బాలుడ్ని బలిగొన్న నీటి సంప్
కటిక దారిద్య్రం. ప్లాస్టిక్, చిత్తుకాగితాలు ఏరుకుని.. విక్రయించగా వచ్చిన కొద్దిపాటి పైసలతో పొట్టపోసుకునే కుటుంబం వారిది. కూడే కాదు.. గూడు కూడా లేదు. చెట్లకిందే వారి నివాసం. వర్షం వస్తే ఎవరి పంచనో చేరుతారు. అలాంటి దంపతులకు ముక్కుపచ్చలారని ఇద్దరు చిన్నారులు .. పేదరికం వేధిస్తున్నా.. బిడ్డల్ని ప్రేమగా సాకుతూ మురిసిపోతూ కాలం గడుపుతున్నారు. ఈ కష్టాల నుంచి గట్టెక్కించాలని.. భీష్మ ఏకాదశి రోజుకావడంతో ఉదయన్నే శాలిహుండం యాత్రకు వెళ్లి.. వేణుగోపాలుడిని వేడుకుని వచ్చారు. చెట్టనీడన ఆదమరచి నిద్రపోతున్నారు. ఇంతలో.. ఇద్దరు బిడ్డల్లో ఒకరు మెల్లగా ఆడుకుంటూ వెళ్లాడు.
అంతే.. కంటినిండా నిద్రపోతున్న ఆ తల్లిదండ్రులకు తెలియలేదు తమ బిడ్డ నీటిగుంతలో పడిపోయాడని. కళ్లుతెరిచి చూసేసరికి.. జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. అయితే ఈ నిర్లక్ష్య ఎవరిది? సంప్కు పైకప్పు ఏర్పాటు చేయని అధికారులదేనని స్థానికులంటున్నారు. పట్టణంలోని మీసేవా కేంద్రం (చేపల మార్కెట్ ప్రక్కన)ఉన్న కుళాయి నీరు నిల్వ ఉన్న గోతిలో(సంప్) పడి గురువారం ఏడాదిన్నర బాలుడు పైడి తేజ మృతి చెందాడు. ఏఎస్ఐ జి. వి. రమణ చెప్పిన ప్రకారం వివరాల ప్రకారం..
శ్రీకాకుళం రూరల్ మండలం రాగోలు గ్రామానికి చెందిన పైడి మురళి ఆయన భార్య ఆదమ్మ రోడ్లపై ప్లాస్టిక్ కవర్లు ఏరుకుంటూ మూడేళ్లుగా అదే ప్రాంతంలో చెట్టు కింద నివాసం ఏర్పాటు చేసుకుని జీవన గడుపుతున్నారు. వీరికి పెద్దకుమారుడు తేజతోపాటు నాలుగు నెలల మరో బాబు ఉన్నాడు. శాలిహుండంలోని వేణుగోపాలుడి యాత్రకు వెళ్లి వచ్చి ఆ ప్రాంతంలో తల్లిదండ్రులు ఇద్దరూ మధ్యాహ్నం 2గంటల సమయంలో చెట్టుకింద ఆదమరచి నిద్రపోతున్నారు. తేజ మెల్లగా ఆడుకుంటూ బుడిబుడి అడుగులతో వెళ్లి పక్కనే ఉన్న మూతలేని కుళాయి గుంత (సంప్)లో పడి మృతి చెందాడు.
ప్రభుత్వ కార్యాలయానికి చెందిన సంప్
మీసేవా కేంద్రం భవనం, దాని పైన పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ కార్యాలయం ఉంది. ఆ కార్యాలయాలకు తాగునీరు, వాడుక నీరు వినియోగించేందుకు గతంలో మోటారు బిగించి నీరు పైకి తరలించేందుకు సంప్ ఏర్పాటు చేశారు. ఇటీవల మున్సిపల్ అధికారులు జారీ చేసిన ఆదేశాలతో మోటారును తొలగించారు. ప్రస్తుతం ఆ గోతిలో పడుతున్న మున్సిపల్ కుళాయి నీటిని చేదతో మేడపైకి తోడుకొని అక్కడ శిక్షణపొందుతున్న కొంతమంది మహిళలు ఆ నీరు వినియోగించుకునేందుకు దాని పైకప్పు తెరిచి ఉంచారని సమాచారం. ఆ క్రమంలోనే ఆ గోతిలో బాలుడు శవమై తేలి ఉండడాన్ని అక్కడి మహిళలే గుర్తించి బాలుడి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే బాలుడు మృతి చెందాడని ప్రయివేటు వైద్యులు నిర్ధారించారు. బాలుడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరై విలపించిన తీరు స్థానికులను సైతం కలిచివేసింది. మేం అడుక్కొనైనా... పిల్లడికి కడుపునిండా తిండి పెట్టేవారం.. దేముడు మాకు అన్యాయం చేశాడంటూ ఆ తల్లి రోదించిన తీరు చూసి స్థానికులు కంటతడిపెట్టారు.
అధికారుల నిర్లక్ష్యమే...
ఆ ప్రాంతంలో కుళాయి నీటికోసం తీసిన గొయ్యిపై పలకలు మూతపెట్టపోవడం వల్లే ఈప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అటు మున్సిపల్ అధికారులు కానీ, ఇటు మీసేవా కేంద్రం, పట్టణ పేదరికనిర్మూలన కేంద్రం అధికారులు కానీ దానిపై కప్పు వేయకుండా నిర్లక్ష్యం చేయవం వల్లే బాలుడు మృతి చెందాడని మండిపడుతున్నారు. ఇలాంటి కుళాయిలపై మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ కూడా ఉండాలని, కానీ ఎవ్వరూ పట్టించుకోలేదని వాపోతున్నారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు.
- ఆమదాలవలస