breaking news
mobile manufacturer
-
చౌక 5జీ ఫోన్ల మోత!
5జీ ఫోన్ కొనే ప్లాన్‌లో ఉన్నారా? పండుగ సీజన్ వరకు కాస్త ఓపిక పట్టండి! ఎందుకంటారా? భారీగా ఆదా చేసే చాన్స్ రాబోతోంది. రాబోయే పండుగల్లో చౌక 5జీ ఫోన్లు మార్కెట్‌ను ముంచెత్తనున్నాయి. ప్రధానంగా హ్యాండ్సెట్ల తయారీలో కీలకమైన 5జీ చిప్సెట్లను చిప్ తయారీ బ్రాండ్లు తక్కువ ధరల్లో విడుదల చేస్తుండటంతో ఫోన్ రేట్లు దిగొచ్చేందుకు వీలవుతోంది. దీంతో ఈ ఏడాది చివరికల్లా దేశంలో 5జీ హ్యాండ్సెట్ల మార్కెట్ భారీగా ఎగబాకుతుందనేది పరిశ్రమ వర్గాల అంచనా.మనం ఇప్పటికే 5జీ యుగంలోకి అడగుపెట్టేశాం. ఒకపక్క టెలికం కంపెనీలు 5జీ నెట్వర్క్ విస్తరణకు వడివడిగా అడుగులు వేస్తున్నాయి. మరోపక్క మొబైల్ ఫోన్ తయారీ సంస్థలు కూడా 5జీ హ్యాండ్సెట్లను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి. దీంతో ఫోన్ కొనుగోలుదారులకు ఇక ‘పండుగే’! ప్రస్తుతం దేశంలో 5జీ స్మార్ట్ ఫోన్ల ధర రూ. 11,000–13,000 మధ్య ప్రారంభమవుతోంది. కొన్ని ఫోన్ బ్రాండ్లు అప్పుడప్పుడు ప్రమోషనల్ ఆఫర్లను అందిస్తుండటంతో ధర కొంచెం తగ్గుతోంది. అయితే, చిప్ తయారీ సంస్థలు చౌక 5జీ చిప్సెట్లను అందుబాటులోకి తెస్తుండటంతో ఫోన్ రేట్లు భారీగా దిగిరానున్నాయి. చిప్.. చిప్.. హుర్రే! తాజాగా భారత్ కోసం చైనా చిప్సెట్ బ్రాండ్ యూనిసాక్ ‘టీ760’ చిప్‌సెట్‌ను విడుదల చేసింది. ప్రధాన మొబైల్ ఫోన్ తయారీ సంస్థలు అందుబాటు ధరల్లో 5జీ ఫోన్ల విడుదలకు చర్చలు జరుపుతున్నట్లు ప్రకటించింది. దీంతో రూ. 10,000 లోపు ధరల్లో 5జీ ఫోన్లకు మార్గం సుగమం కానుంది. యూనిసాక్ బాటలోనే మొబైల్ చిప్సెట్లలో దిగ్గజ బ్రాండ్లైన క్వాల్కామ్, మీడియాటెక్ కూడా చౌక 5జీ చిప్సెట్లను అందించనున్నాయి. ‘అతి త్వరలోనే’ బడ్జెట్, ఎంట్రీలెవెల్ 5జీ హ్యాండ్సెట్ల కోసం చిప్సెట్లను తీసుకొస్తామని క్వాల్కామ్ కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు. మీడియాటెక్ ‘డైమెన్సిటీ 6000 సిరీస్’ ఎంట్రీలెవెల్ చిప్సెట్ చౌకగా స్మార్ట్ ఫోన్లను అందించేందుకు వీలుకల్పిస్తుందని ఆ కంపెనీ డిప్యూటీ డైరెక్టర్ అనూజ్ సిద్ధార్థ్ చెప్పా రు. ‘2జీ, 4జీ విభాగాల్లో యూనిసాక్ చిప్సెట్ల వాటా పటిష్టంగా ఉంది. టీ760తో భారత్‌లో అందరికీ చౌక 5జీ ఫోన్లను అందించడమే మా లక్ష్యం. దీనికోసం కీలక ఫోన్ తయారీదారులతో జట్టు కడుతున్నాం. టీ760 చిప్సెట్ మెరుగైన పనితీరుతో భారత్ 5జీ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో సంచలనం సృష్టిస్తాం’ అని యూనిసాక్ కంపెనీ పేర్కొంది. ఇక 5జీ మార్కెట్ జోరు... చిప్సెట్ల రేట్లు దిగిరావడం, చౌక ఫోన్ల లభ్యతతో ఈ ఏడాది చివరికల్లా 5జీ ఫోన్ల మార్కెట్ వాటా రెండంకెల స్థాయికి చేరుకోవచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ‘రూ. 