breaking news
go number 30
-
కాపుల్లో ఇంత అసంతృప్తి ఉందా?
సాక్షి, విజయవాడ బ్యూరో/హైదరాబాద్: కాపు గర్జన ఉద్యమం ఉధృత రూపం దాల్చడంతో అవాక్కయిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ కోపాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలపై చూపించారు. కాపుల్లో ఇంత అసంతృప్తి ఉందా అని పార్టీ నేతలను ప్రశ్నించి.. దాన్ని పసిగట్టలేకపోయారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసంలో మధ్యాహ్నం నుంచి గర్జన పరిణామాలను ఎప్పటికప్పుడు ఆయన తెలుసుకుంటూ వచ్చారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో టెలి కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ.. ఇంటెలిజెన్స్ అధికారులు అక్కడ ఏంజరుగుతుందో తెలుసుకోలేకపోవడం ఏమిటని ఆయన ఆగ్రహించినట్లు సమాచారం. సమావేశం జరుగుతుందని మాత్రమే అంచనా వేశామని, అప్పటికప్పుడు ముద్రగడ ఆందోళనకు పిలుపునిస్తారని ఊహించలేదని అధికారులు వివరణ ఇచ్చినా సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఘటన జరిగిన తర్వాత కూడా పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకురాలేకపోవడం, కనీసం అక్కడ ఏంజరుగుతుందో కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఉండడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు కాపు గర్జనకు అనూహ్య స్పందన రావడానికి ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అనుసరించిన తీరే కారణమని ఆ పార్టీలోని కాపు నేతలు అంటున్నారు. సీఎం అయిన తరువాత కాపులను బీసీల్లో చేరుస్తామన్న హామీని పట్టించుకోకపోవడం, కాపు నాయకుల్ని ఎదగనీయకుండా తొక్కిపెట్టడం వంటివాటి వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని అంతర్గత సంభాషణల్లో దుయ్యబడుతున్నారు. కట్టడి చేయడం వల్లే.. ‘కాపు నాయకులు ఎవరూ సభకు వెళ్లవద్దని టెలి కాన్ఫరెన్సుల్లో మా అధినేత ఆదేశించడం వల్లే ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. పార్టీలోని కాపు ఎమ్మెల్యేలను వెళ్లనిచ్చి ఉంటే సమస్యే ఉండేది కాదు. కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏటా రూ.వెయ్యి కోట్ల చొప్పున అయిదేళ్లలో రూ.5 వేల కోట్లు కేటాయిస్తామని, కాపులను బీసీల్లో చేరుస్తామని చెప్పి.. నెరవేర్చకపోవడం వల్ల యువతలో అసహనం పెరిగింది. బాబుపై నమ్మకం లేకపోవడం వల్లే ఉద్యమించి సాధించుకోవాలనే అభిప్రాయానికి వచ్చారు. కాపు కార్పొరేషన్ జీవో జారీచేసి ఎంగిలి మెతుకులు విదిల్చినట్లు రూ.వంద కోట్లే ఇవ్వడంతో యువతలో కోపం పెరిగింది. ఇవన్నీ కాపు ఉద్యమం వైపు జనాన్ని నడిపించాయి. ఇందుకు పార్టీ అధినేత చంద్రబాబే బాధ్యుడు. కాపు గర్జనలో బీజేపీ నాయకులు కూడా పాల్గొన్నా.. వైఎస్సార్ సీపీని టార్గెట్ చేయడం కూడా తప్పే. ఈ విషయాన్ని ప్రజలు గమనిస్తారు. ఇది పార్టీకే నష్టం..’ అని టీడీపీలోని కాపు నాయకులు పేర్కొన్నారు. -
జీఓ 30 అమలు అసాధ్యం
