breaking news
Mohammad Abdul hadi
-
టూత్ బ్రష్ కూడా పట్టుకోలేకపోయా!
విజయమైనా, వివాదమైనా భారత టెన్నిస్‌లో సానియా మీర్జా ముద్ర స్పష్టం. ఆమె స్థానం పదిలం. దశాబ్ద కాలానికి పైగా భారత నంబర్‌వన్‌గా కొనసాగుతున్న ఈ హైదరాబాదీ అంతర్జాతీయ టెన్నిస్‌లోనూ తన గుర్తింపును చాటుకుంది. ముఖ్యంగా మహిళల డబుల్స్‌లో గత కొన్నాళ్లుగా ఆమె తిరుగులేని విజయాలు సాధిస్తోంది. తాజాగా ప్రపంచ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో ఆమె ఐదో ర్యాంక్‌కు చేరుకుని అత్యుత్తమ స్థాయికి చేరింది. చాలా కాలం క్రితమే సింగిల్స్‌కు దూరమైనా తాను ఎంచుకున్న విభాగంలోనే 28 ఏళ్ల సానియా దూసుకుపోతోంది. అయితే దాదాపు నాలుగేళ్ల క్రితమే సానియా తన కెరీర్ ముగించాలని భావించింది. గాయాలను తట్టుకోలేక ఇక చాలనుకుంది. అయితే మొండి పట్టుదలతో ఆమె పోరాడింది. తన కెరీర్‌ను నిలబెట్టుకుంది. - మొహమ్మద్ అబ్దుల్ హాది ఒకప్పుడు సానియా మీర్జా భారత్ తరఫున సింగిల్స్‌లోనూ సూపర్ స్టార్. కానీ ఎక్కువకాలం ఈ విభాగంలో నిలకడ చూపలేకపోయింది. అదృష్టం బాగుంటే రెండో రౌండ్, లేదంటే తొలి రౌండ్లో పరాజయం... ఒక దశలో సానియా సింగిల్స్ మ్యాచ్ ఫలితం అంటే ఇంతే అన్నట్లుగా ఉండేది. డబ్ల్యూటీఏ సర్క్యూట్లో ఉన్న పోటీని సానియా అందుకోలేకపోయింది. మరోవైపు చూస్తే డబుల్స్‌లో అప్పుడప్పుడు కొన్ని మెరుపు విజయాలు దక్కుతున్నాయి. ఒక రకమైన సందిగ్ధావస్థలో ఉన్నా... చివరకు సింగిల్స్‌కు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకుంది. ‘పూర్తిగా ఆడలేనని కాదు. సింగిల్స్‌లో 60-70 మధ్య ర్యాంకుల్లో ఉన్నాను. డెరైక్ట్ ఎంట్రీ కూడా లభిస్తోంది. కానీ నా ఆట గురించి నాకు తెలుసు. గాయాల తర్వాత సింగిల్స్ ఒత్తిడిని నా శరీరం భరించే స్థితిలో లేదు. కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు’ అని సానియా చెప్పింది. అయితే ఆ నిర్ణయం ఆమెకు ఎంతో మేలు చేసింది. పూర్తి స్థాయిలో డబుల్స్‌పై దృష్టి పెట్టేలా చేయగలిగింది. ‘ఆటను మొదలు పెట్టినప్పుడు అత్యుత్తమ స్థాయికి చేరాలని భావించాను. ఇప్పుడు ఐదో ర్యాంక్ అందుకోవడం నిజంగా అద్భుతంగా ఉంది. ఇక్కడి దాకా వచ్చినదాన్ని నంబర్‌వన్‌ను కూడా కాగలను‘ అని ఆమె ఆత్మవిశ్వాసంతో చెబుతోంది. భాగస్వాములు మారినా... సాధారణంగా డబుల్స్‌లో ఒకే భాగస్వామితో ఎక్కువ కాలం ఆడితేనే మంచి ఫలితాలు వస్తాయంటారు. కానీ సానియా ఇది తప్పని నిరూపించింది. తనకు లభించిన అవకాశాలను ఉపయోగించుకుంది. గతంలో బెథాని మాతెక్తో కలిసి వరుస విజయాలు సాధించిన ఆమె ఇప్పుడు కారా బ్లాక్‌తో కలిసి అదే జోరును కొనసాగిస్తోంది. 