breaking news
Empty space
-
ఇంటి ఆవరణలో ఖాళీ స్థలంపై పన్ను!
-
ఇంటి ఆవరణలో ఖాళీ స్థలంపై పన్ను!
► మూడింతలు ఖాళీగా ఉంటే వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ వర్తింపు ► ఇంత కాలం పన్ను వసూలు చేయకపోవడంపై సర్కారు అసంతృప్తి ► ఇకపై కట్టుదిట్టంగా వసూలు చేయాలని పురపాలికలకు ఆదేశం సాక్షి, హైదరాబాద్: మీ ఇంటి ఆవరణలో మూడింతలు, ఆపై స్థలం ఖాళీగా ఉందా? అయితే ఇక నుంచి ఆ స్థలంపై ఖాళీ స్థల పన్ను (వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్)ను ముక్కుపిండి వసూలు చేయనున్నారు. నగర, పట్టణ ప్రాంతాల్లోని భవనాల నిర్మిత స్థలంతో పోల్చితే మూడింతలు, ఆపై స్థలం ఖాళీగా ఉన్నా లేక భవనం ఆవరణలో 1,000 చదరపు మీటర్లు, ఆపై స్థలం ఖాళీగా ఉన్నా ఆయా భవనాల యజమానులపై ఖాళీ స్థల పన్ను విధించాల్సిందేనని పురపాలకశాఖ చట్టాలు పేర్కొంటున్నాయి. అయితే రాష్ట్రంలో ఇప్పటివరకు ఇలాంటి పన్నులను విధించలేదు. రాష్ట్రంలోని 69 నగర, పురపాలికల ఆర్థిక వనరులపై పురపాలకశాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు ఇటీవల సమీక్ష నిర్వహించారు. పన్నులు, ఇతర మార్గాల్లో పురపాలికలకు రావాల్సిన మేరకు ఆదాయం సమకూరడం లేదని ఈ సమావేశంలో గుర్తించారు. కొన్ని రకాల పన్నులు, రుసుముల వసూళ్లపై పురపాలికలు ఏమాత్రం దృష్టిసారించడంలేదని ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ముఖ్యంగా ఇళ్లలోని ఖాళీ స్థలాలపై పన్నులు విధించకపోవడంపై ఈ సమీక్షలో చర్చ జరిగింది. ఇకపై ఖాళీ స్థల పన్నును కచ్చితంగా వసూలు చేయాలని ఈ సమావేశంలో పురపాలకశాఖకు ఆదేశాలు అందాయి. దీంతో ఖాళీ స్థల పన్నుల వసూళ్లపై పురపాలకశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. భవనం, అపార్ట్మెంట్, ఇంటి ఆవరణలో మూడింతల స్థలం ఖాళీగా ఉంటే .. ఆ స్థలాన్ని ఖాళీ స్థలంగా పరిగణించి పన్ను విధించాలనే నిబంధనను ఇకపై కచ్చితంగా అమలు చేయాల్సిందేనని రాష్ట్రంలోని అన్ని పురపాలికలకు ఇటీవల అంతర్గత ఆదేశాలు జారీ అయ్యాయి. ఖాళీ స్థలాల జాబితాలను ప్రతి నెలా రూపొందిస్తుండాలని, ఎప్పటికప్పుడు పన్నుల విధింపుపై సమీక్షలు జరపాలని మున్సిపల్ కమిషనర్లకు సూచనలు వెళ్లాయి. భవనాలపై ఆస్తి పన్నులు విధించినట్లే పట్టణ ప్రాంతాల్లోని వ్యవసాయేతర ఖాళీ స్థలాలపై పన్నులను విధించాలని పురపాలక చట్టాలు పేర్కొంటున్నాయి. నిబంధనల ప్రకారం మున్సిపాలిటీల్లోని ఖాళీ స్థలాలపై వాటి మార్కెట్ విలువలో 0.20 శాతం, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని ఖాళీ స్థలాలపై వాటి మార్కెట్ విలువలో 0.50 శాతం మొత్తాన్ని గణించి ఖాళీ స్థలం పన్నుగా విధిస్తారు. -
చెరువులను చెరబట్టారు
