breaking news
Palm oil plant
-
సాగుకు 24 గంటల కరెంట్
-
సాగుకు 24 గంటల కరెంట్
వచ్చే ఏడాది నుంచి ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం: సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది నుంచి వ్యవ సాయానికి 24 గంటల కరెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. గిట్టుబాటు ధర సమ స్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు వచ్చే బడ్జెట్లో రూ.500 కోట్ల నిధిని ఏర్పాటు చేస్తా మని, రైతు కమిటీల ఆధ్వర్యంలోనే వ్యవ సాయ ఉత్పత్తుల అమ్మకం జరుగుతుందని వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం అప్పారావుపేటలో పామాయిల్ ప్లాంట్ ప్రారంభానికి సిద్ధమైన నేపథ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో రైతులు ఆదివారమిక్కడ ప్రగతి భవన్‌కు వచ్చి సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ప్లాంట్ ప్రారం భోత్సవానికి రావాల్సిందిగా సీఎంను ఆహ్వా నించారు. ఇందుకు ముఖ్యమంత్రి సానుకూ లంగా స్పందించారు. త్వరలోనే ప్లాంట్‌ను ప్రారంభిస్తానని వెల్లడించారు. ఈ కార్య క్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మినారాయణ, కర్నె ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతుల నుద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడారు. ధర నిర్ణయం రైతులదే.. రైతులకు పెట్టుబడి సమస్య తీర్చామని ముఖ్య మంత్రి చెప్పారు. ‘‘రైతులకు రెండే సమస్య లున్నాయి. పెట్టుబడి వ్యయం ఒకటైతే.. గిట్టు బాటు ధర రాకపోవడం మరోటి. పెట్టుబడి సమస్యను తీర్చేందుకు ప్రభుత్వమే ఏడాదికి ఎకరానికి రూ.8 వేలు పెట్టుబడిగా సమకూ ర్చాలని నిర్ణయం తీసుకుంది. ఏ పంట వేసినా సరే పెట్టుబడి రూ.8 వేలు అందుతాయి. ఎన్ని వందల ఎకరాల ఆసామి అయినా పెట్టుబడి కోసం ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. రోహిణి కార్తె వచ్చిందంటే చాలు అప్పుల కోసం తిప్పలు పడే దుస్థితి ఉంది. ఈ విష వలయం నుంచి రైతులను బయటపడేయడానికే పెట్టుబడి వ్యయం సమకూర్చాలని నిర్ణయిం చుకున్నాం. రైతు సంతోషంగా ఉంటాడు. రైతు బాగుంటేనే ఊరు బాగుంటుంది. వ్యవసా యాన్ని ఆధారం చేసుకుని మనుగడ సాగించే కులవృత్తులు కూడా వర్ధిల్లుతాయి. రైతు గ్రహమైతే, చేతి వృత్తి పనివారంతా ఉపగ్రహాలుగా బతుకుతారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టి రైతుతోనే ప్రారంభం అవుతుంది’’ అని అన్నారు. ‘‘గిట్టుబాటు ధర మరో సమస్య. దీని పరిష్కారం కూడా ఆలోచించాం. గ్రామాల్లో రైతు సంఘాలు ఏర్పాటు చేస్తాం. వాటి ద్వారా మండల రైతు సమాఖ్యలు, జిల్లా రైతు సమాఖ్యలు, రాష్ట్ర రైతు సమాఖ్య ఏర్పాటు చేస్తాం. పంటలకు ధర నిర్ణయించే అధికారం రైతు సంఘాలకే ఉంటుంది. రైతు సంఘం మండల స్థాయిలో వ్యాపారులతో చర్చించి ధర నిర్ణయిస్తుంది. దాని ప్రకారమే అమ్మకం జరగాలి. రాష్ట్ర రైతు సంఘానికి వచ్చే బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయిస్తాం. ఏ పంటకైతే రేటు తగ్గిందో ఆ తగ్గిన రేటుకు సరిపడా ఈ నిధుల నుంచి ఖర్చు చేసి రైతులకు కనీస మద్దతు ధర అందేలా చర్యలు తీసుకుంటాం. అలాగే రాష్ట్రవ్యాప్తంగా క్రాప్ కాలనీలు ఏర్పాటు చేస్తాం. నీటి వనరు, ఉష్ణోగ్రత, గాలివేగం, భూసారం తదితర అంశాల ఆధారంగా ఏ ప్రాంతంలో ఏ పంట వేయాలో వ్యవసాయ శాస్త్రవేత్తలు నిర్ణయిస్తారు. దాని ప్రకారం పంటలు వేసుకోవాలి. దీంతో మంచి దిగుబడి వస్తుంది. అందరూ ఒకే పంట వేసుకునే పద్ధతి పోతుంది. అందరూ ఒకే పంట వేయడం వల్ల మార్కెట్లో రేటు పడిపోతోం ది. రైతే రైతుకు శత్రువు అవుతున్నాడు. క్రాప్ కాలనీల ద్వారా వేర్వేరు పంటలు వేసుకోవడం ద్వారా అందరికీ మంచి ధర వస్తుంది. రాష్ట్రం కూడా వ్యవసాయ ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి సాధిస్తుంది. మన అవసరాలకు పోను మిగతా పంటను వేరే రాష్ట్రాల్లో, విదేశాల్లో అమ్ముకునే వెసులుబాటు కూడా కల్పిస్తాం’’ అని ముఖ్యమంత్రి వివరించారు. ఆటోమేటిక్ స్టార్టర్లతో