2013లో సానియా ఐదుగురు వేర్వేరు భాగస్వాములతో ఐదు టైటిల్స్ గెలవడం విశేషం. ‘భాగస్వామి మారకుంటే మంచిదే. కానీ అదే ముఖ్యం కాదు. మనపై మనకు నమ్మకం ఉండాలి. పక్కన ఎవరు ఉన్నా సమన్వయానికి సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు బ్లాక్‌తో నాకు అలాగే జత కుదిరింది’ అని సానియా వెల్లడించింది. సింగిల్స్‌తో పోలిస్తే డబుల్స్‌కు పెద్దగా గుర్తింపు ఉండదనేది వాస్తవం. అయితే సర్క్యూట్లో డబుల్స్‌ను తక్కువ చేసి చూడటం కూడా ఉండదు. ప్రపంచంలో టాప్-30లో చాలా మంది క్రీడాకారులు డబుల్స్ ఆడటం దీనిని సూచిస్తోంది. ‘భారత టెన్నిస్‌కు గుర్తింపు తెచ్చిన పేస్, భూపతి కూడా ఆ ఘనతలన్నీ డబుల్స్‌లోనే సాధించారనేది మరచిపోవద్దు. అయినా సింగిల్స్‌లో ఎంత మందికి గ్రాండ్‌స్లామ్ గెలిచే అవకాశం ఉంటుంది. అది అంత సులువు కాదు’ అని ఈ హైదరాబాదీ తన మనోభావం వెల్లడించింది. మిక్స్డ్ డబుల్స్‌లో సానియా ఖాతాలో రెండు గ్రాండ్‌స్లామ్‌లు ఉన్నాయి. నాలుగేళ్ల క్రితం నరకం క్రీడాకారుల జీవితంలో చాలాసార్లు గాయాలు భాగంగా మారిపోతాయి. అయితే అవి కెరీర్‌పై ప్రభావం చూపించేవిగా ఉంటేనే సమస్య. సానియాను ఒకసారి కాదు మూడుసార్లు ఈ సమస్య వెంటాడింది. మోచేతికి గాయం, మూడు సర్జరీలు ఆమె ఆటను ఆపేశాయి. కనీసం టెన్నిస్ రాకెట్ కూడా పట్టుకోలేని పరిస్థితిలో ఇక మళ్లీ కోర్టులోకి దిగడం కష్టమే అనిపించింది. అయితే ఈ సమయంలోనూ ఆమె పట్టుదల కోల్పోలేదు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, స్ఫూర్తితో ఆమె మళ్లీ బరిలోకి దిగింది. ‘టెన్నిస్ రాకెట్ సంగతేమో కానీ కనీసం టూత్‌బ్రష్‌ను కూడా నా చేతితో పట్టుకోలేని పరిస్థితి. ఇక ఆట ఏం ఆడతాం. రిటైర్ కావడమే మిగిలింది అనిపించింది. అయితే అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటిద్దామని నిర్ణయించుకున్న సమయంలో నా మనసు చాలా బాధపడింది. కానీ ఇంట్లోవాళ్లు ‘ఒక ప్రయత్నం చేసి చూడవచ్చు కదా’ అన్నారు. దీంతో ఆరు నెలలు మళ్లీ శ్రమించాను. అది ఇప్పుడు ఫలితాన్నిస్తోంది’ అని సానియా గర్వంగా చెబు తోంది. ఈ ఘనతను ఆమె తన తండ్రి ఇమ్రాన్ మీర్జాకే ఇస్తోంది. ఎందుకంటే