breaking news
Consumer goods companies
-
మార్జిన్లు పెరగకపోవచ్చు.. కారణాలు..
పెరుగుతున్న పామాయిల్, ముడిసరుకు ధరల వల్ల ఎఫ్ఎంసీజీ సంస్థల మార్జిన్లు, లాభాలపై సెప్టెంబర్ త్రైమాసికంలో ప్రభావం పడనుంది. ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థలు గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ (జీసీపీఎల్), డాబర్, మారికో ఇప్పటికే ఇందుకు సంబంధించి సంకేతాలు ఇచ్చాయి.సెప్టెంబర్ త్రైమాసికంలో మార్జిన్లలో వృద్ధి గతేడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే ఫ్లాట్‌గా ఉండొచ్చని పేర్కొన్నాయి. కోప్రా, వెజిటబుల్ ఆయిల్ ధరలు పెరిగినట్టు చెప్పాయి. ‘పామాయిల్ ధరలు, తయారీ వ్యయాలు మార్చి నుంచి పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు రెండంకెల స్థాయిలో వీటి పెరుగుదల నమోదైంది. పెరిగిన వ్యయ భారం మొత్తాన్ని వినియోగదారులకు బదిలీ చేయకూడదని యాజమాన్యం నిర్ణయించింది. కొత్త ఉత్పత్తులు సహా దీర్ఘకాల వృద్ధికి పెట్టుబడులు కొనసాగించాలని తెలిపింది’ అని జీసీపీఎల్ పేర్కొంది. పామాయిల్, ముడి సరుకుల ధరల కారణంగా సెప్టెంబర్ క్వార్టర్ స్టాండలోన్ ఎబిటా వృద్ధి ఫ్లాట్‌గా ఉండొచ్చని తెలిపింది. ఆదాయం మాత్రం సింగిల్ డిజిట్ స్థాయిలో వృద్ధిని నమోదు చేయవచ్చని అంచనా వేసింది.ఇదీ చదవండి: ఒకే ఆర్డర్.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సొంతంముడి సరుకుల ధరల పెరుగుదల..ఇటీవలే ప్రభుత్వం దిగుమతి సుంకాలు పెంచిన ఫలితంగా వెజిటబుల్ నూనెల ధరలు, కోప్రా ధరలు పెరిగాయని మారికో తెలిపింది. స్థూల మార్జిన్లు మోస్తరుగానే ఉండొచ్చని పేర్కొంది. ఆదాయ వృద్ధితో పోలిస్తే.. నిర్వహణ లాభం వృద్ధి మోస్తరుగానే ఉండొచ్చని అంచనా వేసింది. మరో ఎఫ్ఎంసీజీ సంస్థ డాబర్ పంపిణీదారుల స్థాయిలో నిల్వలను సరిదిద్దే పనిలో ఉన్నట్టు తెలిపింది. ‘తక్కువ అమ్మకాలతో లాభాలపై ప్రభావం పడింది. ఆపరేటింగ్ మార్జిన్ రెండంకెల స్థాయిలో క్షీణించొచ్చు’అని పేర్కొంది. మరోవైపు ప్రకటనలపై డాబర్ తన వ్యయాలను పెంచింది. పంపిణీ ఛానల్ బలోపేతానికి వీలుగా ఈ తాత్కాలిక దిద్దుబాట్లు అవసరమని, రానున్న రోజుల్లో మెరుగైన నిర్వహణ, వృద్ధికి ఈ చర్యలు వీలు కల్పిస్తాయని చెప్పింది. మరోవైపు ప్రత్యామ్నాయ ఛానళ్ల ద్వారా ఎఫ్ఎంసీజీ అమ్మకాలు మెరుగుపడినట్టు తెలుస్తోంది. ప్రత్యామ్నాయ ఛానళ్ల ద్వారా ఆదాయం రెండంకెల స్థాయిలో పెరిగినట్టు అదానీ విల్మార్ ప్రకటించింది. ముఖ్యంగా ఈ–కామర్స్ ఛానళ్ల ద్వారా గడిచిన ఏడాది కాలంలో ఆదాయం నాలుగు రెట్లు వృద్ధి చెందినట్టు తెలిపింది. -
కొనుగోళ్లపై జైడస్ దూకుడు
