breaking news
Jagan Press Meet
-
మీడియా సమావేశంలో వైఎస్ జగన్ ప్రదర్శించిన వీడియోలు
-
చంద్రబాబువన్నీ మోసాలే.. వైఎస్ జగన్ ప్రెస్‌మీట్ హైలైట్స్
సాక్షి, గుంటూరు: ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పాలనలో.. యూరియా కొరత, గిట్టుబాటు ధరలేక రైతులు పడుతున్న అవస్థలు, 10 కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం.. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసి వైద్య రంగాన్ని దెబ్బ తీయడం.. అలాగే సూపర్‌సిక్స్ హామీలు అమలు చేయకపోయినా, సూపర్‌హిట్ పేరుతో ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేసుకోవడం గురించి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మీడియా ద్వారా సుదీర్ఘంగా మాట్లాడారు. రైతులకు అందాల్సిన ఎరువులు, యూరియాను బ్లాక్ మార్కెట్ చేస్తూ స్కామ్‌కు పాల్పడుతున్నారు. దాన్ని నిరసిస్తూ మా పార్టీ నాయకులు, కార్యకర్తలు రైతులకు తోడుగా నిలబడుతూ, వారి పక్షాన వారితో కలిసి ఆర్డీఓలకు అర్జీ ఇచ్చే కార్యక్రమం చేశారు. దాన్ని కూడా అడ్డుకుంటూ, పోలీసుల ద్వారా అణగదొక్కే ప్రయత్నం చేశారు. మాజీ మంత్రులు, సీనియర్ నాయకులకు నోటీసులు ఇచ్చారు. (అంటూ, పోలీసులు ఇచ్చిన నోటీసులు మీడియాకు పీపీటీలో చూపారు) యూరియా కోసం రైతులతో కలిసి ఆర్డీఓకు అర్జీలు ఇవ్వడం తప్పా? రైతుల తరపున మాట్లాడొద్దా? ప్రజాస్వామ్యం ఖూనీ చేస్తున్నారు. అసలు మీరు అవసరమైన ఎరువులు అందిస్తే, ఏ రైతు కూడా రోడ్డెక్కడు కదా? ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు స్కామ్‌లు చేశారు. అందుకే ఈ పరిస్థితి. ఏకంగా రెండు నెలల నుంచి రైతులు యూరియా కోసం నానా అగచాట్లు పడుతున్నారు. అది మీ దారుణ పాలనకు సాక్ష్యం కాదా?. మీ అవినీతి పాలనకు నిదర్శనం కాదా? (అంటూ.. యూరియా కోసం అనేక చోట్ల రైతులు బారులు తీరిన ఫోటోలు ప్రదర్శన. చివరకు కుప్పం, టెక్కలిలో కూడా అదే స్థితి).నేను ఒకటే అడుగుతున్నాను. ప్రజలంతా ఆలోచించాలి. మా పాలనలో 5 ఏళ్లలో ఎక్కడైనా, ఎప్పుడైనా రైతులు ఇలా ఎరువుల కోసం అగచాట్లు పడ్డారా? రోడ్డెక్కారా? అప్పులు ఆ పరిస్థితి ఎందుకు రాలేదు?. ఇప్పటి పరిస్థితికి కారణం.. జగన్ అనే వ్యక్తికి రైతుల మీద ఆపేక్ష. వారికి మంచి చేయాలన్న తపన, తాపత్రయం. నాటి సీఎంకు, ఇప్పటి సీఎంకూ అదే తేడా. ఎరువుల సరఫరాలో కూడా స్కామ్ చేస్తున్నారు. అందుకే ఈ దుస్థితి. ఇందుకు చంద్రబాబు సిగ్గుతో తల దించుకోవాలి.చంద్రబాబు నోట అబద్ధాలు..