breaking news
photo identity cards
-
‘క్యూఆర్’ గుర్తింపు కార్డులు
సాక్షి, న్యూఢిల్లీ: ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పారదర్శకతకు, భద్రతకు పెద్దపీట వేస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ పలు కీలక చర్యలు చేపట్టింది. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి అనధికార వ్యక్తుల ప్రవేశానికి అడ్డుకట్ట వేసేందుకు క్యూఆర్ కోడ్ ఆధారిత ఫొటో గుర్తింపు కార్డులను జారీ చేయనున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన మాడ్యూల్‌ను ఈసీఐనెట్ వేదికగా ప్రవేశపెట్టినట్లు గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. మే 4వ తేదీన అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలతో పాటు, 5 రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్‌లోనూ ఈ విధానాన్ని తొలిసారిగా అమలు చేయనున్నట్లు వెల్లడించింది. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద గుర్తింపు కార్డుల వెరిఫికేషన్ కోసం ఈసీ ప్రత్యేకంగా మూడంచెల భద్రతా యంత్రాంగాన్ని ఖరారు చేసింది. మొదటి రెండంచెల్లో రిటర్నింగ్ అధికారులు (ఆర్ఓ) జారీ చేసిన ఫొటో గుర్తింపు కార్డులను భద్రతా సిబ్బంది మాన్యువల్‌గా తనిఖీ చేస్తారు. మూడో అంచె, కౌంటింగ్ హాల్‌కు అతి సమీపంలో ఉండే ఈ కీలకమైన పాయింట్ వద్ద క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తారు. సాఫ్ట్వేర్ ద్వారా వెరిఫికేషన్ సక్సెస్ అయ్యాకే సంబంధిత వ్యక్తిని లోపలికి అనుమతిస్తారు. ఎన్నికల సంఘం అనుమతి పొందిన అన్ని విభాగాల వారికి అంటే.. రిటర్నింగ్ అధికారులు (ఆర్వో), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు (ఏఆర్వో), కౌంటింగ్ సిబ్బంది, టెక్నికల్ టీమ్, ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లకు ఈ కొత్త క్యూఆర్ కోడ్ కార్డులు తప్పనిసరి. కౌంటింగ్ కేంద్రాల వద్ద మీడియా సెంటర్ జర్నలిస్టుల కోసం కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేకంగా ‘మీడియా సెంటర్’ఏర్పాటు చేయనున్నారు. మీడియా ప్రతినిధుల ప్రవేశం మాత్రం ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారమే, ఈసీ జారీ చేసే అథారిటీ లెటర్ల ఆధారంగా కొనసాగుతుంది. కొత్త వ్యవస్థను పకడ్బందీగా అమలు చేసేందుకు అవసరమైన శిక్షణ పొందిన సిబ్బందిని నియమించాలని జిల్లా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులను ఈసీ ఆదేశించింది. భవిష్యత్తులో జరగబోయే అన్ని లోక్‌సభ, అసెంబ్లీ సాధారణ, ఉప ఎన్నికల్లోనూ ఇదే విధానాన్ని అనుసరించనున్నట్లు స్పష్టం చేసింది. ఏడాది కాలంగా చేపట్టిన 30కి పైగా సంస్కరణల్లో భాగంగానే క్యూఆర్ కోడ్ ఐడీ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. -
ఆధార్, రేషన్ కార్డు లేవా.. అయితే రావొద్దు!
మీరు ఏదైనా పనిమీద తూర్పుగోదావరి జిల్లా వెళ్తున్నారా? అందులోనూ కిర్లంపూడి గ్రామానికి వెళ్దామని అనుకుంటున్నారా? అయితే ఒక్క నిమిషం. మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు లాంటి ఫొటో ఐడెంటిటీ కార్డులు తప్పనిసరిగా తీసుకెళ్లండి. దాంతోపాటు మీరు ఏ పనిమీద వెళ్తున్నారో కూడా స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. అదేంటి... సొంత రాష్ట్రంలో తెలుగు ప్రజలకు ఈ ఆంక్షలేంటి, ఏమైనా పాకిస్థాన్‌లో ఉన్నామా అని భయపడుతున్నారా? కాపు రిజర్వేషన్ల సాధన కోసం కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న నేపథ్యంలో అక్కడ పోలీసులు విధించిన ఆంక్షలివి. చుట్టుపక్కల గ్రామాలకు చెందినవారైనా సరే.. తప్పనిసరిగా తమ గుర్తింపు కార్డులు చూపించిన తర్వాత మాత్రమే కిర్లంపూడిలో ప్రవేశించడానికి అనుమతిస్తామని పోలీసులు చెబుతున్నారు. ముద్రగడ దీక్ష నాలుగో రోజుకు చేరుకున్న నేపథ్యంలో పోలీసులు హడావుడి చేస్తున్నారు. గత మూడు రోజుల కంటే సోమవారం హడావుడి మరింత ఎక్కువగా కనిపిస్తుండటంతో... ఈరోజు ఏమైనా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాపులను బీసీలలో చేర్చి రిజర్వేషన్ కల్పించాలని, ఏడాదికి వెయ్యికోట్లు ఇస్తామన్నందున ఈ రెండేళ్లకు సంబంధించిన నిధులు వెంటనే విడుదల చేయాలని ముద్రగడ డిమాండ్ చేస్తున్నారు. దాంతోపాటు తాము సూచించిన వ్యక్తినే కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించాలని కోరుతున్నారు. వీటిపై ఆయనతో చర్చించేందుకు ప్రభుత్వం తరఫున కొందరు ప్రతినిధులు ఈరోజు కిర్లంపూడికి వస్తారని తెలుస్తోంది.


