breaking news
Hindupur Lok Sabha constituency
-
గోరంట్ల మాధవ్ నామినేషన్‌కు ఆమోదం
సాక్షి, అనంతపురం: హిందూపురం లోక్‌సభ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ నామినేషన్‌కు ఆమోదం లభించింది. తీవ్ర ఉత్కంఠ రేపిన మాధవ్ నామినేషన్‌ను మంగళవారం ఎన్నికల అధికారులు ఆమోదించారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుగా గోరంట్ల మాధవ్ వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిని ఆమోదించాల్సిందిగా ట్రిబ్యునల్ తీర్పు వెలువరించినప్పటికీ.. చంద్రబాబు ప్రభుత్వం మాధవ్ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. అందులో భాగంగా ట్రిబ్యునల్ తీర్పుపై స్టే ఇవ్వాల్సిందిగా హైకోర్టును ఆశ్రయించారు. అయితే ట్రిబ్యునల్ తీర్పుపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో మాధవ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ లభించినట్టయింది. సోమవారం హిందూపురం లోక్‌సభ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాధవ్ నామినేషన్ దాఖలు చేశారు. హైకోర్టు తీర్పు కాపీలను కూడా రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. ముందు జాగ్రత్తగా ఆయన తన భార్య సునీతతో కూడా నామినేషన్ దాఖలు చేయించారు. ఈ రోజు అభ్యర్థుల నామినేషన్లను పరిశీలించిన ఎన్నికల అధికారులు మాధవ్ నామినేషన్‌ను ఆమోదించినట్టు ప్రకటించారు. అలాగే అనంతపురం లోక్‌సభ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తలారి రంగయ్య నామినేషన్‌కు కూడా ఎన్నికల అధికారులు ఆమోదం తెలిపారు. -
ఈ పురం ఎవరికి వరం
హిందూపురం లోక్‌సభ నియోజకవర్గం.. ఎన్నికలంటేనే రాష్ట్రం మొత్తం ఇటువైపు చూస్తుంది. ఎందుకంటే అనంతపురం జిల్లాలో ఈ సిగ్మెంట్ పరిధిలో ఉన్నహిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచే టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్, ఆయన కుమారుడు బాలకృష్ణ ప్రాతినిథ్యం వహించారు. ప్రస్తుతం హిందూపురం లోక్‌సభ నియోజకవర్గంలో టీడీపీ తరఫున నిమ్మల కిష్టప్ప పోటీచేస్తుండగా వైఎస్సార్సీపీ నుంచి గోరంట్ల మాధవ్ బరిలో దిగారు. హిందూపురం తొలి ఎన్నికల్లో పెనుకొండ పార్లమెంటరీ నియోజకవర్గంగా ఉండేది. 1957లో ఆ స్థానంలో హిందూపురం అవిర్భవించింది. 1952 ఎన్నికల్లో కేఎంపీపీ అభ్యర్థి కేఎస్ రాఘవాచారిఇక్కడ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తరువాత హిందూపురం స్థానానికి 15సార్లు ఎన్నికలు జరగ్గా.. కాంగ్రెస్, కాంగ్రెస్(ఐ), టీడీపీలు ఐదేసి సార్లు గెలుపొందాయి. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ఇక్కడి నుంచి గెలిచాక లోక్‌సభ స్పీకర్ అయ్యారు. ఈ నియోజకవర్గం పరిధిలో రాప్తాడు, మడకశిర, హిందూపురం, పెనుకొండ, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి నిమ్మల కిష్టప్ప గెలుపొందారు. ఇక్కడ వరుసగా మూడోసారి పోటీ చేసిన అభ్యర్థి గెలిచిన సందర్భం లేదు. కిష్టప్ప వరుసగా రెండుసార్లు ఎంపీగా విజయం సాధించారు. టీడీపీకి ఎదురుగాలి.. పెచ్చుమీరిన విభేదాలతో టీడీపీ బలహీనపడింది. పెనుకొండలో ఎమ్మెల్యే బీకే పార్థసారథితో కిష్టప్పకు తీవ్ర విభేదాలున్నాయి. ఎంపీ నుంచి గెలవడం కష్టమని భావించి ఇప్పటికే అసెంబ్లీకి వెళ్లాలని ప్రయత్నించగా కుదర్లేదు. మరోవైపు ఈ పార్లమెంటరీ పరిధిలో మైనారిటీల ఓట్లు ఎక్కువ. అయితే టీడీపీ ఒక్క సీటు కూడా మైనారిటీలకు కేటాయించలేదు. పుట్టపర్తిలో పల్లె రఘునాథరెడ్డి అవినీతిపై సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తున్నారు. ఇక్కడ శ్రీధర్‌రెడ్డి దూసుకుపోతున్నారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గ బాగోగులను పూర్తిగా విస్మరించారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ఘనీ వైఎస్సార్ సీపీలో చేరారు. బాలయ్యపై రిటైర్డ్ ఐజీ ఇక్బాల్ బరిలోకి దిగారు. రాప్తాడులో మంత్రి సునీత కుటుంబ‘సామంత పాలన’పై తీర్పు ఇచ్చేందుకు ఓటర్లు సిద్ధమయ్యారు. ధర్మవరంలో ఎమ్మెల్యే వరదాపురం వ్యవహారంతో టీడీపీకి ఇబ్బందికర పరిణామాలు ఎదురవుతున్నాయి. చేనేత వర్గాలు ఎక్కువగా ఉన్న ధర్మవరంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి కేతిరెడ్డి దూసుకుపోతున్నారు. మడకశిరలో టీడీపీ తరఫున ఈరన్న, వైఎస్సార్ సీపీ తరఫున డాక్టర్ తిప్పేస్వామి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వైఎస్ హయాంలో లేపాక్షి హబ్.. దివంగత సీఎం వైఎస్ హిందూపురం సమీపంలో ‘లేపాక్షి నాలెడ్జ్ హబ్’ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు పలు బహుళజాతి సంస్థలు పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చాయి. ఇందులోని పరిశ్రమలకు నీరందించేందుకు సోమశిల బ్యాక్ వాటర్ నుంచి పైపులైన్ నిర్మాణం చేపట్టారు. 25 శాతం పనులు పూర్తయ్యాయి. చంద్రబాబు ప్రభుత్వం వీటిలో ఏఒక్క సంస్థ పురోగతికి పాటు పడలేదు. పెద్ద పెద్ద సంస్థలంటూ శంకుస్థాపనలకే పరిమితం చేశారు. గోరంట్ల మాధవ్ సానుకూలతలు : పోలీసు అధికారిగా మంచి పేరుంది. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు పార్లమెంట్ పరిధిలో ఎక్కువ శాతం ఓటర్లు ఉన్న కురుబ సామాజికవర్గం నేత కావడం. జిల్లాలో వైఎస్సార్సీపీ బలంగా ఉండడం. టీడీపీ అవినీతి, అక్రమాలు ప్రజలకు తెలియడం. నిమ్మల కిష్టప్ప సానుకూలతలు : రెండు సార్లు ఎంపీగా చేసిన అనుభవం.. ఆర్థికంగా అండదండలు అందించే అనుచరగణం వ్యతిరేకతలు: రెండు మార్లు ఎంపీగా చేసినప్పటికీ ఆ ప్రాంతానికి ఏమీ చేయలేదని ప్రజల్లో బలంగా ఉంది. అలాగే నేతల అవినీతి అక్రమాలు పెచ్చుమీరిపోయాయి చేనేత రుణాలు మాఫీ చేస్తానని చెప్పి రిక్తహస్తం చూపడం. – మొగిలి రవివర్మ, సాక్షి ప్రతినిధి, అనంతపురం -
పురం.. ఎవరి పరం ?