న్యూఢిల్లీ: విస్తరణకు మద్దతుగా.. వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు వీలుగా ఇతర కంపెనీలను సొంతం చేసుకోవాలని కన్జూమర్ గూడ్స్ కంపెనీ జైడస్ వెల్నెస్ ప్రణాళికలు వేసింది. పోర్ట్‌ఫోలియోను విభిన్న విభాగాలకు విస్తరించే యోచనలో ఉన్న కంపెనీ కొత్త ఆవిష్కరణలపై ప్రత్యేక దృష్టిపెట్టింది. మరిన్ని ప్రాంతాలకు అమ్మకాలు విస్తరించడం ద్వారా వినియోగదారుల సంఖ్యను పెంచుకోవాలని చూస్తున్నట్లు తాజా వార్షిక నివేదికలో తెలియజేసింది. ఇందుకు అనుగుణంగా ఇతర కంపెనీల కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇవ్వనుంది. కంపెనీ కొనుగోళ్ల ద్వారానే గ్లూకోన్–డి, కాంప్లాన్, నైసిల్ తదితర సుప్రసిద్ధ బ్రాండ్లను సొంతం చేసుకోవడం గమనార్హం! కంపెనీ భవిష్యత్ ప్రణాళికలు, వృద్ధి అవకాశాలకు అనుగుణంగా ఉన్న కంపెనీలను చేజిక్కించుకునేందుకు చూస్తున్నట్లు జైడస్ వెల్నెస్ వెల్లడించింది. కంపెనీ రూ. 4,595 కోట్లను వెచ్చించి హీంజ్ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. కంపెనీ దక్షిణాసియా, మధ్యప్రాచ్యం, ఆగ్నేయాసియా ప్రాంతాలలో విస్తరించే యోచనలో ఉంది. -
కన్జ్యూమర్ కంపెనీల్లో వాటాలను పెంచుకున్న ఎల్ఐసీ
దేశీయ అతిపెద్ద సంస్థాగత ఇన్వెస్టర్ ఎల్ఐసీ ఈ మార్చి త్రైమాసికంలో వినియోగ ఆధారిత కంపెనీల్లో వాటాలను పెంచుకుంది. హిందుస్తాన్ యూనిలీవర్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, మహానగర్ గ్యాస్, హావెల్స్ ఇండియా, అమరా రాజా బ్యాటరీస్, టీవీఎస్ మోటార్ కంపెనీల షేర్లను తన ఫోర్ట్‌ఫోలియోలో చేర్చుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మార్చి క్వార్టర్ ధరల సగటును పరిగణలోకి లెక్కిస్తే ఈ మొత్తం వాటా విలువ రూ.1300 కోట్లుగా ఉంది. ఈ క్వార్టర్లో పై కంపెనీల్లో ఎల్ఐసీ తన వాటాను 0.7 - 0.26శాతం పరిధిలో పెంచుకుంది. కన్జ్యూమర్ కంపెనీల్లో అగ్రగామి హెచ్‌యూఎల్ కంపెనీలో ఎల్ఐసీ అధిక వాటాలను కొనుగోలు చేసింది. ఈ మార్చి క్వార్టర్లో హెచ్‌యూఎల్ కంపెనీకి చెందిన సుమారు 1శాతం వాటాకు సమానమైన ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసింది. దీంతో హెచ్‌యూఎల్‌లో ఎల్ఐసీ వాటా 2.6శాతానికి పెరిగింది. నిఫ్టీ- 50 ఇండెక్స్‌లో అన్ని కంపెనీలతో పోలిస్తే అత్యుత్తమ ఆదాయ వృద్ధి కలిగి ఉంది. అలాగే గ్లాక్సో స్మిత్‌క్లైన్ కన్స్యూమర్ హెల్త్‌కేర్‌తో విలీనంతో మార్కెట్లో తన వాటాను మరింత పెరగనుంది. ఈ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఎల్ఐసీ హెచ్‌యూఎల్‌లో తన వాటాను పెంచుకొని ఉండవచ్చని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. తాజా వాటా కొనుగోలుతో హెచ్‌యూఎల్ కంపెనీలో ఎల్ఐసీ అతిపెద్ధ సంస్థాగత పెట్టుబడిదారుగా