breaking news
model colony
-
శభాష్.. సాయి
సనత్‌నగర్: వృద్ధాప్యానికి వయస్సు ఉంటుందేమో గానీ..మనస్సుకు కాదంటూ ఆ ఏడు పదుల వ్యక్తి నిరూపిస్తున్నారు. వయస్సుతో నిమిత్తం లేకుండా నవ యువకుడిలా కాలనీ అభివృద్ధికి, వివిధ రకాల సేవా కార్యక్రమాలను ఉత్సాహంగా నిర్వర్తిస్తుంటారాయన. ఆయనే మోడల్‌కాలనీకి చెందిన జేఎస్టీ సాయి. చిట్టాతో రెడీ... రాష్ట్ర మంత్రో, ప్రజాప్రతినిధో...లేక అధికారో...మోడల్‌కాలనీ వైపు వస్తున్నారంటే చాలు...ఆ వ్యక్తి సమస్యల చిట్టాతో రెడీగా ఉంటాడు. అవి సొంత సమస్యలేమీ కాదు.. అన్నీ ప్రజా సంక్షేమంతో ముడిపడినవే. ఇక రెగ్యులర్‌గా సమస్యలపై అధికారులతో ఫోన్లో టచ్‌లో ఉంటుండడం ఆయన దినచర్యలో ఒక భాగం. ఆ వ్యక్తి వస్తున్నా...లేదా ఫోన్న్ చేస్తున్నా...మళ్ళీ ఏ సమస్యను మోసుకొస్తున్నారంటూ అని వ్యంగ్యంగా అనే అధికారులూ లేకపోలేదు. తాను ఉండే కాలనీ ప్రజల సంక్షేమం. అభివృద్ధి గురించి ఆయనలోని తపనకు ఇదో ఉదాహరణ. ఇది నాణేనికి ఒక వైపు అయితే... ఆయనలోని సామాజిక కోణం మరోవైపు...తానుండే కాలనీ వారితో కలిసి మానవ సేవా సమితి పేరిట సమాజహిత కార్యక్రమాలను విస్తృతం చేస్తున్నారు. ఆయనలోని ఇంకో కోణం ఏమిటంటే సినీ అభిమాని అయిన ఆయన కళాకారులకు ప్రోత్సాహాన్ని అందిస్తూ తనలోని కళాభిమానాన్ని చాటుతుంటారు. ఇవన్నీ చేయాలంటే ఉరకలెత్తే రక్తమే ఉండనక్కర్లేదు..అనుభవాలను ధారపోసే సీనియర్ సిటిజ¯Œన్స్ కూడా చేయవచ్చని నిరూపిస్తున్నారు 78 ఏళ్ళ జేఎస్టీ సాయి. ఆ ప్రాయంలోనూ సామాజిక సేవా కార్యకర్తగా, కాలనీ అభివృద్ధి బాధ్యతలను, జీహెచ్ఎంసీ సర్కిల్–10 ఆసరా కమిటీ ఉపాధ్యక్షుడిగా ఓపిగ్గా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. స్వచ్ఛ కాలనీ అవార్డు రావడంలో ప్రధాన భూమికగా... ఒకప్పుడు మోడల్‌కాలనీ పార్కు చూస్తే చెట్లపొదలతో చిట్టడివిని తలపించేలా ఉండేది. దాని అభివృద్ధికి అధికారులను, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగి పార్కును సర్వాంగసుందరంగా, ఆహ్లాదంగా తీర్చిదిద్దడానికి కారకులుగా నిలిచారంటే ఆయనలోనే తపనకు నిదర్శనం. ఆ పార్కు నిర్వహణకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ సంస్థల నుంచి అవార్డులు, ప్రశంసలు కూడా వచ్చాయి. అలాగే రోడ్లు, మంచినీరు, డ్రైనేజీ, విద్యుత్, అంతెందుకు రోడ్డుపై చెత్త, చెట్ల కొమ్మలు ఉన్నా వెంటనే అధికారులకు ఫోన్న్ చేయడమో! లేక నేరుగా వెళ్ళి వినతిపత్రం ఇవ్వడమో చేసి పరిష్కారం జరిగే వరకు వెంటపడుతుండడం. ఒకానొక దశలో అధికారులు సైతం విసుగెత్తిపోయి సమస్య పరిష్కారించి తీరక తప్పదు. అందుకేనేమో ఆ కాలనీకి స్వచ్ఛ కాలనీ అవార్డు వరించింది. ఐక్యతే బలం నినాదంతో... ఇక వినాయక చవితి, స్వాతంత్య్ర, గణతంత్ర, కార్తీక మాస విశిష్ట పూజలు, వనభోజనాలు...