* కాపు నాయకులే దాన్ని ఇవ్వొద్దన్నారు * కాపు రిజర్వేషన్లను బీసీలు వ్యతిరేకిస్తున్నారు * కమిషన్ సిఫారసు చేయకపోతే మేమేం చేయలేం * ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ * ఖద్దరు బట్టలు వేసుకొని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ధ్వజం సాక్షి, విజయవాడ బ్యూరో: కాపుల రిజర్వేషన్లకు సంబంధించిన జీఓ నంబర్ 30ను అమలు చేయడం అసాధ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ మేరకు కోర్టు తీర్పులున్నాయని చెప్పారు. తునిలో జరిగిన ఘటనలు కాపులకే నష్టదాయకమని వ్యాఖ్యానించారు. కాపు ఐక్య గర్జన పరిణామాలపై ఆయన ఆదివారం రాత్రి తన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రాజకీయ దురుద్దేశంతో కొన్ని రాజకీయ పార్టీలు కావాలని ఇదంతా చేశాయని ఆరోపించారు. తునిలో జరిగిన ఆందోళనలో 25 వాహనాలు, ఒక రైలు కాలిపోయాయని, ఇద్దరు డీఎస్పీలు, ముగ్గురు సీఐలు, ముగ్గురు ఎస్ఐలు, ఎనిమిది మంది కానిస్టేబుళ్లు గాయపడ్డారని చెప్పారు. వారిలో ఒక సీఐ, కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉందన్నారు. రెండు పోలీస్ స్టేషన్లు ధ్వంసమయ్యాయన్నారు. ప్రశాంతంగా ఉండే తూర్పుగోదావరి జిల్లాలో 40 ఏళ్లలో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదని అన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు, అమరావతిని ఇలాగే అడ్డుకున్నారని, రాయలసీమలోనూ విద్వేషాలు రెచ్చగొట్టాలని చూశారని ఆరోపించారు. జీఓ ఇచ్చినా చెల్లదు కాపులను బీసీల్లో కలపాలని చూస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కాపు రిజర్వేషన్లను బీసీలు వ్యతిరేకిస్తున్నారని ఉద్ఘాటించారు. బీసీల ప్రయోజనాలు దెబ్బతినకుండా ఎలా చేయాలో ఆలోచిస్తున్నామన్నారు. కాపుల రిజర్వేషన్లపై సిఫారసుల కోసం కమిషన్ను నియమించామని తెలిపారు. జీఓ నంబర్ 30ని అమలు చేయడం ఎలా సాధ్యమని కాపు నేతలను ప్రశ్నించారు. రిజర్వేషన్లపై ఒక కమిషన్ వేసి, దాని సిఫారసుల ఆధారంగా చేయమని ఈ జీఓలో పేర్కొన్నారని, దానిపైకొందరు కోర్టుకెళ్లారని పేర్కొన్నారు. బలవంతంగానో, శాంతిభద్రతల సమస్య కారణంగానో దీనిపై నిర్ణయం తీసుకోవద్దని హైకోర్టు తీర్పు ఇచ్చిందని, ఒక కమిషన్ వేసి వాళ్ల నివేదిక ప్రకారం చేయాలని సూచించిందని గుర్తుచేశారు. కమిషన్ సిఫారసు చేయకపోతే తాము చేయడానికి ఏమీ ఉండదని తేల్చిచెప్పారు. నిబంధనల ప్రకారం చేయకపోతే ఈ రిజర్వేషన్లపై జీఓ ఇచ్చినా చెల్లదన్నారు. దానిపై తాను తూర్పుగోదావరి జిల్లాలో కాపు నేతలతో మాట్లాడానని, జీఓ ఇవ్వొద్దని, నిబంధనల ప్రకారమే చేయాలని వారు కోరారని తెలిపారు. పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కాపుల రిజర్వేషన్లపై ఏం చేసిందని చంద్రబాబు ప్రశ్నించారు. గర్జనలో కాపులు 10 శాతం మందే వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ వాళ్లే ఇదంతా చేయించారని, వాళ్లకు సంబంధించిన ఆరు, ఏడు వాహనాలను ముందే పంపించారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఒక కుట్ర ప్రకారం ఇదంతా జరిగిందన్నారు. రైళ్లు తగులబెట్టడం, పోలీసులను కొట్టడం దారుణమన్నారు. ఖద్దరు బట్టలు వేసుకున్న నాయకులు ఫోజులు కొడుతూ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, ప్రభుత్వం అంటే అంత చులకనైపోయిందా? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలంటే తాను రేపే మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి, జీఓ ఇస్తానని అది నిలవకపోతే ఏం చేస్తారని ప్రశ్నించారు. కాపుల ఐక్య గర్జనకు ఇతర ప్రాంతాల నుంచే ఎక్కువ మంది వెళ్లారని, కాపులు ఐదు, పది శాతం మంది మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు. ఇకపై సమావేశాలు జరిగితే ఆధార్ కార్డులు చూపిస్తే కానీ లోనికి పంపని పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.