అవతరించింది. హెచ్‌యూఎల్ కంపెనీలో మార్చి 2020 నాటికి దేశీయ మ్యూచువల్ ఫండ్లు, ఇన్సూరెన్స్ కంపెనీల వాటాలు వరుసగా 2.9శాతం, 3.4శాతంగా ఉన్నాయి. కన్జ్యూమర్ రంగంలోని ఇతర కంపెనీలైన నెస్లే ఇండియా, ఏషియన్ పేయింట్స్, బ్రిటానియా ఇండస్ట్రీస్‌లో ఎల్ఐసీ తన వాటాలను వరుసగా 2.9శాతం, 2.8శాతం, 6.1శాతానికి పెంచుకుంది. కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ ప్రకారం, మార్చి త్రైమాసికంలో బీఎస్ఈ -200 కంపెనీలలో ఎల్ఐసీ నిర్వహణలోని ఆస్తుల విలువ 32 శాతం తగ్గింది. గత క్వార్టర్లో ఈ మొత్తం విలువ 82 బిలియన్ డాలర్లు ఉండగా ఈ మార్చి క్వార్టర్‌కు 52బిలియన్ డాలర్లకు చేరుకుంది. -
సినిమా సూపర్ హిట్ కలెక్షన్లు ఫట్
జనం పెట్టే ఖర్చులు తగ్గాయంటే... ఓలా, ఉబెర్ బుకింగులు పెరిగాయంటారు ఆర్థిక మంత్రి!!. మరి అదే నిజమైతే కార్ల విక్రయాలు కూడా పెరగాలి కదా? అనేది సామాన్యుడి సందేహం. వీటి మధ్య సంబంధం ఉందనుకుంటే ఉంది!. లేదనుకుంటే లేదు!!. 2019లో మన ఆర్థిక వ్యవస్థ తీరు చూసినా ఇలాగే అనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు ఎకానమీ మందగమనంతో నత్తనడకన నడుస్తోంది. విక్రయాలు తగ్గిపోయాయని ఆటోమొబైల్, వినియోగ వస్తువుల కంపెనీలు మొత్తుకుంటున్నాయి. స్టాక్ మార్కెట్లు మాత్రం రోజుకో కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. అటు సంస్కరణల ఊతంతో సులభతర వ్యాపార నిర్వహణ ర్యాంకుల్లో భారత్ భారీగా ఎగబాకినా.. ఇటు పారిశ్రామిక దిగ్గజాలు మాత్రం వ్యాపార వర్గాల నోరు నొక్కేస్తోందంటూ ప్రభుత్వంపై బాహాటంగానే విరుచుకుపడుతున్నారు. మందగమనం సమస్యకు చికిత్స చేసేందుకు ప్రభుత్వం కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించినా ఫలితం కనిపించలేదు. ఈ నేపథ్యంలో 2019 సింహావలోకనంతో పాటు కొత్త సంవత్సరంపై నెలకొన్న అంచనాల సమాహారమిది... స్టాక్ మార్కెట్లు.. ‘రికార్డ్’ల పరుగు ఎకానమీ పరిస్థితి ఎలా ఉన్నా.. స్టాక్ మార్కెట్లు మాత్రం రయ్‌మని ఎగిశాయి. నిఫ్టీ సుమారు 13 శాతం, సెన్సెక్స్ దాదాపు 15 శాతం పెరిగాయి. 2017 తర్వాత దేశీ సూచీలకు 2019 బాగా కలిసొచ్చింది. ఇన్వెస్టర్ల సంపద సుమారు రూ.10.2 లక్షల కోట్లు ఎగిసింది. ఈ ఏడాది జనవరి 1న 36,162 పాయింట్లుగా ఉన్న సెన్సెక్స్ 5,000 పాయింట్లు పైగా పెరిగి తాజాగా 41,000 పైకి చేరింది. ఎకానమీతో సంబంధం లేనట్లుగా స్టాక్ మార్కెట్లు అలా పెరుగుతూ పోవడంపై ఆర్థికవేత్తలు కూడా అయోమయంలో పడ్డారు. స్టాక్ మార్కెట్ల ర్యాలీ కొన్ని షేర్లకే పరిమితం కావడం గమనార్హం. 