breaking news
Dohchay
-
ప్రయోగాలకు రెడీ!
‘‘ప్రయోగాలనేవి రిస్కుగా అనిపిస్తాయి కానీ, వాటివల్లే మనకంటూ ఓ గుర్తింపు వస్తుంది. అప్పట్లో నాన్నగారు కూడా ఎన్నో ప్రయోగాలు చేశారు. నేను కూడా ఆయనలాగానే ప్రయోగాలకు రెడీ’’ అంటున్నారు నాగ చైతన్య. సుధీర్ వర్మ దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో ఆయన నటించిన ‘దోచేయ్’ ఇటీవలే విడుదలైంది. ఈ సినిమా తనకు విభిన్నమైన గుర్తింపు తీసుకువచ్చిందని నాగ చైతన్య మంగళవారం హైదరాబాద్‌లో పత్రికలవారితో చెప్పారు. ఈ సందర్భంగా నాగ చైతన్య మాట్లాడుతూ -‘‘నాన్నగారు సినిమా చూసి బాగా ఎంజాయ్ చేశారు. నా లుక్, గెటప్ స్టయిలిష్‌గా ఉందని మెచ్చుకున్నారు. పోసాని కృష్ణమురళి, బ్రహ్మానందాల కామెడీ ఈ సినిమాకు ప్లస్. ఛేజింగ్, యాక్షన్ సన్నివేశాలు బాగా కష్టపడి చేశాను’’ అని చెప్పారు. అఖిల్ పరిచయ చిత్రంలో అతిథి పాత్రపోషణ చేస్తున్నట్టు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. చందు మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా స్క్రిప్టు దశలో ఉందనీ, గౌతమ్ మీనన్‌తో ఓ చిత్రం చేయడానికి చర్చలు జరుగుతున్నాయనీ ఈ సందర్భంగా నాగ చైతన్య వెల్లడించారు. -
నాలో ఒకే ఒక్క మైనస్ ఉంది!
స్లిమ్‌గా... స్టయిల్‌గా... ఎట్రాక్టివ్‌గా... ఎనర్జిటిక్‌గా... కొంచెం టామ్ బాయ్‌లా... ఇంకొంచెం గాళ్ నెక్ట్స్ డోర్లా... ఏ లుక్‌లో కనిపించినా... యూత్ ‘హార్ట్’ డిస్క్‌ల్లో నిండిపోతున్నారు కృతీ సనన్. మహేశ్‌బాబుతో ‘1 నేనొక్కడినే’లో తొలిసారి తళుక్కుమన్న ఈ పంజాబీ భామ తాజా తెలుగు సినిమా ‘దోచేయ్’. గురువారం హైదరాబాద్ వచ్చిన కృతీతో ‘సాక్షి’ స్పెషల్ టాక్. ‘1 నేనొక్కడినే’ తర్వాత పదిహేను నెలలకు ‘దోచేయ్’ ద్వారా తెలుగు తెరపై కనిపించనున్నారు. ఇందులో మీ పాత్ర గురించి? ఇందులో నా పాత్ర పేరు మీరా. ఓ ఆడపిల్లకు ఉండాల్సిన బిడియం, మొహమాటం ఇలాంటివేవీ ఉండవన్న మాట. వైద్య కళాశాల విద్యార్థినిని. కాలేజీలకు బంక్ కొట్టడం, స్నేహితులతో ఆటోల్లో తిరగడం... ఇలా ఇష్టం వచ్చినట్లు ఉంటాను. అందర్నీ డామినేట్ చేసేస్తూ ఉంటాను. సరిగ్గా చెప్పాలంటే ‘టామ్ బాయ్’ తరహా పాత్ర. మొత్తం మీద మీరా చాలా హుషారుగా ఉంటుంది. ఈ పాత్రను చాలా ఎంజాయ్ చేశాను. నిజజీవితంలోనూ మీరు టామ్ బాయ్ టైపేనా? మీరా అంత కాదు. ఒక ఆడపిల్లకు ఉండాల్సిన బిడియం, మొహమాటం అన్నీ నాకున్నాయి. అయితే చలాకీగా ఉంటాను. సంప్రదాయాలను గౌరవిస్తాను. పద్ధతిగా ఉండటానికి ఇష్టపడతాను. మరి.. కాలేజీలు బంక్ కొట్టిన సందర్భాలున్నాయా? రెండు, మూడు సార్లు అలా చేశాను. కానీ, మరీ మీరాలా గోడలు దూకలేదు. ఆటోల్లో హల్ చల్ చేయలేదు. ఆల్మోస్ట్ బుద్ధిగా ఉండేదాన్ని. ఓకే.. అసలు ‘దోచేయ్’ అంటే అర్థం తెలుసా? కొల్లగొట్టమని అర్థం అట. టైటిల్ పెట్టిన తర్వాత అర్థం ఏంటని అడిగితే చెప్పారు. ఈ కథకి ఈ టైటిల్ ఎంత కరెక్టో సినిమా చూస్తే తెలుస్తుంది. ఒక్కటి మాత్రం చెబుతా.. కచ్చితంగా ఈ చిత్రం ప్రేక్షకుల మనసులను కొల్లగొడుతుంది. మీ మనసునెవరైనా కొల్లగొట్టారా? అలాంటిదేమీ లేదండి. నేను కూడా ఎవరి మనసూ దోచేయలేదు. నాగచైతన్య సరసన నటించడం ఎలా అనిపించింది? మేమిద్దరం దాదాపు ఒకే వయసువాళ్లం కాబట్టి, స్నేహంగా ఉండేవాళ్లం. మా కెమిస్ట్రీ కూడా చాలా బాగుంటుంది. లుక్ టెస్ట్ అప్పుడు మేమిద్దరం పెద్దగా మాట్లాడుకోలేదు. షూటింగ్ మొదలయ్యాక పరిచయం పెరిగింది. ఆ తర్వాత నుంచి లొకేషన్లో మేం చేసిన సందడి, వేసిన జోక్స్‌కీ కొదవే లేదు. అది సరే.. ఇంత స్లిమ్‌గా ఉన్నారు.. ఏం చేస్తారేంటి? వారానికి నాలుగైదు రోజులు వెయిట్ ట్రైనింగ్ తీసుకుంటా. ఆహారం పరంగా కొన్ని నియమాలు పాటిస్తా. నా అదృష్టం ఏంటంటే.. నేనెంత తిన్నా బరువు పెరగను. ఊహ తెలిసినప్పట్నుంచీ నేనిలా సన్నగానే ఉన్నాను. మీరు భోజనప్రియురాలేనా? స్వతహాగా పంజాబీలు కొంచెం ఫుడ్ లవర్సే. నేనందుకు మినహాయింపు కాదు. బటర్ చికెన్ అంటే చాలా ఇష్టం. మొహమాటం లేకుండా లాగించేస్తా. ఏది తినాలపిస్తే అది తింటా. నోరు కట్టేసుకోవడం నా వల్ల కాదండీ బాబు. మీ పంజాబీ అమ్మాయిలు చాలా బోల్డ్ అట కదా? అందరి సంగతి నాకు తెలియదు కానీ, నేను మాత్రం స్ట్రాంగే. అయితే నాకున్న ఒకే ఒక్క మైనస్ ఏంటంటే.. ఏదీ తట్టుకోలేను. వెంటనే ఏడుపొచ్చేస్తుంది. పది మందిలో ఉన్నా ఏడుపుని నియంత్రించలేను. బాగా ఏడ్చాక మనసంతా తేలికైనట్లుగా అనిపిస్తుంది. ఏడుపు మినహా నాకు వేరే బలహీనతలేవీ లేవు. ఎలాంటి సమస్యను అయినా ఎదుర్కొనేంత మానసిక స్థయిర్యం ఉంది. అంటే.. మీ గురించి వచ్చే వదంతులను కూడా తేలికగా తీసుకుంటారన్నమాట...? కొన్ని వదంతులు బాధపెడతాయ్. ఇవాళ సామాజిక మాధ్యమంలో ఏదో ఒక వార్త పుట్టుకొస్తూనే ఉంటుంది. ప్రతిదీ పట్టించుకుంటే నా పనులు నేను చేసుకోలేను. అందుకే, వంద వదంతులు వచ్చాయనుకోండి.. సీరియస్‌గా తీసుకోదగ్గ ఓ ఐదూ, పది వదంతులను మాత్రమే పట్టించుకుంటాను. తెలుగు పరిశ్రమలో పురుషాధిక్యం ఉందని ఆ మధ్య నటి రాధికా ఆప్టే అన్నారు కదా.. మీరేమంటారు? ఆ మాటకొస్తే.. దేశంలో ఉన్న అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ పురుషాధిక్యమే ఉంది. ఇప్పుడు దాన్ని మార్చాలంటే ఎవరి వల్లా కాదు. రాధికా ఆప్టే తనకు ఎదురైన అనుభవాల దృష్ట్యా ఆ విధంగా అన్నారేమో. ఒకవేళ ఆమె అభిప్రాయాన్ని వక్రీకరించారేమో. ఎందుకంటే, ఆ మధ్య నేనిలాంటి విషయమే ఒకటి మాట్లాడినట్లు రాశారు. కానీ, నేనా మాటలు అనలేదు. ఆ సంగతలా ఉంచితే. నా మటుకు నాకు ఇటు టాలీవుడ్లో కానీ అటు బాలీవుడ్లో కానీ ఎలాంటి చేదు అనుభవాలు ఎదురు కాలేదు. సినిమా పరిశ్రమ నాకు సౌకర్యవంతంగా ఉంది. చిత్రపరిశ్రమను వదిలేస్తే.. విడిగా కూడా పురుషాధిక్యమే ఉంటోంది.. ఆ విషయం గురించి ఏమంటారు? ఒక్కసారి మన తాత, ముత్తాతల తరం గురించి ఆలోచిద్దాం. అప్పట్లో ఆడవాళ్ల పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది. కానీ, రాను రాను ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. భవిష్యత్తులో ఇంకా మార్పు వస్తుందని ఆశిద్దాం. మీ తదుపరి చిత్రాలు? హిందీలో ‘దిల్వాలే’, ‘ఫర్జీ’ అనే సినిమాలు చేస్తున్నా. తెలుగులో ఇంకా ఏమీ అంగీకరించలేదు. సలహాలు స్వీకరిస్తా! ఎవరైనా మంచి సలహాలిస్తే స్వీకరించాలనుకుంటా. అయితే, వింటున్నాను కదా అని ఉచిత సలహాలిస్తే అప్పుడు వడపోత మొదలుపెడతా. వాటిలో తీసుకోదగ్గవి మాత్రమే తీసుకుని, మిగతావి వదిలేస్తా. ఫైనల్‌గా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా నా మనసు ఏది చెబితే దాన్నే పాటిస్తా. - డి.జి. భవాని -
'దోచేయ్' స్టిల్స్
-
చిరిగిన జీన్సు వేసుకున్నా..!
