breaking news
GSLV D6 experiment
-
కౌంట్‌డౌన్ షురూ
-
కౌంట్‌డౌన్ షురూ
నేటి సాయంత్రం 4.52 గంటలకు జీఎస్ఎల్వీ డీ6 ప్రయోగం సూళ్లూరుపేట: ఇస్రో శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి చేపట్టనున్న జీఎస్ఎల్వీ డీ6 కమ్యూనికేషన్ల ఉపగ్రహ ప్రయోగానికి బుధవారం మధ్యాహ్నం 11.52 కు కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభమైంది. 29 గంటల కౌంట్‌డౌన్ అనంతరం గురువారం సాయంత్రం 4.52 గంటలకు ప్రయోగాన్ని నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన క్రయోజనిక్ ఇంధన దశతో రెండోసారి చేస్తున్న ప్రయోగం ఇది. బుధవారం కౌంట్‌డౌన్ ప్రారంభమైన వెంటనే రెండోదశలో 39.5 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను మధ్యాహ్నం 2 గంటలకు పూర్తిచేశారు. ప్రస్తుతం రాకెట్‌కు తుది విడత తనిఖీలు చేస్తున్నారు. షార్‌లో జీఎస్ఎల్వీ డీ6 ప్రయోగాన్ని చేపడుతుండడంతో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళ(సీఐఎస్ఎఫ్) సిబ్బంది కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. షార్కు చుట్టూ ఉన్న దీవి గ్రామాలతో పాటు వేనాడు, ఇరకం దీవుల్లోనూ కూంబింగ్ నిర్వహించారు. అటకానితిప్ప వద్ద చెక్‌పోస్టును ఏర్పాటు చేశారు. గురువారం సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని జాలర్లను హెచ్చరించారు. ‘సిల్వర్ జూబ్లీ’... సాక్షి, హైదరాబాద్: జీఎస్ఎల్వీ డీ6.. ఇస్రో తయారు చేసిన 25 వ సమాచార ఉపగ్రహం. జీ శాట్ శ్రేణిలో ఆరవది. దీని బరువు 2,117 కిలోలు. ఎస్ బ్యాండ్‌లో 5 స్పాట్ బీమ్స్, సీ బ్యాండ్‌లో ఒక జాతీయ బీమ్ ద్వారా ఈ ఉపగ్రహం రక్షణ, విమానయాన, అంతరిక్షం వంటి వ్యూహాత్మక రంగాలకు సమాచార సౌకర్యాలు కల్పిస్తుంది. ఇది అందుబాటులోకి వస్తే మొబైల్ ఫోన్ల వంటి పరికరాలతోనే సురక్షితంగా సమాచారం ఇచ్చిపుచ్చుకోవచ్చు. తొమ్మిదేళ్లపాటు సేవలందించేలా దీన్ని రూపొందించారు. దీని ప్రయోగం కోసం తొలిసారి ఇస్రో భారీ సైజు అన్‌ఫర్లబుల్ యాంటెన్నాను వాడుతోంది. కక్ష్యలోకి చేరిన తరువాత ఓ గొడుగులా విచ్చుకునే ఈ రకమైన యాంటెన్నా దాదాపు ఆరు మీటర్ల వ్యాసం ఉంటుంది. గత ఏడాది జనవరి 5 న జరిగిన జీఎస్ఎల్వీ డీ5 ప్రయోగంలో తొలిసారి పూర్తి స్వదేశీ టెక్నాలజీతో తయారైన క్రయోజెనిక్ ఇంజిన్‌ను ఇస్రో విజయవంతంగా పరీక్షించింది.