breaking news
Gandepalle
-
లారీ బోల్తా : డ్రైవర్ మృతి
గండేపల్లి (తూర్పు గోదావరి) : అతి వేగంగా వెళ్తున్న లారీ.. ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టి అనంతరం అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలోకి దూసుకెళ్లింది. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండల కేంద్ర శివారులో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. పిడుగురాళ్ల నుంచి ఐరన్ ముడి సరుకుతో విశాఖ వెళ్తున్న లారీ గండేపల్లికి చేరుకోగానే ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. అనంతరం రోడ్డు పక్కకు దూసుకెళ్లడంతో.. డ్రైవర్ కటారి పిచ్చియ్య(35) క్యాబిన్లో ఇరుక్కొని మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
వైఎస్సార్ సీపీలోకి దొరబాబు
గండేపల్లి, న్యూస్‌లైన్ : మాజీ మంత్రి తోట నరసింహం ముఖ్య అనుచరుడు, గండేపల్లి మండలం మురారికి చెందిన కాంగ్రెస్ బ్లాక్ వన్ అధ్యక్షుడు చలగళ్ల దొరబాబు. తన 400 మంది అనుచరులతో బుధవారం ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు, కాకినాడ పార్లమెంటరీ నాయకుడు చలమలశెట్టి సునీల్, వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ తనయుడు నవీన్ ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. వారికి పార్టీ నేతలు కండువాలు వేసి ఆహ్వానించారు. రెండు కళ్ల సిద్ధాంతంతో వ్యవహరిస్తున్న చంద్రబాబు రాష్ర్ట విభజనను అడ్డుకోలేకపోయారని ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు విమర్శించారు. ప్రతి పేదవానికి సంక్షేమ పథకాలు అందించగల సత్తా వైఎస్ జగన్మోహన్ రెడ్డికే ఉందని చలమలశెట్టి సునీల్ అన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అందించారన్నారు. జగ్గంపేట నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకునే అవకాశాన్ని తన తండ్రి జ్యోతుల నెహ్రూ కు ఇవ్వాలని నవీన్ కోరారు. పీఏసీఎస్ అధ్యక్షుడు ముమ్మన సత్యనారాయణ, దేవస్థానం చైర్మన్ గద్దె చినసత్తిరాజు, భారతీయ కిసాన్ సంఘ్ అధ్యక్షుడు గారపాటి శేషగిరిరావు తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ పరిమి బాబు, మేకా మాధవరావు, సుంకవిల్లి రాజారావు, అడబాల భాస్కరరావు, ఉప్పలపాటి సాయి, మద్దిపట్ల రామకృష్ణ, వివిధ గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు. -
మురారిలో అగ్ని ప్రమాదం...బాలిక సజీవ దహనం
గండేపల్లి, న్యూస్‌లైన్ :కూలిపని నుంచి వచ్చి ఇంట్లో ఆదమరచి నిద్రిస్తున్న బాలిక కేదా వీరవెంకటలక్ష్మి (15) ఆకస్మికంగా జరిగిన అగ్నిప్రమాదంలో సజీవదహనమైంది. తీవ్ర విషాదాన్ని నింపిన ఈ ఘోర అగ్ని ప్రమాదం మండలంలోని మురారి గ్రామంలో గురువారం మధ్యాహ్నం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా రెండు తాటాకిళ్లు అగ్నికి ఆహుతవగా మూడు కుటుంబాలు నిరాశ్రయమయ్యాయి. సుమారు రూ.9 లక్షల ఆస్తినష్టం వాటిల్లింది. కాగా ప్రమాదంలో చిక్కుకున్న ఇద్దరు మహిళలను స్థానికులు కాపాడగలిగినా బాలికను ఎవరూ రక్షించలేకపోయారు. కళ్లెదుటే అగ్నికీలల్లో చిక్కుకున్న కుమార్తెను రక్షించేందుకు తండ్రి విఫలయత్నం చేశారు. వివరాలు ఇలా వున్నాయి. మురారి జాతీయ రహదారిని ఆనుకుని అన్నదమ్ములు కేదా రోణేశ్వర్రావు, పాప దంపతులు, వారి రెండో కుమార్తె వీరవెంకటలక్ష్మి, కేదా గురుమూర్తి, వీరలక్ష్మి దంపతులు, కుమారుడు శివన్నారాయణ ఒకే ఇంటిలోని రెండు వేర్వేరు పోర్షన్లలో నివసిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు వ్యాపించాయి. దీంతో వీరి ఇంటితో పాటు పక్కనే ఉన్న పాడిశెట్టి సోమరాజు ఇల్లు కూడా మంటల్లో కాలి బూడిదయ్యాయి. స్థానికులు మంటలను ఆర్పేందుకు శ్రమించినా ఫలితం లేకపోయింది. ఇళ్లలోని నిత్యావసర వస్తువులు, దుస్తులు, బీరువా, టీవీ వంటివన్నీ ఆహుతయ్యాయి. మంటల్లో చిక్కుకున్న పాప, వీరలక్ష్మిలను స్థానికులు బయటకు తీసుకువచ్చారు. వీరవెంకటలక్ష్మి మంటల్లో చిక్కుకోగా తండ్రి రోణేశ్వర్రావు కాపాడే ప్రయత్నం చేశారు. అయితే పై నుంచి మండుతున్న దూలాలు ఒక్కసారిగా ఆమెపై పడడంతో బాలిక మంటల్లో సజీవదహనమైంది. కళ్లెదుటే కన్నకూతురు సజీవ దహనం కావడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. వారిని ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. జ్యోతుల నవీన్ పరామర్శ అగ్ని ప్రమాదంలో కుమార్తెను కోల్పోయిన, నిరాశ్రయులైన బాధితులను వైఎస్సార్ సీపీ యువనేత జ్యోతుల నవీన్ ఓదార్చి ఆర్థిక సహాయం అందజేశారు. గండేపల్లిలో గడప గడపకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో ఉన్న నవీన్ ఈ సమాచారం తెలియగానే సంఘటన స్థలానికి చేరుకుని బాధితుల్ని ఓదార్చారు. పార్టీ మండల కన్వీనర్ పరిమిబాబు, అడబాల భాస్కరరావు, మేకా మాదవరావు, ఉప్పలపాటి సాయి, సుంకవిల్లి రాజారావు, రమేష్ తదితరులు కార్యక్రమంలో ఉన్నారు. టీడీపీ నాయకులు కందుల కొండయ్యదొర, కాంగ్రెస్ నాయకులు చలగళ్ల దొరబాబు తదితరులు కూడా బాధితులను పరామర్శించారు. గండేపల్లి ఎస్సై సురేష్, సిబ్బంది, తహశీల్దార్ ఎస్.నరసింహరావు, ఆర్ఐ కృష్ణ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకుని సహాయక చర్యలు చేపట్టారు.