రెండు నష్టాలు.. ‘‘ప్రస్తుతం వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ అందిస్తున్నాం. కొంతమంది రైతు లు అటోమెటిక్ స్టార్టర్లు ఉపయోగిస్తున్నా రు. అవసరానికి మించి నీటిని తోడుతున్నా రు. దీనివల్ల రెండు రకాల నష్టాలున్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోతాయి.. అవసరానికి మించి నీరు అందడం వల్ల పంట పాడవుతుంది. కాబట్టి ఆటోమేటిక్ స్టార్టర్ల వాడకం పూర్తిగా మానేయండి’’ అని సీఎం పేర్కొన్నారు. ‘‘వచ్చే ఏడాది, ఏడాదిన్నర సమయంలో మనకు మరింత కరెంట్ లభ్యమవుతుంది. అప్పుడు వ్యవసాయానికి కూడా 24 గంటల కరెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. రైతులు ఎప్పుడు కావాలంటే అప్పుడు నీళ్లు పెట్టుకునే అవకాశం ఉంటుంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకుంది. గతంలో ఎరువులు, విత్తనాల కోసం ఎంతో ఇబ్బంది పడేవారు. సాగునీరు లేక పొలాలు బీళ్లుగా ఉండేవి. ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ప్రాజెక్టులు కట్టుకుంటున్నాం. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు పునరుద్ధరించుకుంటున్నాం. 9 గంటల కరెంట్ ఇచ్చుకుంటున్నాం. విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చూశాం. 21.5 లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములు నిర్మించుకున్నాం. ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటున్నాం’’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. -
దొంగతనం చేసిందనే నెపంతో... వృద్ధురాలిని కొట్టి చంపారు
రఘునాథపాలెం, న్యూస్‌లైన్: దొంగతనం చేసిందనే నెపంతో వృద్ధురాలిని యజమానురాలు, తోటి కూలీలు కలిసి చితకబాదడంతో ఆమె మృతిచెందింది. మృతదేహాన్ని మాయంచేసేందుకు ప్రయత్నించగా గ్రామస్తులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. రఘునాధపాలెం మండలం పంగిడిలో కలకలం రేపిన ఈసంఘటనకు సంబంధించి పోలీసుల కథనంమేరకు వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడ సమీపంలోని ఈడ్పుగల్లుకు చెందిన ఉప్పలపాటి అరుణకు పంగిడి సమీపంలోని ఎన్.వి.బంజర రోడ్డులో పామాయిల్ తోట ఉంది. ఆ తోటలో పనిచేసేందుకు విజయవాడ నుంచి వీరమ్మ (60) అనే వృద్ధురాలితో పాటు కూలీలు మూడు నెలల క్రితం వచ్చారు. వీరిలో కొందరు రఘునాథపాలెం, పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడికి చెందిన వారున్నారు. వీరంతా తోటలోనే పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నారు. కాగా, యజమానురాలు అరుణకు సంబంధించిన బంగారు గొలుసు, రూ.వెయ్యి నగదును దొంగతనానికి గురయ్యాయి. వీటిని వీరమ్మే దొంగిలించిందనే అనుమానంతో యజమానురాలు అరుణతోపాటు తోటి కూలీలు మంగళవారం ఉదయం 9గంటల ప్రాంతంలో తీవ్రంగా కొట్టారు. ఈ దెబ్బలను తట్టుకోలేక వీరమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. దీంతో భయపడిన వారు మృతదేహాన్ని మాయం చేసేందుకు ప్రయత్నించారు. యజమానురాలు అరుణ, కూలీలు మృతదేహాన్ని తోట మధ్యలోకి తీసుకువెళ్లి పడేశారు. అయితే ఈ విషయం గ్రామస్తులకు తెలియడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ గణేష్ ఆధ్వర్యంలో పోలీసులు పామాయిల్ తోటకు చేరుకుని యజమానురాలిని, కూలీలను ప్రశ్నించగా తమకేమీ తెలియదని సమాధానం ఇచ్చి తప్పించుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని తోటలో గాలింపు చర్యలు చేపట్టగా తోటమధ్యలో పడేసిన మృతదేహం కనిపించింది. కాగా, హత్యకు గురైన వీరమ్మ తనది రాజమండ్రి అని చెప్పినట్లు తోటి కూలీలు చెబుతున్నారు. పోలీసులు విచారణ చేస్తే ఆమె ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయం పూర్తిగా తెలిసే అవకాశం ఉంది. వృద్ధురాలి హత్య జరిగినట్లు సమాచారం తెలియడంతో పంగిడితో పాటు పరిసరగ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి దోషులను కఠినంగా శింక్షించాలని కోరారు. సంఘటన ప్రాంతాన్ని డీఎస్పీ బాలకిషన్‌రావు పరిశీలించారు.