ఈనెల 3న మీడియాతో మాట్లాడిన సీఎం చంద్రబాబు, ఈ ఖరీఫ్‌లో 6.65 లక్షల మెట్రిక్ టన్నుల యూరియ సరఫరా చేశామని, గత ఏడాదితో పోలిస్తే 97 వేల టన్నులు ఎక్కువ సరఫరా చేశామని చెప్పారు. మరి చంద్రబాబుగారు చెబుతున్నట్లుగా ఎరువులు అంది ఉంటే, రైతులు రోడ్కెక్కే పరిస్థితి ఎందుకు వచ్చింది? వారికి యూరియా అందలేదు కాబట్టే, ఈ పరిస్థితి వచ్చింది కదా?. రాష్ట్రానికి వస్తున్న యూరియాను టీడీపీ నాయకులు దారి మళ్లించి ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. మరోవైపు ప్రైవేటు వ్యాపారులకు ఎక్కువగా ఇచ్చేశారు. వారు కొరత సృష్టించి బస్తాకు రూ.200 వరకు ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. ఇలా బ్లాక్మార్కెట్లో ఎరువులు అమ్ముతూ దాదాపు రూ.250 కోట్ల వరకు స్కామ్ చేస్తున్నారు. రైతులను పీడించి, స్కామ్‌లు చేసి అందరూ పంచుకుంటున్నారు.మరోవైపు, ఏ ఒక పంటకూ గిట్టుబాటు ధర లేదు. వరి, చీనీ.. ఏది చూసినా. ఇప్పుడు కూడా ఉల్లి, టమోటా పరిస్థితి కూడా అదే. ధరలు పడిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ, సీఎం చంద్రబాబు పట్టించుకోడు. తూతూ మంత్రంగా ప్రకటన చేస్తాడు. అసలు ముందు వాస్తవాలు ఒప్పుకోడు. తప్పదనుకుంటే, ఒక ప్రకటన చేస్తాడు. దాన్ని ఎల్లో మీడియా హైలైట్ చేస్తుంది. ఈరోజు ఉల్లి క్వింటాలు ధర రూ.200 నుంచి రూ.300 ఉంటే, బహిరంగ మార్కెట్లో కేజీ రూ.34. అంటే క్వింటాలుకు రూ.3400.మా ప్రభుత్వ హయాంలో రూ.7,802 కోట్లు ఖర్చు చేసి, మార్కెట్లో జోక్యం చేసుకున్నాం. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులను ఆదుకున్నాం. మార్కెట్లో పంటల ధరలు తగ్గితే.. సీఎం–యాప్ (కంటిన్యూయస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైజ్ అండ్ ప్రొక్యూర్మెంట్) ద్వారా ప్రభుత్వం రంగంలోకి దిగి, కొనుగోలు చేసేది. కానీ, ఇప్పుడవేవీ లేవు. మా ప్రభుత్వం అమలు చేసిన అనేక పథకాలకు మంగళం పాడేశారు.ప్రజారోగ్య రంగం నిర్వీర్యం.. సంపద సృష్టిస్తానని ఎన్నికల ముందు చెప్పి, ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులను శనక్కాయలు, బెల్లానికి అమ్ముకంటున్నారు. తన మనుషులకు దోచి పెడుతున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. తారాస్థాయికి చేరిన చంద్రబాబు అవినీతి, స్కామ్‌లకు పరాకాష్ట. 2019 వరకు మన రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలు 11. పద్మావతి వర్సిటీ కాలేజీ కూడా కలుపుకుంటే వాటి సంఖ్య 12. చంద్రబాబు తన అన్నేళ్ల పాలనలో కనీసం ఒక్కటంటే, ఒక్క మెడికల్ కాలేజీ అయినా కట్టాడా? కనీసం ఆ ఆలోచన అయినా చేశాడా?. అదే మా ప్రభుత్వంలో కేవలం 5 ఏళ్ల అతికొద్ది కాలంలోనే, ప్రతి జిల్లాకు ఒక టీచింగ్ హాస్పిటల్ తీసుకురావాలని, ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని చూశాం. జిల్లాలు 13 నుంచి 26కు