breaking news
GMV
-
ఈసారి ఈ–కామర్స్‌కు పండుగే..!
న్యూఢిల్లీ: ఈ ఏడాది పండుగ సీజన్ ఈ కామర్స్ కంపెనీల సంబరాలను రెట్టింపు చేసే అవకాశం ఉంది. ఈసారి ఆన్లైన్ అమ్మకాలు రెండింతలు ఉండొచ్చని రెడ్‌సీర్ రీసెర్చ్ నివేదిక చెబుతోంది. గతేడాది ఈ–కామర్స్ కంపెనీలు సాధించిన గ్రాస్ మర్చండైజ్ వాల్యూ(జీఎంవీ) 3.8 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఈ ఏడాది జీఎంవీ 7 బిలియన్ డాలర్లుగా ఉండవచ్చని నివేదిక సర్వే అంచనా వేసింది. ఆన్లైన్ షాపింగ్ పోర్టల్ ద్వారా జరిగే లావాదేవీల స్థూల విలువను జీఎంవీగా పిలుస్తారు. ఆన్లైన్ కొనుగోళ్లకు డిమాండ్ ఇందుకే.. కోవిడ్–19 తర్వాత కస్టమర్లు గతంలో కంటే సురక్షితమైన, శుభ్రమైన, సౌకర్యవంతమైన రీతిలో షాపింగ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఈ కామర్స్ సంస్థలు అలాంటి సదుపాయాల కల్పనను సిద్ధం చేసుకున్నాయి. ఇందులో భాగంగా వీడియో, వాట్సాప్ ఆధారిత షాపింగ్ విధానంతో ఈ కామర్స్ కంపెనీలు కొత్త షాపింగ్ విధానానికి తెరతీశాయి. మా సర్వేలో అధిక శాతం కస్టమర్లు ఆన్లైన్ కొనుగోళ్లకే మొగ్గుచూపుతున్నారు’’ అని రీసెర్చ్ సంస్థ తెలిపింది. కస్టమర్లను ఆకర్షిస్తున్న ఆఫర్లు.. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్, షాప్‌క్లూస్ వంటి ఈ కామర్స్ సంస్థలు ఉత్పత్తులను భారీ ఆఫర్లను ప్రకటించి కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ఫలితంగా ఈ ఏడాది పండుగ సీజన్ తొలి రోజుల్లోనే గతేడాది మొత్తం ఆన్లైన్ కస్టమర్ల సంఖ్యను అధిగమించవచ్చని సర్వే అంచనా వేస్తుంది. కోవిడ్–19తో పెరిగిన డిజిటల్ లావాదేవీలు: మాల్స్, రిటైల్ అవుట్‌లుక్ లాంటి అధిక సంచారం కలిగిన ప్రాంతాలకు వెళ్లి షాపింగ్ చేసేందుకు ఇప్పటికీ ప్రజలు వెనకడుగు వేస్తున్నారు. ఫలితంగా ఆఫ్‌లైన్ అమ్మకాల రికవరీ ఇంకా బలహీనంగా నే ఉన్నట్లు సర్వే తెలిపింది. కిందటేడాది ఆన్లైన్ ద్వారా 40–50 మిలియన్ మంది షాపింగ్ చేశారు. కోవిడ్–19 డిజిటల్ లావాదేవీలను మరింత పుంజుకునేలా చేసింది. సంప్రదాయ ఆఫ్‌లైన్ వినియోగదారుల్ని, ఆన్‌లైన్‌కు మళ్లించింది. ఫలితంగా ఈ పండుగ సీజన్లో ఆన్లైన్ వినియోగదారులు ఏకంగా 70శాతం పెరిగే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. సర్వేలో మరికొన్ని అంశాలు.. బలమైన జాతీయవాద మనోభావంతో కేంద్రం ఇచ్చిన ఆత్మనిర్భర్ నినాదంతో ఎలక్ట్రానిక్స్, మొబైల్ వంటి విభాగాల్లో కస్టమర్లు ‘‘బ్రాండ్’’ను పెద్దగా పట్టించుకోవడంలేదని సర్వే తెలిపింది. లాక్‌డౌన్‌తో ఉత్పత్తి ఆగిపోవడంతో మొబైల్, అప్లికేషన్లు గతేడాదితో పోలిస్తే డిమాండ్ కాస్త తక్కువగా ఉంటుందని సర్వే అంచనా వేసింది. గృహోపకరణాలకు డిమాండ్ ఉంటుదని సర్వే చెబుతోంది. -
