breaking news
Pending salaries
-
ఏడు నెలలుగా జీతాలివ్వలేదని..
సాక్షి, బెంగళూర్ : నెలల తరడబడి తమకు జీతాలు ఇవ్వలేదన్న కోపంతో తమ యజమానిని కిడ్నాప్ చేశారనే ఆరోపణలపై నలుగురు ప్రైవేట్ సంస్థ ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూర్‌లోని హలసూరులో 23 ఏళ్ల సుజయ్ ఓ ప్రైవేట్ సంస్థను నడుపుతూ గత ఏడు నెలలుగా ఉద్యోగులకు వేతనాలు చెల్లించడం లేదు. తమ బాస్‌ను కిడ్నాప్ చేసి పెండింగ్ వేతనాలను రాబట్టాలని సంస్ధలో పనిచేసే ఏడుగురు ఉద్యోగులు బృందంగా ఏర్పడి తమ ప్లాన్‌ను అమలు చేశారు. తమ యజమాని సుజయ్‌ను మార్చి 21న కిడ్నాప్ చేసి తమ స్నేహితుడు నివసించే హెచ్ఎస్ఆర్ లేఅవుట్‌కు తీసుకువెళ్లారు. అక్కడ సుజయ్‌ను వేతనాలు డిమాండ్ చేస్తూ వేధించిన ఉద్యోగులు ఆయన నుంచి హామీ తీసుకున్న తర్వాత వదిలేశారు. ఉద్యోగుల చెర నుంచి బయటపడిన సుజయ్ ఫిర్యాదు చేయడంతో హలసూరు పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
వేతనాలపై జెట్ ఎయిర్వేస్ మెలిక
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎయిర్వేస్ వేతన చెల్లింపులపై చేతులెత్తేసింది. డిసెంబర్ వరకూ ఉన్న వేతన బకాయిలే చెల్లిస్తామని స్పష్టం చేసింది. వేతన బకాయిలను పూర్తిగా పరిష్కరించకుంటే ఏప్రిల్ 1 నుంచి విమాన సేవలను నిలిపివేస్తామని పైలట్లు యాజమాన్యాన్ని హెచ్చరించిన సంగతి తెలిసిందే. కాగా ఇంజనీర్లు, సీనియర్ సిబ్బంది సహా పైలట్లకు నాలుగు నెలల నుంచి వేతన చెల్లింపు నిలిచిపోయింది. మార్చి 31 నాటికి బకాయిలు చెల్లించడంతో పాటు రానున్న మాసాల్లో వేతన చెల్లింపులపై రోడ్‌మ్యాప్ ప్రకటించని పక్షంలో విమానాలను ఎగరనీయమని సిబ్బంది అల్టిమేటం జారీ చేశారు. ఇక డిసెంబర్ వేతనంలోనే 87.50 శాతం బకాయిని చెల్లించేందుకు ముందుకు వచ్చిన సంస్థ ప్రస్తుతం ఇంతవరకే చెల్లిస్తామని, సంస్థను గాడిలో పెట్టే ప్రక్రియ కొనసాగుతున్నందున సిబ్బంది డిమాండ్‌ను నెరవేర్చేందుకు ఆశించిన సమయం కంటే మరికొంత సమయం పడుతుందని జెట్ ఎయిర్వేస్ సీఈవో వినయ్ దూబే పేర్కొన్నారు. మరోవైపు జెట్ ఎయిర్వేస్లో ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియంకు వాటా కల్పించేందుకు సంస్థ చైర్మన్ నరేష్ గోయల్, ఆయన భార్య అనిత బోర్డు నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. -
అ..అమ్మ..ఆ.. ఆకలి
వేతనం కరువైన సాక్షర భారత్ సమన్వయకర్తలు 14 నెలలుగా వీసీఓలు, తొమ్మిది నెలలుగా ఎంసీఓలకు రూ.7.10 కోట్ల జీతాలు పెండింగ్ ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు వచ్చినా పైసా విదల్చని ప్రభుత్వం జిల్లాలో అక్షరాలు రాక నిరక్షరాస్యులు ముప్పుతిప్పలు పడుతుంటే.. అక్షరాలొచ్చిన వారు ఆకలిదప్పులతో అలమటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా సాఫీగా కొనసాగిన వయోజనకేంద్రాలు, సాక్షరభారత్ సమన్వయ కర్తలను ప్రస్తుత ప్రభుత్వాలు గాలికొదిలేశాయి. నెలల తరబడి చిల్లిగవ్వకూడా విదల్చకపోవడంతో ప్రభుత్వ లక్ష్యం కుంటు పడుతోంది. పండగలొచ్చినా పస్తులతో కుటుంబాలను నెట్టుకురావాల్సి వస్తోంది. వీరి గురించి అటు పాలకులుగానీ, ఇటు అధికారులుగానీ పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. బి.