breaking news
Naval Exercise
-
సాగర తీరాన సమర భేరి
విశాఖ సిటీ : భారత నావికాదళ చరిత్రలో మరో కీలక ఘట్టానికి విశాఖ వేదిక అవుతోంది. దశాబ్ద కాలం తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకమైన మూడు మెగా ఈవెంట్లకు ముస్తాబవుతోంది. ఈ నెల 15 నుంచి 25 వరకు తీరం అంతర్జాతీయ నౌకా బలగా లతో కిక్కిరిసిపోనుంది. ఈ నెలలో 18వ తేదీన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ(ఐఎఫ్ఆర్), 19న మిలాన్– 2026 విన్యాసాలతో పాటు 20న ఇండియన్ ఓషన్ నావల్ సింపోజియం(ఐఓఎన్ఎస్) సదస్సుకు అతిథ్యమిస్తోంది. ప్రపంచ దేశాల మధ్య మైత్రిని పెంపొందించడం, సముద్ర భద్రతలో పరస్పర సహకారాన్ని చాటుతూ ఈనెల 21 నుంచి 25 వరకు భారత నౌకాదళం నిర్వహించే ప్రతిష్టాత్మక ‘మిలాన్–2026 సీ ఫేజ్’ విన్యాసాలకు మెరుగులు దిద్దుకుంటోంది. దశాబ్ద కాలం తర్వాత ఐఎఫ్ఆర్ సముద్ర భద్రత, సహకారం, స్థిరత్వం, సమన్వయాన్ని పెంపొందించడం ముఖ్య లక్ష్యంగా ఈ ఫ్లీట్ రివ్యూ ఉంటుంది. దేశ చరిత్రలోనే మొదటి సారిగా అంతర్జాతీయ యుద్ధనౌకల సమీక్షను 2016లో ఇక్కడే నిర్వహించారు. దాదాపు పదేళ్ల తర్వాత ప్రతిష్టాత్మకమైన ఐఎఫ్ఆర్–2026కు సాగరతీరం రెండోసారి ఆతిథ్యమిస్తోంది. ఈనెల 15 నుంచి 20వ తేదీల మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈసారి ఫ్లీట్ రివ్యూకు ’యునైటెడ్ త్రూ ఓషన్స్’ (సముద్రాల ద్వారా ఏకమవుదాం) అనే ప్రత్యేక థీమ్‌తో నిర్వహిస్తున్నారు. తీరప్రాంత భద్రత, బ్లూ ఎకానమీ, కొత్త సాంకేతికత అనే అంశాలపై ఫ్లీట్ రివ్యూలో చర్చించనున్నారు. ఆర్కే బీచ్ నుంచి భీమిలి తీరం వరకు సముద్ర గర్భంలో భారత రక్షణ శక్తి సామర్థ్యాలు ఆవిష్కృతం కానున్నాయి. రాష్ట్రపతి సమక్షంలో ‘ఫ్లీట్ రివ్యూ’ ఈ ఉత్సవాల్లో అత్యంత కీలకమైన ఘట్టం ఈనెల 18న జరగనుంది. భారత రాష్ట్రపతి, త్రివిధ దళాల సర్వసైన్యాధ్యక్షురాలు ద్రౌపదీ ముర్ము విశాఖ తీరంలో జరిగే నౌకల కవాతుకు ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఆమె ప్రెసిడెన్షియల్ యాచ్‌లో నౌకాదళ విన్యాసాలను పరిశీలిస్తారు. భారత నౌకాదళానికి చెందిన సుమారు 90 యుద్ధ నౌకలు, 45 విమానాలతో పాటు సుమారు 20కి పైగా విదేశీ యుద్ధ నౌకలు సముద్రంలో బారులు తీరి రాష్ట్రపతికి వందనం సమర్పిస్తాయి. ఈ కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొంటారు. ఒళ్లు గగుర్పొడిచేలా విన్యాసాలు ఐఎఫ్ఆర్, మిలాన్ విన్యాసాలకు భారతదేశం తన స్వదేశీ రక్షణ పరిజ్ఞానాన్ని ఈ వేదికపై