breaking news
huge loss
-
ఒక్కరోజులోనే భారీగా నష్టపోయిన ప్రపంచ కుబేరుడు
ముంబై : అంతర్జాతీయ మార్కెట్లు ముఖ్యంగా అమెరికా మార్కెట్లు కుప్పకూలడంతో ప్రపంచవ్యాప్తంగా తొలి 500 మంది సంపన్నులు బుధవారం ఒక్క రోజులోనే భారీ మొత్తంలో సంపదను కోల్పోయారు. కేవలం ఒక్కరోజులోనే అక్షరాలా 7.3 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయారు. వీరందరిలో అత్యధికంగా నష్ట పోయింది అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్. ఈయన ఒక్కరే ఈ రోజు ఏకంగా 9.1 బిలియన్ డాలర్ల సంపదను (మన కరెన్సీలో దాదాపు 67 వేల కోట్ల రూపాయలు) కోల్పోయారు. ఈ ఏడాది బిలియనీర్ల సూచీలో వచ్చిన రెండో అతిపెద్ద కుదుపుగా దీనిని బ్లూమ్‌బెర్గ్ అభివర్ణించింది. వీరందరిలోకి బెజోస్ ఎక్కువగా నష్టపోయినట్లు పేర్కొంది. ఇక యూరప్‌కు చెందిన బిలియనీర్ బెర్నార్డ్ అర్నాల్ట్ సంపద రూ.33వేల కోట్లు ఆవిరైంది. ఆయన ఈ ఏడాదిలో పెంచుకున్న విలువలో సగం ఒక్కరోజులోనే కోల్పోయారు. ఇక బెర్క్‌షైర్ హత్వే అధినేత వారన్ బఫెట్ సంపద కూడా దాదాపు రూ.33 వేల కోట్లు తగ్గింది. మరో 67 మంది బిలియనీర్లు తమ సంపదలో దాదాపు రూ.2.3 లక్షల కోట్లను కోల్పోయారు. అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు ముదురుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ఆర్థికవ్యవస్థ వృద్ధి అంచనాలను ఐఎంఎఫ్ కుదించింది. ఈ రెండు దేశాలూ వచ్చే ఏడాదిలో వాణిజ్య వివాద ప్రభావాలను చవి చూడాల్సి వస్తుందని వ్యాఖ్యానించింది. దీంతో అమెరికా స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయిన నేపథ్యంలో ఈ కుబేరులంతా ఒక్క రోజులేనే తమ సంపదలో అధిక భాగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. దలాల్ స్ట్రీట్‌కు కూడా ఈ సెగ తాకడంతో ట్రేడింగ్ ప్రారంభంలోనే తొలి 5 నిమిషాల్లో సుమారు రూ.4లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైపోయిన సంగతి తెలిసింది. -
అమ్మకాల ఒత్తిడితో కుదేలయిన మార్కెట్లు
ముంబై: అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల ప్రభావంతో గతకొన్ని రోజులుగా నష్టాల్లో కొనసాగుతున్న మార్కెట్లు బుధవారం మరింత పతనమయ్యాయి దాదాపు 400 పాయింట్లకు పైగా నష్టపోయిన దేశీయ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. మంగళవారం లాభాలతో ముగిసిన సెన్సెక్స్ 396 పాయింట్ల నష్టంతో 24,326 దగ్గర, నిఫ్టీ 117 పాయింట్ల నష్టంతో 7,318 దగ్గర ట్రేడవుతున్నాయి. ఇన్వెస్టర్ల భారీగా అమ్మకాలకు పాల్పడుతుండటంతో అన్నిప్రధాన రంగా షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా బ్యాకింగ్ మెటల్, రియాల్టీ, ఆయిల్ రంగ షేర్లు భారీ పతనం దిశగా సాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర భారీగా తగ్గడంతో చమురు కంపెనీల నష్టాలు భారీగా పేరుకు పోయాయి. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత వాతావరణం నేపథ్యంలో భారత ఈక్విటీ మార్కెట్లు కూడా నష్టాలను చవి చూస్తున్నాయి. నెమ్మదించిన చైనా ఆర్థికరంగం, ఆయిల్ రంగంలో నెలకొన్న సంక్షోభం, ఇటీవలి డాలర్ పతనం భారత మార్కెట్లను ప్రభావితం చేస్తోందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. చమురు ధరలు చైనా మందగమనం, కరెన్సీ తదితర కీలక అంశాలు పెట్టుబడిదారులు ఆందోళనకు గురి చేస్తున్నాయంటున్నారు. అయితే అమెరికా, ఐరోపా దేశాలనుంచి మార్కెట్లనుంచి కొన్ని సానుకూల సంకేతాలు అందితే మిగిలిన అన్ని మార్కెట్లు నిలదొక్కుకునేందుకు అవకాశం ఉందంటున్నారు. ఈ పతనాన్ని దీర్ఘకాలిక మదుపరులు అవకాశంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్ కరెన్సీలతో పోలిస్తే భారతదేశం మెరుగ్గా ఉందని భావిస్తున్నారు.అటు డాలర్ తో పోలిస్తే భారత కరెన్సీ రూపాయి మరింత దిగజారింది. 30 పైసలు నష్టపోయి 67.95 దగ్గర ఉంది. దాదాపు రెండున్నర సంవత్సరాల కనిష్ట స్థాయికి పడిపోయింది. అటు మరోవైపు ఈక్విటీ మార్కెట్ల పతనంతో బంగారం, వెండి ధరలు లాభాల్లో కొనసాగుతున్నాయి.