breaking news
Islam raphikhul
-
ఇస్లాం అతివాదంతో పెను ముప్పు
న్యూఢిల్లీ: ఇస్లాం అతివాదం, ఉగ్రవాదుల చర్యలు అంత్యంత ప్రమాదకరమైనవనీ, అంతర్జాతీయ వ్యవస్థపై ఇవి తీవ్ర దుష్పరిణామాలు చూపగలవని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మంగళవారం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను అధిగమించేందుకు భారత్–ఇజ్రాయెల్ మధ్య మరింత బలమైన బంధం ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఆరు రోజుల భారత పర్యటనలో ఉన్న నెతన్యాహు మంగళవారం ఢిల్లీలో రైసినా డైలాగ్ భౌగోళిక–రాజకీయ మూడో సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇజ్రాయెల్‌కు భారత్ సహజ భాగస్వామి, మిత్రదేశమని చెప్పడంతో అక్కడే ఉన్న నరేంద్ర మోదీ పెదవులపై నవ్వులు విరిశాయి. ఒకప్పుడు ఏమీ లేని ఇజ్రాయెల్ ఆర్థిక, సైనిక, రాజకీయ శక్తుల ద్వారానే నేడు బలమైన దేశంగా ఎదిగిందని నెతన్యాహు చెప్పారు. దేశంలో వ్యాపార నిర్వహణను మరింత సులభంగా మార్చేందుకు, కంపెనీల కార్యకలాపాల్లో ప్రభుత్వ పాత్రను పరిమితం చేసేందుకు మోదీ చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. ప్రజాస్వామ్య దేశాలు కూటమిగా ఏర్పడటం చాలా ముఖ్యమని నెతన్యాహు పేర్కొన్నారు. ప్రపంచం ఎదుర్కొంటున్న పలు సవాళ్లకు పరిష్కారాలు కనుగొనేందుకు రైసినా డైలాగ్ సదస్సును 2016 నుంచి విదేశాంగ శాఖ, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఓఆర్ఎఫ్) సంయుక్తంగా ప్రతి ఏడాది నిర్వహిస్తున్నాయి. మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సుకు ప్రపంచ దేశాల నుంచి మొత్తం 550 మంది ఈ ఏడాది హాజరవుతున్నారు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబ, యూఎస్ పసిఫిక్ కమాండ్‌కు చెందిన కమాండర్ హ్యారీ హ్యారిస్ తదితరులు బుధవారం ప్రసగించనున్నారు. తాజ్‌ను సందర్శించిన నెతన్యాహు రైసినా డైలాగ్‌ను ప్రారంభించడానికి ముందు నెతన్యాహు తన భార్య సారాతో కలసి తాజ్‌మహల్‌ను సందర్శించారు. నెతన్యాహు దంపతులకు ఆగ్రా విమానాశ్రయంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. నెతన్యాహు సందర్శన నేపథ్యంలో తాజ్‌మహల్‌లోకి రెండు గంటలపాటు సాధారణ ప్రజలను అనుమతించలేదు. కాగా, మోదీ గతేడాది ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లినప్పుడు ఓల్గా బీచ్‌లో నెతన్యాహుతో కలసి నడిపిన గాల్–మొబైల్ జీప్‌ను నెతన్యాహు మోదీకి బహూకరించనున్నారు. దాదాపు రూ. 72 లక్షల విలువైన ఈ జీప్ సముద్రపు నీటిని నిర్లవణీకరణం చేసి తాగునీటిగా మారుస్తుంది. గాల్–మొబైల్ ఇప్పటికే భారత్‌కు చేరుకుంది. భారత్ ఇజ్రాయెల్ మధ్య 9 ఒప్పందాలు భారత్–ఇజ్రాయెల్ ద్వైపాక్షిక చర్చల సందర్భంగా సోమవారం ఇరు దేశాల మధ్య సైబర్ భద్రత, గ్యాస్, ఆయిల్ తదితర రంగాల్లో మొత్తం 9 ఒప్పందాలు కుదిరాయి. ఇరు దేశాల అధికారులు వీటిపై సంతకాలు చేశారు. అలాగే ఢిల్లీలో సోమవారం జరిగిన ఇండియా–ఇజ్రాయెల్ వాణిజ్య సదస్సులో మోదీ మాట్లాడుతూ కంపెనీలు తమ వ్యాపారాన్ని మరింత అబివృద్ధి చేసుకునేందుకు భారత్‌లో అపార అవకాశాలున్నాయన్నారు. ముంబైకి మోషే 2008 నవంబరు 26న ముంబైలో ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమంలో రెండేళ్ల వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఇజ్రాయెల్ యూదు బాలుడు మోషే హోల్జ్‌బర్గ్ మంగళవారం మళ్లీ ముంబైకి వచ్చాడు. ప్రస్తుతం 11 ఏళ్ల వయసున్న మోషే, ఆ దుర్ఘటన తర్వాత భారత్‌కు రావడం ఇదే తొలిసారి. తన తాతయ్య షిమోన్ రోజెన్బర్గ్తో కలసి వచ్చిన అతను...తన తల్లిదండ్రులు చనిపోయిన నారీమన్ హౌస్‌ను సందర్శించి నివాళి అర్పించాడు. భారత్‌కు రావడం ఆనందంగా ఉందన్నాడు. గతేడాది మోదీ ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లినప్పుడు మోషేను, అతని కుటుంబాన్ని కలసిన మోదీ...వారు భారత్‌కు ఎప్పుడైనా రావొచ్చంటూ ఆహ్వానించారు. తాజాగా నెతన్యాహు పర్యటన నేపథ్యంలో మోషే ముంబైకి విచ్చేశాడు. -
విగ్ పెట్టి... కాపీ కొట్టి!
సూరి(పశ్చిమబెంగాల్): బీఏ చదువుతున్న ఓ విద్యార్థి పరీక్షల్లో కాపీ కొట్టేందుకు వెరైటీగా ఆలోచనను అమలు చేశాడు. పరీక్ష రోజు తలపై విగ్, చెవులకు బ్లూటూత్ పరికరం పెట్టుకుని అది కనిపించకుండా విగ్‌తో కవర్ చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా పరీక్షా హాల్లోకి వచ్చి కూర్చున్నాడు. బ్లూటూత్ హెడ్సెట్ సాయంతో మొబైల్ ఫోన్ ద్వారా వేరొకరితో మాట్లాడుతూ చకచక రాసేస్తున్నాడు. ఆ సమయంలో విద్యార్థి కొన్నిసార్లు పైకి పెద్దగా మాట్లాడడంతో ప్రిన్సిపాల్ మోండాల్‌కు అనుమానం వచ్చింది. వచ్చి ఆరా తీస్తే విగ్, బ్లూటూత్ హెడ్సెట్, కాపీ అన్నీ బయటపడ్డాయి. పశ్చిమబెంగాల్లోని బీర్భమ్ జిల్లా సూరిలోని విద్యాసాగర్ కాలేజీలో ఇది జరిగింది. విద్యార్థి రఫీఖుల్ ఇస్లామ్‌ను పరీక్షల నుంచి బహిష్కరించారు.