breaking news
Proddatur Hospital
-
జిల్లా ఆస్పత్రికి కమీషన్ల జబ్బు
ఇచట అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఈ కారణంతోనే జిల్లా ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య పెరిగింది. అయితే ఇప్పుడు కమీషన్ల జబ్బు పట్టింది... ఇక్కడి సిబ్బంది, దళారులు కుమ్మక్కై రోగులను పీల్చిపిప్పి చేస్తున్నారు. ధర్మాస్పత్రిని ఆశ్రయించిన క్షతగాత్రులను, గర్భిణులను, రోగులను భయభ్రాంతులకు గురిచేస్తూ, కమీషన్లకు కక్కుర్తి పడి ప్రైవేటు ఆస్పత్రులకు రెఫర్ చేయిస్తున్నారు. ఇంతజరుగుతన్నా ఉన్నతాధికారులు చోద్యం చూస్తున్నారు... నేడు ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం జరగనున్న నేపథ్యంలో సమస్యలపై ‘సాక్షి’ప్రత్యేక కథనం. ప్రొద్దుటూరు క్రైం : జిల్లా ఆస్పత్రికి స్థానికులే గాక మైదుకూరు, జమ్మలమడుగు, కమలాపురం, ప్రజలు వైద్యం కోసం రోజూ వందలాది మంది వస్తుంటారు. కర్నూలు జిల్లాలోని చాగలమర్రి, ఆళ్లగడ్డ నుంచి కూడా ఆస్పత్రికి వస్తారు. కేంద్ర ప్రభుత్వ ఎన్హెచ్ఎం నిధులతో ఇటీవల ఆస్పత్రిలో అన్ని రకాల సౌకర్యాలు సమకూరాయి. సిటీ స్కానింగ్, అల్ట్రాసౌండ్ స్కానింగ్, డయాలసిస్‌ను ఏర్పాటు చేశారు. ఇటీవల ఎమ్మార్ఐ కూడా మంజూరు అయింది. ఈ నెలాఖరులో అందుబాటులోకి రానుంది. సౌకర్యాలు ఉండడంతో ఓపీ కూడా పెరిగింది. ఆస్పత్రిలో వైద్యం కోసం దూరప్రాంతాల నుంచి వచ్చే రోగులు దళారుల చేతిలో దోపిడీకి గురవుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు రెఫర్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని చాలా వరకు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొని వస్తారు. గాయాల తీవ్రత ఎక్కువగా ఉంటే కర్నూలు, కడప రిమ్స్‌కు రెఫర్ చేస్తారు. అయితే ఇటీవల ఎక్కువ కేసులు ప్రభుత్వ ఆస్పత్రి నుంచి ప్రొద్దుటూరులోని ప్రైవేట్ ఆస్పత్రులకు రెఫర్ అవుతున్నాయి. రోడ్డు ప్రమాదంలో ఎవరైనా గాయపడి జిల్లా ఆస్పత్రికి వస్తే ఆస్పత్రి సిబ్బంది కొందరు ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలకు ఫోన్ చేస్తున్నారు. వారి ప్రతినిధి వెంటనే వచ్చి ‘మా ఆస్పత్రిలో మంచి గ్యారెంటీ ట్రీట్మెంట్ చేస్తాం’అని చెప్పి వారి ఆస్పత్రికి తీసుకొని వెళ్తున్నారు. ఇందుకు గాను సమాచారం చేరవేసిన సిబ్బందికి ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యం కమీషన్ రూపంలో పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తున్నారు. కొన్ని సమయాల్లో ప్రైవేట్ ఆస్పత్రుల ప్రతినిధులు జిల్లా ఆస్పత్రి వద్దనే కాపుకాచి ఉంటున్నారు. + జిల్లా ఆస్పత్రికి ప్రసవం కోసం వచ్చే వారిని కొందరు సిబ్బంది స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నారు. బీపీ తక్కువగా ఉందని, రక్తం ఎక్కించాలని ఇలా పలు కారణాలు చూపుతూ వారిని ఆస్పత్రి నుంచి పంపిస్తున్నారు. కడపకు వెళ్తామని గర్భిణీ తరఫు వాళ్లు చెప్పినా కమీషన్ల కోసం కొందరు సిబ్బంది వారిని భయపెట్టి ప్రొద్దుటూరులోని ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లేలా చేస్తున్నారు. రాత్రి వేళల్లో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ‘అమ్ము’లెన్స్..! జిల్లా