breaking news
Mucharla
-
ముచ్చర్లలో ఫార్మాసిటీ వ్యతిరేక సమావేశం
రంగారెడ్డి జిల్లా కందుకూర్ మండలం ముచ్చర్లలో ఫార్మాసిటీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ తెలంగాణ యూనైటడ్ ఫ్రంట్ కో- చైర్మన్ విమలక్క ఆధ్వర్యంలో మంగళవారం సమావేశం జరిగింది. ఫార్మా సిటీ ఏర్పాటుతో కలిగే నష్టాలను ముచ్చర్ల చుట్టుపక్కల గ్రామస్తులకు అవగాహన కల్పించారు. -
ఫార్మాసిటీతో మహర్దశ
కందుకూరు: ఫార్మాసిటీ ఏర్పాటుకు మండలంలోని ముచ్చర్ల రెవెన్యూ శాయిరెడ్డిగూడ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 288లో సీఎం కేసీఆర్ బృందం పరిశీలన చేపట్టనుండటంతో ఈ ప్రాంతంకు మహర్ధశ పట్టనుంది. ఇప్పటివరకు మారుమూలన అంతగా గుర్తింపు లేని ఆ గ్రామాలు ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కడంతో ఆ ప్రాంత ప్రజలు సంబురపడుతున్నారు. రాజధానికి అతి సమీపంలో ఉన్నా ఇప్పటివరకు అభివృద్ధికి నోచుకోలేదు. ఆ ప్రాంతంలో 2,747 ఎకరాల భూములు పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా ఉండటంతో ఇప్పుడు అందరి దృష్టి అటువైపే ఉంది. పరిశ్రమలు పెద్దఎత్తున ఏర్పాటైతే ముచ్చర్ల, శాయిరెడ్డిగూడ, మీర్కాన్‌పేట, యాచారం మండలం కుర్మిద్ధ, తాడిపత్రి, మహబూబ్‌నగర్ జిల్లా కడ్తాల్, హన్మాస్‌పల్లి తదితర గ్రామాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయని, తమ దశ తిరుగనుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ఫార్మాసిటీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని కోరుకుంటున్నారు. -
ఈ గిరి.. ఔషధనగరి
ముచ్చర్లకు నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఔషధాల తయారీకి కందుకూరు మండలం ముచ్చర్ల కేంద్రబిందువు కానుంది. బల్క్‌డ్రగ్, ఫార్మా కంపెనీల స్థాపనతో ఈ ప్రాంతం మందు బిళ్లలకు చిరునామాగా మారనుంది. ఈ ప్రాంతంలో ఫార్మాసిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్వయంగా ఫార్మారంగ దిగ్గజాలను వెంటబెట్టుకొని ముచ్చర్లలో స్థలపరిశీలన జరుపుతుండడం పారిశ్రామికవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దేశంలోనే 20 మంది అగ్రశ్రేణి ఫార్మా కంపెనీల అధినేతలు నాలుగు హెలికాప్టర్లలో రానుండడంతో జిల్లా యంత్రాంగం ఈ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దాదాపు 10వేల ఎకరాల్లో ప్రతిపాదిస్తున్న ఫార్మా సిటీ స్థలాన్ని విహంగ వీక్షణం చేయడమేగాకుండా.. నేలపైకి దిగి ఆ ప్రాంతాన్ని పరిశీలించేందుకు జిల్లా యంత్రాంగం నాలుగు హెలిప్యాడ్లను కూడా నిర్మించింది. భూ లభ్యత, విమానాశ్రయల, ఔటర్‌రింగ్‌రోడ్డు, తదితర విశిష్టతను విశదీకరిస్తూ ఫొటో ఎగ్జిబిషన్‌ను కూడా ఏర్పాటు చేసింది. సీఎం హోదాలో పారిశ్రామికవేత్తలతో స్థల పరిశీలనకు రావడం తొలిసారి కావడం.. నూతన పారిశ్రామిక విధానం ప్రకటించిన అనంతరం ఈ పర్యటన జరుగుతుండడంతో ప్రభుత్వం కూడా ఫార్మాసిటీతో పెట్టుబడులు రాబట్టడంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఫార్మాసిటీ భూములను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారుల బృందం స్వయంగా పరిశీలించింది. పదివేల ఎకరాల్లో ఫార్మాసిటీ! రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని పదివేల ఎకరాల్లో సర్వే నిర్వహించి భూములను పరిశీలించనున్నారు. ఫార్మా కంపెనీల ఏర్పాటుకు అనువుగా ముచ్చర్ల రెవెన్యూ పరిధిలోని సర్వేనంబర్ 288లో 2,747 భూములు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో 2,139.34 ఎకరాలు ప్రభుత్వ ఆధీనంలో ఉండగా, మిగతా దాంట్లో 381.32 ఎకరాలు పట్టా భూములు కాగా, 225 ఎకరాలు నిరుపేదలకు అసైన్డ్ చేయడంతో ప్రస్తుతం వారి సాగుబడిలో ఉంది. మీర్ఖాన్పేటలోని సర్వే నం.112, 120లో 1,277 ఎకరాలను ఫార్మాసిటీకి ప్రతిపాదనలు రూపొందించింది. అదేవిధంగా యాచారం