ఇలాంటి కార్యక్రమాలను కాలనీవాసులందరినీ భాగస్వాములు చేసి ఒకే వేదిక పైకి చేర్చి ఐక్యతలో ఉండే శక్తిని చాటిచెబుతారు. ఆయా పండుగ వేళల్లో ఉల్లాసభరిత కార్యక్రమాలతో మనస్సును పరవశింపజేసే కార్యక్రమాల నిర్వహణలో రాజీపడరంటే అతిశయోక్తి కాదు. ఇక సహపంక్తి భోజనాలు, ఆధ్యాత్మిక, వినోద కార్యక్రమాల నిర్వహణలో ఆయనకు ఆయనే సాటి. గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంలో పిల్లలకు ఆటలు, పాటలు, వ్యాసరచన, వక్తత్వ , పెయింటింగ్ తదితర పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేయడం ఆనవాయితీ. ఓటు విలువపై విస్తృత ప్రచారం... ఓటు హక్కు...ప్రజల తలరాతలను మార్చే ఆయుధంగా జేఎస్టీ సాయి భావిస్తారు. అందుకే ఎన్నికల వేళ ఓటు విలువను తెలియపరుస్తూ ప్రత్యేకంగా కరపత్రాలను ముద్రించి ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రచారం కల్పించడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. మానవసేవా సమితితో సేవలకు నాంది కాలనీకి చెందిన బుచ్చిబాబు, శశికాంత్‌లతో పాటు మరికొంతమందితో కలిసి మానవ సేవా సమితి తరుపున జేఎస్టీ సాయి వివిధ సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. వేసవికాలంలో దాదాపు రెండు నెలల పాటు బాటసారులకు పెరుగన్నం, మజ్జిగ, మంచినీటిని అందిస్తున్నారు. దీంతో పాటు నిత్యం ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రికిలోని రోగుల సహాయకుల కు అన్నదానం చేస్తుంటారు. సత్యసాయి సేవా సమితి తరుపున జరిగే వివిధ కార్యక్రమా ల్లో జేఎస్టీ సాయి చురుగ్గా పాల్గొంటూ తనలోని సేవానిరతిని చాటుతున్నారు. అలాగే విద్యావ్యాప్తిలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులకు నోట్ పుస్తకాల పంపిణీ చేస్తున్నారు. కళాకారులకు ప్రోత్సాహం... ఫిలిం ఫ్యాన్స్ అసోసియేషన్‌న్ ప్రతినిధిగా జేఎస్ టీ సాయి కళాకారులు అంటే అపారమైన గౌర వం. అందుకే కాలనీలో సామూహికంగా ఏ కార్యక్రమం చేపట్టినా కళాకారులను చేయూత అందించాలనే ఉద్దేశ్యంతో వారి చేత ప్రత్యేక ప్రదర్శనలు కూడా ఇప్పిస్తుంటారు. అంతేకాకుండా కళాకారులను ప్రోత్సహించాలనే లక్ష్యం తో స్వయంగా సుమధుర కళానికేతన్‌ను స్థాపిం చి జానపద, కూచిపూడి, భరతనాట్యం, నాటిక, నాటక, అవధానాలు, సంగీతం, మిమి క్రీ వంటి కార్యకమాలు నిర్వహించి తనలోని కళాతృష్ణను తీర్చుకుంటూనే ప్రజలకు వినో దాన్ని అందిస్తున్నారు. శ్రీవిశ్వనాధం సాహిత్య పీఠం జాయింట్ సెక్రటరీ, శ్రీనాటరాజ ఆర్ట్ అకాడమీ కార్యదర్శి, తెలుగు ఫిలిం ఫ్యాన్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ, కష్ణ కళాభారతి కార్యదర్శిగా, సుమధుర కళానికేతన్ ఫౌండర్ సెక్రటరీగా, విద్వత్ పరిషత్ కన్వీనర్‌గా బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించి సాంస్కృతిక రంగంలో తనదైన సేవలు అందించారు. సీనియర్ సిటిజన్స్‌కు ‘ఆసరా’... తోటి సీనియర్ సిటిజన్స్ నిత్యం ఉల్లాసంగా ఉండాలని జేఎస్టీ సాయి తాపత్రయం. అందుకోసం జీహెచ్ఎంసీ నుంచి వివిధ రకాల క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణతో పాటు వారికి సంబంధించిన స్కీములను వినియోగించుకునేలా చైతన్యం తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తుంటారు. ఎన్నో అవార్డులు..