ఇంత సుదీర్ఘ కెరీర్లో సానియా ఎప్పుడూ పూర్తి స్థాయిలో వ్యక్తిగత కోచ్‌లను నియమించుకోలేదు. పరిమిత సమయానికి ఒకరిద్దరు ట్రావెల్ కోచ్‌లుగా పని చేసినా వారి అవసరం పెద్దగా రాలేదని, తన తండ్రే సూపర్ కోచ్ అనేది ఆమె నిశ్చితాభిప్రాయం. ఆట మినహా అన్నీ దూరం ఒకప్పుడు సానియా మీర్జా అంటే ఆమె వెంట వివాదం కూడా నడిచొచ్చేది. మక్కా మసీదులో షూటింగ్తోనో... జాతీయ పతాకానికి అవమానం అనో... లేదంటే ఏదో వ్యాఖ్య చేసో, తన డ్రెస్సింగ్తోనో ఆమె ఆటకంటే ఇతర అంశాలతోనే వార్తల్లో నిలిచేది. అయితే ఇప్పుడు చాలా కాలంగా సానియా వీటికి దూరంగా ఉంది. ఆమె మ్యాచ్‌ల ఫలితాలు తప్ప మరొకటి కనిపించడం లేదు. ‘మీడియా నా వెంట పడటం, నా గురించి పట్టించుకోవడం మానేసిందేమో. అందుకే ఎలాంటి వార్తలు పుట్టడం లేదు. ఎందుకంటే నేను చేసిన దానికంటే మీడియా అనవసరపు ప్రచారంతోనే ఎక్కువగా ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది’ అని సానియా నవ్వుతూ చెప్పింది. అన్నట్లు ఇప్పుడు సానియా మీర్జా తన అకాడమీలో మరింత మంది యువ ఆటగాళ్లను తీర్చి దిద్దే పనిలో ఉంది. ఫలితాల సాధనకు ఏడాది కాలం చాలా చిన్న సమయమని, భవిష్యత్తులో మెరికల్లాంటి ఆటగాళ్లను తయారు చేస్తానంటూ టెన్నిస్ ప్రపంచానికి సానియా హామీ ఇస్తోంది. -
గిరిజన ‘మంత్రదండం’
హాకీ వారికి ఆరో ప్రాణం సుందర్‌గఢ్‌కు ప్రత్యేక గుర్తింపు ఆటకు బంగారు గనిగా పాపులర్ భారత్‌లాంటి క్రికెట్ క్రేజ్ దేశంలో మరో ఆటను పిచ్చిగా ఆరాధించే జనాన్ని, ప్రాంతాన్ని చూడాలంటే ఒడిశా వెళ్లాల్సిందే. అక్కడి సుందర్‌గఢ్ జిల్లా మన జాతీయ క్రీడ హాకీకి అడ్డా. ఆటపై అభిమానమే కాదు, ఆటగాళ్లను తీర్చి దిద్దడంలోనూ ఈ గిరిజన ఏరియా ముందు అన్ని ప్రాంతాలు తీసికట్టు. ఇప్పటి వరకు సుందర్‌గఢ్ జిల్లానుంచే అంతర్జాతీయ స్థాయిలో భారత జట్టుకు 25 మంది ఆటగాళ్లు ప్రాతినిధ్యం వహించడం విశేషం. ఇక జాతీయ స్థాయి ఆటగాళ్లుగా ఎంత మంది ఎదిగారో లెక్కే లేదు. బాగా వెనుకబడిన ఉత్తర ఒడిశాలోని ఈ ప్రాంతంలో హాకీ పాపులార్టీ వెనక అనేక ఆసక్తికర నేపథ్యాలు ఉన్నాయి. ఎవరైనా చిన్నారిని ‘మీ అభిమాన ఆటగాడు ఎవరు అని గానీ, ఎవరిలా కావాలనుకుంటు న్నావు’ అని గానీ ఎప్పుడైనా అడిగారా... కచ్చితంగా అతను క్రికెటర్ పేరే చెబుతాడు. కానీ అక్కడ అలా కాదు. వారు ఆరాధించేది హాకీ ఆటగాళ్లను... మిట్టమధ్యాహ్నం ఎర్రటి ఎండలో కొంత మంది కుర్రాళ్లు కలిసి ఏదైనా గల్లీలో ఆట ఆడుతున్నారంటే సహజంగానే మనకు క్రికెట్టే కనిపిస్తుంది. కానీ అక్కడ మాత్రం ఆ ఆటను పట్టించుకోరు. వారు మైదానంలోకి దిగేది హాకీ కోసమే... చాలా మంది అభిమానులు సుదీర్ఘంగా క్రికెట్ మ్యాచ్‌లపై చర్చించడం మనం చూస్తాం. కానీ ఆ ప్రాంతంలో అలాంటి దృశ్యం మచ్చుకైనా కనిపించదు. వారు ఏం మాట్లాడినా హాకీ గురించే... - మొహమ్మద్ అబ్దుల్ హాది క్రైస్తవ మిషనరీల వెంట... సుందర్‌గఢ్ ప్రధానంగా గిరిజన ప్రాంతం. 36 రకాల తెగల్లో ఎక్కువ మంది ఓరమ్, ముండా, భునియా తెగకు చెందినవారు ఉన్నారు. చాలా ఏళ్లుగా ఇక్కడ క్రైస్తవ మిషనరీలు పెద్ద సంఖ్యలో తమ కార్యకలాపాలు కొనసాగించాయి. వారు ఎక్కడ పాఠశాల ఏర్పాటు చేసినా అక్కడ హాకీ ఆటను తప్పనిసరి చేశారు. ఇది హాకీ ఆట మీద సానుకూల ప్రభావం చూపింది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం మరో కారణం కూడా ఉంది. ఇక్కడి గిరిజనులు సాధారణంగా కాస్త పొట్టిగా ఉంటారు. కానీ కాళ్లు చాలా బలంగా ఉంటాయి. కంటి చూపు కూడా చాలా చురుకైనది. ఒక కర్ర ఆధారంగా ఉన్నా సరే...దానిపై వంగి కొన్ని గంటల పాటు నిలబడగల సామర్థ్యం వారి సొంతం. ఇవన్నీ హాకీ ఆటకు సరిపోయే లక్షణాలు అని వారు చెబుతున్నారు. సూపర్ శిక్షణ... హాకీ నర్సరీ...ఈ పేరును చూస్తేనే నర్సరీ స్థాయి శిక్షణ అని అర్థమవుతోంది కదా...దేశంలోనే ఈ తరహా ఏకైక శిక్షణా కేంద్రం సుందర్‌గఢ్ సమీపంలోని రూర్కెలాలో ఉంది. పసి ప్రాయంలోనే ప్రతిభను గుర్తించి వారిని హాకీలో తీర్చి దిద్దేందుకు ఏర్పాటైన అకాడమీ ఇది. హాకీ స్టిక్ కొనుక్కునే సామర్థ్యం లేకపోయినా, షూస్ లేకపోయినా తమకు అందుబాటులో ఉన్న కర్రలనే కాస్త వంపుగా చెక్కి, వాటినే స్టిక్లుగా మలచి, ఉత్త కాళ్లతో మైదానం వైపు దూసుకుపోయేవారు ఎందరో ఇక్కడ ఉన్నారు. వారికి హాకీ అంటే ప్రాణం, హాకీ అంటే భవిష్యత్తుపై భద్రత కూడా. దీంతో తమకు అందుబాటులో ఉన్న అవకాశాలనే ఉపయోగించుకొని మెరికల్లా తయారవుతున్నారు. స్టీల్ అథారిటీలాంటి సంస్థల ప్రోత్సాహం లభిస్తుండటం కూడా వీరి అదృష్టం. దేశంలోని పెద్ద నగరాల్లోనే ఒక ఆస్ట్రోటర్ఫ్‌కు అవకాశం లేదు గానీ....ఒక్క సుందర్‌గఢ్ జిల్లాలోనే మూడు ఆస్ట్రోటర్ఫ్లు ఉండటం విశేషం. ఇక్కడ ఈ ఆట పాపులార్టీకి ఇదో ఉదాహరణ. జాబితా పెద్దదే... ఇక్కడి మిషనరీ స్కూల్లో ప్రవేశం కోసం వెళ్లేటప్పుడు చేత్తో హాకీ స్టిక్ కూడా తీసుకు వెళ్లాలి. ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే.. వరుడికి ఎన్ని గొర్లు, బర్రెలు ఉన్నాయనేది ముఖ్యం కాదు. అతను స్థానిక పోటీల్లో ఎన్ని గోల్స్ చేశాడన్నది ముఖ్యం. నిద్రలో లేపి చెప్పినా, వెంటనే మైదానానికి వెళ్లి హాకీ ఆడేందుకు ఎవరైనా సిద్ధంగా ఉంటారు. సుందర్‌గఢ్ గురించి వినిపించే వ్యాఖ్యల్లో ఇవి కొన్ని. ఇన్నేళ్లలో ఆ ప్రాంతం నుంచి ఎంతో మంది జాతీయ జట్టుకు ఆడారు. భారత్‌నుంచి అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన దిలీప్ తిర్కీ (412) ఈ జాబితాలో అందరికంటే ముందున్నాడు. మూడు ఒలింపిక్స్ ఆడిన ఏకైన గిరిజనుడు అతనే కావడం విశేషం. ఏథెన్స్ ఒలింపిక్స్‌లో దిలీప్‌తో పాటు ఈ ప్రాంతానికి చెందిన ఇగ్నీస్ తిర్కీ, విలియం గ్జాల్కో ఉన్నారు. మైకేల్ కిండో, ప్రబోధ్ తిర్కీ, లాజరస్ బర్లా, పీటర్ తిర్కీ, రోషన్ మింజ్, అమర్దీప్ ఎక్కా, బీరేంద్ర ఎక్కా, సునీత కుల్లు, సుభద్రా ప్రధాన్, అనుప, బినిత, దీప్ గ్రేక్ ఎక్కా, సునీత లక్డా, నమిత టప్పో, లిలిమా మింజ్, రోజలీన్ డుంగ్‌డుంగ్....వీరంతా భారత్‌కు ఆడినవారే. వీరిలో నలుగురు భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించగా, ముగ్గురు అర్జున అవార్డు, ఇద్దరు పద్మశ్రీలు అందుకున్నారు. ఇటీవల నెదర్లాండ్స్‌లో జరిగిన మహిళల వరల్డ్ హాకీ లీగ్‌లో సుందర్‌గఢ్‌కు చెందిన ఆరుగురు అమ్మాయిలు భారత జట్టు తరఫున ఆడటం తాజా ఘనతగా చెప్పుకోవచ్చు. భవిష్యత్తుపై భరోసా... ఆసక్తికరంగా ఇక్కడినుంచి వెలుగులోకి వచ్చినవారంతా డిఫెండర్లు, మిడ్‌ఫీల్డర్లే తప్ప ఫార్వర్డ్లు ఎవరూ లేరు. దీనిపై స్థానిక కోచ్ ఒకరు... ‘అమాయక గిరిజనులు సాధారణంగా ఎవరి జోలికీ వెళ్లరు. కానీ తమ జోలికి ఎవరైనా వస్తే దానిని అడ్డుకోగల సామర్థ్యం వారి సొంతం. అదే వారిలో ఆటలోనూ కనిపిస్తుంది’ అని చెప్పడాన్ని బట్టి చూస్తే హాకీ వారి జీవనంలోనూ భాగమైపోయిందని అర్థమవుతుంది. ఎంతో మంది ఆట ద్వారానే ఉద్యోగాలు సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఈ ఏరియాలో 500 మందికి పైగా ప్రొఫెషనల్ శిక్షణ పొందుతున్నారు. మిగతా భారత్‌లో క్రికెట్‌కు ఎలాంటి క్రేజ్ ఉందో ఇక్కడ హాకీకి అలాంటి క్రేజ్ ఉందని చెప్పవచ్చు. అయితే సుందర్‌గఢ్ తన పేరును, చరిత్రను నిలబెట్టుకోవాలని అక్కడివారు పట్టుదలగా ఉన్నారు. అందుకే వేర్వేరు స్థాయిల్లో ఆటలో కొనసాగుతున్నారు. తమకు