breaking news
Joint rule
-
సమైక్య పాలకులపై సీఎం కేసీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్ : ‘ప్రపంచ స్థాయి పర్యాటక ప్రాంతాలు, ప్రకృతి రమణీయ దృశ్యాలు, అద్భుత పుణ్యక్షేత్రాలు తెలంగాణలో కొలువై ఉన్నాయి. కానీ వలస పాలనలో ఇవన్నీ మరుగున పడ్డాయి. కాళేశ్వరం పుణ్యక్షేత్రం మహత్యం ఎక్కడో ఉన్న శృంగేరి పీఠాధిపతికి తెలుస్తది గానీ.. నాటి ఆంధ్రా పాలకులకు తెలువలేదు. మన విలువ మనకు తెలవకుంట జేసిండ్రు’అని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు విమర్శించారు. ఉమ్మడి పాలనలో విస్మరించిన తెలంగాణ పర్యాటక రంగాన్ని ప్రపంచ స్థాయిలో వెలుగులోకి తెచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తామని వెల్లడించారు. కామారెడ్డి పట్టణ సమీపంలోని అడ్లూరి ఎల్లారెడ్డి చెరువుకట్ట బలోపేతం, చెరువు ఆయకట్టు పెంపు, ట్యాంక్‌బండ్ సుందరీకరణపై కామారెడ్డి జిల్లా ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టరు, అధికారులతో గురువారం ప్రగతి భవన్లో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విస్తీర్ణంలో సింగపూర్ అతి చిన్న దేశమని.. ప్రకృతి సహజ సిద్ధమైన కేంద్రాలు అంతగా లేని ఆ దేశం పర్యాటక రంగంలో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోందన్నారు. విశాలమైన అడవులు, కొండలు, గుట్టలు, నదీనదాలు, చెరువులు, సహజ సిద్ధ సుందర దృశ్యాలున్న తెలంగాణను అద్భుతంగా తీర్చిదిద్దుకునే అవకాశం ఉందని చెప్పారు. ‘మంచిర్యాల పిలగాడు దూలం సత్యనారాయణ వచ్చి వీడియో తీసి చూపించే వరకు తెలంగాణలో దాగి ఉన్న ప్రకృతి అద్భుతాలు వెలుగులోకి రాలేదు. తెలంగాణ పుణ్యక్షేత్రాలకు గానీ పర్యాటక రంగానికి గానీ గత పాలకులు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదు’ అని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం మొదటి దశలో తాగు, సాగు నీరు, వ్యవసాయం, విద్యుత్‌కు ప్రాధాన్యం ఇచ్చిందని.. వచ్చే ఐదేళ్లలో వ్యవసాయాన్ని స్థిరీకరించి అనుబంధ వృత్తులను బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తామని తెలిపారు. విద్య, వైద్యం, పర్యాటక రంగాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. రాబోయే కాలంలో అన్ని చెరువుల అభివృద్ధి అడ్డూరి ఎల్లారెడ్డి చెరువును అభివృద్ధి చేసి చెరువు కింద 2,500 ఎకరాల ఆయకట్టుకు నీరందించేలా తక్షణం చర్యలు తీసుకోవాలని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావును సీఎం కేసీఆర్ ఆదేశించారు. చెరువు పనులకు రూ.64 కోట్లు తక్షణమే విడుదల చేయాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావును ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వచ్చే రీ–జనరేటెడ్ నీటితోనే చెరువు నిండుతుందన్న సీఎం.. చెరువు కట్టను బలోపేతంతోపాటు ప్రజలు, పిల్లల సౌకర్యార్థం వాటర్ ఫౌంటేన్, ఫుడ్ కోర్టులు, ఓపెన్ ఎయిర్ థియేటర్ తదితర సుందరీకరణ పనులు చేపట్టాలన్నారు. రాబోయే కాలంలో అన్ని రిజర్వాయర్లు, చెరువుల ట్యాంక్‌బండ్‌లను ఆహ్లాదరక వాతావరణం పంచేలా నిర్మిస్తామని వెల్లడించారు. మంత్రి కేటీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, ఎమ్మెల్యేలు గంపా గోవర్దన్, ఏనుగు రవీందర్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. -
విభజనా.. ఒప్పందమా..!