2018 జనవరిలోని ఆల్ టైమ్ గరిష్ట స్థాయిలతో పోలిస్తే మిడ్ క్యాప్ సూచీ 19 శాతం, స్మాల్ క్యాప్ సూచీ 33 శాతం పడ్డాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 10 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ సాధించిన తొలి దేశీ కంపెనీగా రికార్డు సృష్టించింది. కార్పొరేట్ ట్యాక్స్ రేటును తగ్గించడం, ఆఖరు దశలో నిల్చిపోయిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు ఊతమిచ్చేందుకు రూ. 25,000 కోట్ల నిధి ఏర్పాటు చేయడం, విదేశీ ఇన్వెస్టర్లపై పన్ను ప్రతిపాదనలను ఉపసంహరించడం వంటి అంశాలు మార్కెట్ల పరుగుకు దోహదపడ్డాయి. 2019లో రూ.లక్ష కోట్లకు పైగా విదేశీ నిధులు వచ్చాయి. ఇది క్రితం ఏడాదితో పోలిస్తే 7.5 శాతం అధికం. వచ్చే ఏడాది ఆర్థిక వృద్ధి పుంజుకుంటుందని స్టాక్ ఇన్వెస్టర్లతో పాటు వ్యూహాత్మక ఇన్వెస్టర్లు కూడా బుల్లిష్‌గా ఉన్నారనడానికి ఇది నిదర్శనంగా పరిశీలకులు భావిస్తున్నారు. టెల్కోలకు షాక్ ట్రీట్మెంట్.. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) లెక్కింపు విషయంలో కేంద్రం ఫార్ములానే సమర్ధి స్తూ సుప్రీం కోర్టు ఆదేశాలివ్వడంతో పాత ప్రైవేట్ టెల్కోల మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. ఈ దెబ్బతో టెల్కోలు ఏకంగా రూ. 1.47 లక్షల కోట్లు కేంద్రానికి చెల్లించాల్సి వస్తోంది. వీటికి కేటాయింపులు జరపడంతో వొడాఫోన్ ఐడియా సంస్థ దేశ కార్పొరేట్ చరిత్రలోనే రికార్డు స్థాయిలో రూ. 50,921 కోట్ల పైచిలుకు నష్టాలను సెప్టెంబర్ త్రైమాసికంలో ప్రకటించింది. ఎయిర్టెల్ కూడా రూ. 23,045 కోట్ల నష్టాలు నమోదు చేసింది. ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే కంపెనీని మూసేయక తప్పదని వొడాఫోన్ ఐడియా ఆందోళన వ్యక్తం చేసింది. మొత్తానికి రంగంలోకి దిగిన కేంద్రం.. టెల్కోలకు ఊరటనిచ్చేలా స్పెక్ట్రం బాకీల చెల్లింపుపై రెండేళ్ల మారటోరియం ప్రకటించింది. ఇంటర్‌కనెక్ట్ యూసేజ్ చార్జీల వివాదం కూడా తెరపైకి వచ్చింది. ఈ చార్జీలను కొనసాగించాలంటూ పాత టెల్కోలు, ఎత్తివేయాలని కొత్త టెలికం సంస్థ జియో వాదించాయి. చివరికి 2021 దాకా దీని గడువును ట్రాయ్ పొడిగించింది. ఈలోగా టెల్కోలన్నీ కలిసికట్టుగా చార్జీలను పెంచేశాయి. రేటు పెరిగినా డేటా వినియోగానికి డిమాండ్ తగ్గదని, ఆదాయాలు గణనీయంగా మెరుగుపడతాయని కంపెనీలు ఆశిస్తున్నాయి. కనీస చార్జీల ప్రతిపాదనను ట్రాయ్ పరిశీలిస్తోంది. అటు ప్రభుత్వ రంగ టెల్కోలకు కాస్త ఊరట లభించింది. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ను విలీనం చేయాలని కేంద్రం నిర్ణయించింది. రూ.69,000 కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీ ప్రకటించింది. ఇరు సంస్థల్లో 92,000 మంది ఉద్యోగులు స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని ఎంచుకున్నారు. మ్యూచువల్ ఫండ్స్ కొనసాగిన జోష్.. 