బదిలీలపై ఉత్కంఠ
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : గత ఎన్నికల్లో ఎంపీడీవోలను బదిలీ చేసిన దాఖలాలు లేవు. ఈ సారి బదిలీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 10లోగా బదిలీలు పూర్తి చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలున్నాయి. దీంతో గడువు ముంచుకొస్తున్నా ఎంపీడీవోల బదిలీల విషయంపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావడం లేదు. ఒక పక్క ఎన్నికల నేపథ్యంలో చేపట్టనున్న బదిలీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నా, ప్రభుత్వం మాత్రం బదిలీల విషయంపై ముందుకు వెళ్తొంది.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ అధికారులు బదిలీకి మార్గదర్శకాలు జారీ చేశారు. పోలీస్, రెవెన్యూ, ఎంపీడీవోల బదిలీకి సంబంధించిన వివరాలు అందజేయాలని అందులో పేర్కొన్నారు. జిల్లాలో ఒకేచోట మూడేళ్లు పనిచేస్తున్న ఎంపీడీవోలతోపాటు జిల్లా, జిల్లాయేతర ఎంపీడీవోలను బదిలీ చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. జిల్లాకు సంబంధించిన 25 మంది ఎంపీడీవోలు బదిలీ అయ్యే అవకాశాలున్నాయి.
హైకోర్టును ఆశ్రయించిన వైనం..
ఎన్నికల నేపథ్యంలో చేపడుతున్న బదిలీలపై ఎంపీడీవోలు అసంతృప్తితో ఉన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు బదిలీ చేపట్టడంతో అసహానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే న్యాయం కోసం వారు హైకోర్టును ఆశ్రయించారు. ఎక్కువగా రెవెన్యూ, పోలీస్ అధికారులకు బదిలీ చేయాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల్లో ప్రత్యక్షంగా బాధ్యతలు చేపట్టని తమను బదిలీ చేయడం అన్యాయమని, కేవలం జోనల్ అధికారులుగా నియమించే తమకు బదిలీ చేయడం సమంజసం కాదని ఎంపీడీవోల సంఘం నాయకులు పేర్కొంటున్నారు.
ఈ బదిలీలపై ఎంపీడీవోల సంఘం రాష్ట్ర శాఖ తరఫున హైకోర్టును ఆశ్రయించారు. కాగా, శుక్రవారం హైకోర్టులో ఎంపీడీవోల తరుఫున న్యాయవాదుల వాదనలను వినే అవకాశం ఉంది. ఎంపీడీవోల సంఘం నాయకులు హైకోర్టును ఆశ్రయించడంతో వారికి సంబంధించిన ఎలాంటి బదిలీ ఉత్తర్వులు అందలేదని, మరో మూడు రోజుల్లో రానున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.