కందుల కొనుగోలును నిలిపేయొద్దు
ఎఫ్‌సీఐ ఎండీకి మంత్రి హరీశ్‌రావు ఫోన్
సాక్షి, హైదరాబాద్: కందుల కొనుగోలు ప్రక్రియను నిలిపి వేయరాదని... కొనుగోలు కేంద్రాలను కొనసాగించాలని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) ఎండీ త్రిపాఠీకి రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు సోమవారం విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు త్రిపాఠీకి ఫోన్ చేసి రాష్ట్రంలో కందుల దిగుబడి అధికంగా వచ్చిందని చెప్పారు. కొనుగోలు కేంద్రాలను మూసివేయకుండా, ఎఫ్‌సీఐ ఉన్నతా ధికారులతో సంప్రదింపులు జరిపి సమస్యను పరిష్కరించాలని ఢిల్లీలోనే ఉన్న శాఖ కార్యదర్శి పార్థసారథిని మంత్రి ఆదేశించారు. కందులు కొనుగోలు చేస్తున్న నాఫెడ్ సంస్థ ఎదుర్కొంటున్న ఖాళీ సంచుల కొరత పరిష్కారానికి మంత్రి చర్యలు తీసుకున్నారు.
ఆంధ్రపదేశ్ నుంచి 2.50 లక్షల ఖాళీ సంచులను తెప్పించినట్టు నాఫెడ్ తెలిపింది. మరో 5 లక్షల ఖాళీ సంచులు కూడా ఒకటి రెండు రోజుల్లో రానున్నట్టు నాఫెడ్ అధికారులు తెలిపారు. కాగా కొందరు ప్రైవేటు వ్యాపారులు రైతుల దగ్గర రూ. 4 వేలకు కొని ప్రభుత్వ రంగ సంస్థల కొనుగోలు కేంద్రాల దగ్గర మద్దతు ధర.. రూ.5,050కి అమ్ముతున్నట్లు వస్తున్న వార్తలపై మంత్రి స్పందించారు. వ్యాపారులు కొనుగోలు చేసిన కందులు రీసైక్లింగ్ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ డీజీ త్రివేదీని కోరారు. ఈ మేరకు అన్ని జిల్లాల ఎస్పీలకు, ఇతర అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని మంత్రి సూచించారు.