అమెరికాలో ‘నోకింగ్స్’ ఉద్యమం.. బెంబేలెత్తిస్తున్న ‘సికాడా’ వేరియంట్?!
వాషింగ్టన్: అమెరికాలో ఇరాన్‌పై యుద్ధాన్ని ముగించాలని డిమాండ్ చేస్తూ ప్రజలు భారీ స్థాయిలో ఆందోళనలు చేస్తున్నారు. ‘నో కింగ్స్’ నినాదంతో సుమారు 8 మిలియన్ల మంది పాల్గొన్న ఈ నిరసన అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఆందోళనలలో ఒకటిగా భావిస్తున్నారు. ఇదే సమయంలో, అమెరికాలో కొత్తగా గుర్తించిన కోవిడ్-19 వేరియంట్ ‘సికాడా’ (BA.3.2) ఆందోళన కలిగిస్తోంది. ఇది ఒమిక్రాన్ జాతికి చెందిన బీఏ.3 వేరియంట్ నుంచి పుట్టినదిగా వైద్యులు నిర్ధారించారు. పాత ఒమిక్రాన్ రకాలతో పోలిస్తే ఇది మరింత వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు తెలుస్తోంది.అయితే, ఇరాన్‌పై యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ రోడ్డెక్కి ప్రజలు ఆందోళన చేస్తుండగా.. జాగ్రత్తలు తీసుకోకపోతే కోవిడ్-19 వేరియంట్ వ్యాప్తి విజృంభిస్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 2024లో దక్షిణాఫ్రికాలో తొలిసారి గుర్తించిన ఈ వేరియంట్ అప్పట్లో పెద్దగా వ్యాప్తి చెందలేదు. కానీ 2025లో మోజాంబిక్, నెదర్లాండ్స్, జర్మనీ వంటి దేశాల్లో మళ్లీ కనిపించింది. ప్రస్తుతం అమెరికాలోని కాలిఫోర్నియా, ఫ్లోరిడా, మిచిగన్, న్యూయార్క్, మిస్సోరీ, టెక్సాస్ వంటి రాష్ట్రాల్లో ఇది వెలుగులోకి వచ్చింది.సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) నివేదికల ప్రకారం, వేస్ట్‌వాటర్ సర్వైలెన్స్, క్లినికల్ నమూనాలు, ప్రయాణికుల పరీక్షల ద్వారా ఈ వేరియంట్ గుర్తించబడింది. అమెరికాలో మొత్తం 25 రాష్ట్రాల్లో ఇది ఉన్నప్పటికీ, కేసుల సంఖ్య తక్కువగానే ఉంది. ప్రపంచవ్యాప్తంగా కనీసం 23 దేశాల్లో ఇది కనిపించింది.‘సికాడా’ వేరియంట్ లక్షణాలు సాధారణ కోవిడ్ లక్షణాలతో పోలి ఉంటాయి జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, అలసట వంటి లక్షణాలు కనిపించవచ్చు. అయితే, ఇది వాక్సిన్ లేదా గత ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చిన రోగనిరోధక శక్తిని తప్పించుకునే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికాలో జరుగుతున్న ‘నో కింగ్స్’ ఆందోళనతో పాటు ఈ కొత్త వేరియంట్ వ్యాప్తి ప్రజల్లో భయాందోళనలను పెంచుతోంది.