- అ వర్సిటీ ప్రవేశాలపై సందిగ్ధత - తేల్చని తెలంగాణ ప్రభుత్వం, జూన్ 2తో ముగియనున్న ఉమ్మడి పాలన - ఆందోళనలో తెలుగు వర్సిటీ యంత్రాంగం సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి పాలనలో ఉన్న హైదరాబాద్‌లోని తెలుగు విశ్వవిద్యాలయం పరిస్థితి అయోమయంలో పడింది. దీనితో ఇందులో చేరాలనుకునే విద్యార్థులు డోలయామానంలో చిక్కుకున్నారు. దీనిలోని ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసే గడువు సమీపిస్తుండడంతో అధికారులు అయోమయంలో పడ్డారు. దీంతో 2015-16 విద్యా సంవత్సరానికి వర్సిటీలో ప్రవేశాలకు నోటిఫికేషన్ సకాలంలో వస్తుందా? రాదా? అన్న మీమాంస తలెత్తింది. విభజన తర్వాత తెలుగు వర్సిటీని 10వ షెడ్యూల్లో చేర్చిన విషయం తెలిసిందే. ఫలితంగా ఏడాదిపాటు రెండు రాష్ట్రాలకు ఈ వర్సిటీ సేవలందించాలి. అందుకు అవసరమైన నిధులను రెండు రాష్ట్రాలు విడుదల చేయాల్సి ఉంటుంది. రానున్న జూన్ 2కు విభజన జరిగి ఏడాది కాలం పూర్తికానుంది. ఈ క్రమంలో మరికొంత కాలం తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఉమ్మడిగానే కొనసాగిస్తారా? లేక విభజిస్తారా? అన్న అంశం తేలడం లేదు. దీనిపై స్పష్టత ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని వర్సిటీ ఉన్నత వర్గాలు పలు దఫాలు కోరిన ఎలాంటి కదలిక లేదు. దిక్కుతోచని స్థితిలో వర్సిటీ వర్గాలు.. తెలుగు వర్సిటీకి వరంగల్‌తోపాటు ఏపీలోని రాజమండ్రి, శ్రీశైలం, కూచిపూడిలో పీఠాలు ఉన్నాయి. వీటి పరిధిలోని 59 కోర్సుల్లో దాదాపు 625 సీట్లు భర్తీ చేసేందుకు ఏటా మే నెలలో నోటిఫికేషన్ విడుదల చేస్తుంటారు. ఎప్పటిలాగే నోటిఫికేషన్ విడుదలకు సరిగ్గా నెల సమయం కూడా లేదు. ఈ క్రమంలో ప్రవేశాలు ఉమ్మడిగానే కల్పించాలా? వద్దా? అన్న అంశాన్ని ప్రభుత్వం తేల్చడంలో నిర్లక్ష్యం వహిస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఉమ్మడిగా కొనసాగించాలన్న ఆలోచన ఉంటే అందుకు ఇరు ప్రభుత్వాలు పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. దీనికి ముందడుగు పడాలంటే ప్రభుత్వం స్పందించి స్పష్టతనీయాల్సిన అవసరం ఉంది. మూలుగుతున్న నిధులు.. వర్సిటీ అవసరాలు తీర్చడం, విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడం కోసం యూజీసీ నుంచి 12వ పంచవర్ష ప్రణాళిక కింద రూ. 10.62 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో ఇప్పటికే రూ. 4 కోట్లను యూజీసీ విడుదల చేసింది. ఇన్ని కోట్లను విడుదల చేయడం ఇదే తొలిసారి. విద్యార్థులకు వసతి కల్పించేందుకు హాస్టల్ బిల్డింగ్ నిర్మాణం కోసం ఆ డబ్బులు ఖర్చు చేయాలన్న యోచనలో వర్సిటీ అధికారులున్నారు. అయితే నిధులను సద్వినియోగం చేసుకునే క్రమంలో ఆటంకాలు ఎదురవుతున్నాయి. ప్రవేశాలపై ఎటూ తేలకపోవడంతో అధికారులు ధైర్యం చేయలేకపోతున్నారు. ఫలితంగా నిధులు వర్సిటీ ఖజానాలో మూలుగుతున్నాయి.