ప్రపంచానికి చాటి చెప్పనుంది. సముద్రం పైన యుద్ధ నౌకలు ఉంటే, ఆకాశంలో యుద్ధ విమానాలు గర్జించనున్నాయి. విమానవాహక నౌకలు ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఈ విన్యాసాల్లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. వీటితో పాటు ఐఎన్ఎస్ విశాఖపట్నం, ఐఎన్ఎస్ మోర్ముగావ్ వంటి శక్తివంతమైన డిస్ట్రాయర్లు, కల్వరి క్లాస్ సబ్ మెరైన్లు పాల్గొంటాయి. అలాగే అత్యాధునిక డిస్ట్రాయర్లు ఐఎన్ఎస్ విశాఖపట్నం, తారాగిరి సముద్ర గర్భం నుంచి శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే యుద్ధ విన్యాసాలను భారత నేవీ ప్రదర్శించనుంది. గగనతలంలో నౌకాదళానికి చెందిన మిగ్–29కె ఫైటర్ జెట్లు, పి–8ఐ నిఘా విమానాలు, సముద్రపు గద్దలుగా పేరుపొందిన ఎంహెచ్–60ఆర్ రోమియో హెలికాప్టర్లు, సీ కింగ్, ధృవ్ హెలికాప్టర్లు ఆకాశంలో అద్భుతమైన విన్యాసాలను ప్రదర్శించనున్నాయి. విదేశీ వైమానిక దళాలకు చెందిన ఆధునిక విమానాలు కూడా ఈ ప్రదర్శనలో భాగం కానున్నాయి. 60కి పైగా దేశాల భాగస్వామ్యం ఐఎఫ్ఆర్, మిలాన్ కోసం భారత నౌకాదళం మొత్తం 137 దేశాలకు ఆహా్వనం పింపింది. ఇందులో ఇప్పటి వరకు 60కి పైగా దేశాలు భాగస్వామ్యం అవుతున్నట్లు ధృవీకరణ వచ్చింది. ఇందులో 4 వేల మంది విదేశీ ప్రతినిధులు పాల్గొననున్నారు. అలాగే విదేశీ నౌకాదళాధిపతులు 25 నుంచి 30 మంది వరకు రానున్నారు. ఇందులో అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, శ్రీలంక, ఇరాన్ వంటి దేశాల నుంచి 23కి పైగా యుద్ధ నౌకలు పాల్గొంటున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15 నుంచే వివిధ దేశాల నౌకలు విశాఖ తీరానికి చేరుకోవడం ప్రారంభమవుతుంది.విన్యాసాల షెడ్యూల్ ఇలా..⇒ ఈ నెల 15న నావల్ బేస్ వద్ద ‘మిలాన్ విలేజ్’ ప్రారంభమవుతంది. 21వ తేదీ వరకు భారతీయ హస్తకళలు, సంస్కృతి, సంప్రదాయాలు అద్దం పట్టే కార్యక్రమాలు, రుచికరమైన వంటకాల స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. ⇒ 18వ తేదీ ఉదయం అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ ప్రారంభమవుతుంది. ⇒ 19వ తేదీ ఉదయం మిలాన్–2026 రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేతుల మీదుగా ఆరంభమవుతుంది. ⇒ 19వ తేదీ సాయంత్రం ఆర్కే బీచ్ రోడ్డులో అంతర్జాతీయ సిటీ పరేడ్ జరగనుంది. ఇందులో దేశ విదేశీ నౌకాదళాల కవాతు, ఎయిర్ పవర్ డెమో (వైమానిక ప్రదర్శన) ఉంటాయి. ⇒ 19, 20 తేదీల్లో మిలాన్ విన్యాసాల్లో భాగంగా ’హార్బర్ ఫేజ్’లో అంతర్జాతీయ సెమినార్లు, సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతాయి. ⇒ 20న ఐవోఎన్ఎస్ సదస్సు జరగనుంది. ఇందులో హిందూ మహాసముద్ర దేశాల నౌకాదళాధిపతులు భేటీ అవుతారు. ఇందులో 25 సభ్యదేశాలు, 9 అబ్జర్వర్ దేశాల ప్రతినిధులు పాల్గొంటారు. ⇒ 21 నుంచి 25 వరకు ‘మిలాన్’ సీ ఫేజ్ విన్యాసాలు జరుగుతాయి.మిత్ర దేశాల కలయిక.. మిలాన్–2026 ఈనెల 19న కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చేతుల మీదుగా ‘మిలాన్–2026’ విన్యాసాలు అధికారికంగా ప్రారంభమవుతాయి. ‘సౌభ్రాతృత్వం, సహకారం, సమన్వయం‘ అనే నినాదంతో ఈ విన్యాసాలు జరగనున్నాయి. దీనికి సుమారు 137 దేశాలను ఆహ్వానించారు. ఇప్పటివరకు 60కి పైగా దేశాలు తమ భాగస్వామ్యాన్ని ధృవీకరించాయి. మిలాన్ విన్యాసాలు రెండు దళల్లో జరుగుతాయి. ఈ నెల 19, 20 తేదీల్లో ‘హార్బర్ ఫేజ్’లో భాగంగా అంతర్జాతీయ సెమినార్లు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తారు. 21 నుంచి 25 వరకు ‘సీ ఫేజ్’ ప్రారంభమవుతుంది. ఈ దశలో సముద్ర తీరంలో వివిధ దేశాల నౌకలు ఉమ్మడిగా యుద్ధ విన్యాసాలు, కమ్యూనికేషన్ డ్రిల్స్ నిర్వహిస్తాయి.రక్షణ దళాల సమీకరణ (బలగాల వివరాలు) మొత్తం యుద్ధ నౌకలు - 110కి పైగా (భారత్ + విదేశీ)భారత నౌకాదళ నౌకలు - 90 వరకు విదేశీ యుద్ధ నౌకలు - 23 నుంచి 25 విమానాలు హెలికాప్టర్లు - 60కి పైగా ప్రధాన యుద్ధ నౌకలు - ఐఎన్ఎస్ విక్రాంత్, విక్రమాదిత్యపాల్గొనే దేశాలు, ప్రతినిధులు అంశం - వివరాలు మొత్తం ఆహ్వానిత దేశాలు - 137 భాగస్వామ్యాన్ని ధృవీకరించిన దేశాలు - 60+ విదేశీ ప్రతినిధుల సంఖ్య - సుమారు 4వేలు విదేశీ నౌకాదళాధిపతులు - 25 నుంచి 30 మంది -
మళ్లీ సరికొత్తగా ‘క్వాడ్’
పదమూడేళ్లనాటి జపాన్ ప్రతిపాదన అనేకానేక మలుపులు తిరిగి చివరకు సాకారం కాబోతోంది. చతుర్భుజ కూటమి (క్వాడ్) దేశాల ఆధ్వర్యంలో బంగాళాఖాతంలోని మలబార్ సాగర జలాల్లో వచ్చే నెలలో నిర్వహించబోయే నావికా దళ విన్యాసాలకు మన దేశం ఆస్ట్రేలియాను సోమవారం ఆహ్వానించింది. చైనాకు సహజంగానే ఇది ఆగ్రహం కలిగించే చర్య. క్వాడ్ పురుటి నొప్పులు అన్నీ ఇన్నీ కాదు. 