2019లో మ్యూచువల్ ఫండ్స్ అసెట్స్ భారీగా పెరిగాయి. 2019 నవంబర్ నాటికే ఏయూఎం 18 శాతం (సుమారు రూ. 4.2 లక్షల కోట్లు) ఎగిసి రూ.27 లక్షల కోట్లకు చేరింది. ఇన్వెస్టర్ల ధీమాను పెంచేందుకు సెబీ తీసుకుంటున్న చర్యలు, డెట్ స్కీముల్లోకి భారీగా పెట్టుబడుల రాకతో.. కొత్త ఏడాది కూడా ఇదే ధోరణి కొనసాగవచ్చని పరిశ్రమ వర్గాలు ఆశిస్తున్నాయి. 2020లో మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ 17–18 శాతం మేర వృద్ధి నమోదు చేయొచ్చని, ఎకానమీ పుంజుకుంటే ఈక్విటీ ఫండ్స్‌లోకి కూడా భారీగా పెట్టుబడులు రావొచ్చని ఫండ్ సంస్థల సమాఖ్య యాంఫీ అంచనా వేస్తోంది. బీమా రంగం... ధీమాగా వృద్ధి బీమా పరిశ్రమ వృద్ధి స్థిరంగా కొనసాగింది. నవంబర్ దాకా చూస్తే కొత్త ప్రీమియం వసూళ్లు వార్షికంగా సుమారు 37 శాతం వృద్ధితో రూ. 1.7 లక్షల కోట్లుగా నమోదైనట్లు కోటక్ లైఫ్ ఇన్సూరెన్స్ వెల్లడించింది. రాబోయే రోజుల్లో పరిశ్రమ 15% వృద్ధి రేటు సాధించవచ్చని అంచనా వేసింది. కుటుంబాలు చేసే పొదుపు మొత్తాలు.. బంగారం వంటి వాటి వైపు కాకుండా ఇతరత్రా ఆర్థిక అసెట్స్‌వైపు మళ్లుతుండటం, ప్రభుత్వ విధానాలు, బీమా విస్తృతికి సంస్థల ప్రయత్నాలు ఇందుకు దోహదపడగలవని పరిశ్రమవర్గాలు పేర్కొ న్నాయి. ఎకానమీ అస్తవ్యస్తం.. అంతర్గత, అంతర్జాతీయ సవాళ్లతో ఈ ఏడాది దేశ ఆర్థిక వ్యవస్థకు కష్టంగానే గడిచింది. వినియోగం, ప్రైవేట్ పెట్టుబడులు, ఎగుమతులు.. అన్నీ మందగించాయి. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న అగ్రగామి దేశం హోదాను భారత్ కోల్పోయింది. సెప్టెంబర్ క్వార్టర్లో జీడీపీ వృద్ధి.. ఆరేళ్ల కనిష్ట స్థాయి 4.5 శాతానికి పడిపోయింది. 5 ట్రిలియన్ డాలర్ల లక్ష్యం దిశగా దూసుకెళ్లాల్సిన ఎకానమీ... మందగమనం దెబ్బతో కుంటినడకలు నడుస్తోంది. ఐఎంఎఫ్ వంటి అంతర్జాతీయ సంస్థలు దేశ వృద్ధి రేటు అంచనాలకు భారీగా కోతలు పెట్టాయి. ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు కేంద్రం పలు సంస్కరణలు ప్రవేశపెడుతోంది. కార్పొరేట్ ట్యాక్స్ రేటును పాతిక శాతానికి తగ్గించడం, ఆర్థిక రంగ పునర్వ్యవస్థీకరణ, వడ్డీ రేట్ల కోత వంటివి వీటిలో కీలకం. కార్పొరేట్ ట్యాక్స్ కోత వల్ల సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీలు కాస్త మెరుగైన ఫలితాలు ప్రకటించగలిగాయి. సులభతరంగా వ్యాపారాలు నిర్వహించడానికి అనువైన దేశాల జాబితాలో భారత్ 77వ స్థానం నుంచి 63వ స్థానానికి వచ్చింది. మరోవైపు, ఆర్బీఐ కీలక పాలసీ రేట్లను తగ్గించినా.. ఆ ప్రయోజనాలను ఖాతాదారులకు బ్యాంకులు పూర్తిగా బదలాయించకపోతుండటంతో దేశీయంగా