breaking news
Interstate highway
-
రాష్ట్రాల మధ్య ప్రయాణాలపై ఆంక్షల్లేవ్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో అంతర్ రాష్ట్ర ప్రయాణాలపై కేంద్రం ఎలాంటి ఆంక్షలు సిఫారసు చేయలేదు. క్వారంటైన్, ఐసోలేషన్‌లకు సంబంధించి రాష్ట్రాలు సొంత ప్రొటోకాల్ ఏర్పాటు చేసుకోవడానికి అనుమతించింది. కొన్ని రాష్ట్రాలు తమ రాష్ట్రాల్లో ప్రవేశాలకు ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టు కావాలని కోరుతున్నట్లు కేంద్రం దృష్టికి వచ్చింది. సెకండ్‌వేవ్‌లో దేశవ్యాప్తంగా కేసులు క్షీణిస్తున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకొని అంతర్ రాష్ట్ర ప్రయాణాలు సులభతరం చేసే ఉద్దేశంతో తగిన జాగ్రత్తలు పాటిస్తూ దేశీయ ప్రయాణాలకు ఒకే తరహా ప్రోటోకాల్ ఉండేలా దేశీయ ప్రయాణ (రైలు, బస్సు , విమానం) మార్గదర్శకాలు సవరిస్తున్నట్లు తెలిపింది. ఈ మార్గదర్శకాలు అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తిస్తాయని, తద్వారా అంతర్ రాష్ట్ర ప్రయాణాలు సులభతరం చేస్తుందని కేంద్ర ఆరోగ్య సంక్షేమ శాఖ పేర్కొంది. ప్రయాణాల్లో పాటించాల్సిన ఆరోగ్య ప్రొటోకాల్ ► ప్రయాణాల సమయంలో ప్రయాణికులు తమ ఆరోగ్యాన్ని స్వయంగా పర్యవేక్షించుకోవాలి. కోవిడ్–19 లక్షణాలు లేనప్పుడే ప్రయాణం చేయాలి. ► ప్రయాణికులు మాస్క్, ఫేస్ కవర్, ఆరు అడుగుల భౌతికదూరం పాటిం చాలి. ► ప్రయాణ సమయాల్లో బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయరాదు. ► మొబైల్లో ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ తప్పనిసరిగా చేసుకోవాలి. ► ప్రయాణ సమయంలో జలుబు, దగ్గు, జ్వరం వచ్చినట్లైతే విమాన/బస్సు/రైలు సిబ్బందికి తెలియజేయాలి. ► గమ్యస్థానం చేరిన తర్వాత లక్షణాలు కనిపిస్తే జిల్లా నిఘా అధికారి లేదా జాతీయ కాల్ సెంటర్ 1075కు తెలపాలి. విమానాశ్రయాలు/రైల్వే స్టేషన్లు/బస్ స్టేషన్లకు సూచనలు ► కరోనాకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రకటన చేయాలి ► థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతే ప్రయాణికులను అనుమతించాలి. వెలుపలికి పంపాలి. ► ప్రయాణ సమయంలో వినియోగించిన మాస్కులు, గ్లౌజులు, పీపీఈ కిట్లు పారవేయడానికి తగిన ఏర్పాట్లు చేయాలి. ► విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్స్టేషన్లు తరచుగా శుభ్రపరచాలి. ► లక్షణాలు లేని వారు 14 రోజులపాటు స్వీయ పరిరక్షణ హామీతో బయటకు వెళ్లడానికి అనుమతించాలి. ► ఒకవేళ లక్షణాలు బయటపడితే వారిని ఆరోగ్య కేంద్రాలకు తరలించడానికి తగిన ఏర్పాట్లు చేయాలి. ► ప్రయాణికులకు అందుబాటులో మాస్కులు, పీపీఈకిట్లు, గ్లౌజులు ఉంచాలి. రాష్ట్రాలకు సూచనలు ► రైలు, రహదారి, విమానయానం, నీటి మార్గాల ద్వారా అంతర్ రాష్ట్ర ప్రయాణాలపై ఎలాంటి ఆంక్షలు లేవు. ► ఒకవేళ రాష్ట్రంలో ప్రవేశించాలంటే ఆర్టీపీసీఆర్ పరీక్ష తప్పనిసరి అని నిబంధన పెడితే ఆ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేయాలి. ► రెండు డోసుల టీకా తీసుకున్నవారు, రెండో డోసు తీసుకున్నా ధ్రువపత్రం ఇంకా అందని వారు రాష్ట్రంలోకి ప్రవేశిస్తే వారిని ఆర్టీపీసీఆర్ పరీక్ష నుంచి మినహాయించాలి. ► ప్రయాణం తర్వాత లక్షణాలు కనిపిస్తే వారికి రాపిడ్ యాంటిజెన్ పరీక్ష చేయడానికి ఆయా ప్రాంతాల్లో తగిన ఏర్పాట్లు చేయాలి. ► స్థానిక ప్రయోజనాల నిమిత్తం రాష్ట్రాలు అవసరమైతే అదనంగా ఆంక్షలు విధించొచ్చు. -
‘నాలుగులైన్లు’.. కలేనా ?