ఉద్యోగం కూడా హాకీ ద్వారానే దక్కుతుందని వారి నమ్మకం. అయితే ఇప్పటికీ ఈ ఏరియాలో ఒడిషా హాకీ అసోసియేషన్ మాత్రం చురుగ్గా కార్యకలాపాలు నిర్వహించడం లేదు. ప్రభుత్వం తరఫున హాకీ అకాడమీతో పాటు హాకీ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని మాజీ ఆటగాళ్లు కోరుతున్నారు. పెరుగుతున్న డిమాండ్‌తో పాటు ప్రపంచ హాకీలో వచ్చిన కొత్త తరహాలో మార్పుల గురించి ఇప్పుడు శిక్షణ అవసరమని, అందుకు నిపుణులైన కోచ్‌లను నియమించాలని కూడా వారు అంటున్నారు. సౌకర్యాలతో పాటు సంప్రదాయం కూడా కొనసాగితే భవిష్యత్తులో మరెందరో తిర్కీలు ఈ ‘సుందర్‌గఢ్- ది మక్కా ఆఫ్ హాకీ’ నుంచి భారత్‌కు ఆడటం ఖాయం. టోర్నీలే టోర్నీలు... మన వద్ద ఏడాదికో హాకీ టోర్నీ జరిగితే అదే గొప్ప. కానీ సుందర్గఢ్లో ఏడాది పొడవునా హాకీ టోర్నీలే. వీటిని అక్కడ ఖాసీ టోర్నమెంట్లుగా వ్యవహరిస్తారు. ఖాసీ అంటే మేక/ గొర్రె. గతంలో టోర్నీ గెలిస్తే ఖాసీని బహుమతిగా ఇచ్చేవారు. ఇప్పటికీ ఆ సంప్రదాయం కొనసాగుతోంది. ఇక్కడి లల్కిడిహి, సౌనమారా, కేస్రమల్, పాన్‌పోష్ గ్రామాల్లోనైతే హాకీ టోర్నీ అంటే పండగ వాతావరణం కనిపిస్తుంది. పెళ్లి సందర్భంగా ఇరు వర్గాలు సరదాగా ఏదైనా ఆడితే అది హాకీనే. 2003లో సుందర్‌గఢ్ జిల్లా పరిసరాల్లోని 1500 గిరిజన గ్రామాలు 200 హాకీ టోర్నమెంట్లు నిర్వహించడం విశేషం. దశాబ్దం క్రితం ఈ ప్రాంతాల్లో నక్సల్స్ సమస్య పెరిగితే జిల్లా ఎస్పీ హాకీ టోర్నమెంట్లు నిర్వహించి ప్రజలను ఒక్కచోటికి చేర్చారు. టోర్నీ సాకుతో వారికి వైద్య సౌకర్యాలు కల్పించడంతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో భాగం చేయడం విశేషం. ఇక ఈ ఏడాది జనవరిలో రూ. 2 లక్షల ప్రైజ్‌మనీతో స్థానికంగా ఒక టోర్నమెంట్ నిర్వహించారు. దీనికి రికార్డు స్థాయిలో సుందర్‌గఢ్ జిల్లానుంచే 1200 జట్లు పాల్గొనడం ఒక రికార్డు. ప్రైజ్‌మనీతో పనేంటి...ఆటే మా ప్రాణం, హాకీ మా రక్తంలోనే ఉంది అంటారు వీళ్లు. నేను గర్వపడుతున్నా... మా సుందర్‌గఢ్ రక్తంలోనే హాకీ ఉంది. నేను అక్కడివాడిని కావడం నా అదృష్టం. ఆటే మా అందరినీ కలుపుతుంది. నేను అంతర్జాతీయ స్థాయికి ఎదిగానంటే మా ప్రాంతపువారి సహాయ సహకారాలు, ప్రోత్సాహం ఎంతో ఉన్నాయి. పార్లమెంట్ సభ్యుడిగా నేను కూడా సుందర్‌గఢ్ హాకీకి మరింత ప్రాచుర్యం కల్పించేందుకు ప్రయత్నిస్తా. - దిలీప్ తిర్కీ, భారత మాజీ కెప్టెన్