వినియోగానికి ఊతం లభించడం లేదు. దీంతో వచ్చే సంవత్సరం కూడా పరిస్థితి పెద్దగా మెరుగుపడేలా కనిపించడం లేదనేది పరిశీలకుల మాట. అయితే, ఇన్ఫ్రాపై వచ్చే అయిదేళ్లలో రూ.100 లక్షల కోట్లు వెచ్చించాలన్న ప్రభుత్వ ప్రణాళికతో ఎకానమీకి కొంత ఊతం లభించవచ్చన్న అంచనాలు ఉన్నాయి. రియల్టీ అంతంతమాత్రం... రియల్టీ రంగంపైనా ఆర్థిక మందగమన ప్రభావం గణనీయంగా పడింది. టాప్ 7 నగరాల్లో రిటైల్ లీజింగ్ కార్యకలాపాలు క్రితం ఏడాదితో పోలిస్తే 35 శాతం తగ్గాయి. 2018లో 5.5 మిలియన్ చ.అ. లీజింగ్ నమోదు కాగా 2019లో ఇది 3.6 మి.చ.అ.లకు పరిమితమైందని రియల్టీ సేవల సంస్థ అనరాక్ నివేదికలో వెల్లడైంది. ఆటోమొబైల్, జ్యుయలరీ, ఎలక్ట్రానిక్స్, హైపర్మార్కెట్లు మొదలైన విభాగాల్లో లీజింగ్ తగ్గగా.. ఫుడ్ అండ్ బెవరేజెస్, సినిమా, సౌందర్య సంరక్షణ సేవల విభాగాల్లో పెరిగింది. అయితే, వచ్చే ఏడాది రిటైల్ లీజింగ్ మళ్లీ పుంజుకోవచ్చని అంచనాలున్నాయి. పసిడి.. జిగేల్ జిగేల్ పసిడి మెరుపులు ఈ ఏడాది మరింత కాంతివంతమయ్యాయి. అంతర్జాతీయంగా ఔన్సు (31.1 గ్రాములు) బంగారం ధర 1,400 డాలర్ల శ్రేణిని ఛేదించింది. 2013 తర్వాత మళ్లీ తొలిసారి ఈ ఏడాది ఆగస్టులో 1,500 డాలర్ల మార్కును అధిగమించింది. దేశీయంగా రేటు ఏకంగా 25 శాతం పెరిగింది. సంవత్సరం తొలినాళ్లలో రూ.31,500 స్థాయిలో ఉన్న పది గ్రాముల బంగారం ధర దాదాపు రూ.8,000 పెరిగి ఒక దశలో రూ. 40,000 స్థాయిని కూడా తాకింది. సాధారణంగా.. అనిశ్చితి, ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో సురక్షితమైన పెట్టుబడి సాధనంగా బంగారాన్ని పరిగణిస్తారు. ఈ కారణాలే ఈ ఏడాది పసిడి పరుగుకు దోహదపడ్డాయి. అంతర్జాతీయంగా భౌగోళిక.. రాజకీయ... వాణిజ్య అనిశ్చితి, అమెరికా – చైనా మధ్య సుదీర్ఘంగా కొనసాగిన టారిఫ్‌ల యుద్ధం వంటివన్నీ ఇన్వెస్టర్లను పసిడివైపు మొగ్గేలా చేశాయి. ప్రపంచ ఎకానమీపై కమ్ముకున్న నీలినీడలతో.. షేర్ల వంటి రిస్కీ సాధనాల కన్నా బంగారం, ఇతరత్రా సురక్షిత సాధనాలే ఆకర్షణీయంగా ఉంటాయని 2019 రెండో త్రైమాసిక నివేదికలో వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేసింది. సాధారణ ఇన్వెస్టర్ల తరహాలోనే సెంట్రల్ బ్యాంకులు కూడా పసిడిని భారీగా కొని నిల్వలు పెంచుకుంటున్నాయి. వచ్చే ఏడాది కూడా భౌగోళిక, రాజకీయ అనిశ్చితి, కనిష్ట స్థాయిల్లో వడ్డీ రేట్లు, డాలరు బలహీనపడే అవకాశాల నేపథ్యంలో బంగారం పరుగు కొనసాగుతుందని భావిస్తున్నారు. కీలకమైన అమెరికా అధ్యక్ష ఎన్నికలతో మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో 2020లో ఔన్సు బంగారం ధర 1,620 డాలర్ల స్థాయిని తాకవచ్చని అంచనాలున్నాయి. అయితే, ఇప్పటికే పెద్ద మొత్తంలో కొనుగోళ్లు జరిపేసిన స్పెక్యులేటివ్ ఇన్వెస్టర్లు.. 