2007లో మొదట ఈ ప్రతిపాదన మొగ్గతొడిగి భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌లు సమావేశమైనప్పుడే చైనా ఉరిమింది. తనకు వ్యతిరేకంగానే కూటమి కడుతున్నారంటూ నాలుగు దేశాలకూ దౌత్యపరమైన నిరసనలు తెలియజేసింది. అయితే చైనా భయాందోళనలు వాస్తవం కాదని, కేవలం పరస్పరం ప్రయోజనం వున్న అంశాలపై పనిచేయడమే కూటమి ఆంతర్యమని జపాన్ చెప్పింది. మన దేశం కూడా ఆ మాటే అంది. జపాన్‌తో తమకున్న వాణిజ్య ఒప్పందానికి అనుబంధంగా ఈ భద్రతా ఒప్పందం అవసరం గనుకే ఇందులో చేరామని తెలిపింది. కూటమి ఆధ్వర్యంలో టోక్యోలో 2007 మే నెలలో తొలి నావికాదళ విన్యాసాలు జరిగాయి. దానికి కొనసా గింపుగా బంగాళాఖాతంలోనూ విన్యాసాలు నిర్వహించారు. తీరా జపాన్‌లో షింజో అబే అధికారం కోల్పోయి ఆయన స్థానంలో టారో అసో వచ్చాక క్వాడ్‌లో కొనసాగదల్చుకోలేదని ప్రకటించారు. అటు ఆస్ట్రేలియాలో కూడా 2008లో జాన్ హోవార్డ్ నిష్క్రమించి కెవిన్ రుడ్ రావడంతో ఆ దేశం కూడా క్వాడ్‌కు మొహం చాటేసింది. అదే ఏడాది అప్పటి చైనా అధినేతలు మన దేశంలో పర్యటించబోతుండగా నాటి మన ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ‘చైనాను కట్టడి చేసే ఎలాంటి కూట మిలోనూ భారత్ భాగస్వామ్యం కాబోద’ని ప్రకటించారు. అలా ముగిసిన ముచ్చట కాస్తా అమెరికా అధ్యక్షుడుగా డోనాల్డ్ ట్రంప్ వచ్చాక మళ్లీ కదలబారింది. ఆయన మళ్లీ అందరితో మాట్లాడి ఒప్పిం చాక 2017లో క్వాడ్ చర్చలు మొదలయ్యాయి. అప్పటికి దక్షిణ చైనా సముద్ర జలాల్లో చైనా కార్య కలాపాలు పెరిగాయి. అక్కడ పగడాల దిబ్బలు, ఇసుకమేటలు తమవేనని చైనా ప్రకటించి, స్ప్రాట్లీ దీవుల చుట్టూ ఏడు కృత్రిమ దీవుల నిర్మాణాన్ని ప్రారంభించింది. ఇది జపాన్ను చికాకు పర్చడం, ఆ దేశానికి అమెరికా అండగా నిలవడంతో క్వాడ్ మళ్లీ ప్రాణం పోసుకుంది. అయితే మునుపటిలా కాదు... క్వాడ్ ఈసారి గట్టిగా పనిచేయదల్చుకున్నట్టే కనబడుతోంది. ఎప్పుడూ ఏదో ఒక శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా తప్ప ప్రత్యేకించి కూటమి కోసమే సమా వేశాలు జరిగిన చరిత్ర క్వాడ్‌కు లేదు. కలిసేది నాలుగు దేశాలైనా ‘ఆసియాన్’ సమావేశాల సమ యాల్లో లేదా ఐక్యరాజ్యసమితి సమావేశాల సమయాల్లో మాత్రమే నేతలు కలిసేవారు. కానీ ఈసారి అందుకు భిన్నంగా జరిగింది. గత నెలాఖరులో క్వాడ్ దేశాల సీనియర్ అధికారుల సమావేశం జరి గింది. ఆ వెనకే ఈ నెల మొదట్లో విదేశాంగమంత్రులు సమావేశమయ్యారు. మలబార్ విన్యాసాలపై ఆ సమావేశంలో అంగీకారం కూడా కుదిరింది. కానీ ఆస్ట్రేలియా అందులో పాల్గొనడం విషయంలో కొంత సందిగ్ధత ఏర్పడింది. కానీ వారం రోజుల అనంతరం చివరకు ఆస్ట్రేలియాను ఆహ్వానిం చడానికే మన దేశం నిర్ణయించింది. చైనాకు ఆగ్రహం కలిగినంత మాత్రాన క్వాడ్ నాటో తరహాలో ఇప్పటికప్పుడు సైనిక కూటమిగా రూపొందుతుందని భావించనవసరం లేదు. అటు అధికారుల