కొత్తకోట: నిరక్ష్యరాస్యులను అక్షరాస్యులుగా చేస్తున్న సాక్షర భారత్ సమన్వయకర్తలు ఆకలికేకలు పెడుతున్నారు. బొటాబొటి వేతనంతో బతుకు వెళ్లదీస్తున్న వీరు నెలల తరబడి వేతనాలందక సమస్యలతో సతమతమవుతున్నారు. కష్టాల కడలిని ఈదుతున్న వీరి పనితీరుపై ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రతికూల ప్రభావం చూపుతోంది. లక్ష్యం ఘనం.. వయోజన విద్యా విభాగం 15 ఏళ్లు దాటిన నిరక్ష్యరాసులను అక్షరాస్యులుగా మార్చేందుకు సాక్షర భారత్ కార్యక్రమాన్ని అమలుచేస్తోంది. దీనికోసం జిల్లా వ్యాప్తంగా 2,420 మంది గ్రామ సమన్వయకర్తలు (విలేజ్ కో-ఆర్డినేటర్లు), 60 మంది మండల సమన్వయకర్త(ఎంసీవో)లను నియమించింది. వీరు నిరక్ష్యరాస్యులను గుర్తించి వారిని అభ్యాసాల ద్వారా అక్షరాస్యులను చేస్తారు. ఈ కార్యక్రమం కింద ఇప్పటికే ఐదు దశలు పూర్తయ్యాయి. 4,72,510 మందిని అక్షరాస్యులుగా మార్చారు. ప్రస్తు తం ఆరో దశలో జిల్లా వ్యాప్తంగా 1.63లక్షల మందిని అక్షరాస్యులుగా చేయాలని నిర్ణయించారు. ఇందులో ప్రధానంగా ఉపాధి హమీ పథకంలో పనిచేస్తున్న కూలీలు, ఐకేపీ సంఘాల్లోని మహిళలను అక్షరాస్యులుగా చేయాలని లక్ష్యంగా చేసుకొన్నారు. దీనికి డ్వామా, డీఆర్డీఏ శాఖలు సహకారం అందిస్తున్నాయి. వేతనాల మాటేదీ? సాక్షరభారత్ వీసీవోలకు నెలకు రూ.2 వేలు, ఎంసీవోలకు నెలకు రూ.6 వేలు వేతనం ఇస్తున్నారు. అయితే కొద్దిపాటి వేతనంతో పనిచేస్తున్న వీరికి ప్రభుత్వం నుంచి తోడ్పాటు కరువైంది. ‘మీ ఇంట్లో తిని మా ఇంట్లో పనిచేయండి’ అన్నట్టుగా మారింది వీరి పరిస్థితి. వీసీవోలకు 14 నెలలుగా, ఎంసీవోలకు తొమ్మిది నెలలుగా ప్రభుత్వం జీతాలు చెల్లించలేదు. తమ వేతనాలు ఎప్పుడు చె ల్లిస్తారా అని వీరు ఎదురుచూస్తున్నారు. పైసా ఇవ్వని ప్రభుత్వం జిల్లాలో వయోజన విద్యా కార్యక్రమాలు ముందుకు తీసుకుపోవడానికి, వేతనాల చెల్లింపు ఏడాదికి సగటున రూ. 10 కోట్లు అవసరమవుతాయని అధికారుల అంచనా. అయితే దీనికి తగ్గట్టుగా ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి డిసెంబర్ దాటుతున్నా ఒక్కపైసా ఇవ్వలేదు. ఈ పరిస్థితుల్లో వేతనాలు ఇచ్చేదెలాగో అధికారులకు అర్థం కావడం లేదు. సాక్షర భారత్ కో-ఆర్డినేటర్ల జీతం విషయమై జిల్లా వయోజన విద్య డెప్యూటీ డెరైక్టర్ వీ.ఉమాదేవిని సోమవారం వివరణ కోరగా, 2014-15 ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన నిధుల్లో వినియోగించని రూ.3 కోట్ల నిధులు మిగిలి ఉన్నాయని.. వీటితో వేతనాలు చెల్లించేందుకు చర్యలు తీసుకొంటున్నామని తెలిపారు. రోజంతా విధుల్లోనే ఉన్నా.. వేతనం తప్ప మరో ఆదాయం లేదు. దీనిపైనే కుటుంబం ఆధారపడింది. రోజంతా విధుల్లోనే ఉండాలి. అయితే ఏప్రిల్ నుంచి వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నాం. కుటుంబం గడవాలంటే కష్టంగా ఉంది. ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలి. - రాంబాబు, మండల కో-ఆర్డినేటర్, బి.కొత్తకోట అన్ని పనులు చేసినా.. సాక్షర భారత్ కార్యక్రమం ద్వారా ఎంతోమంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాం. ప్రభుత్వ పథకాల ప్రచారం, ఇంటింటి సర్వేలను మాతో చేయించారు. ఇచ్చేది తక్కువ జీతం. అది కూడా 14 నెలలుగా రాకుంటే మేమంతా ఏం తిని బతకాలి. - ఆంజినేయులు, విలేజ్ కో-ఆర్డినేటర్, రంగసముద్రం