2020లో అమ్మకాలకు దిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఫలితంగా పసిడి రేటు తగ్గే చాన్సు కూడా ఉందనేది నిపుణుల అంచనా. ఆటోమొబైల్ రివర్స్ గేర్‌లోనే... డిమాండ్ లేక అమ్మకాలు తగ్గడం మొదలుకుని ప్లాంట్ల మూసివేతలు, ఉద్యోగాల కోతలు, వందల మంది డీలర్ల దివాలా.. కొత్త కాలుష్య ప్రమాణాలు, ఎలక్ట్రిక్ వాహనాల విధానాలు.. ఇలా వివిధ కారణాలు ఆటోమొబైల్ పరిశ్రమను తెరిపిన పడనివ్వకుండా చేశాయి. ఎకానమీలో మందగమనం, ధరల పెంపుతో ప్యాసింజర్ వాహన విక్రయాలు క్షీణించగా, అధిక నిల్వలు పేరుకుపోయి.. ఫైనాన్స్ అవకాశాలు తగ్గిపోయి వాణిజ్య వాహన అమ్మకాలు పడిపోయాయి. ఉద్యోగ కల్పన, డిమాండ్ అంతంత మాత్రంగానే ఉండటంతో ద్విచక్ర వాహన విక్రయాలు భారీగా తగ్గాయి. అయితే, వాహనాల కొనుగోళ్లకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటిస్తుండటం, రుణ లభ్యతను మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటూ ఉండటం తదితర చర్యలు రాబోయే రోజుల్లో ప్యాసింజర్ వాహనాలకు సానుకూలంగా ఉండగలవన్న అంచనాలు నెలకొన్నాయి. అలాగే, గ్రామీణ ప్రాంతాల్లో సెంటిమెంటు మెరుగుపడుతుండటం .. ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్ల అమ్మకాలకూ సానుకూలంగా ఉండవచ్చని అంచనా. డీల్ స్ట్రీట్ .. కార్పొరేట్లు డీలా కార్పొరేట్లు రుణ సంక్షోభాల్లో కూరుకుపోవడంతో 2019లో విలీనాలు, కొనుగోళ్ల (ఎంఅండ్ఏ) డీల్స్ ఒక మోస్తరు స్థాయికే పరిమితమయ్యాయి. లిక్విడిటీ కొరత, విదేశీ ఇన్వెస్టర్లు కూడా పెద్దగా ఆసక్తి చూపకపోవడం, అంతర్జాతీయంగా అమెరికా–చైనా మధ్య వాణిజ్య యుద్ధం వంటి అంశాలతో ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణి అవలంబించారు. న్యాయసేవల సంస్థ బేకర్ మెకెంజీ నివేదిక ప్రకారం 2019లో మొత్తం మీద సుమారు రూ. 52.1 బిలియన్ డాలర్ల విలువ చేసే డీల్స్ జరిగాయి. 2019లో సగటు ఎంఅండ్ఏ డీల్ పరిమాణం 81 మిలియన్ డాలర్లుగా నమోదైంది. గడిచిన మూడేళ్లతో పోలిస్తే ఇదే అత్యల్పం. తయారీ, ఇంధనం, స్టార్టప్, ఫార్మా, బ్యాంకింగ్, ఐటీ, ఇన్ఫ్రా, రిటైల్, ఈ–కామర్స్ రంగాల్లో గణనీయంగా ఒప్పందాలు కుదిరాయి. వ్యాపారాలకు అనువైన సంస్కరణలు, అంతర్జాతీయంగా సానుకూల పరిస్థితులు తిరిగొస్తుండటం వంటి అంశాల ఊతంతో 2020, 2021 సంవత్సరాల్లో డీల్స్ పరిస్థితి మళ్లీ పుంజుకోగలదని బేకర్ మెకెంజీ ఒక నివేదికలో తెలిపింది. బ్యాంకింగ్... ఫైనాన్స్ సవాళ్లమయం ఐఎల్అండ్ ఎఫ్ఎస్ దివాలా ప్రభావాలతో 2019 నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగం కష్టాలు కొనసాగాయి. దివాన్ హౌసింగ్ ఫైనాన్స్, అల్టికో క్యాపిటల్ వంటి