breaking news
The Nobel Peace Prize
-
దేవుని ప్రతిరూపాలు
స్వచ్ఛ బచ్ పన్ కైలాస్ సత్యార్థి గత నలభై ఏళ్లుగా ఏ దేవాలయానికీ వెళ్లకుండానే దైవ సన్నిధిలో గడుపుతున్నారు! ఆయన వయసిప్పుడు అరవై ఏళ్లు. ఇటీవలే నోబెల్ శాంతి బహుమతికి ఎంపికైన సత్యార్థి... బాలల హక్కుల పరిరక్షణ కోసం, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ఇంచుమించు తన ఇరవయ్యవయేట నుంచే పాటు పడుతున్నారు. 1980లో ఆయన స్థాపించిన ‘బచ్పన్ బచావో ఆందోళన్’ ఉద్యమం ఇప్పటి వరకు 144 దేశాలలోని ఎనభైమూడు వేల మందికి పైగా బాలల్ని దుర్భర పరిస్థితుల నుంచి బయటికి తెచ్చింది. దైవం, ఆథ్యాత్మికత అన్నవి సత్యార్థి దృష్టిలో సాధారణ అర్థాలకు పూర్తి భిన్నమైనవి. స్వేచ్ఛ ఆయన నమ్మిన దైవం. దేవుడే మనిషికి స్వేచ్ఛను ప్రసాదించాడు కాబట్టి స్వేచ్ఛకూడా దైవసమానమేనని ఆయన అంటారు. దేవుడిచ్చిన ఆ స్వేచ్ఛను కాపాడుకోడానికి పోరాడడం కూడా ఆయన ఉద్దేశంలో ఒక దైవకార్యమే. బాలల స్వేచ్ఛను కాపాడే ఉద్యమం చేపట్టిన నాటి నుంచీ బాలలే దైవంగా ఆ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు సత్యార్థి. మత భావనలున్న మనిషిని కాదు నేను. గత నాలుగు దశాబ్దాల కాలంలో ఒక్కనాడైనా గుడిని గానీ, మసీదును గానీ, చర్చిని గానీ నేను సందర్శించలేదు. భక్తి ఉంటుంది. కానీ ఆలయాలకు వెళ్లి ఆరాధించను. బాలలే నా దేవుళ్లు. వారికి తమ స్వేచ్ఛను, బాల్యాన్ని తెచ్చివ్వడమే దైవానికి నేను చేసే ప్రార్థన. దేవుడికి నిజమైన ప్రతిరూపాలు బాలలే. వారికోసం పనిచేయడం నాకు దైవ సన్నిధిలో గడపడంలా ఉంటుంది అంటారు సత్యార్థి. -
హక్కుల కోసం ఇక్కడికీ వచ్చారు..
నోబెల్ శాంతి పురస్కార గ్రహీత కైలాష్ సత్యార్థికి తాండూరుతో అనుబంధం 13 ఏళ్ల క్రితం చైతన్య ర్యాలీలో స్ఫూర్తిదాయక ప్రసంగం తాండూరు: ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి పురస్కారానికి ఎంపికైన కైలాష్ సత్యార్థికి తాండూరుతోనూ అనుబంధముంది. బడీడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించడం, వెట్టిచాకిరి నుంచి బాల కార్మికులకు విముక్తి కల్పిం చడం, వారి ఆరోగ్యం కోసం దక్షిణాసియా యాత్రలో భాగంగా కైలాష్ సత్యార్థి దాదాపు పదమూడేళ్ల క్రితం తాండూరుకు వచ్చారు. మావిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేష్(ఎంవీఎఫ్) కార్యదర్శి పద్మశ్రీ శాంతసిన్హాను ఎన్నోసార్లు ఢిల్లీలో కలిసి తాండూరులో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలల హక్కులపై ఉపాధ్యాయులు, చైల్డ్ రైట్స్ఫోరం తదితర స్వచ్ఛంధ సంస్థలు చేస్తున్న కార్యక్రమాలను కైలాష్ సత్యార్థి అడిగి తెలుసుకున్నారు. బాలల హక్కులు, విద్య, ఆరోగ్య, వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించాలనే ఆలోచనతో ఆయన దక్షిణాసియాలో గ్లోబల్ మార్చ్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా 2001లో ఆయన భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో పర్యటించారు. 2001 మార్చి 22న కైలాష్ సత్యార్థి కర్ణాటక రాష్ట్రం నుంచి మహబూబ్నగర్ జిల్లా మీదుగా తాండూరుకు వచ్చారు. ఆయనతోపాటు జర్మనీ తదితర దేశాలకు చెందిన ప్రతినిధుల బృందం కూడా వచ్చింది. తాండూరు ఎంపీడీఓ కార్యాలయ సమీపంలో ఆయనకు స్థానిక ఉపాధ్యాయులు, స్వచ్ఛంధ సంస్థలు స్వాగతం పలికారు. అనంతరం స్థానిక ఎంపీటీ హాల్లో భారీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం ఆయన విద్యార్థులు, యువజన సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, వెట్టిచాకిరీ నుంచి విముక్తి పొందిన బాలలతో కలిసి తాండూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, విద్య, వెట్టిచాకిరీ విముక్తికి ఇక్కడి బాలల హక్కుల సంఘం, ఉపాధ్యాయులు చేస్తున్న పోరాటాల గురించి ఆయన తెలుసుకొని అభినందించారు. ఎంపీటీ హాల్లో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ బాలల హక్కుల పరిరక్షణ బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిదని అన్నారు. వెట్టిచాకిరీ చేయకుండా ప్రజలను చైతన్యం చేయాల్సిన బాధ్యత స్వచ్ఛంధ సంస్థలు చేపట్టాలని స్ఫూర్తి నింపారు. అందరం బాధ్యతగా బాలల హక్కుల కోసం పోరాడినప్పుడే వెట్టిచాకిరీ నశిస్తుందన్నారు. భారతయాత్ర అనంతరం వివిధ రాష్ట్రాల్లో ఆయన పరిశీలించిన అంశాలను అప్పటి ప్రధాన మంత్రికి వివరించారు. అలాంటి సామాజిక కార్యకర్తకు ప్రతిష్టాత్మకమైన శాంతి నోబెల్ పురస్కారం దక్కడం పట్ల స్థానిక రిటైర్డ్ ఉపాధ్యాయుడు, జాతీయ ఉత్తమ ఉపాధ్యా య అవార్డు గ్రహీత జనార్దన్ హర్షం వ్యక్తం చేశారు. తాండూరు పర్యటనలో కైలాష్ సత్యార్థి చేసిన ప్రసంగం, ర్యాలీ స్ఫూర్తితో బాలల హక్కుల సంఘాలు, ఉపాధ్యాయులు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయడానికి ఉద్యమించారు. ఎంతోమంది బాలకార్మికులకు విముక్తి కలిగించడం జరిగిందని జనార్దన్ గుర్తు చేశారు. 2005 సంవత్సరంలో హైదరాబాద్ లలిత కళాతోరణంలో జరిగిన ప్రపంచస్థాయి సదస్సుల్లో కూడా ఆయన పాల్గొని బాలలను వెట్టి నుంచి విముక్తి చేయడానికి చైతన్య పరిచారని ఆయన గుర్తు చేశారు. సుందరయ్య విజ్ఞాన భవన్లో అప్పట్లో జరిగిన మరో కార్యక్రమంలో కూడా కైలాష్ సత్యార్థి పాల్గొని ఎన్జీఓలను బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలని ప్రేరణ కల్పించారని ఆయన గుర్తు చేశారు. ఆయన నోబెల్ పురస్కారం రావడం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు.