breaking news
Mehul
-
అనుపమ్ ఖేర్ బొమ్మ కరెన్సీతో బురిడీ
అహ్మదాబాద్: వీళ్లు అలాంటిలాంటి మోసగాళ్లు కాదు.. దొంగనోట్ల కట్టలు. అవీ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ బొమ్మతో ఉన్నవి అక్షరాలా రూ.1.30 కోట్లు..ఓ బడా బంగారం వ్యాపారికి అంటగట్టి ఏకంగా 2.1 కిలోల బంగారంతో ఉడాయించారు. ఇందుకోసమే ప్రత్యేకంగా వాళ్లు ఓ నకిలీ హవాలా ఆఫీసును సైతం ఏర్పాటు చేసుకున్నారు. మోసం తెలుసుకునేలోపే పత్తా లేకుండా పోయారు. బాలీవుడ్‌ను సైతం తలదన్నే ట్విస్టులున్న ఈ ఘటన గుజరాత్లో చోటుచేసుకుంది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. అహ్మదాబాద్‌కు చెందిన బంగారం వ్యాపారి మెహుల్ ఠక్కర్‌కు ఇటీవల ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. తన పేరు ప్రశాంత్ పటేల్ అని, స్థానికంగా ఉన్న ఫలానా నగల దుకాణం మేనేజర్‌ను అంటూ పరిచయం చేసుకున్నాడు. ఆ దుకాణం మెహుల్‌కు తెలిసిందే కావడంతో ఆయన నిజమేననుకున్నాడు. పటేల్ 2.1 కిలోల బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపగా, కొంత బేరసారాల తర్వాత రూ.1.60 కోట్లకు డీల్ కుదిరింది. అతడిచి్చన సమాచారం మేరకు సెప్టెంబర్ 24వ తేదీన ఠక్కర్ తన మనుషులకు 2.1 కిలోల బంగారమిచ్చి పంపించారు. చెప్పిన ప్రకారం వాళ్లు ఓ హవాలా దుకాణానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ వీరి కోసం ముగ్గురు వ్యక్తులున్నారు. దుకాణంలోని నోట్ల లెక్కింపు మిషన్‌తో తీసుకువచి్చన 26 బండిళ్లలో ఉన్న నోట్లను లెక్కించడం మొదలైంది. తాము రూ.1.30 కోట్లే తెచ్చామని, మిగతా రూ.30 లక్షలు పక్కనే మరో దుకాణం నుంచి తెస్తామంటూ ముగ్గురిలో ఇద్దరు బంగారం బిస్కెట్లను తీసుకుని వెళ్లారు. అయితే, ఆ నోట్లపై మహాత్మా గాం«దీకి బదులు నటుడు అనుపమ్ ఖేర్ బొమ్మ ఉంది. రిజర్వు బ్యాంక్ ఇండియా స్థానంలో తప్పుగా ‘రెసోల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’అని ఉంది. ఠక్కర్ సిబ్బంది ఇదంతా గమనించి, అనుమానించారు. ఇదేమని, అక్కడే ఉన్న మూడో వ్యక్తిని ప్రశ్నించారు. కౌంటింగ్ మిషన్ తెమ్మంటే తెచ్చానే తప్ప, వారెవరో, ఆ నోట్ల విషయమేంటో నాకూ తెలియదు’అంటూ అతడు చావు కబురు చల్లగా చెప్పాడు. బంగారం బిస్కెట్లతో వెళ్లిన పెద్దమనుషులు తిరిగి రాలేదు. దీంతో, సిబ్బంది ఆ విషయాన్ని ఠక్కర్ చెవిన వేశారు. ఆయన గుండె ఆగినంత పనైంది..! ఇదేమిటని ఆరా తీయగా ఆ హవాలా దుకాణాన్ని రెండు రోజుల క్రితమే ఎవరో తెరిచారని తేలింది. దీంతో, మెహుల్ ఠక్కర్ తననెవరో బకరాను చేశారని గ్రహించి, నవ్‌రంగ్‌పుర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
ఓ తండ్రి ప్రేమ!
బిడ్డ కోసం రికార్డుల వేట నిమిషంలో 62 గుంజీలు రెండేళ్ల కుమారుడితో మరో సాహసం సైకిల్ వెనక్కి తొక్కించిన వైనం సికింద్రాబాద్ ఆర్పీ రోడ్డులోని గుజరాతీ ఉన్నతి పాఠశాల ఈ కృత్యానికి శనివారం వేదికైంది. నగరంలోని మల్కాజిగిరి వాణీనగర్‌కు చెందిన ఎలక్ట్రీషియన్ అమీర్ కె వడ్సరియా.... అతని రెండున్నరేళ్లకుమారుడు మేహుల్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు కోసం వినూత్న ప్రయోగం చేశారు. అమీర్ ఒక నిమిషంలో 62 గుంజీలు తీశాడు. మేహుల్ ఒక నిమిషంలో 50 మీటర్ల వరకు ట్రైసైకిల్‌ను రీవర్స్‌లో(వెనక్కి) తొక్కి అందరినీ ఆశ్చర్యపరిచారు. గతంలో అమీర్ గంట వ్యవధిలో ఉన్న 1100 గుంజీల రికార్డును... 1450 గుంజీలు తీసి బద్దలుకొట్టారు. శనివారం ఒక నిమిషంలో 62 గుంజీలు తీసి మరో రికార్డు నెలకొల్పారు. చికిత్స కోసమే.... గుజరాత్‌కు చెందిన అమీర్ ఎనిమిదేళ్ల క్రితం పొట్ట చేత పట్టుకొని...భార్యా పిల్లలతో నగరానికి వచ్చాడు. మల్కాజిగిరి ప్రాంతంలో ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తూ చాలీచాలని డబ్బులతో బతుకుబండిని లాగిస్తున్నాడు. అయిదేళ్లుగా పెద్ద కుమారుడు ఆమన్(8) కండరాల క్షీణత వ్యాధి (మస్క్యులర్ డిస్ట్రో)తో బాధ పడుతున్నాడు. కాళ్లు పూర్తిగా చచ్చుబడిపోయాయి. చికిత్స చేయించడానికి ఆర్థిక పరిస్థితులు సహకరించ లేదు. కొడుకు కోసమే గుంజీలు తీయడం ప్రారంభించానని... ఈ రికార్డు నెలకొల్పడం ద్వారా వచ్చే డబ్బుతో బిడ్డకు వైద్య సేవలు అందించవచ్చని ఈ ప్రయత్నం చేస్తున్నట్లు అమీర్ పేర్కొన్నాడు. తన చిన్న కుమారుడు మేహుల్ తోనూ ట్రై సైకిల్ రివర్స్‌లో తొక్కించడం ప్రారంభించానన్నాడు. వీటిని వీడియో తీసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుకు పంపిస్తానని తెలిపాడు. ఈ రూపంలో డబ్బు సమకూరితే బిడ్డ వైద్య సేవలకు ఉపయోగపడతాయని భావిస్తున్నట్లు చెప్పాడు. బిడ్డ కోసం తండ్రి...అన్న కోసం చిన్నారి చేసిన ఈ ప్రయోగాలు చూపరులను ఆకట్టుకోవడంతో పాటు...కదిలించాయి.