breaking news
justice for land losers
-
సోలార్ బాధితులకు పునరావాసం కల్పించాలి
సాక్షి, కల్లూరు : గని, శకునాల గ్రామాలకు చెందిన సోలార్ బాధిత కుటుంబాలకు పునరావాసం కల్పించాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి. రామక్రిష్ణ డిమాండ్ చేశారు. సోమవారం శకునాలలో సోలార్ బాధిత కుటుంబాలతో ఏపీ రైతు సంఘం నాయకులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రామక్రిష్ణ మాట్లాడుతూ సోలార్ పరిశ్రమ స్థాపనకు సేకరించిన భూములపై ఆధారపడి జీవిస్తున్న రైతు కూలీలకు పునరావాసం కల్పించాలని కోర్టు ఆదేశించిందన్నారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం కూడా బాధితులకు అవార్డు పాస్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నారు. అయితే, అధికారుల ఒత్తిడితో గని, శకునాల గ్రామాల్లో ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో నిద్రిస్తున్న వారి నుంచి సంతకాల సేకరణ చేయించడం ఎంతవరకు సమంజసమన్నారు. బాధితులకు అందించే పునరావాసం ఎగ్గొంటేందుకే ఉన్నతాధికారులు పనిచేయడం సిగ్గుచేటన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో బాధితులు చాంద్‌బాషా, శ్రీధర్, శేఖర్, రాముడు తదితరులు పాల్గొన్నారు. -
బయటివారే చిచ్చు పెడుతున్నారు
నాటి తెలంగాణ ద్రోహులే నేడు ప్రాజెక్టులు పెడుతున్నారు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సాక్షి, సంగారెడ్డి: మల్లన్నసాగర్ ప్రాజెక్టు విషయంలో బయటి నేతలు జిల్లాకు వచ్చి చిచ్చుపెడుతున్నారని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆరోపించారు. నాడు తెలంగాణ రాకుండా అడ్డుకున్న ద్రోహులే నేడు మల్లన్నసాగర్ ప్రాజెక్టును అడ్డుకుంటున్నారన్నారు. రాజకీయ లబ్ధికోసం ప్రతిపక్షాల పన్నిన ఉచ్చులో పడవద్దన్నారు. నిర్వాసితులకు న్యాయం చేసి ప్రాజెక్టును పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. మంగళవారం సంగారెడ్డిలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ విలేకరులతో మాట్లాడుతూ ప్రాజెక్టులు పూర్తయితే తమ ఉనికికే ప్రమాదమని ప్రతిపక్షాలు ఉలిక్కి పడుతున్నాయన్నారు. తెలంగాణ రాకుండా అడ్డుకున్న టీడీపీ ఇప్పుడు మల్లన్నసాగర్ తోపాటు తెలంగాణలోని ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ సైతం రాజకీయలబ్ధి కోసం మల్లన్నసాగర్ ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. ఉపముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదర రాజనర్సింహ సింగూరు ప్రాజెక్టు కాల్వల భూ సేకరణలో 2013 చట్టం ప్రకారం ఎందుకు పరిహారం చెల్లించలేదన్నారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్ మాట్లాడుతూ ఎవరెన్ని కుట్రలు పన్నినా రైతులు, ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వం వెన్నంటే ఉన్నారన్నారు. విలేకరుల సమవేశంలో సీడీసీ చైర్మన్ విజయేందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొండల్‌రెడ్డి, వైస్‌చైర్మన్ సుభాన్, జెడ్పీటీసీ మనోహర్‌గౌడ్, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్‌చారి, నరహరిరెడ్డి, ప్రభుగౌడ్, రాంరెడ్డి, దేశ్‌పాండే తదితరులు పాల్గొన్నారు.