రూ.వెయ్యి కోట్ల జీఎంవీ సాధిస్తాం
క్యాష్‌కరోడాట్‌కామ్ సహ వ్యవస్థాపకురాలు స్వాతి భార్గవ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తమ పోర్టల్ ద్వారా రూ.1,000 కోట్ల మేర గ్రాస్ మర్చండైజ్ వాల్యూను (జీఎంవీ) సాధించాలని నిర్దేశించుకున్నట్లు క్యాష్‌బ్యాక్ ఆఫర్లు అందించే క్యాష్‌కరోడాట్‌కామ్ సహ వ్యవస్థాపకురాలు స్వాతి భార్గవ వెల్లడించారు. మూడేళ్ల క్రితం పోర్టల్ ప్రారంభించినప్పట్నుంచీ జీఎంవీ పరంగా (ఆన్లైన్ షాపింగ్ పోర్టల్ ద్వారా జరిగే లావాదేవీల స్థూల విలువ) ఏటా దాదాపు 300 శాతం మేర వృద్ధి సాధిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. క్యాష్‌బాక్, కూపన్ల విభాగంలో తమకు దాదాపు 60 శాతం మార్కెట్ వాటా ఉందన్నారు. ఆన్లైన్ షాపింగ్ సైట్లలో జరిగే అమ్మకాల్లో సుమారు 20-25% వ్యాపారం తమ తరహా అనుబంధ పోర్టల్స్ నుంచే ఉంటోందని స్వాతి వివరించారు. ప్రస్తుతం దాదాపు 10 బిలియన్ డాలర్లుగా ఉన్న దేశీ ఈకామర్స్ మార్కెట్ 2020 నాటికి దాదాపు 100 బిలియన్ డాలర్లకు పెరగగలదని, తదనుగుణంగా క్యాష్‌బ్యాక్ వంటి ఆఫర్లు అందించే సంస్థలకు పుష్కలంగా వ్యాపార అవకాశాలు ఉన్నాయని ఆమె చెప్పారు. ఇప్పటిదాకా క్యాష్‌బాక్‌ల రూపంలో సుమారు రూ. 35 కోట్లు వినియోగదారులకు అందచేయగలిగామన్నారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ తదితర వెయ్యి ఈకామర్స్ సైట్లు తమ ప్లాట్‌ఫాంపై ఉన్నట్లు స్వాతి చెప్పారు. విస్తరణపై దృష్టి రుతున్న ఆన్లైన్ షాపింగ్ ధోరణులను ప్రస్తావిస్తూ గతంలో సింహభాగం ఎలక్ట్రానిక్స్‌దే ఉండగా.. ప్రస్తుతం ఇది 50 శాతం మేర ఉంటుండగా, సుమారు పాతిక శాతం ఫ్యాషన్ల వాటా ఉంటోందని స్వాతి చెప్పారు. పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా, కలారి క్యాపిటల్ తదితర ఇన్వెస్టర్ల నుంచి ఇప్పటి దాకా దాదాపు 5 మిలియన్ డాలర్ల మేర నిధులు సమీకరించినట్లు స్వాతి తెలిపారు. అటు బ్రిటన్‌లో పోరింగ్ పౌండ్స్ పేరిట క్యాష్‌బ్యాక్ ఆఫర్ల పోర్టల్ నిర్వహిస్తున్న తాము త్వరలోనే సింగపూర్, ఆగ్నేయాసియా దేశాలకూ కార్యకలాపాలను విస్తరించనున్నట్లు ఆమె వివరించారు. ప్రస్తుతం తమ పోర్టల్ ద్వారా అత్యధికంగా లావాదేవీలు జరిగే టాప్ 5 నగరాల్లో హైదరాబాద్ కూడా ఉందని స్వాతి చెప్పారు.