breaking news
Green Energy Co.
-
గ్రీన్ ఎనర్జీలో ఏపీ టాప్
సాక్షి,అమరావతి: గ్రీన్ ఎనర్జీ రంగంలోకి వెల్లువెత్తుతున్న పెట్టుబడులతో దేశంలోనే పునరుత్పాదక ఇంధన రంగంలో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ అవతరిస్తోందని ఇంధనశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. సీఎం వైఎస్ జగన్ స్పష్టమైన విధానాలే పెట్టుబడిదారులకు విశ్వాసాన్ని కల్పించాయన్నారు. విశాఖలో రెండురోజులు జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్) విజయవంతమవడంతోపాటు, పెట్టుబడులను ఆకర్షించడంలో ఇంధనరంగం ప్రథమస్థానంలో నిలిచిన సందర్భంగా ఆయన ఆదివారం ఇంధనశాఖ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. గ్రీన్ ఎనర్జీ పెట్టుబడులను ఆకర్షించడంలో ఇతర రాష్ట్రాల కంటే ఏపీ ముందుందని, జీఐఎస్ వేదికగా ఇంధన రంగంలో రూ.9.57 లక్షల కోట్ల పెట్టుబడులను తెచ్చే 42 అవగాహన ఒప్పందాలపై రాష్ట్ర ప్రభుత్వం సంతకాలు చేసిందని చెప్పారు. దేశంలో అగ్రశ్రేణి కంపెనీలైన రిలయన్స్ ఇండియా లిమిటెడ్, అదానీ గ్రీన్ వంటివి ఏపీలో పెద్ద ఎత్తున గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను స్థాపించడానికి ముందుకొచ్చాయని, తద్వారా దాదాపు 1.8 లక్షల ఉపాధి అవకాశాలు రావచ్చని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ రంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రయత్నిస్తోందని, ఈ పెట్టుబడులు రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీని వేగంగా పెంచడానికి సహాయపడతాయని చెప్పారు. ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ మాట్లాడుతూ రాష్ట్రం ఇప్పటికే పునరుత్పాదక ఇంధన ఎగుమతి విధానం–2020ని ప్రకటించిందని చెప్పారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ రాష్ట్రంలో 10 గిగావాట్ల పునరుత్పాదక సోలార్ ఎనర్జీ ఉత్పత్తికి పెట్టుబడి పెడుతామని చెప్పిందని, అదానీ గ్రీన్ ఎనర్జీ 15 గిగావాట్ల సామర్థ్యంతో పునరుత్పాదక ఇంధన యూనిట్లను ఏర్పాటు చేయనుందని వివరించారు. జీఐఎస్‌కు ముందు కూడా రూ.81 వేల కోట్ల విలువైన గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల కోసం రాష్ట్రం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుందని ఆయన గుర్తుచేశారు. నెడ్‌క్యాప్ వీసీ, ఎండీ ఎస్.రమణారెడ్డి మాట్లాడారు. ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ బి.శ్రీధర్, డిస్కంల సీఎండీలు కె.సంతోషరావు, జె.పద్మజనార్దనరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
రైతన్నకు సౌరశక్తి.. తొలి అడుగు పడింది
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రైతులకు శాశ్వత ప్రాతిపదికన ఉచిత విద్యుత్ అందించేందుకు తొలి అడుగు పడింది. వచ్చే 30 ఏళ్లపాటు నిరంతరాయంగా వైఎస్సార్ ఉచిత విద్యుత్ పథకాన్ని కొనసాగించే దిశగా ప్రభుత్వం ప్రతిష్టాత్మక మెగా సోలార్ ప్రాజెక్టును పట్టాలపైకి తెచ్చింది. రైతన్నకు మరింత ఊతం ఇవ్వబోతున్న ఈ మెగా సోలార్‌తో... యూనిట్ కేవలం రూ.2.48కే అందబోతోంది. ఫలితంగా మొదటి సంవత్సరంలోనేరూ.3,836 కోట్లు ఆదా అవుతాయి. మొత్తంగా వచ్చే 30 ఏళ్లలో ఈ మెగా సోలార్‌తో ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ.1.2 లక్షల కోట్లు ఆదా కాబోతోంది. ఏటా 14వేల మిలియన్ యూనిట్లు వ్యవసాయానికి పగటిపూట 9 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ అందించాలంటే ఏటా దాదాపు 14 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం. ఇందుకయ్యే వ్యయాన్ని ప్రభుత్వం సబ్సిడీగా డిస్కమ్‌లకు అందిస్తోంది. గతంలో డిస్కమ్‌లకు ఈ సబ్సిడీ చెల్లింపులు అరకొరగానే ఉండేవి. దీంతో విద్యుత్ సంస్థలు భారీ అప్పుల్లో కూరుకుపోయి మనలేని స్థితికి చేరాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక 2019–20లో దాదాపు రూ.17,900 కోట్లు విద్యుత్ సంస్థల చేతికందేలా చర్యలు తీసుకుంది ఇక ఈ ఏడాది సబ్సిడీ దాదాపు రూ.9 వేల కోట్లకు చేరింది. ఇలా పెరుగుతున్న సబ్సిడీకి కారణం టీడీపీ ప్రభుత్వంలో అడ్డగోలుగా, భారీ ధరలకు చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలే. మరి