breaking news
My Vehicle Is Safe
-
‘గుర్తు’ పెట్టుకోండి!
* ప్రతి క్యాబ్ కూ పోలీసు ఐడీ ఉండాల్సిందే * నేర చరిత్ర ఉన్న క్యాబ్ డ్రైవర్లకు చెక్ * ‘మై వెహికిల్ ఈజ్ సేఫ్’ స్టిక్కర్ తప్పనిసరి * డ్రైవర్లు, ఓనర్ల వివరాలు సేకరిస్తున్న పోలీసులు సాక్షి, సిటీబ్యూరో: క్యాబ్‌లలో ప్రయాణించే వారి భద్రతకు జంట పోలీసు కమిషనరేట్లు ప్రాధాన్యమిస్తున్నాయి. ఇందులో భాగంగా క్యాబ్ యజమానులు, డ్రైవర్లపై పోలీసులు దృష్టి సారించారు. నేర చరిత్ర కలిగిన క్యాబ్ డ్రైవర్లకు ఉద్వాసన పలికేందుకు సన్నద్ధమవుతున్నారు. అంతేకాదు... ప్రతి క్యాబ్కూ ఇక నుంచి పోలీసు ఐడీ నెంబర్‌ను కేటాయించే పనిలో పడ్డారు. ఢిల్లీలో ఇటీవల జరిగిన క్యాబ్ డ్రైవర్ అకృత్యాలు నేపథ్యంలోఇక్కడి వారిపై దృష్టి సారించారు. క్యాబ్‌లకు ‘మై వెహికిల్ ఈజ్ సేఫ్’ అనే పోలీసు స్టిక్కర్ లేకపోతే అలాంటి వాహనాలను జనవరి ఒకటి నుంచి తిరగనివ్వరు. క్యాబ్ డ్రైవర్లు, యజమానులకు మెటారు వాహనాల చట్టం, నగర పోలీసు చట్టంపై అవగాహన ల్పిస్తున్నారు. ఇప్పటికే జంట పోలీసు కమిషనరేట్లలో తిరుగుతున్న క్యాబ్ డ్రైవర్లు, ఓనర్లతో పోలీసులు విడివిడిగా సమావేశాలు ఏర్పాటు చేశారు. డ్రైవర్లు, ఓనర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిబంధనలపై కౌన్సెలింగ్ చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో 45 వేలకుపైగా వివిధ సంస్థలు, ప్రయివేటు వ్యక్తులకు చెందిన క్యాబ్‌లు ఉన్నాయి. ఇవి ఎక్కువగా సాఫ్ట్వేర్ ఉద్యోగుల కోసమే నడుస్తున్నాయి. మరికొన్ని విమానాశ్రయం, మహాత్మాగాంధీ, జూబ్లీబస్ స్టేషన్లు, కాచిగూడ, నాంపల్లి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల వద్ద ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. నగరంలో విహార యాత్ర కోసం కూడా క్యాబ్‌లను ఉపయోగిస్తున్నారు. ఇవి పోలీసుల వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. వాహన యజమాని చిరునామా, సెల్‌నెంబర్‌తో పాటు డ్రైవర్ పేరు, చిరునామా, సెల్‌నెంబర్, ఫొటోలను పోలీసులు సేకరించే పనిలో పడ్డారు. ఠాణాల వారీగా వివరాలు సేకరించిన తరువాత ఒక్కో క్యాబ్‌కు ఐడీ నెంబర్‌తో కూడిన ‘మై వెహికిల్ ఈజ్ సేఫ్’అని ముద్రించిన స్టిక్కర్‌ను ఇస్తారు. దీన్ని క్యాబ్ ముందు, వెనుక భాగాల్లో అతికించాలి. ఏదైనా క్యాబ్ డ్రైవర్ వాహన రిజిస్ట్రేషన్ నెంబర్ మార్చుకుని నేరానికి పాల్పడితే రహదారులపై ఉండే సీసీ కెమెరాల ఆధారంగా స్టిక్కర్‌పై ఉండే ఐడీని పోలీసులు గుర్తించి వాహనం, డ్రైవర్ వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది. ప్రతి ఠాణాలో దీనికి సంబంధించి ప్రత్యేక రిజిస్టర్ ఉంటుంది. ఇందులో డ్రైవర్ల ఫోటోతో పాటు అతని స్వగ్రామం, పూర్తి వివరాలు పొందుపరుస్తారు. ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు పదివేలకుపైగా క్యాబ్‌లకు ఐడీ నెంబర్లతో కూడిన స్టిక్కర్లను అందజేశారు. ఒకవేళ డ్రైవర్ మారితే ఆ వివరాలను యజమాని పొందుపర్చాల్సి ఉంటుంది. వివరాలు అందజేయని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆధికారులు హెచ్చరిస్తున్నారు. నేరచరిత్రపై ఆరా ప్రతి క్యాబ్ డ్రైవర్ ప్రవర్తనపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గతంలో డ్రైవర్ ఎక్కడ నివసించాడు, ప్రస్తుతం ఉంటున్న చిరునామా, అతనిపై క్రిమినల్ కేసులు ఉన్నాయా? అని ఆరా తీస్తున్నారు. కేసులు ఉంటే ఆ విషయాన్ని పోలీసులు వెంటనే క్యాబ్ యజమానికి తెలియజేస్తారు. నేర చరిత్ర ఉన్న డ్రైవర్లను ఉద్యోగంలో నియమిస్తే ఘోరాలకు ఆస్కారం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. నేరం రుజువై, జైలు శిక్ష