breaking news
free onion
-
ఆ షాపులో ఉచితంగా ఉల్లిపాయలు
నాలుకకు రుచి తగలాలంటే ఆ వంటలో ఉల్లిపాయ ఉండాల్సిందే. కానీ ఉల్లిపాయ రేట్లు కొండెక్కి కూర్చోవడంతో వంటల్లో వాటిని బ్యాన్ చేశారు. దీంతో ఉల్లి లేని వంటలు తినలేక భోజనప్రియులు బిక్కమొహం వేసుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఉల్లిపాయ మ్యూజియంలో వస్తువులా మారిపోయినట్టు కనిపిస్తోంది. ఉల్లిపాయ రేట్లు చూసి సామాన్య జనం కళ్లు తేలేస్తున్నారు. కొనకముందే ఏడ్పించేస్తున్న ఉల్లిపాయలను కొంతమంది బాగానే క్యాష్ చేసుకుంటున్నారు. అదెలాగంటే.. తమిళనాడులోని పట్టుకొట్టై ప్రాంతంలో ఉన్న ఎస్టీఆర్ మొబైల్స్ దుకాణం వినియోగదారులకు ఉచితంగా కిలో ఉల్లిపాయలు ఇస్తోంది. కానీ ఇక్కడో చిన్న మెలిక ఉంది. మీకు ఉల్లిపాయలు కావాలంటే ముందుగా ఆ దుకాణంలో ఓ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఒక్కో స్మార్ట్‌ఫోన్‌కు ఒక కేజీ ఉల్లి ఉచితం. ఈ ఐడియా బాగానే వర్కవుట్ అయినట్లు కనిపిస్తోంది. కేజీ ఉల్లిపాయ ఆఫర్‌తో జనాలు మొబైల్ షాపు ముందు క్యూ కడుతున్నారని దుకాణ యజమాని శరవనకుమార్ చెప్పుకొచ్చాడు. ఈ ఆఫర్‌తో షాపుకు వినియోగదారుల తాకిడి పెరిగిందన్నారు. ‘సాధారణ రోజుల్లో రోజుకు మూడు, నాలుగు మాత్రమే ఫోన్లు అమ్మేవాడిని. కానీ ఈ ఆఫర్ తర్వాత 10 అంతకు పైనే స్మార్ట్ఫోన్లు అమ్ముడవుతున్నాయి’ అని చెప్పాడు. ఇక షాపుకు వచ్చినవాళ్లు స్వయంగా వారే ఉల్లిపాయలను ఏరుకుని మరీ తీసుకెళ్లవచ్చట. కాగా తమిళనాడులో ఓ జంట వివాహానికి హాజరైన అతిథులు బకెట్ ఉల్లిపాయలు గిఫ్ట్‌గా ఇచ్చి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. (చదవండి: ఈజిప్టు ఉల్లి..రావే తల్లీ..!) -
ఉచితంగా ఉల్లిపాయలు..
భోపాల్: నిన్న మొన్నటివరకూ కన్నీళ్లు తెప్పించిన ఉల్లిపాయలను...ఇప్పుడు ఎలా వదిలించుకోవాలా అని మధ్యప్రదేశ్ ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో ఉల్లిగడ్డలను ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ ఏడాది మేలో ఉల్లి ధరలు గణనీయంగా పడిపోయాయి. దీంతో రైతులకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం వారివద్ద నుంచి కేజీ ఆరు రూపాయలకు 10.4 లక్షల క్వింటాళ్ల ఉల్లిని కొనుగోలు చేసింది. అయితే కొనుగోలు చేసిన ఉల్లిని నిల్వ చేసేందుకు రాష్ట్రంలో సరైన గిడ్డండి సదుపాయం లేకపోవడం ఇప్పుడు సర్కార్‌కు తలనొప్పి వ్యవహారంగా మారింది. నిల్వ సదుపాయం లేకపోవడంతో వర్షాకాలంలో అవి కుళ్లిపోవడం మొదలెట్టాయి. దీంతో కొనుగోలు చేసిన ఉల్లిని వదిలించుకోవడానికి ప్రభుత్వం తక్కువ ధరకు రేషన్ దుకాణాల ద్వారా విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఉచితంగా కూడా ఇచ్చేసేందుకు ముందుకు వచ్చింది. అయితే రవాణా ఖర్చుల నిమత్తం కేజీ ఉల్లిపాయలకు కేవలం ఒక్క రూపాయిని వసూలు చేయనుంది. సో మీకు ఉల్లిపాయలు కేజీ రూపాయికి కానీ, లేదా ఫ్రీగా కావాలనుకుంటే మధ్యప్రదేశ్ వెళ్లి తెచ్చుకోవచ్చు. మరోవైపు మహారాష్ట్రలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఆ రాష్ట్రంలో కూడా ఉల్లి ధరలు దారుణంగా పడిపోయాయి. కేజీ ఉల్లిపాయలు అయిదు పైసలు పలుకుతుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.