సమావేశంలోనూ, ఇటు విదేశాంగమంత్రుల సమావేశంలోనూ ప్రధానంగా చర్చకొచ్చింది కరోనా అనంతర పరిస్థితుల గురించే. అలాగే ఇకపై ప్రపంచ పంపిణీ వ్యవస్థ తీరుతెన్నులెలా వుండాలో, సభ్య దేశాలు సమష్టిగా కదిలి ఆర్థికంగా ఎదగడానికి చేయాల్సిందేమిటో కూడా చర్చించారు. మరో మూడు దేశాలు– న్యూజిలాండ్, దక్షిణ కొరియా, వియత్నాంలు కూడా పాలుపంచుకున్నాయి. కనుక క్వాడ్ త్వరలో మరింత విస్తరించడం ఖాయం. అయితే ‘అమెరికా ఫస్ట్’ పేరిట మిత్ర దేశాలపై కూడా రకరకాల ఆంక్షలు విధిస్తూ స్వీయ ప్రయోజనాలు తప్ప మరేమీ పట్టని ట్రంప్‌ను నమ్మి ఇందులో దిగడం ఎంతవరకూ సమంజసమన్న సంశయం ఈ దేశాలకు లేకపోలేదు. ఆసియాన్‌తో మన దేశానికి సంబంధబాంధవ్యాలు ఏర్పడి అర్థ శతాబ్ది దాటుతోంది. చారిత్రకంగా ఆ దేశాలు అమెరి కాతో సన్నిహితంగా మెలిగేవి. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో అందుకే వాటితో మన సంబంధాలు అంతంతమాత్రం. ఇప్పుడు ఆ బంధాలు బలపడ్డాయి. ప్రస్తుతం ఆసియాన్ మరిన్ని దేశాలను కలుపుకొని విస్తరించాలనుకుంటోంది. ఇదే సమయంలో తనకు సమాంతరంగా ఈ ప్రాంతంలో క్వాడ్లాంటి మరో కూటమి మొగ్గతొడుగుతుండటం, అది సైతం విస్తరించాలనుకోవటం ఆసి యాన్‌కు సమస్యే. ఈ వైరుధ్యాన్ని మన దేశం ఎలా పరిష్కరించుకుంటుందో చూడాలి. లద్దాఖ్‌లో చైనాతో మనకు ఏర్పడిన లడాయి, ఆ దేశం అనుసరిస్తున్న మొండివైఖరి మలబార్ విన్యాసాలకు ఆస్ట్రేలియాను ఆహ్వానించాలన్న మన నిర్ణయానికి కారణం కావొచ్చు. కానీ క్వాడ్‌ను పరస్పర ఆర్థిక, వాణిజ్య, భద్రతాపరమైన ప్రయోజనాలకు అనువుగా రూపొందించాలి తప్ప అమె రికా కనుసన్నల్లో నడిచే మరో నాటో కూటమిగా దాన్ని మార్చనీయకూడదు. నాటో కూటమివల్ల యూరప్ కంటే అమెరికాయే ఎక్కువగా లాభపడింది. ప్రపంచ పోలీస్‌గా వ్యవహరిస్తూ, సమస్యా త్మక ప్రాంతాలకు ఆ కూటమి సైన్యాన్ని తరలిస్తూ ప్రపంచంపై తన పట్టు నిలుపుకోవడంలో అది విజయం సాధించింది. అయితే సైనిక కూటమిగా మారకపోవడం చైనా చర్యలపై కూడా ఆధార పడివుంటుంది. వుహాన్ శిఖరాగ్ర సదస్సు అనంతరం క్వాడ్ విషయంలో మన దేశం ఆచితూచి వ్యవహరించింది. చైనాకు ఇబ్బంది కలిగించవద్దన్నదే దాని వెనకున్న ఉద్దేశం. కానీ అంతక్రితంనుంచీ దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో చూపిస్తున్న దూకుడునే గల్వాన్ లోయలో కూడా ప్రదర్శించి తాజా నిర్ణయానికి చైనా ప్రధాన కారణమైంది. ఏదేమైనా క్వాడ్ మళ్లీ ప్రాణం పోసుకోవడం ప్రపంచంలో రానున్న కాలంలో సరికొత్త పరిణామాలకు దారితీస్తుందనటంలో సందేహం లేదు.