ఆస్పత్రిలో రెండు అంబులెన్స్‌లు ఉన్నాయి. అత్యవసర సమయంలో ఆస్పత్రిలోని రోగులను అంబులెన్స్‌ల ద్వారా కడప రిమ్స్‌కు తీసుకొని వెళ్తారు. గతంలో అయితే ప్రభుత్వ అంబులెన్స్‌ల్లోనే కర్నూలు, తిరుపతికి తీసుకొని వెళ్లేవారు. అయితే ఇటీవల ఆస్పత్రికి ఏ కేసు వచ్చినా ప్రైవేట్ అంబులెన్స్‌ల్లోనే కడపకు తరలిస్తున్నారు. కమీషన్లకు కక్కుర్తి పడి ఆస్పత్రిలో పని చేస్తున్న కొందరు సిబ్బంది ఏదైనా కేసు వచ్చినా వెంటనే ప్రైవేట్ అంబులెన్స్‌లకు సమాచారం ఇస్తున్నారు. దీంతో పేదలు తీవ్రంగా నష్టపోతున్నారు. తాగునీటికి ఇక్కట్లు ఆస్పత్రి ప్రాంగణంలో ప్రధాన ద్వారం సమీపంలో మంచి నీళ్ల ట్యాంక్‌ను ఏర్పాటు చేశారు. మంచి నీరు కావాలంటే రెండో అంతస్తులోని వార్డులో ఉన్న రోగులు కిందికి దిగి రావాల్సి ఉంటుంది. వార్డుల్లో మంచి నీటి సౌకర్యం కల్పిస్తామని గతంలో అధికారులు చాలా సార్లు చెప్పారు. అయితే ఇంత వరకు అది అమలు కాకపోవడంతో వృద్ధులు, చిన్న పిల్లల తల్లులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలూ ఆలకించరూ.. ఆస్పత్రి ప్రాంగణంలో రోగుల సహాయకుల కోసం విశ్రాంతి భవనాన్ని నిర్మించారు. అయితే అందులో పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించకపోవడంతో గది నిరుపయోగంగా ఉంది. దీంతో రోగుల బంధువులు, సహాయకులు ఆస్పత్రి గోడల కింద కూర్చొని భోజనం చేస్తున్నారు. + హెచ్ఐవీ వ్యాధిగ్రస్తుల కోసం మొదటి అంతస్తులోని టీబీ విభాగం పక్కన వార్డు ఉండేది. ఇది వారికి ఎంతో సౌకర్యంగా ఉండేది. అయితే ఇటీవల హెచ్ఐవీ వార్డును ప్రధాన గేట్ సమీపంలోని ఔట్‌పోస్టు పక్కన ఏర్పాటు చేశారు. అందరూ చూసేవిధంగా వార్డు ఉండడంతో హెచ్ఐవీ బాధితులు వార్డులో నుంచి బయటికి రావడం లేదు. వార్డును పై అంతస్తులోకి మార్చాలని వారు కోరుతున్నారు. + ఆస్పత్రిలోని క్యాజువాలిటీ విభాగంలో గతంలో బయోమెట్రిక్ మిషన్‌ను ఏర్పాటు చేశారు. బయోమెట్రిక్ విధానం ఉన్న సమయంలో ఆస్పత్రిలోని సిబ్బంది, అధికారులతో పాటు వైద్యులు కూడా నిర్ణీత సమయానికి విధులకు హాజరయ్యేవారు. అయితే కొన్ని రోజుల తర్వాత మిషన్ చెడిపోవడంతో పక్కన పడేశారు. ఇటీవల కొత్త మిషన్ ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పారు. అయితే ఇంత వరకు ఏర్పాటు చేయలేదు. దీంతో ఆస్పత్రిలో పని చేస్తున్న ఉద్యోగులు విధులకు ఆలస్యంగా వస్తున్నారు. కొందరైతే అస్సలు రావడం లేదు. జిల్లా అధికారులు దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. నేడు అభివృద్ధి కమిటీ సమావేశం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సలహామండలి సమావేశం శుక్రవారం మ«ధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించనున్నట్లు మెడికల్ సూపరింటెండెంట్ లక్ష్మీప్రసాద్ తెలిపారు. సమావేశానికి కలెక్టర్ హరికిరణ్ హాజరుకానున్నారని తెలిపారు. ఆస్పత్రిలోని పలు సమస్యలపై సమావేశంలో చర్చిస్తామన్నారు. ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలపై ఏవిధంగా స్పందిస్తారో నేటి సమావేశంలో తెలియనుంది. నేడ కేంద్ర బృందం రాక స్థానిక జిల్లా ఆస్పత్రికి కేంద్ర లక్ష్యా టీం రానున్నట్లు ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ లక్ష్మీప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. లక్నో, జోథ్‌పూర్‌ల నుంచి సభ్యులు వస్తున్నట్లు తెలిపారు. ఆస్పత్రిలోని లేబర్‌వార్డు, ఆపరేషన్ థియేటర్, పోస్ట్‌ఆపరేటివ్ వార్డు, ఎస్ఎన్సీయూ, చిన్న పిల్లల విభాగాలను పరిశీలిస్తారన్నారు. లక్ష్యా అవార్డులో భాగంగా పరిశీలన కోసం కేంద్ర బృందం సభ్యులు వస్తునట్లు తెలిపారు. లక్ష్యా అవార్డు పరిశీలన కోసం రాష్ట్రంలో మూడు ఆస్పత్రులు ఎంపిక కాగా అందులో ప్రొద్దుటూరు జిల్లా అస్పత్రి కూడా ఒకటి అన్నారు. రెండు రోజుల పాటు ఆస్పత్రిలో ఉండి పరిశీలిస్తారని తెలిపారు. -
వామ్మో.. డెంగీ
డెంగీ పేరు చెబితేనే ప్రజలు హడలిపోతున్నారు. అయితే మున్సిపల్ అధికారులు ఆస్పత్రుల్లో ఎలాంటి డెంగీ కేసులు నమోదు కాలేదని ప్రభుత్వానికి నివేదిక పంపుతున్నారు. ఇప్పటికే జిల్లాలో పలువురు డెంగీ జ్వరంతో మృత్యువాత పడినా జిల్లా యంత్రాంగం మేలుకోకపోవడం వారి నిర్లక్ష్యాన్ని బయటపెడుతోంది. ప్రొద్దుటూరు టౌన్ : ప్రొద్దుటూరులో రెండేళ్ల కిందట డెంగీ బారినపడి పదుల సంఖ్యలో మృత్యువాత పడిన పరిస్థితులు ఇప్పుడు పుణరావృతం అవుతున్నాయా అన్నట్లు ఉంది పరిస్థితి. పట్టణంలోని స్వయంసేవక్రోడ్డులో చంద్రశేఖర్‌కు టుంబంలో కుమార్తె సోనిక(12) వారం రోజుల కిందట జ్వరం రావడంతో స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. 1.20 లక్షలు ఉన్న రక్తకణాలు 40 వేలకు తగ్గడంతో వైద్యుని సలహామేరకు కర్నూలు రెయిన్బో ఆస్పత్రిలో చేర్పించారు. ఇప్పటికీ దాదాపు రూ.60 వేల నుంచి రూ.70 వేల దాకా వైద్యానికి ఖర్చయింది. డెంగీ పాజిటివ్ అని రక్త పరీక్షల రిపోర్టులో ఇచ్చారు. ఇతని కుమారుడు చరిత్(10)కు జ్వ రం రావడంతో స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. రక్త కణాలు తగ్గడంతో పరీక్షలు చేయి స్తే ఇతనికి డెంగీ పాజిటివ్‌గా రిపోర్టు ఇచ్చారు. వైద్యానికి రూ.40 వేలకు పైగా ఖర్చయింది. చిన్న వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న ఇతను పిల్లలు ఇద్దరికీ డెంగీ రావడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. రక్తకణాలు 4 వేలకు తగ్గడంతో... చంద్రశేఖర్ అన్న మల్లికార్జున చిన్న కుమార్తె ప్రణవి(9)కి ఈ నెల 10వ తేదీ జ్వరం వచ్చింది. స్థానిక ఆస్పత్రిలో చికిత్స చేయించారు. అయినా జ్వరం తగ్గలేదు. రక్త పరీక్షలు చేయించారు. రక్తకణాలు 9000 ఉన్నట్లు గుర్తించారు. మరో రెండు రోజులు చికిత్స చేయించాక చూస్తే 4000లకు రక్తకణాలు పడిపోయాయి. అప్పటికే ప్రణవి శరీరం వాపు వచ్చింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అంబులెన్స్‌లో ఆక్సిజెన్ ఏర్పాటు చేసుకొని కర్నూలు ఆస్పత్రికి పరుగులు తీశారు. అక్కడికి వెళితే బెడ్లు ఖాళీగా లేవు, పరిస్థితి విషమంగా ఉంది హైదరాబాదుకు వెళ్లమన్నారు. మల్లికార్జున పరిస్థితి దయనీయంగా మారింది. కన్నబిడ్డ ప్రాణం కాపాడుకోవడానికి అటునుంచి అటే హైదరాబాదుకు బయలు దేరారు. లోటస్ ఆస్పత్రిలో చేర్పించారు. ఐదు రోజులు ఐసీయూలో ఉంచారు. దాదాపు రూ.2లక్షలకు పైగా వైద్యానికి ఖర్చు చేశారు. తెలిసిన వారి