ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌ల ప్రేమాయణం
కుంచనపల్లి (తాడేపల్లి రూరల్): మండలంలోని కుంచనపల్లిలో ఓ యువకుడి ప్రేమాయణం సినిమా స్టోరీని తలపించింది. ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లతో కొనసాగుతోంది. కుంచనపల్లికి చెందిన ఓ యువకుడు ఇంటి పక్కనే ఉండే యువతి ప్రేమించాడు. ఆమె కూడా అతడిని ఇష్టపడింది. వీరి మధ్య కొంతకాలం ప్రేమాయణం సాగింది.
కట్ చేస్తే..
అదే గ్రామానికి గుంటూరు నుంచి ఓ కుటుంబం వలస వచ్చింది. ఆ కుటుంబంలోని యువతిపై ఆ యువకుడి కన్ను పడింది. ఆమెకు కూడా ప్రేమ కబుర్లు చెప్పి మొత్తానికి మనసు దోచుకున్నాడు. వీరిద్దరి వ్యవహారం పెద్దల వరకు చేరింది. అయితే ఈ పెద్దోళ్లు వారి మనసులను అర్థం చేసుకున్నారు. వేరు వేరు సామాజిక వర్గాలైనప్పటికీ పిల్లల ఇష్టాలను గౌరవించారు. ప్రేమికులిద్దరినీ ఈ నెల రెండో తేదీన పెళ్లిపీటలు ఎక్కించారు.
ఇదిగో ట్విస్ట్
ఆ పెళ్లినాటి జ్ఞాపకాల దొంతరలు ఆ పెళ్లి కుమార్తె ఊసుల్లో కదిలాడుతుండగానే ఆ యువకుడు పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. పెళ్లికి ముందు ప్రేమించిన యువతిని తీసుకొని గురువారం పరారయ్యాడు. యువకుడి తల్లిదండ్రులు తమ కొడుకు కనిపించడం లేదని పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది. ప్రస్తుతం ఆ యువకుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. అయితే యువకుడి అత్తామామలు మాత్రం అల్లుడిపై కేసులేమీ వద్దు..మాకు అప్పగిస్తే చాలు అంటున్నారు. చివరకు పోలీసులు ఈ కథకు ఎలాంటి ముగింపు ఇస్తారో చూడాలి.