breaking news
Lalu prasadyadav
-
లాలూ ప్రసాద్ రాయని డైరీ
కాలం కలిసి రాకపోతే స్నేహితులు చెయ్యిస్తారు. శత్రువులు సలహాలు ఇస్తారు. సుశీల్‌కుమార్ మూడు రోజులుగా ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు. ‘లాలూజీ, ఈ వరదల్లో ర్యాలీ ఎందుకు? పోస్ట్‌పోన్ చేసుకోండి’ అని సలహా ఇచ్చి వెళుతున్నాడు. వస్తాడు. సలహా ఇస్తాడు. వెళతాడు. టీ తాగి వెళ్లమంటే తాగడు. ‘బాగుండదు లాలూజీ’ అంటాడు! ‘ఏం బాగుండదు సుశీల్‌జీ’ అని అడిగితే.. ‘వరదల్లో ర్యాలీ బాగుండదు’ అంటాడు తప్ప, ‘మీ ఇంట్లో టీ తాగానని నితీశ్ కుమార్‌కు తెలిస్తే బాగుండదు’ అని మాత్రం అనడు. ‘‘డిప్యూటీ సీఎంగా తాగకండి సుశీల్‌జీ. పాట్నా యూనివర్సిటీలో మనకు ఓల్డ్ ఫ్రెండ్షిప్ ఉంది కదా. అప్పటి ఫ్రెండ్షిప్ అనుకుని తాగండి’’ అన్నాను.. మొన్న మళ్లీ ఇంటి బయట తచ్చాడుతున్నప్పుడు. సుశీల్ ఇబ్బంది పడ్డాడు. ‘మన మధ్య ఓల్డ్ ఫ్రెండ్షిప్ మాత్రమే కాదు లాలూజీ, ఓల్డ్ రైవల్రీ కూడా ఉంది’’ అన్నాడు. నాపై దాణా కేసు వేసి, నన్ను జైలుకు పంపింది అతడే! పెద్దగా నవ్వి, ‘తాగండి సుశీల్‌జీ’ అని, గోడ ఇవతలి నుంచి టీ కప్పు అందించాను. అందుకున్న కప్పుని వెంటనే పిట్టగోడ మీద పెట్టి, ‘బాగుండదు లాలూజీ’ అన్నాడు సుశీల్. ‘‘ఏం బాగుండదు సుశీల్‌జీ’’ అని అడిగాను. ‘‘వరదల్లో ర్యాలీ బాగుండదు లాలూజీ’’ అన్నాడు. ‘‘ఎందుకు బాగుండదు సుశీల్‌జీ’’ అని అడిగాను. ‘‘ప్రధాని ఏరియల్ సర్వేకి వస్తున్నప్పుడు, ప్రధానికి వ్యతిరేకంగా మీరు నడుపుతున్న ర్యాలీ బాగుండదు లాలూజీ’’ అన్నాడు. ‘‘సుశీల్‌జీ.. బిహార్‌కు మోదీ కొత్త కానీ, వరదలు కొత్త కాదు. పదిహేనులో వరదలు వచ్చాయి. మోదీ రాలేదు. పదహారులో వరదలు వచ్చాయి. మోదీ రాలేదు. అప్పుడు రాని మోదీ, ఇప్పుడొస్తున్నారు! మేం ర్యాలీ పెట్టుకున్నాం కదా.. దానికి ఒక రోజు ముందు వస్తున్నారు.. డైవర్ట్ చెయ్యడానికి’’ అన్నాను. సుశీల్ వెళ్లిపోయాడు. మళ్లీ రాలేదు. శనివారం ఏరియల్ సర్వేకి మోదీ వచ్చాడు, వెళ్లాడు. ర్యాలీకి వస్తానన్నవాళ్లే ఇంకా రాలేదు! సోనియాజీకి ఒంట్లో బాగోలేదు. రాహుల్ బాబు ఇంట్లో లేడు. మాయావతి రానన్నారు! ములాయం హ్యాండిచ్చారు. సి.సి.ఎం. నోరెత్తడం లేదు. ఫరూక్ ఫోన్ తియ్యడం లేదు. శరద్ యాదవ్ సైలెంట్ అయిపోయాడు. వీళ్లెవరూ లేకుండా పట్నా గాంధీ మైదాన్‌లో ‘బీజేపీ భగావో, దేశ్ బచావో’ అని నేను, నా ఇద్దరు కొడుకులు మైకు పట్టుకుని ఎంత అరిస్తే మాత్రం.. దేశ ప్రజలకు వినిపిస్తుందా?! బలం చూపిద్దాం అనుకుంటే బలహీనతలు బయటపడేలా ఉన్నాయి! -మాధవ్ శింగరాజు -
ఈ ముగ్గురు పోటీ చేయలేదు
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌యాదవ్, జేడీయూ కీలక నేత, మహా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి నితీశ్ కుమార్, బీజేపీ సీనియర్ నేత, రాష్ట్రంలో పార్టీ ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్న సుశీల్ కుమార్ మోదీల మధ్య ఈ ఎన్నికలకు సంబంధించి ఓ సారూప్యం ఉంది. ఈ ముగ్గురు ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. తమతమ పార్టీల తరఫున రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం సాగించారు. దాణా కుంభకోణంలో దోషిగా తేలడంతో లాలూ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోయారు. 2004లో నలంద నుంచి లోక్‌సభకు పోటీ చేసిన నితీశ్.. ఆ తరువాత ఏ ప్రత్యక్ష ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. శాసనమండలి సభ్యుడిగా సీఎం పదవి చేపట్టారు. బిహార్ పీసీసీ అధ్యక్షుడు అశోక్ చౌధరి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మంగళ్ పాండే కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం విశేషం.