దీన్ని నియంత్రించటమెలా? ఎక్కడో ఒకచోట కళ్లెం వేయకపోతే భవిష్యత్తు భయంకరంగా తయారవుతుంది కదా? ఇదే ఉద్దేశంతో సబ్సిడీ భారాన్ని నియంత్రించడానికి కదిలిన ప్రభుత్వం.. వ్యవసాయానికి చౌక విద్యుత్ అందించడానికి 6,400 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తిని చేపట్టింది. ఈ ప్రాజెక్టుకు రూ.50 వేల కోట్ల పెట్టుబడి కావాలి. అందుకే ‘బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ (బీవోటీ)’ పద్ధతిలో మెగా సోలార్కు టెండర్లు పిలిచింది. నిర్మాణ సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలు చేయడానికి గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ టెండర్లు పిలవగా... ఈ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా ఉండేందుకు ప్రభుత్వం ముందే టెండర్ డాక్యుమెంట్లను న్యాయ సమీక్షకు పంపించింది. విద్యుత్ దిగ్గజాలు ఎన్టీపీసీ, టోరెంట్ పవర్, అదానీ సహా మరికొన్ని సంస్థలు పోటీపడ్డాయి. పది ప్రాంతాల్లో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు మొత్తం 24 బిడ్లు వచ్చాయి. రివర్స్ టెండరింగ్ చేపట్టడం వల్ల సోలార్ విద్యుత్ యూనిట్ కనిష్టంగా రూ.2.48కే లభించే వీలు కలిగింది. టెండర్లను ఖరారు చేసిన గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్... రివర్స్ టెండరింగ్‌తో తొలి ఏడాదే రూ.3,836 కోట్ల ప్రజాధనం ఆదా అవుతున్నట్లు తెలియజేసింది. టీడీపీ అడ్డగోలు ఒప్పందాలు... విద్యుత్ నిర్వహణలో విద్యుత్ కొనుగోళ్ళే కీలకం. కాకపోతే 2014–19 మధ్య అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం దీన్ని పూర్తిగా విస్మరించింది. 2014లో రూ.33,500 కోట్లు ఉన్న విద్యుత్ రంగం అప్పులు... టీడీపీ ప్రభుత్వం అడ్డగోలుగా జరిపిన ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్ళు, అవినీతి కారణంగా 2019 మార్చి చివరినాటికి రూ.70,250 కోట్లకు చేరాయి. విద్యుత్ సంస్థల చెల్లింపులు రూ.2,893 కోట్ల నుంచి ఏకంగా రూ.21,500 కోట్లకు చేరాయి. విద్యుత్ పంపిణీ సంస్థలు రూ.19920 కోట్ల అప్పుల్లో కూరుకుపోయాయి. ప్రయివేటు సౌర, పవన విద్యుత్ కొనుగోళ్ళను తెలుగుదేశం అవసరానికి మించి ప్రోత్సహించి... సోలార్కు యూనిట్‌కు రూ. 5.25 నుంచి రూ.5.90 వరకూ చెల్లించేలా... అది కూడా పాతికేళ్ల పాటు అమల్లో ఉండేలా దీర్ఘకాలిక ఒప్పందాలు చేసుకుంది. అంతటితో ఆగకుండా ఆయా ప్రయివేటు విద్యుత్ సంస్థలు చెల్లించే ఆదాయపు పన్నును, ఎలక్ట్రిసిటీ డ్యూటీని తిరిగి వాళ్లకు రిఫండ్ ఇచ్చేలా ఒప్పందం చేసుకుంది. ఇవి కూడా కలిపితే యూనిట్ విద్యుత్ ఖరీదు చాలా ఎక్కువ. ఫలితంగా విద్యుత్ సంస్థలపై మోయలేని భారం పడింది. పవన విద్యుత్‌కు యూనిట్‌కు రూ. 4.84 చొప్పున చెల్లించేలా ఏకంగా 41 విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏలు) చేసుకుంది. ఈ ధరకు ఆదాయపు పన్ను, ఎలక్ట్రిసిటీ డ్యూటీ రీఫండ్ అదనం. పైపెచ్చు పవన, సౌర విద్యుత్ కోసం థర్మల్ విద్యుత్‌ను తగ్గించి, స్థిర ఛార్జీలు వృధాగా చెల్లించింది. చిత్రమేంటంటే టీడీపీ ప్రభుత్వం నామినేషన్లపై ఇలా ఏకపక్షంగా రూ.4.84 చెల్లించి పీపీఏలు చేసుకున్న సంవత్సరంలోనే... అంటే 2017లోనే గుజరాత్ ప్రభుత్వం టెండర్లు పిలిచి యూనిట్‌ను రూ.2.43కే కొనుగోలు చేసింది. దీన్నిబట్టే చంద్రబాబు ప్రభుత్వ అవినీతి ఏ స్థాయిలో ఉందో తేలిగ్గా అర్థమవుతుంది. తాజాగా మెగా సోలార్ ప్రాజెక్టులో భాగంగా యూనిట్ రూ.2.48కే వస్తుండటంతో... సబ్సిడీ కష్టాలకు చెక్‌పడి, రైతులకు శాశ్వతంగా ఉచిత విద్యుత్ అందనుంది. -
గ్రీన్కో ఎనర్జీలో రూ.1,530 కోట్ల పెట్టుబడులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పునరుత్పాదక ఇంధన రంగంలో ఉన్న గ్రీన్కో ఎనర్జీలో సింగపూర్‌కు చెందిన ఇన్వెస్ట్మెంట్ కంపెనీ జీఐసీతోపాటు అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీలకు చెందిన కంపెనీలు సుమారు రూ.1,530 కోట్లు పెట్టుబడి పెట్టాయి. దీంతో గ్రీన్‌కోలో మెజారిటీ వాటాదారుగా జీఐసీ నిలిచింది. 1,000 మెగావాట్లకుపైగా పవన, జల విద్యుత్ ప్రాజెక్టులను గ్రీన్కో నిర్వహిస్తోంది.