breaking news
Flavonoids
-
తరచూ అనారోగ్యమా?.. ఇలా చేస్తే చాలంటున్న అధ్యయనం
సాక్షి, హైదరాబాద్: జబ్బులు రాకుండా ఉంటే ఎంత బాగుండు అని.. అవి వచ్చిన ప్రతిసారి అనుకుంటూ ఉంటాం. కానీ అందుకు ఏం చేయాలో మాత్రం తెలియక ఇబ్బంది పడుతూంటాం. వ్యాయామాలు చేస్తూంటాం. రకరకాల ప్రయత్నాలూ కొనసాగిస్తూంటాం. అయితే.. మీరు తినే ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా నిజంగానే జబ్బులు రాకుండా చేసుకోవచ్చునని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఎలాగూ చూసేయండి.. “Let food be thy medicine and medicine be thy food.” అంటాడు గ్రీకు తత్వవేత్త హిపొక్రేట్స్. మీరు తినే ఆహారమే మీకు మందు కావాలి. మందే మీ ఆహారం కావాలని స్థూల అనువాదం. ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం నాటి హిపొక్రేట్స్ మాట ఇప్పుడు మరోసారి బాగా పాపులర్ అవుతోంది. మనకొచ్చే జబ్బులకు ఆహారం ద్వారానే చికిత్స అందించేందుకు ఒక పక్క ప్రయత్నాలు జరుగుతుంటే.. ఇంకోపక్క అసలు జబ్బులే రాకుండా ఉండేందుకు ఆహారం ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకునేందుకు అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఒకటి ఒక అధ్యయనం నిర్వహించింది. యునైటెడ్ కింగ్డమ్లో నలభై లేదా అంతకంటే ఎక్కువ వయసున్న సుమారు 1.24 లక్షల మందికి సంబంధించిన ఆహార అలవాట్లను, వారి ఆరోగ్యాన్ని ఏళ్ల తరబడి పరిశీలించిన తరువాత వీరు తేల్చిందేమిటంటే.. ఆహారం ద్వారా ఫ్లేవనాయిడ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల జబ్బులు రాకుండా ఉంటాయి అని!. ఇంకేముంది.. ఎంచక్కా ఫ్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుందామని డిసైడ్ అయిపోయారా?. ఆగండాగండి.. ఓ చిన్న ట్విస్ట్ ఉందిక్కడ. ఏంటంటే.. మీరు ఎంత ఎక్కువ మోతాదులో ఫ్లేవనాయిడ్స్ తీసుకుంటున్నారు అన్నది ముఖ్యం కాదు. ఎన్ని రకాలవి తీసుకుంటున్నారన్నది కీలకమని శాస్త్రవేత్తలు గుర్తించారు. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఫ్లేవనాయిడ్లు ఎక్కువగా ఉన్న ఆహారాలకు.. దీర్ఘాయిష్షును అందించే, వ్యాధులను నిరోధించే లక్షణం ఉన్నట్లు చాలాకాలంగా తెలియడం!. మరి తాజా అధ్యయనం ఏం తేల్చిందంటే.. ‘‘ఫ్లేవనాయిడ్లు ఎక్కువగా తీసుకుంటే గుండెజబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయని, మధుమేహం, పార్కిన్సన్స్ వంటి నాడీ సంబంధిత సమస్యలూ నిరోధించవచ్చునని ముందే తెలుసు. కానీ.. రాశి కంటే వాసి ముఖ్యమని.. వెరైటీ ఇంకా కీలకమని మాత్రం తాజా అధ్యయనం స్పష్టం చేసింది’’ అంటారు బెల్ఫాస్ట్ యూనివర్శిటీ పోషకాహార శాస్త్రవేత్త అడెన్ కాసిడీ. తమ అధ్యయనంలో మూడింట రెండు వంతుల మంది గ్రీన్, బ్లాక్ టీల నుంచి ఫ్లేవనాయిడ్లు అందాయని, ఆపిల్స్, రెడ్‌వైన్, ద్రాక్ష, బెర్రీ పళ్లు, డార్క్ చాకొలేట్, కమలా ఫలాలు ఇతర ఆహార మార్గాలని ఆయన వివరించారు. ఎక్కువ వెరైటీల ఫ్లేవనాయిడ్లను ఆహారం ద్వారా తీసుకున్న వారికి మృత్యుభయం, వ్యాది సమస్యలు తక్కువగా ఉన్నట్లు తమ విశ్లేషణలో తేలిందని చెప్పారు. రోజూ 500 మిల్లీగ్రాముల ఫ్లేవనాయిడ్లు తీసుకున్న వారు వ్యాధుల ద్వారా మరణించే ప్రమాదం 16 శాతం వరకూ తక్కువని ఈ అధ్యయనంలో పాల్గొన్న కోవాన్ యూనివర్శిటీ (ఆస్ట్రేలియా) శాస్త్రవేత్త బెంజిమన్ పార్మెంటర్ తెలిపారు. గుండెజబ్బులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు పది శాతం వరకూ తక్కువ అని వివరించారు. కేవలం రెండంటే రెండు కప్పుల గ్రీన్/బ్లాక్ టీల ద్వారా 500 మిల్లీగ్రాముల ఫ్లేవనాయిడ్లు శరీరానికి అందుతాయి!. రకరకాల ఫ్లేవనాయిడ్లు తీసుకున్న వారికి మధుమేహం, కేన్సర్ వంటివి వచ్చే అవకాశాలు 6 నుంచి 20 శాతం వరకూ తక్కువగా ఉన్నట్లు తేలింది. కొసమెరుపు.. రోజూ రంగు రంగుల పండ్లు, కాయగూరలు తింటూ ఉంటే చాలు.. వెరైటీ ఫ్లేవనాయిడ్లు మీ శరీరంలోకి చేరి మిమ్మల్ని వ్యాధులకు దూరంగా ఉంచుతాయి!.-గిళియారు గోపాలకృష్ణ మయ్యా. -
బ్రకోలీతో కేన్సర్‌కు చెక్
వాషింగ్టన్: బ్రకోలీని వారానికి మూడు లేదా నాలుగు సార్లు ఆహారంగా తీసుకోవడం ద్వారా కేన్సర్, హృద్రోగాలు, డయాబెటిస్, ఆస్తమా వంటి పలు వ్యాధులకు చెక్ పెట్టవచ్చని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఫినోలిక్ పదార్థాలు సహా పలు ఫ్లేవనాయిడ్స్‌ను ఆహారంలో అధికంగా తీసుకోవడం ద్వారా పలు ప్రాణాంతక వ్యాధులను దూరం చేయవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. బ్రకోలీ, క్యాబేజ్, కాలే వంటి వాటిలో ఫినోలిక్ ఎక్కువ మోతాదులో ఉన్నట్లు గుర్తిం చారు. ఫినోలిక్ ఉన్న కూరగాయలు వండినా వాటిలో పోషక విలువలు తగ్గిపోవని అంటున్నారు.