జడ్చర్ల : నిత్యం వందలాది వాహనాలతో రద్దీగా ఉండే జడ్చర్ల- నల్గొండ అంతర్రాష్ట్ర రహదారి విస్తరణకు నోచుకోవడం లేదు. ప్రతిపాదనలకే పరిమితమై నాలుగు లైన్ల పనులు ముందుకుసాగడం లేదు. గతేడాది రాష్ట్రంలో ఐదు రహదారులకు జాతీయహోదాకల్పించాలని పభుత్వం భావించిన నేపథ్యంలో ఈ రహదారిని కూడా జాబితాలో చేర్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న జాతీయ రహదారుల ప్రాజెక్ట్‌ల స్థితిగతులపై హైదరాబాద్‌లో గత ఏడాది జరిగిన సమీక్ష సమావేశంలో అప్పటి కేంద్రమంత్రి ఆస్కార్ ఫెర్నాండేజ్ ఆమోదించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రతిపాదించిన ఐదు రహదారలకు జాతీయ రహదారుల స్థాయి కల్పించడానికి నిధులు విడుదల చేసేందుకు ఆమోదంకూడా తెలిపారు. దీంతో కోదాడ- మిర్యాలగూడ- దేవరకొండ- కల్వకుర్తి- జడ్చర అంతర్రాష్ట్రరహదారిని నాలుగులైన్లుగా మారనున్నట్లు ప్రచారం జరిగింది. గతంలో రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మహ బూబ్‌నగర్ న ల్గొండ మధ్య 163 కి.మీల రహదారిని విస్తరించాలన్న ప్రతిపాదనలు ఉన్నాముందుకు సాగలేదు. ముసాయిదా బిల్లులోనూ... తెలంగాణకు రహదారుల సౌకర్యాన్ని మెరుగపర్చాలని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లులోను ప్రస్తావించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలకు రహదారుల సౌకర్యాలకు అనువుగా తీర్చిదిద్దే బాధ్యతను నేషనల్ హేవేస్ అథారిటీ ఆఫ ఇండియాకి అప్పగించే విధంగా చర్యలు తీసుకొనున్నారు. ఇందులో భాగంగా నల్గొండ జిల్లా కోదాడ నుండి మిర్యాలగూడ, దేవరకొండ, కల్వకుర్తి, జడ్చర్ల వరకు సుమారు 220 కి.మీల మేర రోడ్డును జాతీయరహదారి స్థాయికి పెంచాలని గతేడాది రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సిఫారసు కూడా చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్అండ్బీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడితేవాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. విస్తరిస్తే ప్రయోజనమిదే.. అయితే ఈ రహదారిని నాలుగు లైన్లుగా విస్తరిస్తే కర్ణాటక ప్రాంతవాసులు కోస్తా జిల్లాలకు వెళ్లేందుకు దాదాపుగా వంద కిమీలకు పైగా దూరం తగ్గే అవకాశం ఉంది. అదేవిధంగా కల్వకుర్తి, దేవరకొండ మీదుగా నల్గొండ జిల్లాలోని మాచర్ల వద్ద జాతీయ రహదారిని చేరుకునే అవకాశం ఉంది. కర్ణాటక, గోవా తదితర ప్రాంతాల నుండి ఉత్తర భారతం వైపునకు దారిగుండా వెళ్తారు. ముఖ్యంగా జిల్లా రైతులు, వ్యాపారులు ఈ రోడ్డుమార్గం ద్వారా మిర్చి, పత్తి వంటి పంట ఉత్పత్తులను గుంటూరు తదితర ప్రాంతాలకు తరలిస్తుంటారు. అయితే ప్రస్తుతం కొంత మేర సింగల్, మరికొంత మేర డబుల్ రోడ్డుగా ఉండడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. రహదారి ఇరుకుగా ఉండడటంతో ప్రమాదాల సంఖ్య కూడా తీవ్రంగానే ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఈ రోడ్డును నాలుగులైన్ల రహదారిగా మార్చాలని పలువురు కోరుతున్నారు.