పెంచి, ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశారు. ఎప్పుడైతే ఒక జిల్లాలో మెడికల్ కాలేజీలో భాగస్వామ్యంగా టీచింగ్ హాస్పిటల్ ఏర్పాటైతే, అక్కడ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుతాయి. ఆ స్థాయిలో వైద్యులు, వైద్య సిబ్బంది అందుబాటులోకి వస్తారు. మా హయాంలో 17 మెడికల్ కాలేజీల పనులు చేపట్టాం. ఒక్కో దానికి రూ.500 కోట్లు ఖర్చు చేశాం. ప్రతి కాలేజీని 50 ఎకరాల్లో చేపట్టాం. అన్ని హంగులతో వాటి నిర్మాణం చేపట్టాం. అంకితభావంతో పని చేశాం కాబట్టే.. 2023–24లో విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో మెడికల్ కాలేజీలు ప్రారంభించాం. తరగతులు మొదలయ్యాయి. అవే కాకుండా, గత ఏడాది ఎన్నికల నాటికి, పాడేరు, పులివెందుల మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తైంది. అడ్మిషన్లకు సిద్ధం చేశాం. పులివెందుల కాలేజీని ప్రారంభించాను. ఎన్నికలు ముగిశాక, పాడేరు మెడికల్ కాలేజీ మొదలైంది. అడ్మిషన్లు జరిగి, క్లాస్‌లు కూడా ప్రారంభం అయ్యాయి. అంటే, మా హయాంలో చేపట్టిన 17 మెడికల్ కాలేజీల్లో 7 పూర్తి చేసి, ప్రారంభించాం. మెడికల్ కాలేజీలే కాదు.. మా హయాంలో ఎంతో చేశాం. కానీ చేసింది చెప్పుకోలేకపోయాం.. అదే తప్పైంది మెడికల్ సీట్లు వద్దన్న చంద్రబాబుచంద్రబాబు ఎంత దుర్మార్గుడు అంటే, పులివెందుల మెడికల్ కాలేజీకి ఎన్ఎంసీ (జాతీయ వైద్య కమిషన్) 50 సీట్లు కేటాయించి, భర్తీ చేయడానికి అనుమతి ఇస్తే, ఆ సీట్లు వద్దంటూ చంద్రబాబు లేఖ రాశాడు. అలాంటి సీఎం దేశంలో ఎక్కడైనా ఉంటాడా?. చంద్రబాబు అసలు మనిషా? లేక రాక్షసుడా? ఆలోచించండి.మేము నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం, చంద్రబాబు చొరవ చూపి ఉంటే.. 2024–25లో మరో 4 కాలేజీలు.. అదోని, మదనపల్లె, మార్కాపురం, పిడుగురాళ్లలో క్లాస్‌లు మొదలై ఉండేవి. ఆ మేరకు నిర్మాణాలు కొనసాగించాం. (అంటూ ఆ కాలేజీల ఫోటోలు కూడా చూపారు). ఇంకా మా ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్లి ఉంటే, మరో 6 మెడికల్ కాలేజీలు.. అమలాపురం, బాపట్ల, నర్సీపట్నం, పార్వతీపురం, పాలకొల్లు, పెనుకొండలో మెడికల్ కాలేజీలు 2025–26 విద్యా సంవత్సరంలో మొదలై ఉండేవి. ఆ ప్రకారం మేము పనులు చేశాం. మా ప్రభుత్వం వచ్చే నాటికి ఉన్న మెడికల్ సీట్లు 2360. కొత్త కాలేజీల ద్వారా మరో 2550 మెడికల్ సీట్లు పెరిగేవి. మొత్తం 4,910కి మెడికల్ సీట్లు చేరుకునేవి. మా హయాంలో ప్రారంభమైన మెడికల్ కాలేజీల ద్వారా 800 సీట్లు భర్తీ అయ్యాయి. వైద్య విద్యలో ఇది అద్భుత ఘట్టం. నాకు క్రెడిట్ వస్తుందని, దెబ్బ తీయడం, రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేయడం ఎంత వరకు ధర్మం?