10,000 విభాగంలో 5జీ ఫోన్ల వాటా ఈ ఏడాది మే నాటికి కేవలం 1.4 శాతం మాత్రమే ఉంది. చౌక చిప్సెట్ల ప్రభావంతో డిసెంబర్ నాటికి ఈ వాటా 10 శాతానికి చేరుకోనుంది’ అని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ పేర్కొన్నారు. ట్రాన్సియన్ హోల్డింగ్స్ (టెక్నో, ఇన్ఫినిక్స్, ఐటెల్ తదితర మొబైల్ బ్రాండ్స్), హెచ్ఎండీ గ్లోబల్ (నోకియా బ్రాండ్), రియల్మీ, రెడ్మీ వంటి కంపెనీలు దసరా, దీపావళి పండుగ సీజన్లో చౌక 5జీ హ్యాండ్సెట్లను ప్రవేశపెట్టే సన్నాహాల్లో ఉన్నాయి. ‘ట్రాన్సియన్ వంటి కీలక తయారీదారు భారీ ప్రణాళికల్లో ఉండటంతో రూ.10,000 లోపు 5జీ హ్యాండ్సెట్ల మార్కెట్ దూసుకుపోనుంది. 5జీ ఫోన్ల విడుదలకు సంబంధించి మార్కెట్‌ను అధ్యయనం చేస్తున్నాం’ అని ట్రాన్సియన్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ అరిజీత్ తలపాత్ర పేర్కొన్నారు.ఈ ఏడాది మే నాటికి రూ.10,000 లోపు 5జీ హ్యాండ్సెట్ల అమ్మకాల వాటా: 1.4% డిసెంబర్ కల్లా దేశీ ఫోన్ల మార్కెట్లో 5జీ మొబైల్స్ సేల్స్ పరిమాణం (కౌంటర్ పాయింట్ అంచనా): 10% ఎంట్రీలెవెల్ 5జీ సెగ్మెంట్లో టాప్ కంపెనీలు: ట్రాన్సియన్, హెచ్ఎండీ గ్లోబల్, రియల్మీ, రెడ్మీ – సాక్షి, బిజినెస్ డెస్క్ -
రాష్ట్రంలో మొబైల్ తయారీ హబ్
రెండు లక్షల మందికి ఉపాధి ఖాయం: సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మొబైల్ తయారీ హబ్ ఏర్పాటు ద్వారా సుమారు రెండు లక్షల మందికి ఉపాధి దక్కుతుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. గురువారం సీఎం క్యాంపు కార్యాలయంలో తైవాన్‌కు చెందిన ఫ్యాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ ప్రెసిడెంట్ కాల్విన్ చిన్, ఫిహ్ మొబైల్ లిమిటెడ్ చైర్మన్ విన్సెంట్ టాంగ్ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అత్యంత అనుకూల వాతావరణం ఉందని ఈ సందర్భంగా కేసీఆర్ వారితో అన్నారు. పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉండే పారిశ్రామిక విధానం వల్ల ఇక్కడి యువతకు ఉపాధి కల్పించడంతో పాటు, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నదే తమ లక్ష్యమన్నారు. తెలంగాణలో మొబైల్ తయారీ హబ్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే అనేక సెల్‌ఫోన్ తయారీ సంస్థల ప్రతినిధులు తమ యూనిట్లను తెలంగాణలో స్థాపించేందుకు ముందుకు వచ్చిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. మొబైల్ తయారీ హబ్‌కు అనువైన స్థలం కేటాయించడంతో పాటు, అన్ని వసతులు కల్పిస్తామని చెప్పారు. పరిశ్రమల ఏర్పాటుకు నిర్దిష్ట ప్రతిపాదనలతో రావాలని తైవాన్ ప్రతినిధులను కేసీఆర్ కోరారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న టీఎస్ ఐపాస్ చట్టం ఉదాత్తంగా ఉందని, తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని తైవాన్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఐఫోన్ లాంటి అత్యాధునిక ఫోన్లను తయారు చేసే తమ కంపెనీ హైదరాబాద్‌లో తయారీ యూనిట్‌ను నెలకొల్పే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు తైవాన్ ప్రతినిధులు వెల్లడించారు. సమావేశంలో ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు, ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్, సీఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగరావు పాల్గొన్నారు.