మూడంచెల భద్రతా వ్యవస్థ
4న ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపునకు ఈసీ కీలక చర్యలు
సాక్షి, న్యూఢిల్లీ: ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పారదర్శకతకు, భద్రతకు పెద్దపీట వేస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ పలు కీలక చర్యలు చేపట్టింది. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి అనధికార వ్యక్తుల ప్రవేశానికి అడ్డుకట్ట వేసేందుకు క్యూఆర్ కోడ్ ఆధారిత ఫొటో గుర్తింపు కార్డులను జారీ చేయనున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన మాడ్యూల్‌ను ఈసీఐనెట్ వేదికగా ప్రవేశపెట్టినట్లు గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది.
మే 4వ తేదీన అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలతో పాటు, 5 రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్‌లోనూ ఈ విధానాన్ని తొలిసారిగా అమలు చేయనున్నట్లు వెల్లడించింది. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద గుర్తింపు కార్డుల వెరిఫికేషన్ కోసం ఈసీ ప్రత్యేకంగా మూడంచెల భద్రతా యంత్రాంగాన్ని ఖరారు చేసింది.
మొదటి రెండంచెల్లో రిటర్నింగ్ అధికారులు (ఆర్‌ఓ) జారీ చేసిన ఫొటో గుర్తింపు కార్డులను భద్రతా సిబ్బంది మాన్యువల్‌గా తనిఖీ చేస్తారు. మూడో అంచె, కౌంటింగ్ హాల్‌కు అతి సమీపంలో ఉండే ఈ కీలకమైన పాయింట్ వద్ద క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తారు. సాఫ్ట్‌వేర్ ద్వారా వెరిఫికేషన్ సక్సెస్ అయ్యాకే సంబంధిత వ్యక్తిని లోపలికి అనుమతిస్తారు. ఎన్నికల సంఘం అనుమతి పొందిన అన్ని విభాగాల వారికి అంటే.. రిటర్నింగ్ అధికారులు (ఆర్‌వో), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు (ఏఆర్‌వో), కౌంటింగ్ సిబ్బంది, టెక్నికల్ టీమ్, ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లకు ఈ కొత్త క్యూఆర్ కోడ్ కార్డులు తప్పనిసరి.
కౌంటింగ్ కేంద్రాల వద్ద మీడియా సెంటర్
జర్నలిస్టుల కోసం కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేకంగా ‘మీడియా సెంటర్’ఏర్పాటు చేయనున్నారు. మీడియా ప్రతినిధుల ప్రవేశం మాత్రం ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారమే, ఈసీ జారీ చేసే అథారిటీ లెటర్ల ఆధారంగా కొనసాగుతుంది. కొత్త వ్యవస్థను పకడ్బందీగా అమలు చేసేందుకు అవసరమైన శిక్షణ పొందిన సిబ్బందిని నియమించాలని జిల్లా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులను ఈసీ ఆదేశించింది. భవిష్యత్తులో జరగబోయే అన్ని లోక్‌సభ, అసెంబ్లీ సాధారణ, ఉప ఎన్నికల్లోనూ ఇదే విధానాన్ని అనుసరించనున్నట్లు స్పష్టం చేసింది. ఏడాది కాలంగా చేపట్టిన 30కి పైగా సంస్కరణల్లో భాగంగానే క్యూఆర్ కోడ్ ఐడీ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.