మేం దిగిపోయే నాటికి దాదాపు రూ.3 వేల కోట్ల పనులు జరగ్గా, మిగిలిన రూ.5 వేల కోట్లకు కూడా నాబార్డుతో పాటు, కేంద్ర ప్రభుత్వ స్పెషల్ అసిస్టెన్స్ ద్వారా కానీ, ఇతర సంస్థల ద్వారా నిధులకు ఓకే అయింది. కొత్త కాలేజీల వల్ల భూమలు విలువ బాగా పెరిగింది. మొత్తం కాలేజీల విలువ కూడా పెరిగింది. భవిష్యత్తులో దాని విలువ లక్ష కోట్లు దాటుతుంది. కొన్ని కోట్ల మంది ప్రాణాలు కాపాడబడతాయి.ఇంకా చంద్రబాబునాయుడుగారి హయాంలో వైద్య రంగం నిర్వీర్యం అయింది. మా ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీలో 3,257 ప్రొసీజర్లు. రూ.25 లక్షల వరకు వ్యయ పరిమితి. వార్షికాదాయం రూ.5 లక్షలు ఉన్న వారికి కూడా పథకాన్ని వర్తింప చేయడం వల్ల 95 శాతం కవర్ అయ్యారు. దాని నిర్వహణకు నెలకు రూ.300 కోట్లు కావాలి. 15 నెలలకు రూ.4500 కోట్లు కావాల్సి ఉంటే, చంద్రబాబు ఇచ్చింది రూ.600 కోట్లు మాత్రమే. దాంతో కార్పొరేట్ ఆస్పత్రులు పథకంలో వైద్యం చేయడం లేదు. ఇన్ని చేసిన చంద్రబాబు, ఇంకా మరో మోసం. డ్రామా చేస్తున్నాడు. కొత్తగా ఇన్సూరెన్స్ తీసుకొచ్చాడు. దానిలో వైద్యం ఖర్చును కేవలం రూ.2.5 లక్షలకే పరిమితం చేయడంతో పాటు, ప్రొసీజర్లను 2500కు తగ్గించారు. చంద్రబాబు వైద్య రంగాన్ని నాశనం చేసిన తీరుకు.. తురకపాలెం ఉదాహరణ. 2 నెలల్లో 45 మంది చనిపోతే, ప్రభుత్వం గుర్తించలేని పరిస్థితి. ఇది సీఎం ఇంటికి చాలా చేరువ.సూపర్‌హిట్ ఫ్లాప్ సంబరాలు:చంద్రబాబుకు ఉన్న నైపుణ్యం. కళ్లార్పకుండా పచ్చి అబద్ధాలు చెప్పడం. అది ఆయనకు మాత్రమే తెలుసు. ఒకవైపు పథకాల అమలు లేదు. మరోవైపు మోసం. అయినా సూపర్‌సిక్స్ సూపర్‌హిట్ అంటూ వేడుక. ఇది అట్టర్‌ఫ్లాప్ అయిన సినిమాకు బలవంతంగా విజయోత్సవం చేసినట్లు ఉంది. చంద్రబాబు అబద్దాలు, మోసాలు ఏ స్థాయిలో ఉంటాయంటే.. ఒకసారి చూడండి. (అంటూ ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన అడ్వరై్జజ్మెంట్స్. సూపర్‌సిక్స్‌పై ప్రదర్శన). ఇంకా ఎన్నికల ముందు సూపర్‌సిక్స్ గురించి చంద్రబాబు ఏమన్నారనేది చూద్దాం. (అంటూ ఆ పత్రికా ప్రకటనలు. అప్పుడు ఇంటింటికీ పంపించిన బాండ్లు. వాటిలో ఏమేం చెప్పారు?. బాబు ష్యూరిటీ. భవిష్యత్తు గ్యారెంటీ. దీనిపై చంద్రబాబు, పవన్‌కళ్యాణ ఫోటోలు, సంతకాలు కూడా ఉన్నాయి. ఇంకా పథకాలపై చంద్రబాబు హామీల ప్రచార వీడియోల ప్రదర్శన).ఇప్పుడు నేను అడుగుతున్నాను.. ఇవన్నీ మోసాలు కావా?:18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇచ్చావా?. ఆడబిడ్డ నిధి కింద రెండేళ్లకు రూ.36 వేలు బాకీ. ఈరోజు అనంతపురంలో సూపర్‌హిట్ పేరుతో సభ పెట్టావు. నిరుద్యోగ యువతకు ఉద్యోగం లేదా నెలకు రూ.3 వేల చొప్పున ఏడాదికి రూ.36 వేలు. రెండేళ్లకు రూ.72 వేలు బాకీ. అవి ఇవ్వనప్పుడు మోసం కాదా? అది నీ సూపర్‌సిక్స్ హామీ కాదా?.. 50 ఏళ్లకే పెన్షన్ నెలకు రూ.4 వేలు. ఏడాదికి రూ.48 వేలు. రెండేళ్లకు రూ.96 వేలు బాకీ. ఇది మోసం కాదా?. పెన్షన్ల సంఖ్య గత ఏడాది మార్చి నాటికి 66,34,742 ఉంటే, ఈనెలలో మీరు ఇచ్చిన పెన్షన్లు 61,92,864. అంటే దాదాపు 5 లక్షలు కోత. ఇది మోసం కాదా?. రాష్ట్రంలో మహిళలు ఎక్కడికి పోవాలన్నా మహిళలకు ఫ్రీ అన్నావు. కానీ పరిమిత బస్సుల్లోనే అనుమతి. ఇది మోసం కాదా?. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అన్నావు. కానీ గత ఏడాది ఒక్కటే ఇచ్చావు. ఈ ఏడాది ఒక్కటి కూడా లేదు. అంటే 6 సిలిండర్లకు గానూ, కేవలం ఒక్కటే ఇవ్వడం మోసం కాదా?. పీఎం కిసాన్ కాకుండా రూ.20 వేలు అన్నదాత సుఖీభవ కింద ఇస్తానన్నావు. అలా రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ.5 వేలు మాత్రమే ఇవ్వడం మోసం కాదా?. తల్లికి వందనం కింద రెండేళ్లకు రూ.30 వేలు ఇవ్వాల్సి ఉండగా, 30 లక్షల మందికి ఎగ్గొట్టి కేవలం రూ.13 వేలు మాత్రమే, ఇంకా చాలా మందికి రూ.8 వేలు మాత్రమే ఇవ్వడం మోసం కాదా?గత ప్రభుత్వంలో అమలైన పథకాలు రద్దు చేయడం మోసం కాదా? చేయూత, ఆసరా, సున్నా వడ్డీ, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, తోడు, చేదోడు, ఉచిత పంటల బీమా, విద్యాదీవెన, వసతిదీవెన, పిల్లలకు ట్యాబ్‌లు రద్దు చేశావు. ఇది మోసం కాదా?.. చంద్రబాబు చెప్పిన అబద్ధాలు, ఆయన చేసిన మోసంతో ప్రజల జీవితాలు తగలబడుతుంటే.. ఆయన సూపర్‌హిట్ పేరుతో బలవంతపు వేడుకలు. ఇది దారుణం.15 నెలల్లో రికార్డు స్థాయిలో అప్పులుఒక్కటే అడుగుతున్నాను. 15 నెలల్లో దాదాపు రూ.2 లక్షల కోట్ల అప్పు చేశారు. ఎవరి జేబులోకి పోతోంది ఆ మొత్తం. ఇది రాష్ట్ర చరిత్రలోనే లేదు. రాష్ట్రం విభజించిన రోజు, మొత్తం అప్పులు కలిపి రూ.140,717 కోట్లు ఉంటే ఆయన దిగిపోయేనాటికి రూ,3,90,247. అంటే 22.63 శాతం సీఏజీఆర్. అది మా హయాంలో అది 13.57 శాతం మాత్రమే. ఇక మా ప్రభుత్వ హయాంలో అప్పు రూ.3,90,247 కోట్ల నుంచి రూ.7,21,918 కోట్లకు పెరిగింది. అంటే మా ప్రభుత్వం 5 ఏళ్లలో చేసిన మొత్తం అప్పు రూ.3,32,671 కోట్లు కాగా, చంద్రబాబు కేవలం 15 నెలల్లో చేసిన అప్పు ఏకంగా రూ.1,91,361 కోట్లు. మేము 5 ఏళ్లలో చేసిన అప్పులో 57.5 శాతం ఈ 15 నెలల్లోనే చేశారు.