breaking news
Indian lady
-
'ఆంటీ వయసుకు వచ్చాక.. మన కలలను నెరవేర్చుకోవచ్చు'
‘ఆంటీ’ అనే మాటను స్త్రీలు ఎక్కువగా ఇష్టపడరు. వయసును చెప్పడాన్నీ అంతగా ఇష్టపడరు. ఒక వయసు వచ్చాక వారు ఏదైనా భిన్నమైన పని చేస్తే ఎదుటివారు ఇష్టపడరు మరి. ‘ఇలా ఇష్టపడని వారంతా ఎటైనాపోండి’ అంటారు స్కేట్‌బోర్డ్ మీద రివ్వున దూసుకుపోయే ఊర్బీ రాయ్. కెనడాలో ఉన్న ఈ 46 ఏళ్ల భారతీయురాలు ఇప్పుడు సోషల్ మీడియా సెన్సేషన్. ‘ఆంటీ వయసుకు వచ్చాక కూడా మన కలలను నెరవేర్చుకోవచ్చు’ అని ఈమె సందేశం. రంగు రంగుల చీరతో స్కేటింగ్ విన్యాసాలు చేస్తూ ‘ఆంటీ స్కేట్స్’ పేరుతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నారు. ‘పార్క్కో, పిక్నిక్కో వచ్చిన ఫ్యామిలీస్‌ని చూడండి. తండ్రి, పిల్లలు ఆడుతుంటారు. తల్లి దూరంగా కూచుని వారిని ఫొటోలు తీస్తుంటుంది. లేదా బ్లాంకెట్ పరిచి స్నాక్స్ రెడీ చేస్తూ ఉంటుంది. నేను అలాంటి తల్లిని కాను. నేను మాత్రం ఎందుకు ఆడకూడదు అనుకున్నాను’ అని నవ్వుతుంది 46 ఏళ్ల ఊర్బీ రాయ్. కోల్‌కతా నుంచి అమెరికా మీదుగా కెనెడా వలస వెళ్లి ప్రస్తుతం టొరొంటోలో నివాసం ఉంటున్న ఈ ఫ్యాషన్ డిజైనర్ తన టిక్‌టాక్‌ల ద్వారా 90 వేల మంది ఫాలోయెర్స్‌ను సంపాదించుకుని స్టార్‌డమ్‌ను అనుభవిస్తోంది. ఇంతవరకూ ఆమె టొరెంటోలో మాత్రమే తెలుసు. ఇప్పుడు ప్రపంచమంతా తెలుసు. దానికి కారణం ఈ వయసులో ఆమె అద్భుతంగా స్కేటింగ్ చేయడమే. భారతీయ స్త్రీగా చీర కట్టుకుని మరీ స్కేటింగ్ చేసి ఆమె ప్రశంసలు అందుకుంటోంది. ఆంటీ స్కేట్స్ కెనడాలో టిక్‌టాక్ ఉంది. బ్యాన్ కాలేదు. అక్కడ టిక్‌టాక్‌లో ‘ఆంటీ స్కేట్స్’ అనే అకౌంట్ కింద ఊర్బీ రాయ్ అప్లోడ్ చేసే వీడియోస్ వైరల్‌గా మారాయి. టిక్ టాక్ ఉన్న అనేక దేశాలలో ఇప్పుడు వాటిని పదే పదే చూస్తున్నారు. ‘సాధారణంగా స్కేట్బోర్డింగ్ని పిల్లల ఆటగా చూస్తారు. ఆ తర్వాత కుర్రాళ్ల ఆటగా చూస్తారు. టీనేజ్ దాటాక దీని జోలికి వచ్చేవాళ్లు తక్కువ. నా వయసు స్త్రీలు, అందునా ఇద్దరు పిల్లల తల్లి స్కేట్బోర్డింగ్ చేస్తుండేసరికి చాలామంది ఇన్‌స్పయిర్ అవుతున్నారు’ అంటుంది ఊర్బీ. ‘నా భర్త సంజీవ్ స్కేట్బోర్డింగ్ చేస్తాడు. నా ఇద్దరు పిల్లలకూ అది ఇష్టమే. వారితో పాటు కలిసి నేను స్కేట్పార్క్లకు వచ్చి వారు ఆడుతుంటే చూసేదాన్ని. ఎన్నాళ్లని చూడను? ఒకరోజు స్కేట్‌బోర్డ్‌ను కాళ్ల కిందకు తీసుకున్నాను. వెంటనే దానిని స్వారీ చేశాను’ అంటుంది ఊర్బీ. ఆమె వీడియోలకు ‘ఆంటీ స్కేట్స్’ అనే టైటిల్ ఎందుకు పెట్టింది అని అడిగితే ‘ఆంటీలు చాదస్తం అని చాలామంది అనుకుంటారు. ఆంటీలు అదిలా ఇదిలా అని వంకలు పెడుతుంటారు, జడ్జ్ చేస్తుంటారు అని కూడా అనుకుంటూ ఉంటారు. కాని ఆంటీలు కూడా జీవితాల్లో కొత్తది చేస్తారు. చేయగలరు. వారు కుర్రవయసులో ఉన్నవారితో సమంగా ఉత్సాహంగా ఉండగలరు అని చెప్పడానికే ఆంటీ స్కేట్స్ అనే పేరు పెట్టాను’ అంటుంది ఊర్బి. కోల్కటా వాసి అయితే ఇలా స్కేటింగ్ చేస్తూ వార్తలకెక్కిన ఊర్బి కేవలం స్కేటింగ్‌తో కాలక్షేపం చేసే హౌస్‌వైఫ్ కాదు. ఆమె భర్త సంజీవ్, ఆమె ఇద్దరూ న్యూయార్క్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పని చేశారు. ‘ఆ ఉద్యోగం నా జీవితాన్ని నమిలేస్తుందని అనిపించింది. నాకు చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ మీద చాలా ఆసక్తి. మార్కెట్లో ఎలాంటి ట్రెండ్స్ వస్తున్నాయో గమనించేదాన్ని. మా అమ్మ ద్వారా నాకు భారతీయ సంస్కృతిని డిజైనింగ్‌లో ఎలా వాడాలో తెలిసింది. అందుకని ఇక్కడ ‘ఓమ్ హోమ్’ పేరుతో నా ఔట్లెట్ తెరిచాను. కోల్‌కతాలో కొంతమంది నేతగాళ్లను, టైలర్లను పనిలోకి తీసుకుని అక్కడ తయారు చేయించి ఇక్కడ నుంచి మార్కెటింగ్ చేస్తున్నాను’ అంటుంది ఊర్బి. ఆమె భర్తతో కలిసి కెనడాకు వలస వచ్చింది. ఊర్బి కుటుంబం ముందు నుంచి వ్యాపార రంగంలో ఉంది. ‘మా ముత్తాత బెంగాల్ పల్లెల నుంచి మొదటిసారి కోల్‌కతా వచ్చి ఇంటింటికి తిరిగి సబ్బులమ్మేవాడు’ అంది ఊర్బి. కష్టమే కాని తప్పదు ‘‘ఒక వయసు వచ్చిన స్త్రీలు ప్రాణం సుఖంగా ఉంది కదా ఇప్పుడు కొత్త కష్టాలు ఎందుకు అనుకుంటారు. 2018లో స్కేట్బోర్డింగ్ నేర్చుకునే సమయంలో ఇది నాకు అవసరమా అని ఒక క్షణం అనిపించింది. కొత్తది నేర్చుకోగలనా అనే సంశయం కూడా ఉండింది. కాని లేదు.. చేయాల్సిందే అని ముందుకు వెళ్లాను. ఇవాళ టొరెంటోలో స్కేట్బోర్డింగ్ కమ్యూనిటీ అంతా నన్ను చాలా గౌరవిస్తుంది. నా చేత ఆన్లైన్ క్లాసులు తీసుకుంటూ కొత్త పిల్లలు ఈ ఆటను నేర్చుకుంటున్నారు. అది కాదు విశేషం. ఎన్నో దేశాలలో చాలామంది నా వయసు వారు ‘నిన్ను చూసి ఇన్‌స్పయిర్ అయ్యి స్కేట్బోర్డింగ్ నేర్చుకుంటున్నాం’ అని నాకు మెసేజ్‌లు పెడుతున్నారు. ఇంతకన్నా ఏం కావాలి? జీవితం ఎప్పుడూ పూర్తయినట్టు కాదు. కొత్తగా ప్రారంభించవచ్చు’’ అంటుంది ఊర్బి. – సాక్షి ఫ్యామిలీ -
తుపాకీతో బెదిరించిన దొంగను ఉతికి ఆరేసింది!