ఒకప్పుడు పరిశ్రమల ఖిల్లాగా, వాణిజ్య కేంద్రంగా భాసిల్లిన హిందూపురం లోక్‌సభ స్థానం ఇప్పుడు బోసిపోయింది. పునర్వైభవం సాధించేందుకు సమర్థవంతమైన నాయకత్వం కోసం ఎదురుచూస్తోంది. ఇది రాజకీయ ముఖచిత్రంలోనూ సమూల మార్పులు సూచిస్తోంది. సాగునీరు అందించి బంజరు భూములను మాగాణులు చేసే... పరిశ్రమలు స్థాపించి చేతినిండా పని కల్పించే నేతకే పట్టం కడతామని ఇక్కడి ఓటర్లు స్పష్టం చేస్తున్నారు. ఆలమూరు రాంగోపాల్‌రెడ్డి - అనంతపురం: హిందూపురం లోక్‌సభ నియోజకవర్గంలో సిటింగ్ ఎంపీ, టీడీపీ అభ్యర్థి నిమ్మల కిష్టప్ప గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. పవర్‌లూమ్స్ యజమానులకు దన్నుగా నిలిచి సొంత సామాజిక వర్గమైన చేనేతల పొట్టకొట్టిన నిమ్మలపై ప్రజావ్యతిరేకత కన్పిస్తోంది. లోక్‌సభ నియోజకవర్గ అభివృద్ధికి వైఎస్ బాటలు వేయడం, ముస్లింలు, చేనేత, ఇతర సామాజిక వర్గాల ప్రజలు బాసటగా నిలుస్తోండటంతో వైఎస్సార్ సీపీ అభ్యర్థి దుద్దేకుంట శ్రీధర్‌రెడ్డి రేసులో ముందున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ ఖాళీ అవడంతో ఆ పార్టీ అభ్యర్థి చిన్న వెంకటరాముడు కనీస ప్రభావం కూడా చూపే పరిస్థితి లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ స్థానం నుంచి మొత్తం 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధాన పోటీ మాత్రం వైఎస్సార్ సీపీ, టీడీపీ అభ్యర్థుల మధ్య నెలకొంది. గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్యే పోటీ కొనసాగింది. పీఆర్పీ అభ్యర్థి కడపల శ్రీకాంత్‌రెడ్డి లక్షకుపైగా ఓట్లను చీల్చడంతో కాంగ్రెస్ అభ్యర్థి ఖాసీంఖాన్పై టీడీపీ అభ్యర్థి నిమ్మల కిష్టప్ప 22,835 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కడపల శ్రీకాంత్‌రెడ్డి బరిలో లేకుండా ఉంటే నిమ్మల కిష్టప్ప గెలుపొందే వారు కాదని రాజకీయ విశ్లేషకులు అప్పట్లో అభిప్రాయపడ్డారు. నిమ్మలపై ప్రజావ్యతిరేకత సిటింగ్ ఎంపీ నిమ్మల కిష్టప్పను టీడీపీ మరోసారి బరిలోకి దింపింది. ఐదేళ్లలో ఎంపీగా ఆయన ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలనూ చేపట్టలేకపోయారు. కదిరి-పుట్టపర్తి, పుట్టపర్తి-చిక్‌బళ్లాపూర్ రైలుమార్గాలను సాధిస్తానని చెప్పి.. చివరకు చేతులెత్తేశారు. హిందూపురాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తానన్నహామీని నెరవేర్చలేదు. ఎంపీ ల్యాడ్స్ నిధులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలున్నాయి. హిందూపురం మండలం ముద్దిరెడ్డిపల్లిలో బినామీ పేర్లతో పవర్‌లూమ్స్ నిర్వహిస్తున్నారని చేనేత వర్గం నేతల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. దీనివల్ల ధర్మవరం, సోమందేపల్లి, హిందూపురం పరిసర ప్రాంతాల్లోని చేనేత కార్మికులకు ఉపాధి లేకుండా పోతోంది. ఐదేళ్లలో హిందూపురం లోక్‌సభ స్థానం పరిధిలోని 58 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఏ ఒక్క కుటుంబాన్నీ నిమ్మల పరామర్శించిన దాఖాలాలు లేవు. దీంతో సొంత సామాజికవర్గంలోనే ఆయన పట్ల సానుకూలత లేదు. లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో టీడీపీ అభ్యర్థులు కూడా నిమ్మల పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. చివరకు హిందూపురం నుంచి పోటీచేస్తోన్న నందమూర్తి బాలకృష్ణ కూడా వ్యతిరేకిస్తోండటం గమనార్హం. అన్ని వర్గాలూ వైఎస్సార్ సీపీ వైపే లోక్‌సభ స్థానం పరిధిలో కురుబ, బోయ, చేనేత సామాజిక వర్గాల ప్రజలు, ఎస్సీలు, ముస్లిం మైనార్టీలు గెలుపోటములను నిర్దేశిస్తున్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో కురుబలకు చోటిస్తామని, జిల్లా పరిషత్ చైర్మన్ పదవి బోయలకు కేటాయిస్తామని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇవ్వడంతో ఆ రెండు సామాజిక వర్గాలూ పార్టీకి దన్నుగా నిలుస్తున్నాయి. చేనేత సంక్షేమం కోసం వైఎస్ అమలు చేసిన పథకాలను కొనసాగిస్తానని వైఎస్ జగన్ ప్రకటించడం ఆ వర్గాలను పార్టీకి చేరువ చేసింది. ముస్లిం మైనార్టీలు ఇప్పటికే వైఎస్సార్ సీపీ వైపు ఉన్నారు. వారు టీడీపీ-బీజేపీ పొత్తుపై మండిపడుతున్నారు. నియోజకవర్గాన్ని వ్యవసాయపరంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో యువ పారిశ్రామికవేత్త దుద్దేకుంట శ్రీధర్‌రెడ్డిని వైఎస్సార్ సీపీ బరిలోకి దించింది. ఐదేళ్లలో లక్ష మందికి తగ్గకుండా ఉపాధి కల్పించకపోతే.. 2019 ఎన్నికల్లో పోటీచేయనని శ్రీధర్‌రెడ్డి చేస్తోన్న వాగ్దానంపై జనం సానుకూలంగా స్పందిస్తున్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని చేనేతలకు అందుబాటులో తేవడం ద్వారా చేనేతలను ఆదుకుంటానన్న హామీపై కూడా సానుకూలత వ్యక్తమవుతోంది. హంద్రీ-నీవా రెండో దశను పూర్తిచేసి.. 2.34 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తానని, చెరువులను నింపి సేద్యానికి ఊపిరిపోస్తానని శ్రీధర్‌రెడ్డి హామీ ఇస్తున్నారు. ఇదీ చరిత్ర హిందూపురం లోక్‌సభ నియోజకవర్గం 1952లో ఏర్పాటైంది. తొలి సార్వత్రిక ఎన్నికల్లో కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ (కేఎంపీపీ) అభ్యర్థి కేఎస్ రాఘవాచారి కాంగ్రెస్ అభ్యర్థి కేఎస్ రావుపై విజయం సాధించారు. 1952, 1962 ఎన్నికల్లో కేవీఆర్ రెడ్డి (కాంగ్రెస్) విజయకేతనం ఎగురవేశారు. 1967లో నీలం సంజీవరెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. ఆయన కేంద్ర మంత్రివర్గంలోనూ స్థానం దక్కించుకున్నారు. 1971, 1977, 1980లో పాముదుర్తి బయపరెడ్డి హ్యాట్రిక్ విజయాలు నమోదు చేశారు. టీడీపీ ఆవిర్భవించాక 1984లో నిర్వహించిన ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి కె.రామచంద్రారెడ్డి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన సానిపల్లి గంగాధర్ వరుసగా రెండు సార్లు (1989, 1991) పార్లమెంటుకు వెళ్లారు. 1996 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఎస్.రామచంద్రారెడ్డికి ప్రజలు అవకాశమిచ్చారు. ఆ తర్వాత 1998లో నిర్వహించిన మధ్యంతర ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సానిపల్లి గంగాధర్‌ను విజయం వరించింది. 1999 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బీకే పార్థసారథి, 2004లో కాంగ్రెస్ అభ్యర్థి కర్నల్ నిజాముద్దీన్ గెలుపొందారు. 2009లో టీడీపీ అభ్యర్థి నిమ్మల కిష్టప్పకు విజయం దక్కింది. హిందూపురం: లోక్‌సభ నియోజకవర్గం తొలి ఎంపీ : కేఎస్ రాఘవాచారి (కేఎంపీపీ) ప్రస్తుత ఎంపీ : నిమ్మల కిష్టప్ప (టీడీపీ) రిజర్వేషన్ : జనరల్ ప్రధాన అభ్యర్థులు వీరే దుద్దేకుంట శ్రీధర్‌రెడ్డి (వైఎస్సార్ సీపీ) నిమ్మల కిష్టప్ప (టీడీపీ) చిన్న వెంకట్రాముడు (కాంగ్రెస్) హిందూపురం లోక్‌సభ స్థానం ఓటర్ల సంఖ్య 14,45,742 మహిళలు 7,11,655 పురుషులు 7,34,020 ఇతరులు 67 అసెంబ్లీ సెగ్మెంట్లు 1. రాప్తాడు 2. ధర్మవరం 3. కదిరి 4. పుట్టపర్తి 5. పెనుకొండ 6. మడకశిర 7. హిందూపురం నియోజకవర్గ ప్రత్యేకతలు - నియోజకవర్గ కేంద్రమైన హిందూపురం పట్టణం బెంగళూరుకు సమీపంలో ఉండ టంతో పారిశ్రామికంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. - నియోజకవర్గ పరిధిలోని పలు అసెంబ్లీ సెగ్మెంట్లు కర్ణాటకతో సరిహద్దును పంచు