breaking news
love Wedding
-
మధురిమలు పంచుకోండి.. మధురంగా..
ఒక గులాబీ.. ఒక చాక్లెట్.. ఒక గ్రీటింగ్ కార్డ్.. ఒక కేక్.. ఒక గిఫ్ట్.. ప్రేమికుల రోజును ఇలాంటి వాటితో ఆరంభించండి.. మీకు ప్రియమైన వారిపై మీకున్న ప్రేమను తెలియజేయండి. రోజూ చూపే ప్రేమను ఇది ఎన్నో రెట్లు ఎక్కువగా చేస్తుంది. ఈ అనుభూతి మరింత మధురానుభూతులను మీ జీవితంలో నింపుతుంది. నచ్చిన ఆట.. కలిసి ఆడండి. ఉదాహరణకు చెస్, క్యారమ్స్ వగైరా.. ఏదైనా.. ఆ ఆట ఇద్దరి మధ్య బంధాన్ని మరింత పెంచుతుంది. సాక్షి, పశ్చిమగోదావరి డెస్క్: ప్రేమ అనేది ఓ మధుర భావన. ఇది మనసులను కలుపుతుంది.. మనుషులను దగ్గర చేస్తుంది. ప్రేమతో జీవించడం.. జీవితంలోని మాధుర్యాన్ని మన దరి చేరుస్తుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నవారైనా.. పెళ్లి తర్వాత ప్రేమించుకుంటున్నవారైనా.. అంతిమంగా తమ భాగస్వామిపై చూపే ప్రేమే వారి జీవిత గమనాన్ని మధురంగా మారుస్తుంది. మరి ఇలాంటి జంటలు ఈ ఏడాది ప్రేమికుల రోజును ఎలా జరుపుకోవాలనే దానిపై ఆలోచిస్తుంటే.. వారికి నెటిజన్లు అనేక సూచనలు అందిస్తున్నారు. వాటిలో కొన్ని ఖర్చుతో కూడుకున్నవి కాగా.. మరికొన్ని తక్కువ వ్యయంతో ప్లాన్ చేసుకోదగినవి. అసలు ఖర్చే అవసరం లేనివి కూడా ఇందులో ఉన్నాయి. వాటిలో తమకు ఉత్తమంగా అనుకున్నవి.. సాధ్యమయ్యేవి ప్లాన్ చేసుకుని సెలబ్రేట్ చేసుకుంటే.. ఆ మాధుర్యాన్ని ఎప్పటికీ మరిచిపోలేరని కూడా చెబుతున్నారు. ఇవి నెట్టింట చాలా ఎక్కువమందిని ఆకట్టుకుంటుండటం విశేషం. అవేంటో తెలుసుకోవాలనే ఆసక్తి ఉందా.. అయితే.. ఇవి మీకోసమే.. ► మీకు ఇష్టమైన పాటలను కలిసి ఎంచుకోండి. మీ సంబంధాన్ని గుర్తుచేసే, మీ భాగస్వామికి ఎక్కువగా ఇష్టమైన పాటలకు అందులో ప్రాధాన్యత ఇవ్వండి. వాటిని మీ ప్లే లిస్ట్‌లో ఉంచేందుకు సమయం కేటాయించండి. ► ఇద్దరూ కలిసి ఒకరోజు గడపడంలో ఉత్తమమైన మార్గాల్లో మరొకటి.. స్వచ్ఛంద సేవ. ఇతరులకు స్వయంగా సేవ చేయడం మీరు ఒకరికొకరు మరింత కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. ► మీ సొంత ప్రాంతంలో పర్యాటకులుగా మారండి. మీ పట్టణంలో ఏదైనా ప్రసిద్ధమైన ప్రాంతాన్ని లేదా మీరు ఎప్పుడూ చూడని మ్యూజియాన్ని సందర్శించండి. ఫొటోగ్రాఫర్లుగా మారి నచ్చిన విధంగా ఫొటోలు తీయండి. ► మీ ఇద్దరి తీపి గుర్తులను కలిపి ఒక విలువైన పుస్తకంగా రూపొందించండి. లవ్ లెటర్లు, దుస్తులు, చేతి రుమాళ్లు, బహుమతులు, ఫొటోలు, పాత సినిమా టికెట్లు, గుర్తుగా దాచుకున్నవాటిని సేకరించి దీనిని తయారుచేయండి. ► డ్రైవ్ కోసం వెళ్లండి.. కారు లేదా బైక్ ఫుల్ ట్యాంకు చేయించండి. ఇది కొంత ఖర్చుతో కూడుకున్నది కావచ్చు. అయినా ఇది మీరు వెళ్లే కొత్త ప్రాంతంలో సరికొత్త అనుభూతులను కలిసి ఆస్వాదించేందుకు ఉపకరిస్తుంది. ► ఇద్దరూ కలిసి మీ ప్రేమకు సింబాలిక్‌గా ఉండేలా గోడకు తగిలించే లేదా వేలాడదీసే ఒక ఆహ్లాదకరమైన కళాత్మక వస్తువును రూపొందించండి. దానిని మీరు నిత్యం సంచరించే ప్రాంతంలో ఏర్పాటు చేయండి. ► ఒకరికొకరు ప్రేమలేఖలు రాసుకోండి. ఇంతకుముందే రాసిన అనుభూతులు ఉన్నప్పటికీ.. ఇప్పుడు కొత్తగా ప్రయత్నించండి. మీ భాగస్వామి మీకు ఎందుకు ప్రత్యేకమైన వారో అందులో పొందుపరచండి. మీ భాగస్వామిలోని ఏ లక్షణాలను మీరు ఎక్కువగా ఆరాధిస్తారో, వారు మిమ్మల్ని ఎలా భావిస్తారో, మీరు వారితో ఎందుకు ప్రేమలో పడ్డారో ఆ లేఖలో తెలియజేయండి. ► ఇద్దరికీ ఇష్టమైన రొమాంటిక్ సినిమాలు చూడండి. పాప్‌కార్న్ వంటి స్టఫ్ కూడా అందుబాటులో పెట్టుకోండి. ► ఇద్దరూ కలిసి ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించండి. అది వంటకం కావచ్చు.. డ్యాన్స్ కావచ్చు.. మరేదైనా కావచ్చు. ► కలిసి యోగా లేదా వ్యాయామం సాధన చేయండి. ఆ సమయాన్ని ఆస్వాదించండి. ► ట్రెజర్ హంట్ (నిధి వేట) లాంటి ఆసక్తికరమైన ఆట ఎంచుకోండి. మీ భాగస్వామికి ఇచ్చేందుకు తీసుకొచ్చిన ప్రేమికుల రోజు బహుమతిని దాచి ఉంచండి. దానిని కనుగొనడానికి ఆధారాలు రూపొందించి దానిని కనిపెట్టాలని సూచించండి. ► ప్రేమకు సూచిక అయిన హార్ట్ సింబల్లో ఆహారాన్ని కలిసి తయారు చేయండి. చపాతీ, పిజ్జా, ఆమ్లెట్, కేక్.. ఇలా మీ ఊహ మేరకు ప్రయత్నించండి. లేదంటే హార్ట్ సింబల్ ఆకారంలో కేక్‌కి ఆర్డర్ ఇవ్వండి. ► ఇద్దరూ కలిసి షాపింగ్‌కు వెళ్లండి. ఒకరి కోసం ఇంకొకరు ఇష్టమైన వస్తువును కొనడానికి ప్రయత్నించండి. ► ఇద్దరూ కలిసి పెయింట్ చేయండి. మీరు పెయింటర్లు కాకపోవచ్చు.. అయినా ఇద్దరూ కలిసి ఒక సొంత కళాఖండం రూపొందించడానికి ప్రయత్నించండి. అది తప్పనిసరిగా సరికొత్త అనుభూతులను పంచుతుంది. ► ఇద్దరూ కలిసి అందమైన పూలతోటను సందర్శించడానికి ప్రయత్నించండి. కనీసం మీకు సమీపంలోని నర్సరీకి వెళ్లి ప్రేమికుల రోజుకు గుర్తుగా ఒక మొక్క కొనుగోలు చేయండి. అద్భుతమైన ఫొటోలూ తీసుకోండి. ► రాత్రి భోజనం కలిసి వండండి. ఒక సూపర్ బిజీ రెస్టారెంట్లో తినడానికి బయటకు వెళ్లడం కంటే ప్రత్యేకంగా ఇంట్లో వండిన భోజనం చాలా రొమాంటిక్‌గా ఉంటుంది. మీలో ఒకరికి చెఫ్‌కి సమానమైన నైపుణ్యాలు లేకపోయినా, మీరు ఇద్దరూ ఆనందించే చిరస్మరణీయమైన విందును చేయవచ్చు. ► ఒక గులాబీ.. ఒక చాక్లెట్.. ఒక గ్రీటింగ్ కార్డ్.. ఒక కేక్.. ఒక గిఫ్ట్.. ప్రేమికుల రోజును ఇలాంటి వాటితో ఆరంభించండి.. మీకు ప్రియమైన వారిపై మీకున్న ప్రేమను తెలియజేయండి. రోజూ చూపే ప్రేమను ఇది ఎన్నో రెట్లు ఎక్కువగా చేస్తుంది. ఈ అనుభూతి మరింత మధురానుభూతులను మీ జీవితంలో నింపుతుంది. ► నచ్చిన ఆట.. కలిసి ఆడండి. ఉదాహరణకు చెస్, క్యారమ్స్ వగైరా.. ఏదైనా.. ఆ ఆట ఇద్దరి మధ్య బంధాన్ని మరింత పెంచుతుంది. -
సీఏ విద్యార్థిని అనుమానాస్పద మృతి
గుణదల (విజయవాడ తూర్పు) : ప్రేమ వివాహం జరగకపోగా ప్రియుడు తన నుంచి దూరమయ్యాడనే మనస్తాపంతో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ ఘటన విజయవాడలోని మాచవరం పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు.. కృష్ణాజిల్లా తిరువూరు మండలం, రాజుగూడెం గ్రామానికి చెందిన చెరుకూరి సింధు (29) గుణదల గంగిరెద్దుల దిబ్బ ప్రాంతంలో ఉంటోంది. సీఏ చదువుకుంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. కొంతకాలంగా ప్రసేన్ అనే యువకుడితో సన్నిహితంగా ఉంటోంది. వారిద్దరి స్నేహం ప్రేమగా మారింది. కానీ, ప్రసేన్ కుటుంబ సభ్యులు వారిద్దరి ప్రేమ వివాహానికి నిరాకరించారు. సింధు తల్లిదండ్రులు కూడా వ్యతిరేకించడంతో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. మరోవైపు.. సింధు, ప్రసేన్ మధ్య కూడా మనస్పర్థలు