మండలం తాడిపర్తి, కుర్మిద్ద పరిధిలోని రిజర్వ్‌ఫారెస్ట్ భూములు సహా రంగారెడ్డి జిల్లా పరిధిలోని దాదాపు ఏడున్నర వేల ఎకరాలు ఫార్మాసిటీకి కేటాయించే అవకాశం ఉంది. పాలమూరులో మరో రెండున్నర వేల ఎకరాలు.. ఫార్మా కంపెనీలన్నీ ఒకే చోట ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఫార్మాసిటీకి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పెద్దఎత్తున భూముల అవసరం ఉండడంతో రంగారెడ్డి జిల్లా కందుకూరు, యాచారం మండలాల్లో ఏడున్నర వేల ఎకరాలను గుర్తించిన అధికారులు.. మహబూబ్‌నగర్ జిల్లా ఆమనగల్ మండలంలోని కడ్తాల్ సమీపంలో సర్వేనంబర్ 265లో మరో 1600 ఎకరాల భూమిని గుర్తించారు. కడ్తాల్ బ్లాక్‌లోని దాదాపు వెయ్యి ఎకరాల అటవీ భూములను ఫార్మాసిటీకి కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈక్రమంలో రెండు జిల్లాల పరిధిలో దాదాపు పదివేల ఎకరాల భూమిని ఫార్మాసిటీ కోసం ప్రతిపాదించారు. అన్నీ సక్రమంగా జరిగితే ఫార్మాసిటీ ఏర్పాటుకు రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలు వేదిక కానున్నాయి. పరిమిత సంఖ్యలోనే.. బుధవారం సీఎం కేసీఆర్ నిర్వహించే ఫార్మాసిటీ ఏరియల్ సర్వే ప్రక్రియ అంతా కీలక అధికారుల కనుసన్నల్లోనే జరుగనుంది. ఈ క్రమంలో ఫార్మా ప్రముఖులు, ఉన్నతాధికారులు సైతం పరిమిత సంఖ్యలోనే హాజరుకానున్నారు. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రికి మాత్రమే ఆహ్వానం పలికిన ప్రభుత్వం.. ఈ కార్యక్రమానికి మీడియాను సైతం దూరంగా ఉంచింది. తద్వారా పారిశ్రామికవేత్తలతో జరిపే చర్చలు బయటకు పొక్కకుండా గోప్యత ప్రదర్శించాలని నిర్ణయించింది. సీఎం రాక కోసం ముమ్మర ఏర్పాట్లు.. కందుకూరు: సీఎం కేసీఆర్ తోపాటు ఫార్మా సంస్థల అధినేతలు మండలంలోని ముచ్చర్ల రెవెన్యూ పరిధి లో ఫార్మాసిటీ ఏర్పాటుకు ప్రభుత్వ భూములను పరిశీలించడానికి బుధవారం విచ్చేయనుండటంతో అధికార యంత్రాంగం మంగళవారం ముమ్మర ఏర్పాట్లు చేసింది. ఏరియల్ వీక్షణం అనంతరం నేరు గా ఆ భూముల్లో దిగడానికి అనువుగా ఆర్అండ్బీ ఎస్ఈ ఆశారాణి ఆధ్వర్యంలో అధికారులు యుద్ధప్రాతిపదికన నాలుగు హెలిప్యాడ్లను ఏర్పాటు చేశారు. రాకపోకలకు అనుకూలంగా ఫార్మేషన్ రోడ్డు, భోజన వసతి కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం బృందం క్షేత్రస్థాయిలో పరిశీలన అనంతరం ఆ భూములకు సంబంధించి ఫొటో ఎగ్జిబిషన్ ను తిలకించడంతోపాటు అతిథులు కూర్చొని మాట్లాడుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టర్ పర్యవేక్షణలో.. ఉదయం నుంచే ఆయా శాఖల ముఖ్యఅధికారులు పనులను పర్యవేక్షిస్తుండగా.. సాయంత్రం కలెక్టర్ శ్రీధర్, జేసీ చంపాలాల్ అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ యాదగిరిరెడ్డి, తహసీల్దార్ సుశీల తదితర అధికారులను పనుల తీరును గురించి అడిగి తెలుసుకున్నారు. ఉదయం స్థానిక ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించి అధికారులకు సూచనలు చేశారు. ఆయనతోపాటు ఎంపీపీ అనేగౌని అశోక్‌గౌడ్, జెడ్పీటీసీ సభ్యుడు ఏనుగు జంగారెడ్డి, స్థానిక సర్పంచ్‌లు కాస నర్సింహ, గోవర్థన్ నాయక్ పాల్గొన్నారు. పరిశీలనకు వచ్చిన హెలికాప్టర్.. కాగా సీఎం పర్యటనకోసం ఇక్కడ నిర్మించిన హెలిప్యాడ్‌ను పరిశీలించడానికి మంగళవారం సాయంత్రం ట్రయల్ హెలికాప్టర్ వచ్చింది. సైబరాబాద్ కమిషనర్ పర్యవేక్షణ.. సీఎం పర్యటనకు సంబంధించిన బందోబస్తు నిర్వహణను సైబరాబాద్ కమిషనర్ సీపీ సీవీ ఆనంద్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఆయనతో పాటు జాయింట్ కమినర్ శశిధర్‌రెడ్డి, ఎల్బీనగర్ డీసీపీ రవివర్మ, ఏసీపీ నారాయణగౌడ్ ఉన్నారు. భారీ ఎత్తున పోలీసు బలగాలను రంగంలోకి దించారు. డాగ్ స్క్యాడ్, బాంబ్ స్క్వాడ్‌తో హెలిప్యాడ్లతో పాటు పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.