breaking news
dorsey
-
ఉద్యోగులపై వేటు వేయనున్న ట్విట్టర్
ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్‌ను కొనేవారు కరువవ్వడంతో, తానే ఎలాగైనా మార్కెట్లో నిలదొక్కుకోవాలని ఆ కంపెనీ ప్రయత్నాలు ప్రారంభించింది. ఆర్థికనష్టాలతో కొట్టుమిట్టాడుతున్న కంపెనీని లాభదాయకత వైపు మరల్చుకోవడానికి, ఉద్యోగాలపై వేటు వేయాలని నిర్ణయించింది. కంపెనీలోని 9 శాతం ఉద్యోగాలపై కోత విధించనున్నట్టు ట్విట్టర్ ప్రకటించింది. ఈ కోత ప్రభావంతో దాదాపు 350 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోనున్నారు. ఉద్యోగాల కోత ఎక్కువగా సేల్స్, పార్టనర్షిప్ డిపార్ట్మెంట్స్, మార్కెటింగ్‌లలో ఉండనుందని కంపెనీ సీఈవో జాక్ డోర్సే తెలిపారు. నాన్-కోర్ ఏరియాలో పెట్టుబడులు తగ్గిస్తూ.. ఎక్కువ ప్రాధాన్యత ఉన్న వాటిలో పెట్టుబడులు కొనసాగించడమే ఈ పునర్నిర్మాణం ముఖ్య ఉద్దేశ్యమని తమ షేర్హెల్డర్స్ సమావేశంలో డోర్సే పేర్కొన్నారు.. కాగ, ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్‌కు 3,860 మంది ఉద్యోగులున్నారు. కంపెనీ ఫలితాల ప్రకటన నేపథ్యంలో ఉద్యోగుల కోత అంశాన్ని ట్విట్టర్ ప్రకటించింది. ట్విట్టర్ విశ్లేషకుల అంచనాలను అధిగమించి యేటికేటీకి తన క్వార్టర్లీ రాబడులను 8 శాతం పెంచుకుని, 616 మిలియన్ డాలర్లను(రూ.4,114 కోట్లకు పైగా) నమోదుచేసింది. అదేవిధంగా గతేడాది కంటే యాక్టివ్ యూజర్లను 3 శాతం పెంచుకుని నెలకు 317 మిలియన్ యూజర్లను కలిగిఉన్నట్టు తెలిపింది. కానీ లాభాలను ఆర్జించడంలో మాత్రం కంపెనీ విఫలమైంది. గత క్వార్టర్లో ట్విట్టర్ 103 మిలియన్ డాలర్లు(688 కోట్లకు పైగా) నికర నష్టాలను మూటకట్టుకున్నట్టు ప్రకటించింది. గతేడాది కూడా 336 ఉద్యోగులను ట్విట్టర్ తొలగించింది. గత నెలే బెంగళూరులోని ఇంజనీరింగ్ ఉద్యోగులు 20 మందికి కూడా ట్విట్టర్ గుడ్ బై చెప్పింది. -
'ట్విట్టర్ అడ్డంకులు తొలగిపోయాయ్'
సుమారు దశాబ్దం చరిత్రగల సోషల్ మీడియా నెట్వర్క్ సంస్థ ట్విట్టర్.. యూజర్ సేఫ్టీ కోసం చేపట్టిన చర్యలు విజయవంతం అయ్యాయని ఆ సంస్థ యూరప్ ప్రతినిధి బ్రూస్ డైస్లీ స్పష్టం చేశారు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రతికూల వార్తలతో ట్విట్టర్ వెనుకబడి పోతున్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 30 కోట్లకు పైగా యూజర్లతో 33 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ ఉన్న ట్విట్టర్ సంస్థపై ఇటీవల పలు విమర్శలు వస్తున్నాయి. ట్విట్టర్ అకౌంట్ల ద్వారా అభ్యంతరకరమైన భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారని, ఉగ్రవాద కార్యకలాపాలకు కూడా ఈ మాద్యమం బాగా ఉపయోగపడుతోందనే ఆరోపణలు ఉన్నాయి. పైగా ఎన్నో ఏళ్లుగా ట్విట్టర్‌ను ఆదరిస్తున్న కొందరు ప్రముఖులు సైతం ఇటీవల తమ అకౌంట్లను క్లోజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డైస్లీ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అక్టోబర్‌లో సంస్థ సీఈవోగా జాక్ డోర్సీ బాధ్యతలు చేపట్టిన తరువాత ప్రతికూల అంశాల నుండి ట్విట్టర్ నిలదొక్కుకుందని ఆయన స్పష్టం చేశారు. మహిళల భద్రత, ఇతర రక్షణ విషయాల్లో సంస్థ చేపట్టిన ప్రణాళికలు విజయవంతం అయినట్లు వెల్లడించారు. వినియోగదారుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకొని అభ్యంతరకరమైన అకౌంట్ల సంఖ్యను తగ్గించినట్లు తెలిపారు. అలాగే ఫోన్ ద్వారా వెరిఫికేషన్‌ను చేపట్టి అకౌంట్‌ను నిర్వహిస్తున్న వ్యక్తుల వివరాలను సమగ్రంగా నమోదు చేయడంలో చాలా వరకు సఫలీకృతం అయినట్లు డైస్లీ తెలిపారు.