జిల్లాలోని చెరువులను అధికార పార్టీ నేతలు చెరబట్టారు. ప్రభుత్వ భూములు అయిపోయాయేమో.. ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఉన్న చెరువులను పోటీలుపడి ఆక్రమిస్తున్నారు. వాటిల్లో బోర్లువేసి, మోటార్లు బిగించి పంటలు సాగుచేస్తున్నారు. అధికారులు సైతం వారిని అడ్డుకునేందుకు సాహసించలేకపోతున్నారు. - శ్రుతిమించుతున్న అధికార పార్టీ నేతల ఆగడాలు - బోర్లు వేసి పంటలు సాగుచేస్తున్న వైనం - జిల్లా వ్యాప్తంగా చెరువుల్లో 5వేల ఎకరాల ఆక్రమణ సాక్షి,చిత్తూరు : జిల్లాలో ఆక్రమణల పరంపర కొనసాగుతోంది. ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేస్తున్నారు. చిన్నగొట్టిగల్లు మండలంలోనే 72 ఎకరాల చెరువు భూములు ఆక్రమణలకు గురయ్యాయని తహశీల్దార్ నారాయణమ్మ చెప్పడం చూస్తే ఆక్రమణలు ఏ స్థాయిలో జరిగాయో తెలుస్తోంది. ఒక్క చిన్నగొట్టిగల్లు చెరువులోనే అధికార పార్టీ నేతలు 15 ఎకరాల భూమిని ఆక్రమించి సాగుచేస్తున్నారు. ఆక్రమణలను తొలగించేందుకు పూనుకుంటే అధికారపార్టీ నేతలు దాడులకు దిగుతున్నారని, ఇటాంటి పరిస్థితిలో ఉద్యోగాలు చేయడమే కష్టంగా ఉందని తహశీల్దార్ నారాయణమ్మ శనివారం కలెక్టరేట్ వద్ద విలేకరులతో వాపోయారు. జిల్లా వ్యాప్తంగా అధికార పార్టీ నేతలది ఇదే తీరు. జిల్లాలో పంచాయతీరాజ్, చిన్ననీటి పారుదల శాఖల పరిధిలో 8,083 చెరువులున్నాయి. వీటిలో వంద ఎకరాలలోపు ఆయకట్టు ఉన్న చెరువులు 7,395 ఉండగా, వంద ఎకరాల పైబడి ఆయకట్టు ఉన్న చెరువులు 683 ఉన్నాయి. శ్రీకాళహస్తి, సత్యవేడు, చిత్తూరు, చంద్రగిరి, పూతలపట్టు, జీడీనెల్లూరుతోపాటు దాదాపు అన్ని నియోజకవర్గాల్లో చెరువులు పెద్ద ఎత్తున ఆక్రమణలకు గురయ్యాయి. 66 మండలాల పరిధిలో 5 వేల ఎకరాలకు పైనే ఆక్రమణకు గురయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ఆక్రమిత చెరువుల్లో పంటలు సాగు చేస్తుండగా తిరుపతి, శ్రీకాళహస్తి, చిత్తూరు, మదనపల్లె తదితర నగర, పట్టణ ప్రాంతాల చెరువులను ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ కోట్లు దండుకుంటున్నారు. కొందరు రెవెన్యూ అధికారులు సైతం అధికారపార్టీ నేతలకు సహకరిస్తూ లక్షల్లో దండుకంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలోని అన్ని చెరువుల ఆక్రమణలు తొలగించి ఆధునికీకరిస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఆచరణలో అమలుకు నోచుకోలేదు. ఏ ఒక్క చెరువులోనూ ఆక్రమణలు తొలగించేందుకు అధికారులు ముందుకు రాలేదు. మరోవైపు చెరువుల ఆధునికీకరణ ముందుకు సాగలేదు. వేసవి ప్రారంభం నుంచే పనులు మొదలు పెట్టి చేయా ల్సి ఉన్నా, వేసవి ముగింపు సమయంలో 3,715 చెరువులు, చిన్న కుంటల్లో మాత్రమే అధికారులు పనులు చేపట్టడంపై విమర్శలు ఉన్నాయి. ఇప్పటికీ 60 శాతానికి పైగా చెరువుల్లో పనులు మొదలు కాలేదు. ఆధునికీకరణ పనులు పూర్తికాకపోతే చెరువుల్లో వాననీరు పూర్తి స్థాయిలో నిలిచే పరిస్థితి ఉండదు. అదే జరిగితే రైతులకు వ్యవసాయ పనులకేకాక భూగర్భ జలాల పెరుగుదలకూ నష్టమే. జిల్లా వ్యాప్తంగా దాదాపు 90 శాతానికి పైగా చెరువుల కట్టలు, తూములు, పంటకాలువలు ఇప్పటికే దెబ్బతిన్నాయి.