breaking news
Montreal Open
-
విక్టరీ విక్టోరియాదే...
మాంట్రియల్: తనకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న క్రీడాకారిణులను ఓడిస్తూ... సంచలన ప్రదర్శన చేసిన కెనడా టెన్నిస్ టీనేజర్ విక్టోరియా ఎంబోకో... మాంట్రియల్ ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 టోర్నీలో అద్భుతమైన ‘ఫినిషింగ్’ ఇచ్చింది. ‘వైల్డ్ కార్డు’తో బరిలోకి దిగిన 18 ఏళ్ల ఎంబోకో చివరకు చాంపియన్‌గా అవతరించి ఔరా అనిపించింది. ఈ టోర్నీకి ముందు మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) టూర్లో ఒక్క టైటిల్ నెగ్గని ఎంబోకో... గ్రాండ్‌స్లామ్ తర్వాతి స్థాయి టోర్నీగా పరిగణించే డబ్ల్యూటీఏ–1000 లెవెల్ టోర్నీనే మొదటి టైటిల్‌గా గెల్చుకోవడం విశేషం.ప్రపంచ మాజీ నంబర్‌వన్, నాలుగు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ విజేత, 49వ ర్యాంకర్ నయోమి ఒసాకా (జపాన్)తో జరిగిన ఫైనల్లో విక్టోరియా ఎంబోకో 2–6, 6–4, 6–1తో గెలిచింది. విజేత ఎంబోకోకు 7,52,275 డాలర్ల (రూ. 6 కోట్ల 58 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. రన్నరప్ ఒసాకా ఖాతాలో 3,91,600 డాలర్లు (రూ. 3 కోట్ల 42 లక్షలు) చేరాయి. టైటిల్ నెగ్గిన క్రమంలో ఎంబోకో తొలి రౌండ్లో ప్రపంచ 79వ ర్యాంకర్ కింబర్లీ బిరెల్ (అమెరికా)పై, రెండో రౌండ్లో 2020 ఆ్రస్టేలియన్ ఓపెన్ చాంపియన్, ప్రపంచ 27వ ర్యాంకర్ సోఫియా కెనిన్ (అమెరికా)పై, మూడో రౌండ్లో ప్రపంచ 39వ ర్యాంకర్ మేరీ బుజ్కోవా (చెక్ రిపబ్లిక్)పై, ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్, 2023 యూఎస్ ఓపెన్, 2025 ఫ్రెంచ్ ఓపెన్ విజేత కోకో గాఫ్ (అమెరికా)పై, క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 51వ ర్యాంకర్ జెస్సికా మనీరో (స్పెయిన్)పై, సెమీఫైనల్లో ప్రపంచ 12వ ర్యాంకర్, 2022 వింబుల్డన్ విజేత ఎలీనా రిబాకినా (కజకిస్తాన్)పై గెలిచింది. ఈ టోర్నీకి ముందు 85వ ర్యాంక్‌లో ఉన్న ఎంబోకో తాజా టైటిల్‌తో సోమవారం విడుదలయ్యే ర్యాంకింగ్స్‌లో 60 స్థానాలు ఎగబాకి 25వ ర్యాంక్‌కు చేరుకోనుంది. ఫాయె అర్బన్ (1969లో), బియాంక ఆండ్రెస్కు (2019లో) తర్వాత మాంట్రియల్ ఓపెన్ టైటిల్ సాధించిన మూడో కెనడా ప్లేయర్‌గా ఎంబోకో గుర్తింపు పొందింది. మరియా షరపోవా (రష్యా; 2011లో సిన్సినాటి ఓపెన్), బియాంక ఆండ్రెస్కు (కెనడా; 2019లో ఇండియన్ వెల్స్ ఓపెన్) తర్వాత... ‘వైల్డ్ కార్డు’తో బరిలోకి దిగి డబ్ల్యూటీఏ–1000 టోర్నీలో విజేతగా నిలిచిన మూడో ప్లేయర్‌గా ఎంబోకో ఘనత సాధించింది. -
ప్రిక్వార్టర్స్‌లో సానియా జోడీ
టొరంటో: కెనడియన్ ఓపెన్‌లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మహిళల డబుల్స్‌లో శుభారంభం చేసింది. అమెరికా ప్లేయర్ మాడిసన్ కీస్‌తో జతకట్టిన సానియా తొలి రౌండ్లో 6–4, 3–6, 10–6తో అలైజ్ కార్నెట్ (ఫ్రాన్స్)–జిల్ టెయిక్మన్ (స్విట్జర్లాండ్) జంటపై విజయం సాధించింది. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో సానియా జోడీ... టాప్‌సీడ్ వెరొనిక కుడెర్మెటోవా (రష్యా)– ఎలైజ్ మెర్టెన్స్ (బెల్జియం) జంటతో తలపడుతుంది. మరో వైపు మాంట్రియల్ ఓపెన్ ఏటీపీ టోర్నమెంట్లో భారత వెటరన్ స్టార్ రోహన్ బోపన్న జోడీ కూడా ప్రిక్వార్టర్స్ చేరింది. తొలి రౌండ్లో బోపన్న–మిడిల్‌కూప్ (నెదర్లాండ్స్) ద్వయం 7–6 (7/5), 4–6, 10–6తో డెనిస్ షపొవలోవ్ (కెనడా)– కరెన్ కచనొవ్ (రష్యా) జంటపై గెలిచింది. ప్రిక్వార్టర్స్‌లో బోపన్న జోడీ పొలండ్‌కు చెందిన జెలిన్స్కీ–హుర్కాజ్ జంటతో తలపడుతుంది. -
సౌరవ్ ఓటమి
చెన్నై: భారత అగ్రశ్రేణి స్క్వాష్ ఆటగాడు సౌరవ్ ఘోషల్ మాంట్రియల్ ఓపెన్ నుంచి నిష్క్రమించాడు. మూడో సీడ్ ఒమర్ ఆదిల్ (ఈజిప్ట్)తో కెనడాలో శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో టాప్ సీడ్ సౌరవ్ 12–10, 10–12, 7–11, 15–17 తేడాతో ఓడిపోయాడు. తొలి గేమ్ గెలిచిన అతడు వరుసగా రెండు గేమ్‌లు కోల్పోయాడు. నాలుగో గేమ్‌లో కొంత ప్రతిఘటించినా చివరకు 15–17తో గేమ్‌ను, మ్యాచ్‌ను చేజార్చుకున్నాడు.