‘హైదరాబాద్ ఏసెస్’ ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: చాంపియన్స్ టెన్నిస్ లీగ్ (సీటీఎల్)లో పాల్గొనే హైదరాబాద్ జట్టును ‘ఏసెస్’గా ఖరారుచేశారు. గురువారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో జట్టు పేరును ప్రకటించారు. టెన్నిస్ దిగ్గజం విజయ్ అమృత్‌రాజ్ ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. నగరానికి చెందిన మాజీ ఆటగాడు డాక్టర్ కె. రామరాజు, రాజేశ్ రాజు హైదరాబాద్ ఫ్రాంచైజీకి యజమానులుగా ఉన్నారు. ఏసెస్ జట్టుకు మార్క్ ఫిలిప్పోసిస్, మార్టినా హింగిస్, మిఖాయిల్ యూజ్నీ, జీవన్ నెడుంజెళియన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
హైదరాబాద్ జట్టు హోం మ్యాచ్‌లు ఈ నెల 17, 18 తేదీల్లో ఎల్బీ స్టేడియం టెన్నిస్ కాంప్లెక్స్‌లో జరుగుతాయి. 17న బెంగళూరుతో, 18న పుణేతో ఏసెస్ టీమ్ తలపడుతుంది. సీటీఎల్ వల్ల భారత్‌లోని వర్ధమాన టెన్నిస్ ఆటగాళ్లకు మేలు జరుగుతుందని, ఆటకు మరింత ప్రాచుర్యం లభిస్తుందని ఈ సందర్భంగా అమృత్‌రాజ్ అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె. తారకరామారావు, ప్రకాశ్ అమృత్‌రాజ్, ఫ్రాంచైజీ యజమానులు పాల్గొన్నారు.
గేమ్‌ల ఆధారంగా...
సీటీఎల్‌లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి. వీటిని రెండు గ్రూప్‌లుగా విభజించారు. ఒక్కో గ్రూప్‌లో మూడు జట్లు ఉంటాయి. తమ గ్రూప్‌లోని ఇతర రెండు టీమ్‌లతో తలపడిన అనంతరం పాయింట్ల ఆధారంగా టీమ్ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ప్రతీ మ్యాచ్‌లో ఐదు సెట్లు ఉంటాయి. ఒక్కో సెట్ ఆరు గేమ్‌ల చొప్పున సాగుతుంది. లెజెండ్స్ సింగిల్స్, మెన్స్ సింగిల్స్, ఉమెన్ సింగిల్స్, మెన్ డబుల్స్, మిక్స్డ్ డబుల్స్లుగా ఈ ఐదు సెట్లను వర్గీకరించారు.
సెట్ల ఆధారంగా కాకుండా ఐదు సెట్లలో కలిపి ఒక జట్టు సాధించిన గేమ్‌ల ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు. ఈ టోర్నీ చాంపియన్‌కు రూ. 1 కోటి, రన్నరప్‌కు రూ. 50 లక్షలు ప్రైజ్‌మనీగా లభిస్తుంది. 10 రోజుల పాటు జరిగే ఈ లీగ్‌లో మొత్తం 13 మ్యాచ్‌లు జరుగుతాయి.