breaking news
noble peace prize winner
-
బాలీవుడ్లో మరో బయోపిక్.. ఎవరిదంటే
హిట్టు, ఫ్లాఫ్‌తో పని లేకుండా ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీల్లో బయోపిక్‌ల హవా నడుస్తోంది. సినీ ప్రముఖులు, రాజకీయ వేత్తలే కాక ఇతర రంగాల్లో గుర్తింపు పొందిన ప్రముఖుల గురించి కూడా బయోపిక్‌లు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో ప్రముఖ వ్యక్తి బయోపిక్ మనల్ని పలకరించనుంది. సేవే పరమావధిగా బతికి.. ప్రపంచానికంతటికి తల్లిగా గుర్తింపు తెచ్చుకున్న ‘మదర్ థెరీసా’ జీవిత చరిత్ర ఆధారంగా ఓ బయోపిక్ తెరకెక్కనుందట. మదర్ థెరిసా జీవితం గురించి ఎన్నో పుస్తకాలు వచ్చాయి. ఇలా వచ్చిన పుస్తకాల్లో సీమా ఉపాధ్యాయ్ రచించిన ‘మదర్ థెరీసా.. ది సెయింట్’ అనే పుస్తకం బాగా పాపులర్ అయింది. ఈ పుస్తకం ఆధారంగా ఇప్పుడు మదర్ థెరీసా బయోపిక్‌ను తెరకెక్కించబోతున్నారు. సీమా ఉపాధ్యాయే దర్శకత్వం వహించే ఈ చిత్రం 2020 లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ.. ‘మదర్ థెరీసా శాంతికి, సేవకు చిహ్నంగా నిలుస్తారు. ఆమె జీవితం ఎందరికో ఆదర్శం. అందుకే ఆమె జీవితం గురించి ప్రేక్షకులకు తెలయజేయాలనుకుంటున్నాం. ఈ బయోపిక్కు మొదలు పెట్టాలని అనుకోగానే ముందు కోల్‌కతాలోని చారిటీకి వెళ్లి వారి ఆశీర్వాదం తీసుకున్నాం. ఈ చిత్రంలోని పలు పాత్రలను జాతీయ అంతర్జాతీయ నటీనటులు పోషిస్తారు. 2020లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం’ అని తెలిపారు. ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టిన మదర్ థెరిసా, ఇండియా వచ్చి.. కోల్‌కతా ప్రాంతంలో అనాధ శరణాలయాన్ని స్థాపించారు. ఆ శరణాలయం ద్వారా లక్షలాది మందిని చేరదీసి అమ్మగా మారారు. ఆమె సేవలకు ప్రతిఫలంగా నోబెల్ శాంతి పురస్కారాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. -
లైంగిక దాడులకు అడ్డుకట్ట పడాలి
జయనగర : దేశంలో చోటుచేసుకుంటున్న లైంగిక దాడులకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని నోబెల్ శాంతి పురస్కారగ్రహీత ౖకైలాస్‌సత్యార్థి సూచించారు. యలహంక శేషాద్రిపుర డిగ్రీ కాలేజీలో భారతీయవిజ్ఞానసంస్థ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన సిల్వర్‌జూబ్లీ టాక్‌లో కైలాస్‌సత్యార్థి పాల్గొని మాట్లాడారు. వివిధ యూనివర్సిటీల్లో విద్యార్థినులపై జరిగే లైంగిక దాడులను బాధితులు బయటకు చెప్పుకోలేక పోతున్నారన్నారు. తల్లిదండ్రులు స్నేహభావంతో మెలిగి పిల్లల సమస్యలు తెలుసుకోవాలన్నారు. నేటికి కోట్లాదిమంది పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారని, దుస్తులు, పాఠ్యపుస్తకాల కొనుగోలుకు డబ్బు లేక చదువులకు దూరమవుతున్నారన్నారు. ప్రపంచంలో 152 మిలియన్ల పిల్లలు బాలకార్మికులుగా ఉన్నారన్నారు. వారికి విముక్తి కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. యువత కొత్త ఆలోచనలతో ముందుకు సాగాలన్నారు. పరిశోధనలకు ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు బోధన రంగంలో ఉన్నత పదవులు అలంకరించాలన్నారు. అనంతరం కళాశాల యాజమాన్యం కైలాస్ సత్యార్థిని ఘనంగా సన్మానించింది. డీఆర్డీఏ మాజీ అధ్యక్షుడు డాక్టర్ వీకే.అత్రే, ఐఐఎస్సీ మాజీ డైరెక్టర్ ప్రొ.బలరామ్, సంస్థ గౌరవకార్యదరి డాక్టర్ వూడే పీ.కృష్ణ, డాక్టర్ ఎంపీ .రవీంద్ర, శేషాద్రిపురం ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అధ్యక్షుడు ఎన్ఆర్.పండితారాద్య తదితరులు పాల్గొన్నారు. -
బాలల రక్షణే..భారత రక్షణ
- నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి కర్నూలు: బాలల రక్షణే భారత రక్షణ అని నోబుల్ శాంతి బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి అన్నారు. బాలికలపై అత్యాచారాలు, ఆకృత్యాలు జరగడం బాధకరమని, అలాంటి వాటిని దేశం నుంచి తరిమికొట్టేందుకే తాను ఉద్యమం చేపట్టానన్నారు. బాలల హక్కులపై చైతన్యం తీసుకురావడానికి ఆయన చేపట్టిన భారత్ యాత్ర మంగళవారం కర్నూలు చేరింది. ఈ సందర్భంగా రాజ్‌విహార్ సెంటర్ నుంచి ఏపీఎస్పీ రెండో పటాలం మైదానం వరకు విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. కైలాష్ సత్యార్థితో కలసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం ఏపీఎస్పీ రెండో పటాలం మైదానంలో జరిగిన బహిరంగ సభలో సత్యార్థి ప్రసంగించారు. పిల్లలపై వేధింపులు, అక్రమ రవాణాను అరికట్టేందుకు తాను 11 వేల కిలోమీటర్ల మేర 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ద్వారా భారతయాత్ర చేపట్టానన్నారు. యాత్ర సందర్భంగా అనేక మంది పిల్లలను తాను కలుస్తున్నానని... సొంత కుటుంబ సభ్యులే వారిపై లైంగికదాడులకు పాల్పడుతున్న సంఘటనలు చూసి ఎంతో బాధేస్తోందన్నారు. బుద్ధుడు, మహాత్మాగాంధీలు పుట్టిన భారతదేశంలో తాను జన్మించడం గర్వంగా ఉందన్నారు. భారతదేశంలో లైంగిక వేధింపులు, బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, అవమానపరచడంపై 15 వేల కేసులు రిజిష్టర్ అయ్యాయని చెప్పారు. ఇందులో 4 శాతం పరిష్కారం కాగా 90 శాతం పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. పాఠశాల ఆవరణలో పిల్లలు అవమానాలకు గురవుతున్నారని, వారికి జరిగిన అన్యాయంపై త్వరితగతిన తీర్పులు వెలువడాలన్నారు. భారతదేశం యువత విద్య, ఆరోగ్యానికి 4శాతం ఖర్చు చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును 2001లో తాను కలిశానని, రాజకీయం, అభివృద్ధి సంక్షేమం పథకాలు హృదయంతో చేయాలన్నారు. ఎంత ఆస్తి సంపాదించినా పిల్లల సంరక్షణ లేకపోతే వృథానేనని అభిప్రాయపడ్డారు. తల్లిదండ్రులు పిల్లల పట్ల స్నేహితులుగా మెలగాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాలబాలికలు విద్య, ఆరోగ్యంగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, సమాచార శాఖ, గృహ నిర్మాణ శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు, కలెక్టర్ సత్యనారాయణ, డీఐజీ ఇక్బాల్ హుస్సేన్, ఎస్పీ గోపీనాథ్‌జట్టి, మాజీ శాసన మండలి చైర్మన్ చక్రపాణి యాదవ్, రాజ్యసభ సభ్యులు టీ.జీ.వెంకటేష్, ఎంపీ బుట్టా రేణుక, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, జెడ్పీ, కేడీసీసీ చైర్మన్లు మల్లెల రాజశేఖర్, మల్లికార్జునరెడ్డి, ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, మణిగాంధీ, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ శమంతకమణి, టీడీపీ నాయకులు కేఈ ప్రభాకర్, కేఈ ప్రతాప్ పాల్గొన్నారు. హక్కులపై అవగహ కల్పిస్తా.. ఓర్వకల్లులోని కస్తూరిబా గాంధీ భవన్ విద్యాలయ విద్యార్థిని శ్యామల తాను 7వ తరగతి చదువుతున్నానని, తనకు విద్యతో పాటు అన్ని విషయాలపై ఉపాధ్యాయులు అవగాహన కల్పిస్తున్నారని, 1098 మంది బాల కార్మికులను కాపాడి కేజీబీవీలలో చేర్పించారని చెప్పింది. తాను పెరిగి పెద్దయ్యాక నలుగురికి హక్కులపై అవగాహన కల్పిస్తానని చెప్పింది. ఇంట్లో ఒక అమ్మాయి చదివితే దేశం మొత్తం బాగుపడుతుందని వెల్లడించింది. మనోధైర్యం నింపారు.. కర్నూలు పట్టణానికి చెందిన పల్లవి మాట్లాడుతూ తాను 9వ తరగతి చదువుకుంటున్న సమయంలో ఓ వ్యక్తి తనను ప్రేమించి మోసం చేశాడని దీంతో తాను ఆత్మహత్యకు పాల్పడే సమయంలో పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు, సిబ్బంది తనలో మనోధైర్యం నింపి విద్యాబుద్ధులు నేర్పించారని చెప్పింది. అనంతరం కైలాస్ సత్యార్థి, ఆయన సతీమణి సుమేధ సత్యార్థిలను మెమోంటో, శాలువాతో సీఎం సత్కరించారు. ఆ తర్వాత మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ముద్రించిన కిశోరి వికాసం బ్రోచర్లను సీఎం, కైలాస్ సత్యార్థి ఆవిష్కరించారు. అంతకుముందు సురక్షిత భారతదేశం ఛాయచిత్రాలను వారు తిలకించారు.