రివార్డులు.. మరెన్నో సన్మానాలు... ♦ మోడల్‌కాలనీకి స్వచ్ఛ కాలనీ అవార్డు దక్కించుకోవడం వెనుక జేఎస్టీ సాయి కాలనీ పరిశుభ్రత విషయంలో కీలక భూమిక వహించారు. ♦ ఎల్డర్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ రివార్డు. ♦ సీనియర్ సిటిజన్స్, సంఘ సేవకు గాను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌చే అవార్డు, సన్మానం. ♦ సామాజిక సేవలకు గానుఎకోష్యూర్ ఎక్సలెన్స్ అవార్డు ♦ సంఘ సేవకు గాను ఖమ్మం మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావుచే సత్కారం.. -
విద్యార్థినుల పట్ల వెకిలిచేష్టలు
- మొన్న ఎంఈఓ.. నేడు ఉపాధ్యాయుడు హిందూపురం అర్బన్ : పాఠాలు బోధించాల్సిన ఉపాధ్యాయులు కొందరు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. గురువు స్థానానికి కలంకం తెస్తున్నారు. ఇటీవల ఎంఈఓ ఓ విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి జైలుపాలయ్యారు. ఆ ఉదంతం మరవకముందే మంగళవారం మోడల్‌కాలనీలో సర్థార్ వల్లభాయ్ పటేల్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఇంగ్లిష్ సబ్జెక్టు ఉపాధ్యాయుడు మల్లికార్జున నాయక్ విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. సాయంత్రం స్కూల్ కమిటీ సమావేశం జరుగుతుండటంతో అక్కడికి బాధిత విద్యార్థినుల తల్లిదండ్రులు వచ్చారు. వీరి రాకను ముందుగానే పసిగట్టిన సదరు ఉపాధ్యాయుడు అక్కడి నుంచి జారుకున్నాడు. ఉపాధ్యాయుడు వెకిలి చేష్టలు చేస్తూ ద్వంద్వార్థాలు వచ్చేలా మాట్లాడుతున్నారని విద్యార్థినుల తల్లిదండ్రులు స్కూల్ కమిటీ సభ్యుల దృష్టికి తీసుకొచ్చారు. అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే తామే బుద్ధి చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. అనంతరం టూటౌన్ పోలీసులకు సమాచారం అందడంతో స్కూలుకు వచ్చి విచారణ చేశారు. తమకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని సీఐ మధుభూషణ్ చెప్పారు. ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థిసంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. -
నేడు సీఎం రాక
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు మోడల్ కాలనీ నిర్మాణానికి శంకుస్థాపన ఎడ్యుకేషన్ హబ్, ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ తదితర నిర్మాణాలకూ.. మినీ ట్యాంక్‌బండ్‌గా.. పాండవుల చెరువుకు శ్రీకారం గజ్వేల్ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం గజ్వేల్ నగర పంచాయతీలో పర్యటించనున్నారు. ఇందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గత మార్చి 12న ఇక్కడ పర్యటించి పట్టణానికి కొత్తరూపు తీసుకురావడానికి పలు ప్రతిపాదనలకు ఆదేశించిన కేసీఆర్ వాటికి కార్యరూపమిస్తూ ఆ పనులకు శంకుస్థాపన చేయడానికి ఇక్కడికి వస్తున్నారు. ఆయన పర్యటనకు సంబంధించి ‘గడా’ (గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ) ఓఎస్డీ హన్మంతరావు నేతృత్వంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన సొంత నియోజకవర్గంలో మరోసారి పర్యటనకు వస్తున్న నేపథ్యంలో పోలీసులు భద్రత ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. వివిధ బలగాలు భారీగా మోహరించాయి. ఇదీ సీఎం పర్యటన షెడ్యూల్.. ► ఉదయం 10 గంటలకు రోడ్డు మార్గం ద్వారా సీఎం గజ్వేల్ చేరుకుంటారు. ► తొలుత ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో నిర్మించతలపెట్టిన వంద పడకల ఆసుపత్రికి, పాలశీతలీకరణ కేంద్రం వెనుక భాగంలోని స్థలంలో ఆడిటోరియం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ► కస్తుర్బాగాంధీ పాఠశాల ప్రాంగణంలోని 20 ఎకరాలకుపైగా విస్తీర్ణంలో బాలికల కోసం టెన్త్ నుంచి పీజీ వరకు విద్యాసంస్థలు, పాలిటెక్నిక్‌లోని 45 ఎకరాల ప్రాంగణంలో బాలుర కోసం టెన్త్ నుంచి పీజీ వరకు విద్యాసంస్థలు, హాస్టళ్లతో కూడిన ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణానికి, హౌసింగ్ బోర్డు మైదానంలో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ► సంగాపూర్‌లో ప్రభుత్వ ఆదర్శ గురుకుల పాలిటెక్నిక్ వెనుక భాగంలో ఉన్న 68 ఎకరాల్లో మోడల్ కాలనీ నిర్మాణానికి శంకుస్థాపన. ► రూ.8.50 కోట్లతో అభివృద్ధి చేయనున్న పాండవుల చెరువు నిర్మాణ పనులను ప్రారంభిస్తారు. ► రాజిరెడ్డిపల్లిలోని రాజీవ్ రిక్రియేషన్ పార్కు సందర్శన.. విలేకరుల సమావేశం. ► మధ్యాహ్నం ఒంటిగంటకు ములుగు మండలం మర్కుక్ పీహెచ్సీ తదితర నిర్మాణాలకు శంకుస్థాపన. -
మోడల్ కాలనీ అభివృద్ధికి ప్రత్యేక నిధులు
చేగుంట, న్యూస్‌లైన్: మోడల్ కాలనీలో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక నిధులు కేటాయిస్తామని కలెక్టర్ స్మితా సబర్వాల్ పేర్కొన్నారు. బుధవారం చేగుంటలో కలెక్టర్ చేతుల మీదుగా మోడల్ కాలనీ లబ్ధిదారులు పట్టాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేగుంటలో నిరుపేదలకు ఇండ్ల స్థలాలు అందించడం, లబ్ధిదారులు సర్టిపికెట్లకన్నా ముందుగా ఇండ్ల నిర్మాణం చేపట్టడం అభినందనీయమన్నారు. మోడల్ కాలనీ ఏర్పాటుకు ఎమ్మెల్యే ముత్యంరెడ్డి చేస్తున్న కృషిని కలెక్టర్ అభినందించారు. కాలనీలో అంతర్గత రోడ్లు విద్యుత్ సౌకర్యం తదితర వసతుల కల్పనకు ప్రత్యేక నిధులు అందిస్తామన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మోడల్ కాలనీలో వాటర్ ట్యాంకు నిర్మాణానికి, షాదీఖానా నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. వందశాతం ఉత్తీర్ణత సాదించండి పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించి గ్రామం పేరు నిలబెట్టాలని కలెక్టర్ స్మితా సబర్వాల్ రాంపూర్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సూచించారు. పదోతరగతి పరీక్షల కొసం విద్యార్థులు చదువుతున్న తీరును అడిగితెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులకు బెంచీలు, క్రీడా సామాగ్రి అందించారు. కార్యక్రమంలో ఆర్డీఓ వనజాదేవి, డీఎఫ్ఓ సుధాకర్‌రెడ్డి, డీఈఓ రమేశ్, తహశీల్దార్ వెంకన్న పాల్గొన్నారు.