‘బాండ్లు అమ్మేయండి.. బంగారం కొనేయండి’
అమెరికా భారీగా పెరుగుతున్న ప్రభుత్వ రుణభారం భవిష్యత్తులో తీవ్ర ఆర్థిక సంక్షోభానికి దారితీసే అవకాశం ఉందని బిలియనీర్ ఇన్వెస్టర్, బ్రిడ్జ్‌వాటర్ అసోసియేట్స్ వ్యవస్థాపకుడు రే డాలియో హెచ్చరించారు. ప్రస్తుత ఆర్థిక విధానాల్లో మార్పు రాకపోతే అమెరికా రుణ సంక్షోభం మరో మూడు సంవత్సరాల్లో ఎదురయ్యే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు.ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అమెరికా బాండ్లలో తమ పెట్టుబడులను తగ్గించి, పోర్ట్‌ఫోలియోలో 10–15 శాతం వరకు బంగారానికి కేటాయించాలని సూచించారు. అలాగే కొంతమేర బిట్‌కాయిన్‌ను కూడా కలిగి ఉండటం ద్వారా పెట్టుబడుల రిస్క్‌ను తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు.శుక్రవారం లింక్డ్ఇన్లో చేసిన పోస్టులో డాలియో.. బలమైన ఆర్థిక స్థితి ఉన్న దేశాలు, వివిధ రకాల ఆస్తుల్లో పెట్టుబడులను విస్తరించుకోవాలని సూచించారు. ముఖ్యంగా ప్రభుత్వ బాండ్లపై అధికంగా ఆధారపడటం కంటే బంగారం, ఇతర ప్రత్యామ్నాయ ఆస్తులను కలిగి ఉండటం మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.మూడు సంవత్సరాల్లో సంక్షోభం?అమెరికా రుణభారం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వానికి వడ్డీ చెల్లింపుల భారమూ భారీగా పెరుగుతోంది. అమెరికా ఫెడరల్ ప్రభుత్వ నికర వడ్డీ వ్యయం 2026లోనే సుమారు 1 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని కాంగ్రెస్ బడ్జెట్ కార్యాలయం (CBO) అంచనా వేసింది. 2026లో ప్రభుత్వ ఆదాయం సుమారు 5.6 ట్రిలియన్ డాలర్లుగా ఉండొచ్చని CBO అంచనా వేస్తోంది.డాలియో దృష్టిలో ఇది సాధారణ రుణ సమస్య మాత్రమే కాదు. ప్రభుత్వ రుణాన్ని తీర్చేందుకు చెల్లించాల్సిన వడ్డీ వ్యయం పెరుగుతూనే ఉండటం, అదే సమయంలో భారీగా కొత్త రుణాలు సమీకరించాల్సి రావడం ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని పెంచుతుందని ఆయన చాలాకాలంగా హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ రుణానికి తగినంత డిమాండ్ లేకపోతే అధిక వడ్డీ రేట్లను అంగీకరించాల్సి రావచ్చు లేదా కేంద్ర బ్యాంకు ద్వారా మరింత డబ్బు సృష్టించే పరిస్థితి రావచ్చని ఆయన అభిప్రాయం. అటువంటి పరిణామాలు కరెన్సీపై ఒత్తిడి, ద్రవ్యోల్బణం వంటి సమస్యలను పెంచే అవకాశం ఉందనేది ఆయన విశ్లేషణ.బాండ్ల మార్కెట్లో ఒత్తిడిడాలియో వ్యాఖ్యలు వెలువడుతున్న సమయంలోనే అమెరికా ట్రెజరీ బాండ్ మార్కెట్లో ఒత్తిడి పెరిగింది. ఆగస్టు 21న 30 ఏళ్ల ట్రెజరీ ఈల్డ్ 5.27 శాతానికి చేరగా, వారంలో అది 2007 తర్వాతి అత్యధిక స్థాయిలకు సమీపించింది. అమెరికా ప్రభుత్వ రుణభారం 40 ట్రిలియన్ డాలర్లను దాటడం కూడా పెట్టుబడిదారుల ఆందోళనకు కారణమవుతోంది.పరిస్థితిని చక్కదిద్దేందుకు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ దీర్ఘకాలిక ప్రభుత్వ బాండ్ల బైబ్యాక్‌లను పెంచే ప్రణాళికను ప్రకటించారు. అయితే ఈ చర్యతో ఈల్డ్స్‌లో వచ్చిన ప్రారంభ తగ్గుదల నిలవలేదు. దీంతో మార్కెట్లో ఇది తాత్కాలిక పరిష్కారమే తప్ప, అమెరికా ద్రవ్య లోటు, రుణభారం వంటి మూల సమస్యలను పరిష్కరించదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.బంగారం, బిట్‌కాయిన్‌కు డిమాండ్అమెరికా రుణభారం, డాలర్‌పై ఆందోళనలు పెరగడంతో ఈ వారం మదుపరులు బంగారం, బిట్‌కాయిన్ వంటి ప్రత్యామ్నాయ ఆస్తులవైపు మొగ్గుచూపారు. ఆగస్టు 21న స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు 4,623.94 డాలర్ల వరకు పెరిగి మూడు నెలల గరిష్ఠాన్ని తాకింది. ఈ వారంలో పసిడి ధర 5 శాతానికి పైగా పెరిగింది.ఇదే సమయంలో బిట్‌కాయిన్ 79,000 డాలర్లకు సమీపంలోకి వెళ్లి, అనంతరం 77,000 డాలర్ల ప్రాంతంలో ట్రేడైంది. ఈ వారంలో క్రిప్టోకరెన్సీ సుమారు 23 శాతం వరకు లాభపడింది. 2023 మార్చి తర్వాత ఇదే అత్యంత బలమైన వారపు ర్యాలీగా నిలిచింది.లోటును తగ్గించాలిఅమెరికా బడ్జెట్ లోటును స్థూల దేశీయోత్పత్తి (GDP)లో సుమారు 3 శాతానికి తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలని డాలియో సూచించారు. ఇందుకోసం ప్రభుత్వ వ్యయాల్లో కోతలు, అధిక పన్ను ఆదాయం, తక్కువ వడ్డీ రేట్లు వంటి చర్యల కలయిక అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే తరహా రుణ, ఆర్థిక ఒత్తిళ్లు బ్రిటన్, చైనా, జపాన్ వంటి దేశాల్లోనూ ఉన్నాయని పేర్కొన్నారు.ఇదీ చదవండి: బంగారం భారీ ధరలు.. కియోసాకి కామెంట్స్