breaking news
hindustan cables
-
మూతపడిన కంపెనీకి మోదీ ప్యాకేజీ
న్యూఢిల్లీ : నష్టాల్లో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ సంస్థ హిందూస్తాన్ కేబుల్స్ లిమిటెడ్(హెచ్‌సీఎల్) మూతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేబినెట్, ఉద్యోగుల వేతనాలకు బుధవారం స్పెషల్ ప్యాకేజీ ప్రకటించింది. ఈ మూత నేపథ్యంలో ఉద్యోగులకు వేతనాలు చెల్లించడానికి, రిటైర్మెంట్ పథకాలకు, ప్రభుత్వ రుణాన్ని ఈక్విటీలోకి మార్చుకునేందుకు అవసరమైన రూ.4,777.05 కోట్ల ప్యాకేజీని కేంద్రప్రభుత్వం ఆమోదించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో నేడు జరిగిన కేబినెట్ సమావేశంలో హెచ్సీఎల్ను మూసేందుకు ఆమోదించారు. కంపెనీల చట్టం 1956/2013, పరిశ్రమల వివాదాల చట్టం 1947, ఇతర చట్టాల కింద దీన్ని మూసివేస్తున్నట్టు కేంద్ర ఓ ప్రకటనలో తెలిపింది. వీఆర్ఎస్/వీఎస్ఎస్ ప్యాకేజ్ కింద 2007వ పే స్కేల్‌ను ఆఫర్ చేస్తున్నట్టు వెల్లడించింది. ఈ ప్యాకేజీని నగదు కింద రూ.1,309.90 కోట్లు, నగదురహిత కింద రూ.3,467.15 కోట్లను కంపెనీలోకి ప్రవేశపెట్టనుంది. కేంద్ర ప్రభుత్వ రంగంలోని టెలికాం శాఖకు కావలసిన కేబుల్స్‌ను తయారుచేసే సంస్థగా హెచ్‌సీఎల్ ఉండేంది. వైర్లెస్ ఫోన్లు మార్కెట్లోకి రావడంతో ల్యాండ్ ఫోన్లు, వాటికి కేబుల్స్ అవసరం దారుణంగా పడిపోవడంతో హెచ్‌సీఎల్ మూసివేత స్థితికి చేరింది. 1952లో ఏర్పాటైన ఈ సంస్థ, నాలుగు తయారీ యూనిట్లు రుప్నరైన్ పూర్, నరేంద్రపూర్ (పశ్చిమ బెంగాల్), హైదరాబాద్ (తెలంగాణ),నాని (ఉత్తరప్రదేశ్)లలో తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2015 ఫిబ్రవరిలోనే కంపెనీని మూసివేయడానికి కేంద్రం సిద్ధమైనా ఉద్యోగుల ఆందోళనలతో వెనక్కి తగ్గింది.అయితే అదే ఏడాది ఏప్రిల్ నుంచి ఉద్యోగులకు జీతాలు చెల్లించడంలేదు. -
మా సంస్థను డిఫెన్స్‌లో కలపండి
* హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్ ఉద్యోగుల డిమాండ్ * ఢిల్లీలో ధర్నా సాక్షి, న్యూఢిల్లీ: హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్ సంస్థను రక్షణ రంగానికి సంబంధించిన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్‌లో కలపాలని ఆ సంస్థ ఉద్యోగులు డిమాండ్ చేశారు. సోమవారం హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్‌తోపాటు హైదరాబాద్ పబ్లిక్ రంగ సమన్వయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ‘సేవ్ పబ్లిక్ సెక్టార్- సేవ్ ఇండియా’ నినాదంతో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేశారు. రక్షణ రంగంలో ఎఫ్‌డీఐలను ప్రవేశపెట్టాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎంపీలు వినోద్‌కుమార్, సీతారాం ఏచూరి, డి.రాజా ధర్నా వద్దకు వచ్చి సంఘీభావం తెలిపారు. హిందుస్థాన్ కేబుల్స్‌ను డిఫెన్స్‌లో కలిపే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని హామీ ఇచ్చారు. ఆందోళనలో హిందుస్థాన్ కేబుల్స్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు జె.సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి జి.దామోదర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు కె.శరత్‌బాబు, బుచ్చిరెడ్డి, యాదగిరిరావు పాల్గొన్నారు.