breaking news
encounter in north Kashmir
-
ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని బండిపోరా జిల్లాలో శనివారం భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు గుర్తు తెలియని ఉగ్రవాదులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఉత్తర కశ్మీర్‌లోని బండిపోరాలో సుంబ్లార్ ప్రాంతంలోని షోక్‌బాబా అడవిలో ఉగ్రవాదులు ఉన్నట్లు భద్రతా దళాలు సమాచారం అందుకున్నట్లు పోలీసు అధికారి తెలిపారు. అయితే ఉగ్రవాదుల కోసం వెతుకుతుండగా.. ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపారు. దీంతో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. కాగా గత వారం రోజుల్లోనే ఈ లోయలో పలు ఎన్కౌంటర్లు జరిగిగాయి. బారాముల్లాలోని సోపోర్‌లోని వార్పోరా గ్రామంలో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు లష్కరే తోయిబా (ఎల్ఇటీ) ఉగ్రవాదులు మరణించారు. వారి నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. ఇక జమ్మూ కశ్మీర్‌లోని షోపియన్‌లో భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో సోమవారం లష్కరే తోయిబా ఉగ్రవాది, మరో గెరిల్లా మృతి చెందారు. -
గర్ల్ ఫ్రెండే పట్టించింది..
సాక్షి, శ్రీనగర్: భద్రతా దళాలు సోమవారం మట్టుబెట్టిన జైషే మహ్మద్ కాశ్మీర్ చీఫ్ ఖలీద్ ఎన్కౌంటర్ వెనుక పెద్ద కథే నడిచింది. ఖలీద్ పతనానికి మోహం, కామం, వంచన ప్రేరేపించాయి. అతడిని పట్టుకుని హతమార్చే ప్రక్రియకు స్వయంగా ఖలీద్ మాజీ ప్రియురాలే భద్రతా దళాలకు సహకరించడం గమనార్హం. ఖలీద్‌ను మట్టుబెట్టడమే తనకు కావాలని జమ్మూ కాశ్మీర్ సీనియర్ పోలీస్ అధికారి ఒకరితో 20 సంవత్సరాల వయసున్న అతని గర్ల్ ఫ్రెండ్ తేల్చిచెప్పినట్టు సమాచారం. ఖలీద్ కదలికలపై తాను సమాచారం ఇస్తానని మిగిలిన పని (హతమార్చడం) మీరు చక్కబెట్టాలని ఆమె పోలీస్ అధికారితో అన్నారు. ఉత్తర కాశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా దళాలు ఖలీద్‌ను మట్టుబెట్టాయి. ఖలీద్‌పై ఆమెకు కోపం ఎందుకంటే..? ఉగ్రవాది ఖలీద్‌తో సన్నిహితంగా మెలిగిన అనంతరం గత ఏడాది తాను గర్భం దాల్చినట్టు బాధిత యువతి గుర్తించారు. ఈ వార్తతో తనలాగే ఖలీద్ సైతం సంతోషిస్తాడని ఆమె ఆశించారు. అయితే తన కడుపులో ఉన్న బిడ్డతో తనకు ఎలాంటి సంబంధం లేదన్న అతడి సమాధానానికి ఆమె గుండె పగిలినంత పనైంది. దీంతో పంజాబ్‌లోని జలంధర్‌లో ఉంటున్న తన సోదరుడి వద్దకు వెళ్లి అక్కడే అబార్షన్ చేయించుకున్నారు. ఇక అక్కడినుంచి తిరిగి వచ్చిన తర్వాత లైంగిక అవసరాల కోసం తనను వాడుకుని, తర్వాత తనను మోసగించడం, కడుపులో పసికందునూ చిదిమివేయడం పట్ల ఖలీద్‌పై ప్రతీకారం కోసం రగిలిపోయారు. మరణశాసనం లిఖిస్తూ.. ఖలీద్‌పై పట్టరాని ఆగ్రహంతో రగిలిన బాధిత మహిళ పకడ్బందీగా తన మిషన్‌ను అమలు చేసేందుకు పూనుకున్నారు. ఎనిమిదేళ్లుగా ఖలీద్‌ను మట్టుబెట్టడంలో తృటిలో టార్గెట్ మిస్ అయిన భద్రతా దళాలు, జమ్మూ కాశ్మీర్ పోలీసులకు సమాచారం చేరవేయడం ద్వారా తన పనిసులువవుతుందని భావించి జమ్మూలో సీనియర్ పోలీస్ అధికారిని కలిసి తన ప్లాన్‌ను వివరించారు. గత కొన్నేళ్లుగా జైషే ఉగ్రదాడుల వెనుక సూత్రధారిగా ఉన్న ఖలీద్‌ను మట్టుబెట్టేందుకు ఇదే సరైన అవకాశమని పోలీసులూ తమ ఆపరేషన్‌కు పదును పెట్టారు.లవర్‌బాయ్ ఇమేజ్ను పొందిన ఖలీద్ చివరకు తాను హతమయ్యే సమయంలోనూ ముగ్గురు, నలుగురు గర్ల్‌ఫ్రెండ్స్‌తో ఉన్నట్టు గుర్తించారు. వంచన నుంచి ఎన్కౌంటర్ వరకూ... ఖలీద్ గర్ల్‌ఫ్రెండ్ ఇస్తున్న సమాచారం మేరకు పలు ప్రాంతాల్లో అతడిని మట్టుబెట్టేందుకు వెళ్లిన భద్రతా దళాలకు అతడు ఝలక్ ఇస్తూ తప్పించుకు పారిపోయే వాడు. అయితే సోమవారం సొపోర్‌లో ఓ వ్యక్తిని కలుసుకునేందుకు వచ్చిన ఖలీద్‌ను అంతమొందించేందుకు భద్రతా దళాలు, పోలీసులు వేసిన స్కెచ్ నుంచి ఈసారి ఖలీద్ బయటపడలేకపోయారు. తనను చుట్టుముట్టిన దళాలపై ఖలీద్ కాల్పులకు తెగబడ్డా కేవలం నాలుగు నిమిషాల్లోనే ఎన్కౌంటర్ పూర్తి చేసిన అధికారులు కరుడుగట్టిన కమాండర్‌ను మట్టుబెట్టారు. -
కాశ్మీర్లో ఎన్కౌంటర్ : ఐదుగురు మృతి
కాశ్మీర్ : ఉత్తర కాశ్మీర్ కుప్వారా జిల్లాలోని హండ్వారా ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు తీవ్రవాదులతోపాటు ఓ ఆర్మీ సైనికుడు మరణించాడు. ఈ మేరకు పోలీసులు గురువారం వెల్లడించారు. హండ్వారాలోని సోచల్వారీ గ్రామంలో తీవ్రవాదులు ఉన్నట్లు బుధవారం సైనికులకు సమాచారం అందింది. దీంతో స్పెషల్ అపరేషన్ గ్రూప్‌కి చెందిన పోలీసులు, సైనికులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఆ విషయం గమనించిన తీవ్రవాదులు ఎదురుకాల్పులకు దిగారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురు కాల్పులకు దిగారు. దాంతో బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకు ఎన్కౌంటర్ జరిగిందని పోలీసులు తెలిపారు. అయితే ఈ ఎన్కౌంటర్లో రెండు మృతదేహలను స్వాధీనం చేసుకున్నామన్నారు.