breaking news
Masan
-
ఇదేమి ‘కటింగ్’ బాబూ!
సౌత్‌వేల్స్: చిన్నపిల్లలు సాధారణంగానే హెయిర్ సెలూన్లో కటింగ్ చేసుకోవాలంటే మారాం చేస్తారు, గోల చేస్తారు, ఏడుస్తారు, నానాయాగి చేస్తారు. వారికి కటింగ్ చేయాలంటే సెలూన్ వాడికి కూడా తలప్రాణం తోకకొస్తుంది. ఆదే ఆటిజం(మెదడు సంబంధిత వ్యాధి)తో బాధపడుతున్న పిల్లలకు కటింగ్ చేయించాలన్నా, చేయాలన్నా దేవతలు దిగిరావాలి! ఈ బాధను భరించలేననుకొనే డెనైన్ డీవీస్ అనే ఓ తల్లి ఆటిజంతో బాధ పడుతున్న తన నాలుగేళ్ల కొడుకు మాసన్కు 18 నెలల నుంచి కటింగ్ చేయించలేదు. మాసన్ జుట్టు పిచ్చి పిచ్చిగా పెరిగిపోయింది. క్షణం కూడా నిలకడగా కూర్చోని మాసన్ నిద్రలో ఉన్నప్పుడు కొంచెం, కొంచెం జుట్టు కత్తిరించిన సందర్భాలు ఉన్నాయి. అయితే మేల్కొన్నాక మాసన్ తన జుట్టును చూసుకొని ఇల్లుపీకి పందిరేసేవాడట. సౌత్‌వేల్స్‌లోని పోర్ట్ టాల్బోట్‌లో నివసిస్తున్న డీ వీస్, చిన్న పిల్లలకు అతి నైపుణ్యంతో హేర్ కట్‌చేసే బార్బర్ కోసం వాకబు చేసింది. జేమ్స్ విలియమ్స్ అనే 26 ఏళ్ల బార్బర్ అందులో స్పెషలిస్ట్ అని తెలుసుకుంది. తన పార్టనర్ జామీ లెవీస్‌తో కలసి బాబును తీసుకొని ఓ రోజు ఆ బార్బర్ దగ్గరకు వెళ్లింది. ఆటిజమ్‌తో బాధపడుతున్న పిల్లలకు హేర్ కటింగ్ చేయడం అంత ఈజీ కాదని, ముందుగా వారితో చనువు పెంచుకోవాల్సి ఉంటుందని బార్బర్ విలియమ్స్ సూచించారు. వారికిచ్చిన మాట మేరకు బార్బర్ ప్రతిరోజు సెలూన్ తెరవడానికి ముందు ఆ బాలుడు ఇంటికెళ్లి బాలుడితో స్నేహం చేయడం ప్రారంభించారు. అలా ఒకరోజు ఇంటికొచ్చేసరికి బాలుడు నేలమీద పడుకొని తన తల్లి సెల్‌ఫోన్‌తో ఆడుకుంటున్నాడు. ఇదే మంచి సమయం అనుకున్న బార్బర్ విలియమ్స్ తాను కూడా బోర్లా నేలమీద పడుకొని బాలుడికి హేర్ కటింగ్ చేశారు. ఈ దృశ్యాలను మాసన్ తండ్రి లెవీస్ ఫొటోలుతీసి ఆన్లైన్లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలకు ఇప్పటివరకు 25వేల మంది లైక్స్ కొట్టగా, ఐదేవేల మంది షేర్ చేసుకున్నారు. ఒక్కసారిగా ఆన్లైన్ బార్బర్ విలియమ్స్ సెలబ్రిటిగా మారిపోయారు. తమ పిల్లలకు హెయిర్ కట్ చేయాలంటూ బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల నుంచి రిక్వెస్టులు పెరిగాయి. ముఖ్యంగా ఆటిజమ్‌తో బాధ పడుతున్న పిల్లల తల్లిదండ్రులే వారిలో ఎక్కువగా ఉన్నారు. ‘నా వృత్తిని నేను నిర్వహించాను. ఇందులో గొప్పతనమేమి లేదు. కాకపోతే ఊహించని విధంగా డిమాండ్ పెరగడం ఆనందంగా ఉంది’ అని బార్బర్ వ్యాఖ్యానించారు. కటింగ్ అనంతరం అద్దంలో తన ముఖం చూసుకున్న మాసన్ అసలు ఏడ్వకపోగా తనపని ముగించుకొని వెళుతున్న బార్బర్ విలియమ్స్ వద్దకు వెళ్లి బుగ్గ మీద ముద్దు కూడా పెట్టుకున్నాడని తల్లీ డీవీస్ మురిపింగా తెలిపింది. బార్బర్‌కు థాంక్స్ తెలిపింది. -
అంతగా నచ్చింది మరి!
‘సల్మాన్‌ఖాన్ బ్యానర్లో నటించే అవకాశం మిస్ అయిందట కదా... ఏడ్వక ఏంచేస్తుంది!’ అనుకోవద్దు. పరిణీతి చోప్రా ఏడ్చింది నిజంగా అందుకు కాదు. అంతకుముందే ఆమె ‘మసాన్’ సినిమా చూసింది. సినిమా చూస్తున్నప్పుడు భావోద్వేగానికి లోనై గట్టిగా ఏడ్చేసింది. పక్క సీటు వాళ్లు సినిమా చూడడం మాని, పరిణీతిని ఊరడించడానికే తమ సమయాన్ని కేటాయించారట. కొందరైతే ‘ఇదెక్కడి గోలరా బాబు’ అని వెనక సీట్లోకి పారిపోయారట. ‘‘ఎవరినీ డిస్టర్బ్ చేయడానికి నేను ఏడవలేదు. ఒకటి మాత్రం కచ్చితంగా చెప్పగలను... ఆ సినిమా చూసి ఏడవకుండా ఎవరూ ఉండలేరు’’ అని చెప్పింది పరిణీతి. అంతర్జాతీయంగా ఎన్నో అవార్డులను అందుకున్న ‘మసాన్’ సినిమా పరిణీతిని ఎంతో ఆకట్టుకుందట. అందుకే ‘‘ఈ సినిమాను ప్రతి ఒక్కరు తప్పనిసరిగా చూడాలి’’ అని అందరితోనూ చెబుతోంది. మ్యాటర్ అక్కడితో ఆగిపోలేదు... తాజా విషయం ఏమిటంటే ఈ సినిమా దర్శకుడు నీరజ్ గైవాన్ను పరిణీతి పొగడ్తలతో ముంచెత్తిందట. అంతేకాదు... ‘‘మీ నెక్స్ట్ ప్రాజెక్ట్‌లో నాకు అవకాశం ఇవ్వండి. ఎంత చిన్న పాత్ర అయినా చేస్తాను’’ అని నోరు విప్పి అడిగిందట. అటు నుంచి ఎలాంటి రిప్లై వచ్చిందనేది తరువాత విషయంగానీ... భావోద్వేగంలో పూర్తిగా మునిగిపోవడం వల్లే పరిణీతి ఆ మాట అన్నదని, నిజానికి పాత్ర, పారితోషికం విషయంలో ఎలాంటి రాజీ పడదని ఆమె గురించి తెలిసినవాళ్లు చాటుమాటుగా అంటున్నారు. వింటున్నారా నీరజ్!