ఈ ప్రభుత్వంలో ఇసుక, మట్టి దోచేస్తున్నారు. ఉచితం లేనే లేదు. లిక్కర్ మాఫియా. పర్మిట్‌రూంలు, బెల్టు షాప్‌లు విచ్చలవిడిగా. అక్కడ ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయాలు. ప్రభుత్వ ఆదాయం తగ్గుతోంది. మద్యం మాఫియా దోచేస్తోంది. సిలికా, క్వార్ట్జ్ దోపిడి. అమరావతిలో నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.10 వేలు. అదో దోపిడి. శనక్కాయలు, బెల్లానికి ఇష్టం వచ్చినట్లుగా.. ఉర్సా, లులూకు భూముల కేటాయింపు. రాష్ట్ర ఆదాయం తగ్గుతోంది. మీ ఆదాయం, మీ అనుయాయుల సంపద పెరుగుతోంది.మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అడ్డుకుంటాం స్కామ్‌ల్లో పరాకాష్ట. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ. దీన్ని అడ్డుకుంటాం. నిరసనలు, ర్యాలీలు చేస్తాం. నేనూ అక్కడక్కడా పాల్గొంటా. – రాష్ట్ర శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క పార్టీని కోరుతున్నా. అందరూ కలిసి రండి. కొత్త మెడికల్ కాలేజీలు మన సంపద. రాష్ట్ర సంపద. అందరం కలిసి పోరాడుదాం. వాటిని కాపాడుకుంటాం. అయినా ఈ ప్రభుత్వం కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తే, రేపు మా ప్రభుత్వం రాగానే, వాటన్నింటినీ రద్దు చేస్తాం. ఆ కాలేజీలు వెనక్కు తీసుకుంటాం.మీడియాతో జగన్ చిట్‌చాట్ 👉స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈవీఎంలను ప్రవేశపెట్టబోతున్నారు? ఎలా స్పందిస్తారు? అనే ప్రశ్నకు.. పోలీసు వ్యవస్థ సక్రమంగా లేదు. పోలీసుల చేతనే రిగ్గింగ్ చేయిస్తున్నారు. అలాంటప్పుడు ఈవీఎంలు ఉంటే ఏంటి?.. పేపర్ బ్యాలెట్ పెడితే ఏంటి?. కేంద్ర బలగాలు వస్తేనే ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతాయి. సాధారణ ఎన్నికలప్పుడు సరైన నిర్ణయం తీసుకోవాలి. 👉ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారన్న ఆరోపణలకు స్పందిస్తూ.. అలాంటిదేం లేదు, అదంతా ఉత్త ప్రచారమే.. 👉18 నుంచి అసెంబ్లీ సెషన్ ప్రారంభం కానుందన్న ప్రశ్నకు.. ఇప్పుడు ఇంత సేపు మాట్లాడేందుకు సమయం దొరికింది?. మరి అక్కడ అంత సమయం ఇస్తారా?. ప్రధాన ప్రతిపక్ష హోదాతోనే ఆ అవకాశం ఉంటుంది. ప్రజా సమస్యలు ప్రస్తావనకు రాకూడదన్న రీతిలో సభను నడిపిస్తున్నారు. గతంలో చంద్రబాబు ఎన్నిరోజులు అసెంబ్లీకి వచ్చారు. జరగనిదాన్ని జరిగిందని రాద్ధాంతం చేశారు.👉సోషల్ మీడియా తప్పుడు ప్రచారం పేరిట ఏపీ ప్రభుత్వ తీసుకోబోయే కఠిన నిర్ణయంపై స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వానికి అలాంటి అధికారం ఉండదు. అది కేవలం కేంద్ర పభుత్వ పరిధిలో ఐటీ చట్టాల పరంగా జరగాలి. ఈ వ్యవహారంలో సుప్రీం కోర్టు తీర్పులు కూడా ఉన్నాయి. 👉వైఎస్సార్సీపీ మళ్లీ అధికారంలో ఎలా వస్తుందో చూస్తాం అంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్‌కు స్పందిస్తూ.. ‘‘ఈయనేంది చూసేది.. పైన దేవుడు చూస్తాడు’’