ప్రారంభమయ్యాయి. దీంతో సింధు విజయవాడ గుణదల ప్రాంతానికి వచ్చి ఒంటరిగా ఉంటోంది. అటు సొంత కుటుంబ సభ్యులు, ఇటు ప్రేమించిన వ్యక్తి దూరం కావడంతో ఆమె మానసిక క్షోభకు గురైంది. ఈ నేపథ్యంలో.. జీవితంపై విరక్తి చెంది తాను ఉంటున్న గదిలోనే ఫ్యానుకు చీరతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. రెండ్రోజులుగా సింధు ఉన్న గది తలుపులు మూసి ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి తల్లిదండ్రులు విజయవాడ చేరుకుని విగతజీవిగా ఉన్న కుమార్తెను చూసి కన్నీరుమున్నీరయ్యారు. ప్రసేనే పొట్టన పెట్టుకున్నాడు తన కూతురు ఉరి వేసుకుని చనిపోయేంత పిరికి వ్యక్తి కాదని.. ప్రేమ పేరుతో మోసం చేసిన ప్రసేనే తన కుమార్తెను పొట్టన పెట్టుకున్నాడని సింధు తండ్రి వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండ్రోజుల క్రితమే ఈ ఘటన జరిగి ఉంటుందని ఆయనన్నారు. సింధు మృతదేహాన్ని పోలీసులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరోవైపు.. సింధు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటే తాను ఉరికి వేలాడకుండా నేలపై ఎలా పడిఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే, సింధు తలభాగం నుంచి రక్తం కారడంతో ప్రసేన్ హత్యచేసి ఉంటాడా అన్న కోణంలో కూడా దర్యాప్తు ప్రారంభించారు. -
ఈ పెళ్లికి.. పోలీసులే అతిథులు
మైసూర్: కర్ణాటకలోని మైసూర్ నగరంలో సోమవారం ఓ వివాహం జరిగింది. వధూవరులిద్దరూ ఎంబీఏ గ్రాడ్యుయేట్లు. ఈ పెళ్లికి పోలీసులే అతిథులు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో పాటు భారీ సంఖ్యలో పోలీసులు వచ్చారు. విషయం ఏంటంటే.. ఇది ప్రేమ వివాహం. అందులోనూ మతాంతర వివాహం. ఇరు కుటుంబాలు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. హిందూ సంస్థ కార్యకర్తలు మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది లవ్ జిహాద్ అంటూ నిరసనకు దిగారు. దీంతో ఈ పెళ్లికి భద్రత కల్పించేందుకు భారీగా పోలీసులు తరలివచ్చారు. వధూవరులు ఆషిత, షకీల్లది మాండ్య. వీరి పెళ్లిని వ్యతిరేకిస్తూ వీహెచ్‌పీ కార్యకర్తలు వధువు ఇంటిముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ పెళ్లి లవ్ జిహాద్ అని, వరుడు షకీల్ వివాహం ద్వారా ఆషితను మతమార్పిడికి ప్రేరేపిస్తున్నాడని మండిపడ్డారు. ప్రేమ అయితే తమకు అభ్యంతరం లేదని, మతమార్పిడికి కుట్ర అని ఆరోపించారు. వీరి ఆరోపణలను వధూవరుల తల్లిదండ్రులు ఖండించారు. 'భారత్‌లో అందరూ సమానం. నిరసనకారులకు ఈ పెళ్లి ఓ సందేశం. వారు అర్థం చేసుకోవాలి' అని వధువు తండ్రి డాక్టర్ నరేంద్ర బాబు అన్నారు. ఈ పెళ్లి తమకు అమిత సంతోషాన్ని కలిగిస్తోందని వరుడు తండ్రి ముక్తర్ అహ్మద్ చెప్పారు. చిన్నప్పటి నుంచి ఆషిత, షకీల్‌లకు పరిచయం ఉంది. మాండ్యలో వీరి కుటుంబాలు పక్కపక్కన ఉంటున్నాయి. స్కూల్ నుంచి కాలేజీ వరకు ఇద్దరూ క్లాస్ మేట్స్. 12 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. ఆషిత, షకీల్‌కు వివాహం నిశ్చయమైందని తెలిసిన వెంటనే హిందూమత కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసులు ఇటీవల ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ రోజు భారీ భద్రత మధ్య మైసూరులో పెళ్లి చేసుకున్నారు.