కుంటున్నాయి. - గిన్నిస్‌బుక్‌లో చోటు సంపాదించిన తిమ్మమ్మమర్రిమాను కదిరి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఉంది. - అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తి, ప్రసిద్ధిగాంచిన లేపాక్షి ఆలయం ఈ లోక్‌సభ స్థానం పరిధిలోనే ఉన్నాయి. అసెంబ్లీ సెగ్మెంట్లు .. బలాబలాలు రాప్తాడు పాత కాపులే మళ్లీ పోటీ పడుతున్నారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, టీడీపీ నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే పరిటాల సునీత బరిలోకి దిగారు. పరిటాల సునీత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదన్న విమర్శలున్నాయి. ఇదే సమయంలో తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి చారిటబుల్ ట్రస్టు ద్వారా వందలాది బోరు బావులు తవ్వించి ప్రజల దాహార్తి తీర్చారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా రమణారెడ్డి పోటీ చేస్తున్నారు. ధర్మవరం తాజా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆయన నియోజకవర్గాన్ని రూ.850 కోట్లతో అభివృద్ధి చేశారు. దీంతో ప్రజల్లో సానుకూలత ఉంది. టీడీపీ అభ్యర్థి వరదాపురం సూరి ఫ్యాక్షన్ నేపథ్యమున్న నేత కావడంతో ప్రజలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. టీడీపీ వర్గ విభేదాలూ ఆయనకు మైనస్. కాంగ్రెస్ అభ్యర్థి రంగన అశ్వర్థనారాయణ చేనేత ఓట్లపైనే ఆశలు పెట్టుకున్నారు. కదిరి ఇక్కడ ముస్లింల ఓట్లు అధికం. అత్తార్ చాంద్‌బాష వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా, తాజా మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. కందికుంట నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. దీనికితోడు బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోవడంతో మైనార్టీలు ఆ పార్టీని వ్యతిరేకిస్తున్నారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి శ్రీరామ్‌నాయక్ బంజారాల ఓట్లపైనే ఆశలు పెట్టుకున్నారు. పుట్టపర్తి ఇద్దరు విద్యావేత్తల మధ్య పోరు సాగుతోంది. వైఎస్సార్ సీపీ అభ్యర్థి సి.సోమశేఖరరెడ్డి ఐదేళ్లుగా సేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరువయ్యారు. టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న తాజా మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి ప్రజాప్రతినిధిగా ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి సామకోటి ఆదినారాయణ ఓటర్లను ప్రభావితం చేసే పరిస్థితి కన్పించడం లేదు. పెనుకొండ వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా ఎం.శంకరనారాయణ, కాంగ్రెస్ తరఫున ఏపీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి, టీడీపీ నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి పోటీ చేస్తున్నారు. టీడీపీ అభ్యర్థిని ఆ పార్టీ శ్రేణులే వ్యతిరేకిస్తున్నాయి. అభివృద్ధి పనులు చేయకపోవడంతో ప్రజలు కూడా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. టీడీపీలోని పరిటాల వర్గం రఘువీరాకు అనుకూలంగా పని చేస్తున్నట్లు విమర్శలున్నాయి. మడకశిర ఏపీసీసీ చీఫ్ రఘువీరా సొంత నియోజకవర్గమైన మడకశిరలో కాంగ్రెస్ అభ్యర్థి కె.సుధాకర్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. టీడీపీ అభ్యర్థి ఈరన్నకు అసమ్మతి వెంటాడుతోంది. వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఎం.తిప్పేస్వామికి ఆదరణ కన్పిస్తోంది. వైఎస్ హయాంలో వక్కలిగ సామాజికవర్గం వారిని బీసీ జాబితాలో చేర్చడం, మడకశిరను అభివృద్ధి చేయడం వైఎస్సార్ సీపీ అభ్యర్థికి లాభిస్తాయని ప్రజలు భావిస్తున్నారు. హిందూపురం టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణకు పార్టీలో వర్గ విభేదాలు, స్థానికేతర వివాదం, టీడీపీ ఎమ్మెల్యేల పాలనలో అభివృద్ధి జరగకపోవడం వంటివి ప్రతికూలాంశాలుగా మారాయి. వైఎస్సార్ సీపీ అభ్యర్థి నవీన్ నిశ్చల్‌కు మాస్‌లీడర్‌గా పేరుంది. ఇక్కడ ఎక్కువగా ఉన్న మైనార్టీలు, ఎస్సీలు, బీసీలు ఆయనకు దన్నుగా నిలుస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎంహెచ్ ఇనయతుల్లాను మైనార్టీ వర్గాలే వ్యతిరేకిస్తున్నాయి. జీవనాడి: కూలికెళ్లిన మావాడు.. ఏఈ అయ్యాడు! మాది పేద కుటుంబం. కూలీనాలీ చేసి మా కొడుకు కళ్యాణ్‌రెడ్డిని పదో తరగతి వరకు చదివించాం. ఆ తర్వాత అనంతపురం పాలిటెక్నిక్ కాలేజీలో చేర్పించాం. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువు మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. సుమారు ఏడాది పాటు కూలీ నాలీ చేసుకుంటూ ఇంటి దగ్గరే ఉండిపోయాడు.ఆ సమయంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీంతో కళ్యాణ్ మళ్లీ కాలేజీకి వెళ్లాడు. పాలిటెక్నిక్, ఆ తర్వాత మదనపల్లి మిట్స్ కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. రీయింబర్స్మెంట్ ఉన్నందున ఫీజుల సమస్యే తలెత్తలేదు. చదువు పూ ర్తవగానే ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు అదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో పంచాయతీరాజ్ శాఖ ఏఈగా పనిచేస్తున్నాడు. వైఎస్సే లేకపోతే మా బిడ్డ కూలి పనులకే పరిమితమయ్యే వాడు.’’ - హేమలత, ఈశ్వరరెడ్డి, చిప్పలమడుగు, కదిరి మండలం ప్రగతి పరిశీలన సమాధి రాళ్లు : - ఆత్మకూరులో జూలై 9, 1999న హంద్రీ-నీవా పథకం కోసం చంద్ర బాబు పునాదిరాయి వేశారు. శిలాఫలకానికి కుడివైపున మూడు మీటర్ల మేర మాత్రమే కాలువ తవ్వించి..తర్వాత పట్టించుకోలేదు. - ఎగువన కర్ణాటక చేపట్టిన నాగలమడక ప్రాజెక్టును అడ్డుకోక పోవడంతో రామగిరి మండలంలోని పేరూరు డ్యాం ఒట్టిపోయింది. - బాబు నిర్లక్ష్యం వల్ల హిందూపురంలో 26 పరిశ్రమలు మూతపడ్డాయి. - పరగోడు రిజర్వాయర్(కర్ణాటక)ను అడ్డుకోకపోవడంతో చిత్రావతి నది పరీవాహక ప్రాంతంలో 35 వేల ఎకరాల ఆయకట్టు బీడుపడింది. - తన హయాంలో మంత్రిగా ఉన్న నిమ్మల కిష్టప్ప పవర్‌లూమ్స్‌ను ప్రోత్సహించి...చేనేతల పొట్టగొట్టినా చంద్రబాబు పట్టించుకోలేదు. అభివృద్ధికి ఆనవాళ్లు - హిందూపురం లోక్‌సభ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయాలన్న లక్ష్యంతో వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.6,850 కోట్లతో హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకాన్ని చేపట్టారు. - హిందూపురం, మడకశిర ప్రాంతాలకు తాగునీటి కోసం రూ.560 కోట్లతో నీలకంఠాపురం శ్రీరామరెడ్డి పథకాన్ని పూర్తి చేయించారు. - ధర్మవరం, కదిరి మునిసిపాలిటీల్లో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం రూ.170 కోట్లతో పథకాలను చేపట్టారు. - మడకశిర నియోజకవర్గాన్ని రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి చేశారు. హార్టికల్చర్, వెటర్నరీ పాలిటెక్నిక్‌లు, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కాలేజీలను ఏర్పాటు చేయించారు. - హిందూపురం పరిసర ప్రాంతాల్లో ప్రతిష్టాత్మక ఐఐఎస్సీ(ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెన్సైస్) రెండో క్యాంపస్‌ను ఏర్పాటు చేయించడానికి 2008లో కేంద్రాన్ని ఒప్పించారు. వైఎస్ హఠాన్మరణంతో ఆ ప్రతిపాదనను కేంద్రం పక్కన పెట్టింది.