అనుభవించిన డ్రైవర్లు పూర్తిగా మారిపోయారని యజమాని భావిస్తే ఉద్యోగంలో పెట్టుకోవచ్చంటున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే సీజ్ మహిళలు, ముఖ్యంగా ఐటీ ఉద్యోగినిల భద్రతకు తగిన చర్యలు తీసుకుంటున్నాం. మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, చందానగర్, మియాపూర్ ప్రాంతాలతో క్యాబ్, ఆటో డ్రైవర్లతో ఇప్పటికే సమావేశాలు నిర్వహించాం. ప్రయాణికులతో ఎలా మెలగాలి? యజమానులు, డ్రైవర్ల బాధ్యతపై అవగాహన కల్పించాం. నేర ప్రవృత్తి కలిగిన డ్రైవర్ల సమాచారం సేకరిస్తున్నాం. జనవరి ఒకటి నుంచి క్యాబ్‌లపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తాం. ఇప్పటికే అన్ని ఠాణాలకు ఆదేశాలు జారీ చేశాం. నిబంధనలు ఉల్లంఘించిన క్యాబ్‌లను సీజ్ చేస్తాం. -సీవీ ఆనంద్, సైబరాబాద్ కమిషనర్ -
మహిళల భద్రత కోసం పంచసూత్ర ప్రణాళిక
సైబరాబాద్ సీపీ ఆనంద్ వెల్లడి ‘మై వెహికిల్ ఈజ్ సేఫ్’ స్టిక్కర్ ఆవిష్కరణ సైబరాబాద్, న్యూస్‌లైన్: మహిళల భద్రత కోసం పంచసూత్ర ప్రణాళికను అమలు చేస్తున్నట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. కమిషనరేట్ ఆవరణలో శుక్రవారం ఆయన ‘మై వెహికిల్ ఈజ్ సేఫ్‘ స్టిక్కర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆనంద్ మాట్లాడుతూ...అభయ ఘటన అనంతరం అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సైబరాబాద్ పరిధిలో తిరిగే క్యాబ్‌ల యజమానులు, డ్రైవర్లు తమ పూర్తి వివరాలను పోలీసుల వద్ద నమోదు చేసుకోవాలని మార్చి 1న నోటిఫికేషన్‌ను జారీ చేశామన్నారు. దీనికి స్పందించి 2 వేల మంది తమ వివరాలను పొందుపర్చుకున్నారని, వీరందరికీ ‘మై వెహికిల్ ఈస్ సేఫ్’ స్టిక్కర్ అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జాయింట్ సీపీ గంగాధర్, ట్రాఫిక్ డీసీపీ అవినాష్ మహంతి, సెక్యూరిటీ కౌన్సిల్ ప్రతినిధి పీఎస్‌కె వర్మ పాల్గొన్నారు. నమోదు చేసుకోని వారికి జరిమానా... కమిషనరేట్ పరిధిలో 10 వేల క్యాబ్‌ల వరకు తిరుగుతున్నట్టు గుర్తించామని, వీటిలో 2 వేల మంది మాత్రమే తమ వివరాలు పోలీసుల వద్ద నమోదు చేసుకున్నారని కమిషనర్ ఆనంద్ తెలిపారు. రిజిస్ట్రేషన్ గడువు మే 1తో ముగిసిందని, వివరాలు నమోదు చేసుకొని క్యాబ్‌లకు రూ. 500 జరిమానా విధిస్తామన్నారు. సోమవారం నుంచి శనివారం వరకు.. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య కూకట్పల్లి ట్రాఫిక్ ఠాణాలో క్యాబ్ డ్రైవర్లు తమ వివరాలు నమోదు చేసుకోవచ్చన్నారు. స్టిక్కర్లో పూర్తి వివరాలు.... సైబరాబాద్ పోలీసులు జారీ చేస్తున్న ‘మై వెహికిల్ ఈజ్ సేఫ్’ స్టిక్కర్లో క్యూ ఆర్ కోడ్ (క్విక్ రె స్పాన్స్ కోడ్). అందులో క్యాబ్ యజమాని, డ్రైవర్ వివరాలు, క్యాబ్‌కు సంబంధించిన పత్రాల పూర్తి వివరాలు ఉంటాయి. స్టిక్కర్‌పై వాహనం, దానికి కేటాయించిన ఐడీ నెంబర్లను పెద్ద అక్షరాల్లో ప్రింట్ చేశారు. ఈ స్టిక్కర్ల గడువు ఏడాది ఉంటుంది. ఆపై రెన్యూవెల్ చేసుకోవాలి. స్టికర్ ఉన్న వాహనాల్లోనే ప్రయాణించాలి... సైబరాబాద్ పరిధిలో క్యాబ్‌ల్లో ప్రయాణించే మహిళలు, యువతులు, ఐటీ ఉద్యోగినిలు ‘మై వెహికిల్ ఈజ్ సేఫ్’ స్టిక్కర్ ఉన్న వాటిలోనే వెళ్లాలని కమిషనర్ కోరారు. క్యాబ్ ఎక్కే ముందు స్టిక్కర్‌పై ఉన్న వివరాలు తప్పనిసరిగా రాసి పెట్టుకోవాలన్నారు. కాగా, ఓ క్యాబ్ డ్రైవర్- ‘సార్....మేం తప్పు చేస్తే యాక్షన్ తీసుకుంటున్నారు సరే....మమ్మల్ని క్యాబ్‌లో ఎక్కిన ప్రయాణికులు వేధిస్తే ఏం చేయాలని అని ప్రశ్నించాడు. దీంతో ఒక్కసారిగా అందరూ నవ్వారు. ఫిర్యాదు చేస్తే ఆ ప్రయాణికుడిపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ బదులిచ్చారు.