‘‘ఆవ్ తుజే మోకోత్తా...’’ అంటూ ‘1 - నేనొక్కడినే’ చిత్రంలో మహేశ్‌ను ఆటపట్టించిన కృతీ సనన్, తాజాగా నాగచైతన్యతో ‘దోచేయ్’లో నటించారు. ‘హీరోపంటి’, ‘1 -నేనొక్కడినే’ చిత్రాలకు భిన్నంగా ఆమె ఈ సినిమాలో టామ్‌బాయ్ తరహా పాత్ర పోషించారు. ఈ పాత్ర గురించి ఆమె చెబుతూ -‘‘నేను ఇందులో మెడికోగా నటించాను. క్లాస్‌లు ఎగ్గొట్టడానికి కాలేజీ గోడదూకి పారిపోయే పాత్ర నాది. ఓ విద్యార్థి ఎలా ఉండకూడదో అలా ఉంటుంది’’ అని చెప్పారామె. తన గత చిత్రాలకు భిన్నంగా ఈ సినిమాలో కొత్తగా కనిపించడానికి ప్రయత్నించాననీ, దాని కోసం చిరిగిన జీన్స్‌లు కూడా వేసుకున్నాననీ, మొత్తానికి తన వేషధారణ చాలా విచిత్రంగా ఉంటుందనీ ఆమె చెప్పారు. సహ నటుడు నాగచైతన్య గురించి మాట్లాడుతూ, ‘‘చైతూతో పనిచేయడం చాలా సరదాగా ఉంటుంది. అగ్ర తారల కుటుంబం నుంచి వచ్చానన్న భావం అతనిలో కించిత్ కూడా లేదు ’’ అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. -
దేవదాసు పాటలో చైతూ, బ్రహ్మీ అల్లరి
-
‘దోచేయ్’ ఆడియో ఆవిష్కరణ
-
దోచేస్తాడు!
అభిమానులను, సినీ ప్రియుల మనసులను దోచేయడానికి నాగచైతన్య రెడీ అవుతున్నారు. అదేంటీ అనుకుంటున్నారా? మరేం లేదు.. నాగచైతన్య కథానాయకునిగా సుధీర్‌వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి ‘దోచేయ్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. టైటిల్‌కి తగ్గట్టే ప్రేక్షకుల హృదయాలను ఈ చిత్రం దోచేయడం ఖాయమంటున్నారీ చిత్రబృందం. రిలయన్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా పతాకంపై బీవీయస్‌యన్ ప్రసాద్ ఈ చిత్రం నిర్మిస్తున్నారు. శివరాత్రి సందర్భంగా మంగళవారం ఈ చిత్రం టైటిల్‌ను ప్రకటించడంతో పాటు, టైటిల్ లోగోను, నాగచైతన్య లుక్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ - ‘‘ఈ చిత్రకథకు ‘దోచేయ్’ టైటిల్ వంద శాతం నప్పుతుంది. రెండు పాటలు మినహా సినిమా పూర్తయ్యింది. ‘అత్తారింటికి దారేది’ తర్వాత మా సంస్థ నుంచి రాబోతున్న మరో సూపర్ హిట్ మూవీ ఇది. నాగచైతన్య కెరీర్లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచే చిత్రం అవుతుంది. వచ్చే నెలాఖరున చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. కృతి సనన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, రవిబాబు, రావు రమేష్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం: సన్నీ ఎం.ఆర్, కెమెరా: రిచర్డ్ ప్రసాద్, సహనిర్మాత: భోగవల్లి బాపినీడు.