సంస్థలు దివాలా తీశాయి. ఎన్‌బీఎఫ్‌సీల సంక్షోభంతో రుణ లభ్యత కొరవడి ఆటోమొబైల్ వంటి ఇతర రంగాలపైనా ప్రభావం పడింది. మొండిబాకీలతో కుదేలవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో విలీనాలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వం 10 బ్యాంకులను నాలుగు కింద విలీనం చేసింది. యూనియన్ బ్యాంకులో విలీనంతో తెలుగువారి ఆంధ్రా బ్యాంకు కనుమరుగు కానుంది. నెఫ్ట్ సేవలు ఇరవై నాలుగ్గంటలూ అందుబాటులోకి వచ్చాయి. ఎట్టకేలకు దివాలా కోడ్ ప్రయోజనాలు కనిపించడం ప్రారంభమైంది. ఎస్సార్ స్టీల్ వంటి కేసులు పరిష్కారం కావడంతో బ్యాంకులకు వేల కోట్ల మేర మొండిబాకీల రికవరీ సాధ్యపడింది. అయితే, ఇంకా చాలా కేసుల పరిష్కారానికి సుదీర్ఘ సమయం పట్టేస్తుండటం ఆందోళనకర విషయం. మొండిబాకీల (ఎన్పీఏ) భారం ఈసారి కాస్త తగ్గింది. రిజర్వ్ బ్యాంక్ గణాంకాల ప్రకారం.. సెప్టెంబర్ ఆఖరు నాటికి స్థూల ఎన్పీఏలు రూ. 8.94 లక్షల కోట్లకు తగ్గాయి. క్రితం ఏడాది ఇదే వ్యవధిలో స్థూల మొండిబాకీలు రూ. 10.18 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇక, సుదీర్ఘ వివాదానికి ఫుల్స్టాప్ పెడుతూ బిమల్ జలాన్ సిఫార్సుల మేరకు రిజర్వ్ బ్యాంక్ .. 2018–19 కేంద్రానికి గాను తన వద్ద ఉన్న మిగులు నిధుల్లో రూ. 1.76 లక్షల కోట్లు కేంద్రానికి బదలాయించేందుకు అంగీకరించింది. మందగమనంతో కొట్టుమిట్టాడుతున్న ఎకానమీకి ఊతమిచ్చేలా కీలక వడ్డీ రేట్లను 135 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. దీంతో రెపో రేటు .. దశాబ్ద కనిష్ట స్థాయి 5.15 శాతానికి దిగివచ్చింది. అయితే, ద్రవ్యోల్బణం ఎగియడంతో డిసెంబర్లో రేట్ల కోతకు కాస్త విరామమిచ్చింది. -
టీవీలు, ఫ్రిజ్‌ల ధరలూ పెరుగుతున్నాయ్
గోద్రెజ్, హేయర్, వర్ల్‌పూల్, పానాసానిక్ ఉత్పత్తుల రేట్లు 2-5 శాతం వరకూ పెంపు... న్యూఢిల్లీ: వినియోగ వస్తువుల కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను పెంచుతున్నాయి. ఎక్సైజ్ సుంకం 10 శాతం నుంచి 12 శాతానికి పెరగడం, రూపాయి క్షీణతతో ఉత్పత్తి వ్యయాలు అధికం కావడం వంటి కారణాల వల్ల ధరలను పెంచక తప్పడం లేదని ఆ కంపెనీలు అంటున్నాయి. గోద్రేజ్ అప్లయెన్సెస్, హేయర్, వర్ల్‌పూల్, పానాసానిక్, దైకిన్ తదితర కంపెనీలు ధరలను 2-5% రేంజ్లో పెంచుతున్నాయి. మోడళ్లను బట్టి తమ ఉత్పత్తుల ధరలు 3-5% వరకూ పెంచుతున్నట్లు హేయర్ ఇండియా తెలిపింది. కొత్త స్టాక్‌కు ఈ ధరలు వర్తిస్తాయని పేర్కొంది. గోద్రెజ్ అప్లయెన్సెస్ కూడా ఇదే రేంజ్లో పెంచాలని భావిస్తోంది. వర్ల్‌పూల్ సంస్థ ఈ నెల మూడో వారం నుంచి ధరలను 2-3% పెంచనున్నది. దైకిన్ సంస్థ ఏసీల ధరలను 4%వరకూ పెంచుతోంది.