి తగిన సహాయం చేస్తామన్నారు. ఈ కిడ్నాప్ వ్యవహారాన్ని కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు తెలిపారు.