breaking news
Kumamoto
-
కూలిన జపాన్ ఆర్మీ హెలికాప్టర్..10 మంది గల్లంతు
టోక్యో: జపాన్ దక్షిణ దీవుల్లో కుమమోటో నుంచి నిఘా విధుల్లో భాగంగా గురువారం బయలుదేరిన బ్లాక్‌హాక్ రకం హెలికాప్టర్ 10 నిమిషాల అనంతరం రాడార్ నుంచి అదృశ్యమైంది. అది మియాకో, ఇరాబు మధ్య సముద్రజలాల్లో కూలి ఉంటుందని భావిస్తున్నారు. ఆ హెలికాప్టర్‌కు చెందిన లైఫ్‌బోట్‌ను, ఒక తలుపు, తదితర భాగాలను శుక్రవారం సహాయక సిబ్బంది కనుగొన్నారు. హెలికాప్టర్‌లోని డివిజన్ కమాండర్ సహా 10 మంది సిబ్బంది కోసం గాలింపు కొనసాగుతోంది. వీరిలో ఎవరూ ప్రాణాలతో ఉండేందుకు అవకాశం లేదంటూ జపాన్ రక్షణ మంత్రి యసుకాజు హమదా శుక్రవారం మీడియా సమావేశంలో కన్నీటి పర్యంతమయ్యారు. వారికోసం గాలింపు కొనసాగిస్తామన్నారు. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటుందని చెప్పారు. నష్టాన్ని అంచనా వేసే పనిలో నిమగ్నమైనట్లు చెప్పారు. చైనా నుంచి ఎదురవుతున్న భద్రతా పరమైన సవాళ్ల నేపథ్యంలో జపాన్ ప్రభుత్వం ఇటీవలి కాలంలో రక్షణ సన్నద్ధత కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే హెలికాప్టర్ ప్రమాదానికి గురికావడం గమనార్హం. -
తప్పుడు సమాచారం పోస్ట్ చేస్తే అంతే..
కుమమోటో భూకంపం జపాన్ ను కుదిపేసిన విషయం తెలిసిందే. అటువంటి ప్రకృతి బీభత్సాలు జరిగినప్పుడు జనం ఏ వార్త విన్నా నమ్మే అవకాశం ఉంటుంది. అదే అదనుగా తీసుకున్న ఓ వ్యక్తి.. ఓ కాల్పనిక కథను సృష్టించి ఫోటోతోపాటు ట్విట్టర్ లో పోస్టు చేసి అరెస్టయ్యాడు. ఆన్ లైన్లో అసత్య కథనాలు పోస్టు చేస్తే శిక్షతప్పదని జపాన్ పోలీసులు మరోసారి నిరూపించారు. కుమమోటో భూకంపం తర్వాత ట్విట్టర్లో రూమర్లు పోస్టు చేసిన వ్యక్తిని అరెస్టు చేశారు. కనాగావాకు చెందిన 20 ఏళ్ళ వ్యక్తి.. ట్విట్టర్ లో ఓ సింహం చిత్రాన్ని పోస్ట్ చేసి, అది కుమమోటో వీధుల్లో తిరుగుతున్నట్లు చెప్పి జనాన్ని నమ్మించాడు. ఏప్రిల్ 14న కుమమోటోలో సంభవించిన వినాశకరమైన భూకంపం తర్వాత.. అసలే ప్రాణభయంతో ఉన్న ప్రజలను వీధుల్లో సింహం తిరుగుతోందన్న పుకారు నిజంగానే భయభ్రాంతులకు గురి చేసింది. భూకంపం ప్రభావంతో జ్యూ నుంచి తప్పించుకున్న సింహం.. కుమమోటోలోని మా ఇంటి దగ్గరలో కనిపించింది అంటూ ఓ సింహం చిత్రాన్ని పోస్టు చేయడంతోపాటు.. తన పోస్టుకు టైటిల్ కూడా పెట్టాడు. ఇంకేముందీ అసలే భూకంపం భయంతో వణికిపోతున్న ప్రజలు.. అతడు పోస్ట్ చేసిన ట్వీట్ ను 17000 సార్లు రీ ట్వీట్ చేయడంతోపాటు... కుమమోటో జ్యూ అండ్ బొటానికల్ గార్డెన్ కు వందలకొద్దీ ఫోన్లు చేసి, తప్పించుకున్న సింహం గురించి ఆరా తీశారు. ట్విట్టర్ పోస్టుతో సింహం వార్త కలకలం సృష్టించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. సింహం వార్త పోస్టు చేసిన వ్యక్తి గురించి ఆరా తీశారు. చివరికి అదంతా తప్పుడు సమాచారం అని నిర్థారించారు. అతడు పోస్టు చేసిన ఫోటో.. సౌత్ ఆఫ్రికా కు చెందిన ఓ చిత్రంలోని దృశ్యంగా తెలుసుకున్నారు. ప్రాక్టికల్ జోక్ వేసి జనాల్ని భయపెట్టినందుకు సదరు వ్యక్తిని అరెస్టు చేశారు. పుకార్లు పుట్టించేవారిని అరెస్టు చెయ్యడం బహుశా ఇదే మొదటిసారి అని స్థానిక మీడియా చెప్తోంది. నిజానికి అటువంటి పుకార్లు పోస్టు చేయడం ఒక్కోసారి తీవ్ర నష్టాన్ని కలిగించే అవకాశం ఉందని, అదీ ఇంటర్నెట్, వెబ్ సైట్లలో పోస్టు చేసే వార్తలు ఒక్క జపాన్ వరకే పరిమితం కాక, ప్రపంచం దృష్టి సారిస్తాయన్న కారణంతో మరోసారి ఎవ్వరూ అటువంటి తప్పు చేయకుండా ఉండేందుకు సదరు వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అసత్య కథనాల ప్రచారం ఎవరు చేసినా శిక్ష తప్పదని తెలిసేలా చేశారు.