ఓ దొంగోడు వచ్చి తుపాకీని పాయింట్ బ్లాంక్‌లో పెట్టి బెదిరిస్తే.. ఎవరైనా ఏం చేస్తారు? భయపడతారు. ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు. దొంగ ఏది అడిగితే అది ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. కానీ ఓ భారతీయ మహిళ మాత్రం అలా భయపడలేదు. తుపాకీ చూపినా దొంగకు లొంగిపోలేదు. క్యాష్ బాక్స్ ఎత్తుకుపోవడానికి ప్రయత్నించిన అతడిపై అపర కాళికలా విరుచుకుపడింది. తుపాకీని పక్కకుతోసేసి ఆ కుర్ర దొంగను చితకబాదింది. అంతటితో ఆగకుండా చేతికందిన సుత్తెతో రాణిరుద్రమ్మలా దాడికి ఉద్యుక్తం కావడంతో బెదిరిపోయిన ఆ దొంగ క్యాష్ బాక్స్ వదిలేసి పరుగులంకించుకున్నాడు. ఈ ఘటన అమెరికాలోని కీస్విల్లెలో జరిగింది. కీస్విల్లేలోని ఓ కిరాణ దుకాణంలో భూమిక పటేల్ అనే భారతీయ మహిళ క్యాషియర్‌గా పనిచేస్తుంది. 17 ఏళ్ల క్రిష్టియన్ డకోటా ఆమె దుకాణంలో దొంగతానికి ప్రయత్నించాడు. తుపాకీని పాయింట్ బ్లాంక్‌లో పెట్టి డబ్బు ఇచ్చేయమంటూ బెదిరించాడు. కానీ వాడిని బెంబేలెత్తిస్తూ.. భూమిక పటేల్ అపర చండిక అవతారమెత్తింది. 'నన్ను కాలుస్తావా.. కాల్చేయ్' మంటూ ఎదురుదాడి చేసింది. తుపాకీని బేఖాతరు చేస్తూ చేతికందిన వస్తువుతో చితకబాదింది. అంతటితో ఆగకుండా ఓ సుత్తెతో ఆమె దాడికి ఉద్యుక్తం కావడంతో డకోటా తన దుండగాన్ని మానుకొని పరుగులు లంకించాడు. అపర చండికలా వీరోచిత సాహసాన్ని ప్రదర్శించిన భూమిక పటేల్ ఇప్పుడు స్థానికంగా పెద్ద ఐకాన్ అయ్యారు. ఆమె గురించి స్థానిక మీడియా గొప్పగా కథనాలు ప్రచురిస్తోంది. ఆమె దొంగను చితకబాదిన సీసీటీవీ కెమెరా వీడియోను స్థానికులు ప్రత్యేకంగా వచ్చి మరీ తిలకిస్తున్నారు. ఆమె ధైర్యసాహసాలను మెచ్చుకుంటున్నారు.