breaking news
Konijeti sai sri lakshmi
-
కష్టపడి కాదు.. ఇష్టపడే
కైకలూరు : తమ బిడ్డలు ఎంతో ఉన్నతస్థానానికి ఎదగాలని తల్లిదండ్రులు కలలు కనడం సహజమే. అయితే వారి ఆశలను నిజం చేసే క్రమంలో ఎంత కష్టాన్నయినా ఇష్టంగా మలచుకుని విజయం సాధించే బిడ్డలు అరుదుగా ఉంటారు. ఆ కోవలోకే వస్తుంది కైకలూరుకు చెందిన కొణిజేటి సాయిశ్రీలక్ష్మి. పదిలో నియోజకవర్గ ఫస్ట్, ట్రిపుల్ ఐటీలో టాపర్, సీపీటీలో ఆలిండియా 6వ ర్యాంకు, ఐపీసీసీలో సౌత్ ఇండియా ఫస్ట్, సీఎంఏలో ఆల్ఇండియా ఫస్ట్, ఇప్పుడు ఐసీడబ్ల్యూఏ ఆలిండియా ఫస్ట్రాంకర్గా నిలిచి తన ప్రతిభ చాటుకుంది. ఓ చిన్న కిరాణ దుకాణంతో జీవనం సాగిస్తున్న తల్లిదండ్రుల ఆశలను వమ్ము చేయని చదువుల తల్లితో సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూ.... సాక్షి : ఆలిండియా ర్యాంకుల విజయ రహస్యం ఏంటి ? శ్రీలక్ష్మి: విజయ రహస్యం అంటూ ఏమీ లేదండి. నేను అందరిలోనూ ముందుండాలి అనే బలమైన కోరికే నన్ను ఈ స్థాయికి తెచ్చింది. చిన్నప్పటి నుంచి నాకు చదువంటే ఎంతో ఇష్టం. ఏకాగ్రతతో ఏదైనా సాధించవచ్చు. సాక్షి : టాపర్ స్థాయికి చేరుకోడానికి కారణం ఎవరు ? శ్రీలక్ష్మి: కైకలూరు నేషనల్ స్కూల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివాను. పదిలో 574 మార్కులు సాధించి నియోజకవర్గంలోనే మొదటి స్థానం సాధించాను. అప్పటి నుంచి వెనుదిరిగి చూడలేదు. నాకు స్కూలు విద్యాభ్యాసమే పునాది. సాక్షి : మీ భవిష్యత్తు లక్ష్యం ఏమిటీ ? శ్రీలక్ష్మి: ఐసీడబ్ల్యూఏ పూర్తి చేసి మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం చేయాలనుకుంటున్నాను. అదే విధంగా సివిల్స్‌లో విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. సాక్షి : మీ విజయ పరంపర వెనుక ఎవరున్నారు? శ్రీలక్ష్మి: మా తల్లిదండ్రులు పాండురంగారావు, నాగజ్యోతి సహకారం ఎప్పటికి మర్చిపోను. ఎంతోగానో నన్ను ప్రోత్సహించారు. అదే విధంగా విజయవాడ సూపర్‌విజ్‌లో అధ్యాపకులు గుప్తా మోటివేషన్ తరగతులు నన్ను ఎంతో ముందుకు తీసుకువెళ్లాయి. సాక్షి : ఆలిండియా ర్యాంకుల కైవసంపై మీ అనుభూతి ? శ్రీలక్ష్మి: ఎంతో సంతోషంగా ఉంది.. నేను కైకలూరులో పుట్టినందుకు గర్వపడుతున్నాను. మా తల్లిదండ్రులు, నా గ్రామానికి మంచి పేరు తీసుకురావడానికి మించిన సంతోషం ఏముంటుంది. నన్ను ఆదర్శంగా తీసుకోవాలని నాకు చదువు చెప్పిన ఉపాధ్యాయులే మిగతా విద్యార్థులకు చెప్పడం ఆనందాన్నిచ్చింది. సాక్షి : పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మీరిచ్చే సలహా ? శ్రీలక్ష్మి: మనం ఇష్టపడింది పొందాలంటే దాని కోసం ఖచ్చితంగా కష్టపడాలి. అయితే ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా మలచుకోవాలి. ఎంత సమయం చదివామన్నది ముఖ్యం కాదు, ఎంత వరకు అర్థం చేసుకున్నామనేది ముఖ్యం. విద్యార్థులు లక్ష్యం ఎన్నుకుని, ప్రణాళికతో సాధన చేస్తే విజయం తథ్యం. -
ఐసీడబ్ల్యూఏలో మెరిసిన తెలుగు తేజాలు
ఇంటర్, ఫైనల్లో ఫస్ట్‌ర్యాంకర్లు తెలుగువారే ఇద్దరూ కృష్ణాజిల్లాకు చెందిన వారే విజయవాడ (లబ్బీపేట): కోల్‌కతాలోని ఐసీడబ్ల్యూఏ చాప్టర్ సోమవారం ప్రకటించిన ఇంటర్, ఫైనల్ పరీక్ష ఫలితాల్లో తెలుగు తేజాలు మెరిశాయి. ఆలిండియా ఫస్ట్ ర్యాంకర్లిద్దరూ తెలుగువారే కాగా, ఇద్దరూ కృష్ణా జిల్లాకు చెందిన వారే కావడం విశేషం! వారిద్దరూ విజయవాడలోని సూపర్‌విజ్‌లో శిక్షణ పొందారు. సూపర్‌విజ్ కార్యాలయంలో విలేకరులకు ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు వివరాలు వెల్లడించారు. డిసెంబరు 2015లో నిర్వహించిన ఐసీడబ్ల్యూఏ ఇంటర్, ఫైనల్ పరీక్ష ఫలితాల్లో తమ విద్యార్థులు సత్తాచాటినట్లు తెలిపారు. ఐసీడబ్ల్యూఏ ఫైనల్లో కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన కంతేటి ఉపేంద్ర ఆలిండియా స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ సాధించగా, 50లోపు మరో 8 ర్యాంకులు పొందినట్లు తెలిపారు. ఇంటర్లో కృష్ణా జిల్లా కైకలూరుకు చెందిన కొణిజేటి సాయిశ్రీలక్ష్మి ఆలిండియా స్థాయిలో మొదటిర్యాంకు సాధించగా, చిత్తూరు జిల్లా చోడవరానికి చెందిన నాగోలు మోహన్‌కుమార్ రెండో ర్యాంకు. అదే జిల్లా రామసముద్రానికి చెందిన యల్లంపల్లి లతశ్రీ మూడో ర్యాంకు సాధించినట్లు తెలిపారు. ఇప్పటివరకూ సూపర్‌విజ్ 49 సార్లు ఆలిండియా ఫస్ట్ ర్యాంకులు సాధించి రికార్డు సృష్టించిందన్నారు.