వద్ద నుంచి డబ్బు తెప్పించుకొని శుక్రవారం తెల్లవారుజామున ప్రణవిని ప్రొద్దుటూరుకు తీసుకొచ్చారు. మరో రెండు డెంగీ కేసులు నమోదు... పట్టణంలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో మరో రెండు డెంగీ కేసులు నమోదయ్యాయని శుక్రవారం మున్సిపల్ అధికారులకు నివేదికలు వచ్చాయి. పలు ఆస్పత్రుల్లో పదుల సంఖ్యలో రక్త కణాలు పూర్తి స్థాయిలో పడిపోయిన కేసులు ఉన్నా వారి వివరాలను వైద్యులు మున్సిపల్ అధికారులకు ఇవ్వడంలేదు. రోజూ ఐదు, ఆరు మంది కర్నూలు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. జిల్లాలో పలువురు మృతి... జిల్లాలోని రాయచోటి నియోజకవర్గంలోని సుద్దపల్లె గ్రామానికి చెందిన బుచ్చనపల్లె నాగమ్మ(45) జ్వరం బారిన పడి మృతి చెందింది. అలాగే గువ్వలచెరువు, నీలకంఠరావుపేట, బండపల్లె రాచపల్లె తదితర గ్రామాల్లో కూడా ప్రజలు జ్వరాలతో అల్లాడుతున్నారు. రాయచోటి పట్టణానికి చెందిన నీలా ప్రభు(15) అనే విద్యార్థి విష జ్వరంతో మృతి చెందాడు. లక్కిరెడ్డిపల్లె మండలం ముర్రిచెట్టు సమీపంలో నివాసం ఉంటున్న కీర్తి(8) అనే బాలిక విషజ్వరంతో మృతి చెందింది. రామాపురంలోని మూడు రోడ్ల కూడలి వద్ద అనుంపల్లెకు చెందిన సరోజమ్మ (50) విషజ్వరంతో మృతి చెందింది. మైదుకూరు పట్టణం కడప రోడ్డులో నివాసం ఉంటున్న కె.వనజ (17) డెంగీ జ్వరంతో మృతి చెందింది. -
పెళ్లింట విషాదం
వీరపునాయునిపల్లె: అంకిరెడ్డిపల్లెలో బాలగంగిరెడ్డి, అంకాల్‌రెడ్డి అన్నదమ్ములు ఉన్నారు. బాలగంగిరెడ్డి కుమార్తె వివాహాన్ని బుధవారం చేయాలని నిర్ణయించారు. అంకాల్‌రెడ్డి కుమారుడు శివకృష్ణారెడ్డి(28) తన చెల్లెలి వివాహాన్ని వైభవంగా చేయాలని పనుల్లో నిమగ్నమయ్యాడు. నీళ్లను ట్యాంకర్లో తీసుకొచ్చేందుకు పొలాల వద్దకు వెళ్లాడు. అక్కడ ట్యాంకర్ పైకి ఎక్కి నీరు పడుతుండగా.. పైన ఉన్న విద్యుత్ తీగెలు తగలడంతో షాక్‌కు గురయ్యాడు. అతనిని కుటుంబ సభ్యులు ప్రొద్దుటూరు ఆసుపత్రికి తీసుకుని వెళ్లగా.. అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వరప్రసాద్ తెలిపారు. ఆగిన పెళ్లి:కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ప్రస్తుతం వివాహం ఆగిపోయింది. -
రోడ్డు ప్రమాదంలో 11 మంది కూలీలకు గాయాలు
వీరపునాయునిపల్లె: సంగాలపల్లె వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 11 మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అనిమెల గ్రామం వద్ద జరుగుతున్న గాలి మరల నిర్మాణపు పనుల కోసం ఎర్రగుంట్ల, చిలంకూరు ప్రాంతాల నుంచి వచ్చిన కూలీలు రోజూ లాగే శనివారం కూడా సాయంత్రానికి పనులను ముగించుకుని ఆటోలో స్వగ్రామాలకు వెళ్తున్నారు. సంగాలపల్లె వద్ద వేంపల్లె వైపు నుంచి వస్తున్న ట్యాంపర్ వాహనం వెనుక వైపు నుంచి ఢీకొట్టింది. దీంతో ఆటో రోడ్డు పక్కన వున్న పొలాల్లోకి దూసుకొని వెళ్లగా అందులో ప్రయాణిస్తున్న 11 మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. మల్లికార్జున, నాగరాజు, బాలయ్య, అబ్దుల్లా, షరీఫ్‌తోపాటు మరో ఐదుగురు గాయాల పాలయ్యారు. వీరిని స్థానికులు 108 వాహనం ద్వారా ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు.